1
కవిత్వమంటే హృదయ స్పందన
ఈ మాట సరిగా అర్ధమైతే చాలు
ఏది కవిత్వం కాదో, ఏది జీవితం కాదో కూడా తెలుస్తుంది
2
కవిత్వానికి హృదయం రధి, కవి సారధి, వస్తువు రధం
ఉద్వేగం అశ్వం, తత్త్వం మార్గం
శబ్ద వైచిత్రీ, తర్కవిన్యాసం, అలంకారాలూ అస్త్రాలు. ధ్వని బ్రహ్మాస్త్రం
రసజ్ఞునిలో అమానవుని తొలగించి మానవుని రక్షించటం లక్ష్యం
3
తత్త్వం లేని ఉద్వేగం కళ్ళు మూసుకొని నడుస్తుంది
ఉద్వేగం లేని తత్త్వం ఊరికే కూర్చుని చూస్తుంది
అన్ని రంగుల్నీ దాచుకొన్న తెలుపులాంటిది ప్రశాంత ఉద్వేగం
అనంతజ్ఞానానికి తెరుచుకొన్న ఆశ్చర్యమే తత్వసారం
4
పదాలతో కాదు, భావంతో ఉండాలి
భావంతో కాదు, నీతో నువ్వుండాలి
నీతో నువ్వున్నపుడు నీలో జీవన సారం ఉండాలి
నిర్మలమైన దు:ఖంతో నిండిన జీవితముండాలి
అక్కడ మాట్లాడాలన్న కోరిక పుట్టాలి
అది పదాల వరకూ తోసుకు రావాలి
5
ఇవాళ బ్రతకాలి కాని, నిన్నటిలో, రేపటిలో వీలుకాదు
నిలబడినచోట చూడాలి కాని, లేనిచోటును చూడలేము
ఇవాల్టి తాజా పదాలూ, భావాలూ, శిల్పమూ పట్టుకొని
నిజంగా మనదైన బ్రతుకులో నిలబడి మాట్లాడాలి
6
పక్షి రెక్కలు తగిలిస్తే పక్షి కాలేము, మన ఊహ పక్షిలా రెక్కలు విప్పాలి
పూల రేకుల్లో మునిగితే పూవు కాలేము, మన కల పూవులా వికసించాలి
అక్షరాలు కూర్చితే కవి కాలేము
కవిగా జీవించటం సాధన చేయాలి, నిజాయితీగా స్పందించే అలవాటుండాలి
7
కవిత్వం రప్పిస్తే కవులం కాలేము
కవిత్వాన్ని తప్పించుకోలేనివారు కవులవుతారు
భావం కవిని అనుసరిస్తే ఉపన్యాసమౌతుంది
కవి భావాన్ని ఆశ్రయిస్తే, ధ్యానిస్తే కవిత్వం వస్తుంది
__________________
'ఆకాశం' సంపుటి నుండి
baagundi sir
రిప్లయితొలగించండిThank you..
తొలగించండిvery nice , touching.
రిప్లయితొలగించండిThank you
తొలగించండి