05 మే 2013

దు:ఖం లోపలికి


ఒక్కొక్క తలుపూ మూస్తూ తెరలుతెరలుగా చీకటిని ఆహ్వానించాను
ఇపుడు పదేపదే రాబందులా నామీద వాలుతున్న దు:ఖాన్ని చూస్తున్నాను
చీకటిలాంటి దు:ఖాన్ని మృదువుగా, ప్రశాంతంగా తాకుతున్నాను

దు:ఖమంటే ఏమిటో తెలీదు, లోకంలో దు:ఖం ఎందుకుందో తెలీదు
మూసిన గదిలోకి చీకటీ,
మూసుకొన్న హృదయంలోకి దు:ఖమూ ఎలా చేరుతాయో తెలీదు

పాలపుంతల మధ్య పరుచుకొన్న చీకటిలా
వెలుతురుకిరణాలని పీల్చుకొనే కృష్ణబిలాల్లా
సమస్త సుఖశాంతుల్నీ పీల్చివేసే దు:ఖం వుంది

సుఖం, దు:ఖం దేహంలోపలి రసాయన చర్యలా
మనస్సుపై క్రీడించే మహాశక్తులా
కాదేమో, తెలీదు. అవునేమో, తెలీదు.

ఇపుడు నేను దు:ఖంలో వున్నాను
దు:ఖం, నేనూ ఒకటై వున్నాము
నేనిపుడు దు:ఖాన్ని, నేనిపుడు చీకటిని

సమస్తం నుండీ ముడుచుకొంటున్నవాడిని
సమస్తం నుండీ నన్ను నేను దాచుకొంటున్నవాడిని
మరింత ఘనీభవిస్తున్న శిలాజాన్ని, సాంద్రమవుతున్న జీవితాన్ని

జీవితం లోలోపలికి దు:ఖపు వేర్లు దింపి
రేపటి ఆకాశపుటంచుల్లో
ఆకుపచ్చని కాంతుల్ని ఎగరేసే అవధిలేని ఆనందాన్ని
ఘనీభవించిన చీకటిని కరిగి ఆవిరిలా విహరించే వెలుతురుని

ఇపుడు నేను
పగటినీ, రాత్రినీ నిశ్శబ్దంగా మోస్తున్న ఆకాశంలా 
ఆనందాన్నీ, దు:ఖాన్నీనిశ్శబ్దంగా స్పృశిస్తున్నఒక రహస్యస్పృహని

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి