19 ఫిబ్రవరి 2012

ఫొటోలు: శ్రీ భీమ శంకరం, సహ్యాద్రి పర్వతాలు.

ప్రకృతిధర్మాన్ని అనుసరించి మనిషి సంచారజీవి ఏమో అనిపిస్తుంది. గమనించి చూస్తే, మనిషి సంచరిస్తున్నపుడు మనస్సు స్తిమితంగా ఉంటుంది. స్తిమితంగా ఒకచోట కూర్చున్నపుడు మనసు సంచరిస్తూ ఉంటుంది. అయితే తిరగటం కేవలం తిరగటం కోసమే అయినప్పటికంటే, ఉన్నతమైన గమ్యాన్ని చేరటానికి తిరుగుతున్నపుడు మనలో సాంద్రమైన ఉద్వేగం ఉంటుంది. మనిషి ఇల్లువిడిచి వెళుతున్నప్పటికంటే, బహుకాలం తరువాత తన ఇంటికి తిరిగి వెళుతున్నపుడు ఒక ఉద్వేగానికి లోనవుతాడు. 

ప్రపంచంతో కేవలం బౌద్ధిక (intellectual) సంబంధం మాత్రమే కాక, హృదయగతమైన సంబంధం కూడా మేలుకొన్నపుడు, ఈ సమస్తాన్నీ విభాగాలుచేసి చూడటం మాత్రమే కాక, అంతటినీ ఏకంచేసి చూడాలనే కాంక్ష కూడా కలుగుతుంది. అట్లా అంతటినీ ఒకటిగా చూసే క్రమంలో సమస్తాన్నీ కలిపి ఒకే పేరుతో పిలిస్తే, ఆ పేరే దైవం అని భావిస్తాను. విశ్వం, సృష్టి లేదా జీవితం అనే పూర్ణభావనలే పూర్తిగా హృదయం నుండి పలికినపుడు దైవంగా భావించబడతాయి. ఈ దైవభావం భయం సృష్టించే దైవం కాదు, ప్రేమ సృష్టించే దైవం. ఇది స్వార్ధసృష్టి కాదు, త్యాగసృష్టి. అహంకార సృష్టి కాదు, మానవీయ విలువల సృష్టి. 

కొన్ని పవిత్ర స్థలాలలో, జీవులలో ఆ ప్రేమస్వభావం శక్తివంతంగా వ్యక్తమౌతుంది. ఆయా స్థలాలనూ, మహాత్ములనూ దర్శించినపుడు, సాధారణజనులకు తమ హృదయంలోకి తామే మరొక అడుగు త్వరగా వేసినట్లు అనిపిస్తుంది. అనేకమంది తాము ఎందుకు యాత్ర్ర చేస్తున్నారో తెలియకుండానే చేసినా, వారిలోని మానవీయ స్పందనలనూ, స్వచ్ఛతనూ అనుసరించి వారు తమ అంతరంగంలోనికి వేగంగా ప్రయాణిస్తారు. ఎలాంటి మానసిక పరిపక్వతా లేకుండా, తమలోని స్వార్ధమనే మహాభూతానికి సేవచేయడానికే యాత్రలుచేసే మొరటు మనుషుల నడుమ, అరుదుగానైనా అలాంటి ఆర్తిగల కొందరుంటారు. బహుశా, ఆ అరుదైనవాళ్ళకోసమే ఆ పవిత్రక్షేత్రాలూ, మహాత్ములూ ఓరిమిగా ఎదురుచూస్తుంటారు. 

దైవాన్ని దర్శించడం అంటే తన మూలాన్ని, తన స్వగృహాన్ని దర్శించడం. అట్లాంటి భావంతో యాత్రకు బయలుదేరినప్పుడు, మనలో ఇంటికి చేరుతున్న ఉద్వేగం ఉంటుంది. తన తండ్రినీ, తల్లినీ చిరకాలపు వియోగం తరువాత దర్శించబోతున్న ఆర్తి ఉంటుంది. అంతేకాకుండా తానొక ప్రేమపూర్వకమైన సన్నిధిని చేరుతున్నానన్న స్పృహ వలన, దారివెంట తాను చూస్తున్న ప్రతిదీ ప్రేమమయమౌతుంది. దారివెంట తాను చూసిన ప్రకృతీ, జీవులూ, మానవులూ - సమస్తమూ, తాను చూడబోతున్న దివ్యత్వానికి సన్నిహితమైనవి అయినట్టూ, అవి అన్నీ తనను అక్కడికి చేర్చేందుకు దారిచూపుతున్నట్టూ అనిపిస్తుంది. కాలం నిండా పలుచని గాలిలా, మంచుతెరలా, వానజల్లులా ప్రేమ అలముకొన్నట్టుంటుంది. చివరకు ఆ దివ్యస్థానాలను చేరినప్పుడు హృదయం కరుగుతుంది, కళ్ళు సజలాలౌతాయి. గాఢమైన, లోతైన నిశ్శబ్దం లోపల మేలుకొంటుంది. బహుశా, యాత్ర ముగుస్తుంది.. 

దైవాన్ని జ్యోతిస్వరూపంగా పెద్దలు భావించిన క్షేత్రాలలో ఒకటైన శ్రీ భీమశంకరం యాత్ర, మార్గం నుండి గమ్యం వరకూ మెత్తనికాంతి నింపిన అనుభవం. దారివెంట మంచుతెరల దోబూచులాటలతో పాటు కనిపించీకనిపించకుండా ఆ దివ్యత్వం మనిషితో ఆడుతున్న దోబూచులాట.. ఈ పొగమంచు ఎవరు తొలగించాలి.. మనిషా.. దైవమా..    

అన్ని ఫొటోలనూ చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి. 2 కామెంట్‌లు: