03 మే 2020

అన్వేషులకు..

 

సద్గురు శ్రీ సుబ్రహ్మణ్యం, శ్రీ కాళహస్తి 

      భగవాన్‌ శ్రీ రమణ మహర్షి ‘నేనెవరిని’ అనే పుస్తకానికి ముందుమాటగా ఇలా రాశారు. ‘అందరూ దుఃఖం అనేది లేక ఎప్పుడూ సుఖంగా ఉండాలని కోరుకుంటారు. ప్రతివ్యక్తికీ తనయందే పరమప్రీతి వుంటుంది. ప్రీతికి సుఖమే కారణంగా వుంటుంది. మనస్సు అణగిన నిద్రలో ప్రతిరోజూ అనుభవించే ఆ సుఖాన్ని పొందాలంటే తనని తాను తెలుసుకోవాలి. దానికి నేను ఎవరిని అనే జ్ఞానవిచారమే ముఖ్య సాధనం.’ అయిదు వాక్యాల్లో జ్ఞానవిచారణ ఎందుకు చేయాలో చెప్పారు. అవి నిజమా, కాదా అని తనలోకి తాను తరచి చూసుకొన్నవారికి విచారణ మొదవుతుంది.
      జీవితం దుఃఖమయం. తనకి అన్యంగా కనిపించే ఇంత విశ్వం, ఇన్ని అనుభవాలూ చివరికి తనకి దుఃఖాన్నీ, భయాన్నీ మాత్రమే మిగుల్చుతున్నాయని జీవితాన్ని లోతుగా గ్రహించినవాళ్ళకి తెలుస్తూనే వుంటుంది. మనకి సుఖమనిపించింది కొనసాగాలనో,  మరింత పొందాలనో కోరికా, పొందుతున్న సౌఖ్యం చేజారిపోతుందన్న భయమూ తప్ప, మన పనులకి అర్థమేమన్నా ఉందా అని చూస్తే, ఏమీ కనిపించదు. సుఖ, దుఃఖాలకి కారణమైన ప్రపంచాన్ని వదిలి, వీటిని అనుభవిస్తున్న ‘నేను’ ఎవరు అని వెదకి, కనుగొంటే, భయ, దుఃఖాలు అంతరిస్తాయని జ్ఞానులు చెబుతున్నారు.
        జ్ఞానం వల్ల ప్రపంచం మారదు, కానీ, ప్రపంచం పట్ల మన స్పందనలో, చూపులో జీవమూ, తాజాదనమూ, వివేకమూ తొణికిసలాడతాయి. భారంగా, విసుగ్గా గడిచే జీవితం కలలాగా తేలికగా మారుతుంది.
        జ్ఞానం పొందటం అహంకారాన్ని వదులుకోవటమంత తేలిక, అంత కష్టం. మనకన్నీ అన్యంగా (ఆబ్జెక్టివ్‌గా) చూడటమే తెలుస్తుంది. అంటే నేను వేరు, అవతలి వస్తువు వేరుగా. ‘నేను’ ఎవరు అనే అన్వేషణ మొదలుపెట్టినా మనం అదే పద్దతి అనుసరిస్తాం. ‘నేను’ని అన్యం (ఆబ్జెక్ట్‌) చేస్తాం. అందువల్ల ‘నేను’ ఎప్పటికీ తెలియకుండానే వుంటుంది. అందువల్లనే భగవాన్‌ ‘నేను’గా ‘ఉండటమే ఉంటుంది’ అంటారు.
      అట్లా ఉండటం తెలిస్తే ఇక ఏ సాధనా లేదు. అది తెలియటం అంతకష్టం గనుకే, అనేక గ్రంథాలు, సాధనలు అవసరమయ్యాయి. ఈ గ్రంథాలు ప్రధానంగా రెండు విధాలు. 1. ‘నేను’ని ఇతరాన్ని గురించి చెప్పినట్టు చెప్పేవి. ఇవి మొదటి దశలో  అవగాహన కలగటానికి సహాయం చేస్తాయి. 2. ‘నేను’ అనుభవాన్ని చెప్పేవి. (అనుభవం అనే మాట సరైనది కాకపోయినా, అవగాహనకి అంతకన్నా దారిలేదు.) అంటే ‘నేను’గా స్థిరపడిన జ్ఞానులు తమ అనుభవం నుండి చెప్పేవి. ఇట్లా చెప్పే జ్ఞానుల మాటలు మనస్సులో అతి సూక్ష్మమైన చోట పనిచేస్తాయి. తటాలున ‘నేను’ స్ఫురణలోకి మేల్కొలుపుతాయి.
        ఇలా చెప్పేవారు అరుదు. ప్రాచీనకాలంలో ఇలా చెప్పిన గ్రంధాలని స్వరూపవర్ణన గ్రంథాలంటారు. వాటిలో నేను విన్నవి అవధూతగీత, ఋభుగీత, అష్టావక్రగీత, యోగవాశిష్టం. శ్రీ శంకరుల అద్వైతబోధనలోనూ ఈ ధోరణి చూసిన గుర్తు. నవీనకాలంలో ఇలా బోధించినది శ్రీరమణ మహర్షి, శ్రీనిసర్గదత్త మహరాజ్‌, వారి శిష్యులు శ్రీరమాకాంత మహరాజ్‌. రాబర్ట్ ఆడమ్స్, ఎకార్ట్ టోలీ కూడా ఈ కోవకే వస్తారనుకుంటాను.
        ఈ ధోరణిలో చెప్పే, సజీవంగా వున్న జ్ఞానుల కోసం చాలా వెదికాను, వారితో ముఖాముఖి మాట్లాడటం వలన, వారి సన్నిధి యొక్క పవిత్రత వలన మేలు కలుగుతుందని. గత ఏడాది చివర, మిత్రులు గంగారెడ్డి కొన్ని సూక్తులు పంపి, ఎలా వున్నాయో చూడమన్నపుడు, చదివి, ఆశ్చర్యపడ్డాను. ఎలాంటి మాటలు చెప్పగలవారికోసం వెదుకుతున్నానో, వారే మాట్లాడినట్టు తోచింది.
       సద్గురు శ్రీ సుబ్రహ్మణ్యంగారి సన్నిధీ, మాటలూ నాపై అమృతోపమానమైన ప్రభావం చూపాయి. ఇవి మిత్రులందరికీ చేర్చాలనే తలంపు బలంగా కలిగింది.
      చిత్తశుద్ధితో సత్యాన్ని వెదుకుతున్న మిత్రులకి రెండు సూచనలు. 1. వారిని కలవండి, మీ వెదుకులాటలో మీకు కలిగిన సందేహాలని అడగండి. జ్ఞానుల సన్నిధి, వాక్కు శక్తివంతమైనవి. వాటిని స్వీకరించండి. 2. వారు తన దగ్గరికి వచ్చినవారితో చెప్పిన మాటలు చదవండి. ఎవరి విషయంగానో కాదు, మీ విషయం అనుకొని చదవండి. ఆ మాటల్ని నమ్మటం, ఆలోచించటం కాదు. మీ గురించే చెప్పినట్టుగా పరిశీలించండి, అనుభూతించండి. మీ అనుభవంలోంచి, ఆ మాటల సారాన్ని పట్టుకోవటానికి చూడండి.
మన అవగాహన నిండా మాయ కప్పిన తెరల్ని తేలికైన మాటతో, పదునైన తర్కంతో, చూపుతో తొలగిస్తున్నారు. మాయ తొలగించుకొని మిమ్మల్ని మీరు అనుభవించండి.        
కొందరికైనా ఈ మాటలు ఆత్మోద్దీపన కలిగించగలవన్న నమ్మకంతో..

పీడీయఫ్ పుస్తకాలకు డౌన్ లోడ్ లింక్ : ఇక్కడ క్లిక్ చేయండి 

వారి శిష్యులు నిర్వహిస్తున్న వెబ్ సైట్ లింక్ : ​ఇక్కడ క్లిక్ చేయండి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి