26 జనవరి 2014

ఒకే సంతోషానికి..


ఆకాశాన్ని నీలివస్త్రం చేసి అదాటున విసిరేసినట్టు ఆమె నవ్వుతుంది
అంతవరకూ విషాదస్మృతుల గుహల్లో దాగిన అతను
బంగారుటెండలోకి పరిగెట్టినట్టు నవ్వుల్లోకి పరుగుతీస్తాడు 

అప్పటివరకూ తలపైన శిలలాగా మోస్తున్న బాధ ఏదో
తనలోంచి ఊహలాగా ఎగిరిపోతుంది

ఆమె చిత్రమైన మనిషి 
తనతో భూమ్మీదికి 
పసితనాన్నే తప్ప, యవ్వనాన్నీ, ఫ్రౌఢిమనీ, వార్ధక్యాన్నీ 
వెంట తెచ్చుకోవటం మరిచిపోయినట్టుంటుంది 

ఆమె నిష్కపటంగా పంచే సంతోషాన్ని నిష్కపటంగా స్వీకరిస్తూనే అతను
తన రహస్యదు:ఖాల్ని రహస్యంగా జారవిడుస్తూ వుంటాడు

నువ్వింత సంతోషంగా ఎలా ఉంటావని 
అతను ఉండబట్టలేక అడిగాడొకసారి

ఆమె అందీ 'ఎవరన్నారు, ఎప్పుడూ సంతోషంగా ఉంటానని.
నిన్ను చూసి కదా సంతోషం కలిగేది.
అదే ప్రశ్న నిన్ను అడగాలని ఎన్నోసార్లు అనుకొన్నాను' 

వాళ్ళ నవ్వులకెరటాలు మౌనంలోకి ఇంకిపోతున్నపుడు 
తడితో మెరిసే కాసిని శబ్దాలు వాళ్ళనిలా తాకి వెళ్ళాయి 

'మీరిద్దరూ ఒకే సంతోషానికి రెండు కొసలు.
ఒకరి నుండొకరు వెనుతిరిగినపుడు 
ఒకరి సంతోషాని కొకరు దూరమౌతారు 
ఒకరి కోసం ఒకరు ఎదురు వెళ్ళినపుడు
ఒకే సంతోషపు పూర్ణవలయ మౌతారు ' 

చేతిలోని చేయిని గట్టిగా పట్టుకొన్న వాళ్ళ కళ్ళల్లో
మేలుకొన్న నీటిపొరల్లో
సమస్తసృష్టీ తననొకసారి చూసుకొని నిట్టూర్చింది


______________________________
ప్రచురణ: ఆదివారం ఆంధ్రభూమి 26.1.2014

8 కామెంట్‌లు:

  1. చాల నచ్చింది అండి ! ప్రతిపాదించిన విషయాన్నీ భావుకంగా చెప్పారు అనిపించింది ! తప్పులు ఉంటె మన్నించాలి నన్ను !

    రిప్లయితొలగించండి
  2. పనికిమాలిన ఇగో లతో ఎవరెక్కువో తేల్చుకోవడానికి పోటీ పడుతూ అణుక్షణం సంసార నరకానికి నిచ్చెన లేసుకుంటున్న నేటి జంటలకు -
    " మీరిద్దరూ --------- సంతోషపు పూర్ణవలయమౌతారు "
    అద్భతమైన సందేశం .
    బ్లాగు : సుజన-సృజన

    రిప్లయితొలగించండి
  3. I felt very happy with below words!

    నువ్వింత సంతోషంగా ఎలా ఉంటావని
    అతను ఉండబట్టలేక అడిగాడొకసారి
    ఆమె అందీ 'ఎవరన్నారు, ఎప్పుడూ సంతోషంగా ఉంటానని.
    నిన్ను చూసి కదా సంతోషం కలిగేది.

    రిప్లయితొలగించండి