12 మే 2013

మధ్యాహ్నపు నీడ


1
ఈ మధ్యాహ్నం 
తొందరేంలేనట్టు నిదానంగా విస్తరిస్తున్న నీడల్నిచూస్తున్నపుడు   
దయాగుణమేదో కవిత్వంలా మెలమెల్లగా కనులు విప్పుతోంది     

నిద్రచాలని రాత్రిలోంచి ఈదుకొంటూ వచ్చి
ఇవాళ్టి దృశ్యరాశిలో తొలిభాగమంతా ఆలోచనలలో పొగొట్టుకొన్న నన్ను   
ఈ మధ్యాహ్నపు నీడ స్నేహితుడిలా పరిశీలించింది  

2
పగలొకటే చాలనీ, రాత్రికి లోకంతో పనేముందనీ 
పోరాటం జీవితమనీ, శాంతికి చోటులేదనీ వాదించిన మిత్రులతో

రెండూ సమానమనీ, ఒకదాన్నొకటి నింపుకొంటూ ఉంటాయనీ 
ఒకటి కోల్పోతే, రెండవదీ కోల్పోతామనీ  
ఒప్పించలేకపోయిన నా అశక్తతకి దయగా నవ్వుకొంటున్నపుడు  

పగటి వెలుతురుమహల్లోకి రాత్రి పంపిన అతిథిలా ప్రవేశిస్తున్న
ఈ మధ్యాహ్నపు నీడ 
నువ్వూ నాలాంటివాడివే అంటూ మృదువుగా పలకరించింది  

3
నల్లని రాత్రిలానో, తెల్లని పగటిలానో  
తనకంటూ ఒక రంగునేమీ మిగుల్చుకోని నీడ

గర్వం నుండి ప్రేమకీ, ఉద్వేగాల నుండి స్పష్టతకీ ప్రయాణించే  
నా అక్షరాల్లాగే, వాటిలోంచి లీలగా కనిపించే నాలాగే 
బహుపలుచని ఉనికిని మిగుల్చుకొంటూ సమీపించింది

4
నను కన్న జీవితం
నేను ఒంటరినయ్యానని భావించేవేళల్లో తోడుంటుందని సృష్టించినట్లు   
ఈ మధ్యాహ్నపు నీడ దయలాగా నెమ్మదిగా తాకింది నన్ను  

  
ప్రచురణ: ఆవకాయ.కాం 5.5.2013

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి