22 జూన్ 2012

ఫొటోలు: తాజ్ మహల్ , ఆగ్రా

మా యాత్రా బస్సు ఆగ్రా చేరింది. తాజ్ మహల్ చూడబోతున్నాం. నాకు సాధారణమైన ఆసక్తి మినహా మరీ అంత ఉద్వేగం కలగలేదు. మానవ నిర్మాణాలు నన్ను మరీ అంత ఆకర్షించవు. అవి గొప్ప మానవ హృదయాల అభివ్యక్తి అయితే తప్ప. తాజ్ మహల్ ప్రేమకి మాత్రమే చిహ్నం కాదు.. హింసకి కూడా.. దాని నిర్మాణం నిమిత్తం ఎందరో మరణించారని చెబుతారు..

ముందుగా బస్సు దయాల్బాగ్ అన్నచోట ఆగింది.. అక్కడ రాధాస్వామి మందిరం పేరిట ఒక నిర్మాణం, కొంతవరకూ జరిగినది, ఉంది. దానిని చూడటానికి వెళ్ళాం మేమంతా.. విశాలమైన ఆ పూర్తికాని నిర్మాణంలో మేం అటూఇటూ తిరిగాం కాసేపు. తరువాత నా జీవితంలో, నా ఆంతరిక చైతన్యంలో ఎక్కడో ఇప్పటికీ సజీవంగా ఉన్న అనుభవం ఒకటి జరిగింది.

రుతుపవనాల ప్రభావంతో తొలివానలు కురుస్తున్న జూన్ నెలలొ, మేం ఆగ్రా చేరేసరికే మేఘావృతమైన ఆకాశం నుండి, ఉన్నట్లుండి బలమైన గాలులతో వాన కురవటం మొదలైంది. ఉధృతమైన గాలి, గాలి వెంట విసురుగా తోసుకువస్తున్న వానచినుకులు... తలుపులులేని ఆ విశాలమైన నిర్మాణంలో తమకు నచ్చినట్టల్లా పరుగులు తీస్తున్నాయి.. గాలి వెంటా, వాన వెంటా తోడుగా వచ్చిన శబ్దాలు.. మా అస్తిత్వాలను చెరిపేసి.. ఆ గదులు నిండిపోయేలా హూంకరిస్తున్నాయి... నువ్వు ప్రకృతి.. ఇది నీ అమాయకమైన విశ్వరూపం.. నేను నీ శక్తుల నుండి వచ్చాను.. మనిషిగా.. ఇప్పుడు నువ్వు నన్ను చుట్టుముట్టి.. నేనేమిటో నాకు తెలిసేలా .. నా అల్పమైన ఊహలన్నిటినీ చెదరగొడుతూ.. నన్ను నీలోకి రమ్మంటున్నట్టు.. నేను ఒక మట్టి ముద్దలా ఉండటం నీకూ ఇష్టం లేనట్టు, నాకూ ఇష్టం లేనట్టు.. ఏ యుగాలనాటి గాలి ఇది, వాన ఇది, ఉరుములివి.. మెరుపులివి.. నాలో ఏ అనాది శక్తుల్ని ఇవి మేల్కొలుపుతున్నాయి.. ఒక ప్రశాంత ఉద్వెగంతో నేను.. ఒక స్వచ్చమైన ఉద్వేగంతో ప్రకృతి.. కాసేపు మేం ఒకటి.. కాసేపు మేం వేరు.. విడిపోవటానికి కలవటం.. కలిసేందుకు విడిపోవటం.. ఇది క్రీడ.. ఇది లయ.. ఇది లయం.. క్రమంగా.. అకస్మాత్తుగా.. వానా, గాలీ తమ విశ్వరూపాన్ని ఉపసంహరించుకొన్నాయి.. ఎలా వచ్చిన గాలీ, వానా అలా వెళ్ళిపోయాయి.. ఇప్పుడు ఆకాశం ఏమీ ఎరగనట్టు, పసిపాప మొహంలా విప్పార్చుకొని చూస్తుంది.. ఒక చల్లదనం, స్వచ్చత ఆకాశాన్నీ, మబ్బుల్నీ, ఊరినీ, మనుషుల్నీ ఆక్రమించాయి..

అప్పుడు మా బస్సు తాజ్ మహల్ వైపు బయలుదేరింది.. తడితడి వీధులలో దిగి.. ఇంకా ఉండుండి సన్నగా పడుతున్న చినుకుల లో తడుస్తూ, ఒకటిరెండు ప్రాకారాలు దాటి, అకస్మాత్తుగా దూరంగా, నల్లని మేఘాల నేపథ్యంలో వెలుగుతున్న తాజ్ మహల్ ను మేం దర్శించాం.. నాకు దాని గురించి ఉన్న అనుకూల, ప్రతికూల భావాలన్నీ అదృశ్యమయ్యాయి.. దూరంగా.. మేఘాల నేపథ్యంలో తాజ్ మహల్ ఒక పసిపాపలా పారాడుతోంది.. ఈ పాలరాతి నిర్మాణం.. ఎక్కడో నాలోలోపలి స్వచ్చతను కోమలంగా తాకుతోంది.. ఇది ఎవరికోసం, ఎవరు, ఎవరితో కట్టించారు.. ఆ చరిత్రనిండా ఉన్న గులాబీలేమిటి, ముళ్ళేమిటి, వాటికి అంటిన నెత్తురేమిటి.. ఇవి ఇప్పుడు ముఖ్యం కాదు.. ఇది ఒక పాలరాతి నిర్మాణం.. పాలరాళ్ళను వెన్నముద్దల్ని చేసి మలిచిన శిల్పుల సౌందర్య స్పృహ, నైపుణ్యం.. వీటన్నిటిలోంచీ వినవస్తున్న ఒక అనాది జీవన గానం.. ఒక సౌందర్య ప్రవాహం.. అందంగురించి.. ఆశావహ జీవితంగురించి ఒక కాలం ప్రజలు మరొక కాలం ప్రజలకి రాసిన తెల్లని ప్రేమలేఖ....

చాలాసేపు ఆ నిర్మాణం చుట్టూ తిరిగి, ప్రక్కనే ప్రవహిస్తున్న సరయూ నదిని చూసి..
తాజ్ మహల్ నీ, రాధా స్వామి మందిరం వాననీ కళ్ళనిండా, హృదయం నిండా నింపుకొని..
ఆగ్రా విడిచి బయలుదేరాం..

అన్ని ఫొటోలనూ చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి