08 ఏప్రిల్ 2023

ఊరికే కవిత్వమై.. ముక్కామల చక్రధర్





"తెలియటం నుండి తెలియకపోవటంలోకి దూకాలి
ఏదో ఒకటి కావటం నుండి ఏదీ కాకపోవటంలోకి "

అవును... ఒడ్డున కూర్చుని నదిలో స్నానమాడుతున్న వారిని కాదు చూడడమంటే. నది లోతులు కొలిచేందుకు అందులోకి దూకాలి. అదే జీవితమంటే. అలాంటి జీవితమే కావాలంటూ ఊరికే జీవితమై బతకాలి అంటున్నాడు ఈ శుద్ధ కవిత్వ ప్రేమికుడు బి.వి.వి.ప్రసాద్‌. నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అన్న కవి తిలక్‌ పుట్టిన ఊరు తణుకు నుంచి వచ్చాడు ఈ కవి బి.వి.వి. ప్రసాద్‌. మహాకవులు, మంచి కవులు పుట్టిన ఊరు నుంచి కనీసం ఒక మంచి కవైనా రావడం తెలుగు సాహిత్య "ఊరు వారసత్వం". అలా తిలక్‌ కు వారసుడు ఈ బి.వి.వి. ప్రసాద్‌ అనిపించింది అతని ఊరికే జీవితమై కొత్త సంకలనం చదువుతూంటే...

"జీవితంలోకి దూకకుండా ఉత్త జీవితాన్ని చూసావా" అని నిలదీస్తున్నాడు ఈ కవి సమస్తలోకాన్ని. బహుశా అలా జీవితంలోకి చూడలేని కాలం ప్రారంభమై చాలా కాలమే అయ్యింది. నిజానికి ఈ బిజీ బతుకుల్లో ఎలాగోలా జీవించడం తప్ప జీవితాన్ని ఉత్త జీవితంలా చూసిన వాళ్లు కానరాని లోకం ఇది. అలా చూస్తే... చూడగలిగితే ఇక ఏ జీవితమూ మిగలకపోవచ్చు. ఆ ఏరుకలో ఉన్నారు కనుకనే మానవులంతా పక్క వారి జీవితాలనే కాదు.... తమ జీవితాలను చూసుకునే స్ధితిలో లేకుండా పోయారు. అలా చూడండర్రా అంటున్నాడు ఈ అమాయకపు కవి. చూడలేరని తెలిసి కూడా.

ప్రపంచ సాహిత్యాన్ని పరికిస్తే కవులంతా అమాయకులే. అదేంటో తెలుగు నీళ్లో.... అతి తెలివితేటలో చెప్పలేం కాని తెలుగు కవులు మాత్రం మాయకులు. కవిత్వం కాని దాన్ని కవిత్వంగా చెలామణి చేసేస్తారు. లేదూ చేయిస్తారు. అలా తెలుగు కవిత్వంలో అకవుల సంఖ్య నానాటికి పెరిగిపోయింది. నిత్యం పెరిగిపోతోంది కూడా. మనం రోజూ చూసే మనిషే... నిత్యం మనకు ఎక్కడో ఒకచోట తారసపడే వారే ఉగాది పండుగ రాగానే కవుల్లా కనిపిస్తారు. వీరిని పోల్చుకుందుకు గతంలో వారి చేతిలో కవిలికట్టలు ఉండేవి. ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్లే కనుక ఎవరు కవో, ఎవరు సాధారణ మానవుడో తెలుసుకోవడం చాలా కష్టం.

తామరతంపగా పెరిగిపోతున్న కవుల సంఖ్యలో శుద్ధ కవిత్వాన్ని వెతుక్కోవడం, ఆ కవిత్వాన్ని ఆస్వాదించడం ఈ రోజుల్లో చాలా కష్టం. అందుకే ఎవరైనా నేను కవిని అంటే భయపడే రోజులు వచ్చాయి. అలా అన్న వారి నుంచి కాసింత దూరం జరగడం కవిత్వం చేసుకున్న ప్రారబ్దం. కానీ, ఈ కవి బి.వి.వి. ప్రసాద్‌ కవిత్వం అందుకు మినహాయింపే కాదు కవిత్వాభిమానులకు ఓ ఊరడింపు. విద్యార్ధి దశ నుంచే కవిత్వాన్ని ప్రేమించిన బి.వి.వి. ప్రసాద్‌ కవిత్వం కోసం చిక్కటి వెలుగు నీడలు చూశాడు. తన వెంట తరిమిన వియోగాల్ని అనుభవించాడు. అందుకేనేమో ఊరికే కవిత్వమై మిగిలాడేమో.

" అనేక క్షణాలుగా కనపడే ఒకే ఒక్క క్షణం ఇది
దానిని అనుభవిస్తున్నట్లు ఉంటుంది గానీ
అది నిన్నూ, నన్నూ, లోకాన్ని
అనుభవిస్తూ, పలవరిస్తూ చలిస్తోంది "

అంటాడు. ఇదిగో ఇలా చలించడం కోసమే మహాకవి శ్రీశ్రీ ఒక్కడై శ్రుక్కిన రోజులు అనుభవించాడు. అందుకే చలం కూడా అనుభవించి పలవరించమన్నాడు. ఎవరి జీవితాలను వారు పుటం పెట్టుకుంటే తప్ప ఊరికే జీవితమై బతకలేమని తెలుస్తుంది. బహుశా తన ఇంటి పక్కనే ఉన్న గోదావరి అలలు అలలుగా తనలోకి ప్రవేశించడం.... రోజుకు పది గంటలకు పైగా కోళ్ల మందుల వాసన కొట్లో కూర్చునే ప్రసాద్‌ కు జీవితపు మట్టి వాసన తెలియడమే ఇదిగో ఇలా కవిత్వమై పరిమళించింది.

నా ఇష్ట కవి ఇస్మాయిల్‌ వెళ్లిపోయిన తర్వాత ఆ బెంగను గాలి నాసరరెడ్డి కాసింత తీర్చాడు. కాని తర్వాత కాలంలో ఉద్యోగమో, జీవికో తీసుకొచ్చిన కష్టాల కారణంగా కవిత్వ "గాలి" తగ్గింది. ఇస్మాయిల్ కవిత్వాన్ని పట్టుకున్నామన్న కవులు తెలుగులో చాలా మందే ఉన్నారు. కాని చాలాకాలం తర్వాత ఆ కవిత్వ ఆత్మను రుచి చూపించిన కవి బహుశా బి.వి.వి. ప్రసాద్ మాత్రమే. లేత అరటాకు చివర మెరుస్తున్న మంచు బిందువులా ఉంటుంది ప్రసాద్‌ కవిత్వం. " ఎన్ని రాస్తే సీతాకోక ఎగిరిపోయిన ఖాళీలవుతాయి" ఇదే కదా కవిత్వమంటే. ప్రసాద్‌కి కవిత్వ రహస్యం తెలుసు. ముఖ్యంగా పదాలను ఎంత వొద్దికగా రాయాలో, వాడాలో తెలుసు. చలం అన్నట్లు ఎకానమీ ఆఫ్‌ థాట్స్ కంటే ఎకానమీ ఆఫ్‌ వర్డ్స్ లేకపోవడం దేశభక్తి కంటే హీనమైన పాపమనే ఎరుక బి.వి.వి.లో శుద్ధ కవిత్వమంత ఉంది. పెదాల తడి తాను కాల్చే సిగరెట్ కు ఎక్కడ అతిగా అంటుకుంటుందో అనే భయమే ప్రసాద్‌ కవిత్వంలో అడుగడుగునా కనిపిస్తుంది. కవిత్వ ప్రేమికులకు ఈ ఏడాది దొరికిన ఓ మంచి కవిత్వ సంకలనం ఊరికే జీవితమై.....

( ఆదివారం ఖమ్మంలో కవి బి.వి.వి.ప్రసాద్ కవిత్వ సంకలనం ఊరికే జీవితమై ఆవిష్కరణ సందర్భంగా)

- ముక్కామల చక్రధర్‌. 99120 19929

ప్రచురణ: చక్రవాకం, విశాలాంధ్ర 8.4.2023

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి