18 జులై 2014

పసుపుకాంతి

ఈ పసుపురంగు పూలని చూస్తున్నపుడు
ప్రపంచం కాసేపు మాయమౌతుంది
పుట్టాక మొదటిసారే ఈ రంగుని చూసినట్టు
పసుపుకాంతిలోకి ప్రవేశిస్తాను

‘నువు ప్రపంచంలోకి ఎందుకు వచ్చావో
ఎందుకు గొడవపడతావు
ఇక్కడ నువు చూసేందుకు నేనున్నాను

నదిలోకి పడవ జారినట్టు
ఎక్కడి కిరణమో నీవరకూ, నావరకూ వాలినట్టు
ఫలం నాలుకపై రుచిలా వికసించినట్టు
నాలోకి జారిపో, వాలిపో, వికసించు

ఈ వివశత్వానికి ముందు
నువ్వెవరో, నేనేమిటో ఎందుకు చింతిస్తావు
ఈ రససంయోగం తరువాత
ఏం కావటంలోకి విడిపోతామో, ప్రయాణిస్తామో ఊహిస్తావు

ఈ క్షణంలో మనం ఒకటి కావటంలోనే
పురాతనకాలాల విశ్రాంతి కొలువుతీరింది
ఈ విశ్రాంతిలోనే సమస్తసృష్టీ
నదిలో ప్రతిఫలించే ఆకాశంలా తేలుతూ వుంది’

పసుపుకాంతీ, నేనూ ఒకటైన క్షణాలలో
నక్షత్రాలు నా ప్రక్కగా వెళ్ళిపోతూవుండటం గమనించాను

ఒక గాఢమైన నిశ్శబ్దం
'ఏదీ లేదు, ఊరుకో' అంటూ వుండటం
నేను చివరిసారి విన్నాను

______________________
ప్రచురణ: ఈ మాట  జూలై 2014 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి