07 ఏప్రిల్ 2013

కల అనుకొందాం

కల అనుకొందాం కాసేపు
ఈ సృష్టిని అద్దంలో కనిపించే నగరం అనుకొందాం
పీడకలనుండి మెలకువలోకి ఉలిక్కిపడినట్టు
జీవితంనుండి చిరంతన శాంతిలోకి ఉలిక్కిపడి మేలుకొందాం

ఏమీ తోచని పిల్లవాడు
చిత్తుకాగితంనిండా పిచ్చిగీతలు చుడుతున్నట్టు
మొదలూ, చివరా లేని  సమస్యలచుట్టూ ఆలోచనలు చుడుతున్నాం

కాగితాన్ని వదిలి ఆడుకోవటంలోకీ
ఆలోచనల్ని వదిలి శాంతిలోకీ వెళ్లివద్దాం
కాసేపలా జీవితాన్ని కలగా ఊహించటంలోకి నడిచిచూద్దాం

సృష్టిని కల అనుకొందాం కాసేపు
సృష్టిలో సుడిగుండమై కూరుకుపోయే 'నేను'ను
కలనుండి బయటకు నడిచే ద్వారమనుకొందాం

కాగితాలెటూ ఎగిరిపోవు
వాటిపై బరువుంచిన రాయిలాంటి నేను ఎక్కడికీ మాయంకాదు

రంగురంగుల పంజరాలతో మిరుమిట్లుగొలిపే ప్రపంచం
ఉన్నచోటనే యుగాలపర్యంతం వేలాడుతుంది కానీ,
కాసేపలా స్వేచ్ఛలోకీ, ఏదీ లేకపోవటంలోకీ, ఏదీ నేను కాకపోవటంలోకీ
నవ్వులాగా సునాయాసంగా పరుగుపెడదాం
హద్దుల్లేని పసిదనం కెరటాల్లో మునిగి కేరింతలుకొడదాం

'జీవితం ఉత్త ఊహ, భయపడ ' కని చెప్పుకొందాం
నిద్రలోకో, ప్రేమలోకో, సంగీతంలోకో వెళ్ళినట్టు
కాసేపలా, 'ఇది కలా, నిజమా' అనే సందేహంలోకైనా వెళ్లివద్దాం

ఇంతాచేసి ఇది కలేకదా అనుకొందాం
చప్పరించి మరిచిపోతున్న పిప్పరమెంటు రుచి అనుకొందాం
ఈ నిమిషాన్ని తాజా జ్ఞాపకమనుకొందాం
ఈ నిమిషాన్ని మరకపడుతున్న ఊహ అనుకొందాం
 
కాగితమ్మీది అక్షరాలను కలలో ఉన్నట్టు చదువుకొందాం
కాసేపైనా కలలేవీ లేకపోవటాన్ని కలగందాం, శాంతిగా ఉందాం

కాస్తంత శక్తినీ, దయనీ, కాంతినీ నింపుకొని
జ్వరగ్రస్త జీవితాలని మంత్రమయ హస్తాలతో తాకుదాం


_____________________________
ప్రచురణ: ఆదివారం ఆంధ్రభూమి 7.4.2013

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి