14 జనవరి 2014

బెంగటిలినవేళ

1
 హాస్టల్ నుండి అర్థరాత్రి తండ్రికి ఫోన్ చేసింది అమ్మాయి  
'బెంగగా వుంది, డాడీ' 

వాళ్ళ తలల మీద ఒకే నక్షత్రాలు
కనులు విప్పార్చి చూస్తున్నాయి
ఒకే చలిగాలి ఆ ఇద్దరినీ అమ్మలాగా దగ్గరికి పొదువుకొంది

ఏమంత ముఖ్యంకాని శబ్దాల తెరచాపలు తెరిచి  
మృదువైన ఆర్ద్రతలోకి కలిసి ప్రయాణించారు కాసేపు 

ఆ సమయంలో 
ఆ రెండు జీవితాలూ ఒకటికావటంలోకి వికసించాయా
ఒకే జీవితం రెండుగా వికసించిందా

2
తెలియని యే చోటినుండో ఆమె భూమ్మీదికి వచ్చినపుడు  
అతనిలో అంతకుముందు ఎరుగని ఆకాశమూ
దానినిండా ఆనందమూ ప్రవేశించాయి

ఈ జీవి ఎవరు, ఈమెకీ, నాకూ బంధమేమిటి
ఈమెని చూసినపుడల్లా
కడుపులో ఆనందమో, దయో అలల్లా ఊగటమేమిటని
అతనికి ఆశ్చర్యం కలుగుతూ వుంటుంది

మొన్ననే భూమ్మీద బాతునడకలు మొదలుపెట్టిన ఈ అమ్మాయి
ఇంత పెద్దది ఎపుడయిందని విస్మయంగానూ వుంటుంది

అతన్ని కొనసాగించటానికి ఆమె వచ్చిందో
ఆమె కొనసాగటానికి అతన్ని ముందుగా తెచ్చుకొందో
వాళ్ళకి తెలియనిది వారిద్దరిద్వారా కొనసాగుతోందో చెప్పమని

అతను తనలోని ప్రాచీన మౌనాన్ని ప్రార్ధిస్తాడు  
లోలోపలి మౌనం పదాల్లోకి వికసిస్తూ    
పురాతన విషయమే తాజాగా తెలియచేస్తుంది
  
3
తననించి తాను విడిపోవటం వీలుకాని  
ఒకే జీవితం, ఒకే ఆశ్చర్యం, ఒకే ఆనందంలాంటి దయ
హాస్టల్ గదిలోంచి అతనిలోకి 'బెంగగా వుంది, డాడీ' అన్నపుడు

అనేక జీవితాలు లేవనీ, ఉన్నది ఒకే జీవితమనీ తెలిసిన అతను కూడా
‘నాకూ బెంగగానే వుంది, తల్లీ’ అంటాడు


__________________________

ప్రచురణ: ఆంధ్రజ్యోతి వివిధ 13.01.2014

4 కామెంట్‌లు:

  1. చెప్పిన మాటే మళ్ళీనూ...ఆర్ద్రంగా, ఆత్మీయంగా ఉందండీ..
    సంక్రాంతికి అమ్మాయి ఇంటికి వచ్చిందని ఆశిస్తాను. చిన్నమ్మాయిని హాస్టల్‌లో చేర్పించకండి మరి :))).

    మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  2. ఈ మధ్యనే తండ్రిని అయ్యాను పాపకి ఏడాదిన్నర ! సంక్రాంతికి వెళ్లి వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది. ఆ బెంగ తెలుస్తోంది అండి ! తండ్రి బెంగకి అక్షర రూపం - ధన్యవాదాలు !

    రిప్లయితొలగించండి