28 జులై 2014

దీపం వెలిగిస్తూ..

1
నిజం, నీ చుట్టూ నవ్వులున్నాయి, నవ్వలేకపోవటముంది
కన్నీరుంది, కన్నీరు ఆవిరైపోవటముంది
కోట్ల జీవుల అలజడులు, ఆనందవిషాదాలు,
భయాలు, బెంగలు, సందేహాలు, సందిగ్దతలున్నాయి

2
నడిసముద్రంలోని ద్వీపంలా
వీటిమధ్య నువు మాత్రమే బతకాల్సిన నీ జీవితముంది
చాతనైనంత నిండుగా బతికిచూపే బాధ్యతవుంది
ఎలా జీవించాలో, ఎలా అవసరంలేదో
మాటకన్నా ముందు పాదాలు నడిచి చూపాల్సివుంది

హుందాగా, బిడియంగా పూలలా వికసించే కోరికలతో
కలలన్నీ కన్నీరై  రాలినా లోటేలేని చిరునవ్వు విసురుతూ
ఏ మరకా తాకలేని జీవనానందంతో, మెరిసే ముఖంతో
కాస్త వినమ్రంగా, మరికాస్త సరదాగా భవితలోకి వెళ్ళటమొకటుంది

3
నేనూ ఎదిరిస్తాను మనుషుల్లోని అమానుషాన్ని
బహుశా మరింత తీవ్రంగా, బలంగా, లోతుగా 
నువు ధనికులని నిందిస్తున్నపుడు వాళ్ళ ధనాన్ని చులకనచేస్తాను
వారి నల్లని విజయాలు జీవితాన్ని కోల్పోయిన ఫలితాలని వ్యాఖ్యానిస్తాను

వాళ్ళు సృష్టించే భయోన్మత్త విపణివీధుల మాయాజాలం నుండి
నా వాళ్ళని వెన్నెల్లోకీ, వేసవిలోకీ, చెట్ల ఋతుగానాల్లోకీ
క్షణక్షణమూ సరికొత్తగా మేలుకొనే ఆకాశం లోకీ, ఆశ్చర్యంలోకీ
ఏకాంతవేళల వికసించే లోతులెరుగని మౌనంలోకీ
ఎవరి దయా అక్కర్లేని పరమనిర్లక్ష్యంలోకీ ప్రశాంతంగా నడిపిస్తాను

నీకూ, నాకూ మధ్య భేదాలన్నీ వట్టి భయాలు కట్టిన తెరలని
అలలునిజం కాదనీ, మనం సముద్రజలమనీ మౌనంగా తెలియచేస్తాను 
ఇందరిలోపలి ఆర్ద్రత నా ఆత్మబంధువని, స్వేచ్ఛ నా నేస్తమని
నిరపేక్షసత్యం నన్ను నడిపించే గురువని నిష్కపటంగా నమ్మిచూపిస్తాను 

4
ఎవరెవరిలోనో నచ్చనిదానిని నిందిస్తూ ద్వేషంతో
నువు జీవితాన్ని చీకటి చేసుకొంటున్నపుడు
అందరిలో ప్రేమించతగిన వెలుతురుని వెదుకుతూ, తాకుతూ
నువు నిందిస్తున్న చీకటిలో దీపం వెలిగించాలని చూస్తాను

2 కామెంట్‌లు: