'కవిత్వం' 2023-25 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
'కవిత్వం' 2023-25 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

03 నవంబర్ 2025

కవిత : ఊరట

ఒక పిట్ట ఉత్తరాకాశపు అంచులో తేలి, 
నీ మీదుగా లెక్కలేకుండా ఎగిరి,
దక్షిణాకాశపు అంచులో మునిగినట్లు
ఈ లోకంలోకి ఒక కాలంలో తేలి,
లోకం మీదుగా లెక్కలేకుండా ఎగిరి,
ఒక కాలంలో మునిగిపోవటం కన్నా
ఇక్కడ బ్రతికి, వెళ్ళటానికి
అర్థాలూ, పరమార్థాలూ ఏముంటాయి

ఇన్ని రంగుల ప్రపంచం, 
ఇన్ని వెలుగుచీకట్ల, మిలమిలల, 
దాగుడుమూతల ప్రపంచం కన్నా
ప్రాణంగా ప్రేమించాల్సిన అనుభవమేముంటుంది

ఊరికే పుడతాం మంచులో జారిపడినట్లు,
అదాటున నీటిలోకి మునిగినట్లు,
కలలోనో, ఊహలోనో గాలిలోకి తేలినట్లు,
నీరెండవేళ తేయాకు తోటలో రికామీగా తిరిగినట్లు,
సౌందర్యవతి ముఖాన్ని చంద్రోదయానికి అర్పించినట్లు,
చేప గగనాన్ని పలకరించి నదిలో మునిగినట్లు,
భూమి సారం పూరేకులుగా విప్పారి 
మృదువుగా గాలిని తాకి సెలవు తీసుకున్నట్లు,
తటాలున లోపలినుండి చిరునవ్వు మెరిసి
జీవితమేమీ కారుమేఘం కాదులే 
భయపడకని హామీ ఇచ్చి మాయమైనట్లు

మన ప్రమేయం లేకుండా వచ్చినంత
తేలికగా వెళ్ళిపోతాం, ఏముంటుంది
లోపలి దిగులంతా శీతలగాలికి ఇచ్చి వేసి
రాత్రి గర్భంలోకి ముడుచుకుపోతే చాలు,
అయితే తెల్లవారుతుంది, లేదూ, తెల్లవారదు
అంతకన్నా ఏముంటుంది

బివివి ప్రసాద్
కవిసంధ్య సెప్టెంబర్ 2025

02 నవంబర్ 2025

కవిత : ఏకాంతంలో..

స్నేహితులతో గడిపిన తర్వాత
నీదైన ఏకాంతాన్ని చేరుకుంటావు,
అప్పటి వరకూ ఎదురుచూస్తున్న
దుఃఖశాంతి మృదువుగా సమీపిస్తుంది 

ఒక్కడిగా ఉన్నపుడు నువ్వేమీ కావు,
మంచివీ, చెడ్డవీ, బలశాలివీ, దుర్బలుడివీ 
ఏమీ కావు, కనీసం ఎవరివో తెలీదు

రెండవ మనిషి రాగానే తయారవుతావు 
యుద్ధానికి సిద్ధపడే సైనికుడిలా,
పులిని చూసిన జింకలానో, జింకని చూసిన పులిలానో 
నిన్ను నువు క్షణంలో తీర్చిదిద్దుకుంటావు

చాలాకాలం గడిపావు ఈ నేలపై
ఈ నక్షత్రాల క్రింద, సూర్యకాంతి క్రింద,
రెండవది దుఃఖమని ఇంకా తెలియరాలేదు

ఇతరులతో గడిపాక, నిన్ను పలకరిస్తావు,
సముద్రగర్భంలోని, నీలిగగనాని కావలి 
ప్రశాంత గంభీరమైన నీ సన్నిధికి మేలుకుంటావు

ఇప్పుడు చూడు సుమా,
ఇంత ప్రపంచాన్ని పిండితే
నీకు నువ్వు మాత్రమే సారాంశమై తగులుతావా
ఇతరమేమైనా మిగులుతుందా

ప్రపంచంలో గడిపాక,
ఈత చాలించిన దేహంలా
పరమ ఏకాంతంలో మునిగినపుడు

ఏది సత్యం, ఏ దసత్యం
ఏది నువ్వు, ఏది నేను
ఏది జీవిత మేది మృత్యువు

బివివి ప్రసాద్

01 నవంబర్ 2025

కవిత : లెక్కలు

లెక్కలు దాటగలవా అంటుంది లోపలి ఖాళీ,
అచ్చం ప్రియమైన వ్యక్తిలానే,
నమ్మిన గురువూ, దైవంలానే

సూర్యుడు ఉదయిస్తాడు బంగారుకాంతులతో,
పిల్లలు నవ్వుతారు వెన్నెలలా తెల్లగా, చల్లగా,
పూలు వికసిస్తాయి రంగులు లోకంలో ఒంపుతూ,
చల్లటిగాలి తాకుతుంది తల్లినో, తండ్రినో గుర్తుకుతెస్తూ 

బావుంటాయి కొన్ని క్షణాలు
నువు ఎండుటాకులా రాలినవి,
సముద్రంలోకి కెరటంలా వాలినవి,
నిద్రలోకి మెలకువలా జారినవి

బావుంటాయి, నీకు నువ్వు మిగలనివి,
నిన్ను చెరిపేసుకున్నవి,
చెరిపేందుకు అనుమతించినవి

అవి క్షణాలు, క్షణాలలో దాగిన యుగాలు,
యుగాలలో దాగిన కాలం లేని సమయాలు

లెక్కలు దాటగలవా,
అక్కడుంది రహస్యమంటుంది ఖాళీ గాలి, 
లేదా ఖాళీ ఆకాశం, ఖాళీ ఉద్వేగం, ఉత్త ఖాళీ
..
ఈ మాటలు ముగిశాయా, లేదా..

బివివి ప్రసాద్
ప్రచురణ : సాహిత్యనిధి నవంబర్ 25
పెరుగు రామకృష్ణగారికి ధన్యవాదాలు



31 అక్టోబర్ 2025

కవిత : చాలాసార్లు

చాలాసార్లు అనుకున్నావు
మెలకువలో బస్సు దిగి వెళ్ళిపోయినట్టు,
కలలో ఇంద్రధనువు దిగి వెళ్ళిపోయినట్టు
జీవితం దిగి వెళ్ళిపోవాలని

సాధ్యం కాలేదు గనుకనే
మళ్ళీ పగలూ, సూర్యుడూ, పిట్టలూ 
మనుషుల్లాంటి జంతువులూ,
జంతువుల్లాంటి మనుషులూ
యంత్రం లాంటి జీవితమూ,
జీవితం లాంటి యంత్రమూ 

సాధ్యం కాలేదు గనుకనే
మళ్ళీ బంధాలూ, ఆశలూ, ఉత్సాహాలూ,
బంధాలూ, నిరాశలూ, నిరుత్సాహాలూ

సెలయేళ్ళు ఎప్పట్లానే ప్రవహిస్తాయి
మొక్కల్లోంచి ఆకులు ప్రవహించినట్లు,
పూలు ఎప్పట్లానే విరబూస్తాయి
సూర్యుడు గగనంలో విరబూసినట్లు,
పిల్లలు నవ్వుతారు ఎప్పట్లానే
దైవం నీలోంచీ, నాలోంచీ నవ్వినట్లు,
జీవితం ఎప్పట్లానే కొనసాగుతుంది
పిట్టపాట గాలి అలలపై కాగితం పడవైనట్లు 

చాలాసార్లు అనుకున్నావు
కాలానికి చివరి చుక్క పెట్టాలని, 
స్థలాన్ని చెరిపేయాలని
సాధ్యం కాలేదు గనుకనే
ఇంత దుఃఖం, బహుశా, ఆనందం

బివివి ప్రసాద్

30 అక్టోబర్ 2025

కవిత : కాస్త అమాయకత్వం

కాస్తంత అమాయకత్వం కోసం తడుముకుంటావు
ముసురు రోజుల్లో ఎండ కోసం వెదికినట్లు,
చలిరాత్రి నెగడు కోసమూ,
వేసవి సాయంత్రం గాలితెర కోసమూ తడిమినట్లు

పసిపిల్లల నవ్వులాంటి నవ్వు కోసం,
పిల్లల కళ్ళలోని ఆశ్చర్యం కోసం,
వారి మాటల్లోని తేటదనం కోసం,
వారిలో తొణికిసలాడే జీవనానందం కోసం

నీ సాటి ప్రపంచంలోకి,
పెరిగి, పెద్దదై, వడిలిపోతున్న ప్రపంచపు
ముఖాలలోకి తేరిపార చూస్తావు

జీవితం చీకటిగుహలో దారి తెలియక
తిరుగుతున్న, కూలబడిన ముఖాల్లోకి,
సూర్యుని కోసం కాంతి వాలినచోట గాక,
సూర్యుని వైపు చూడాలని తెలియని కళ్ళలోకి,
అమాయకత్వాన్ని 
అమాయకంగా వదులుకున్న హృదయాల్లోకి

బరువైన జీవితం, నీరు నింపుకొనే కడవలా బరువెక్కే,
ఉదయాన కనులు తెరిచే దుఃఖంలా నిరాశ క్రమ్మే,
ఏకాంతపుసుడిలోకి జారే నిస్పృహ నిండిన జీవితం 
నీ చుట్టూ ముసిరినవేళ కూడా
కాస్త అమాయకత్వం కోసం వెదుకుతుంటావు

నీ కెక్కడో నమ్మకం, కాస్త అమాయకత్వం చాలు
ఇంత దుఃఖం నుండి ప్రపంచాన్ని బయటపడేస్తుందని,
చీకటి గుహలోకి దూరపు కిరణంలా దారి చూపిస్తుందని

బివివి ప్రసాద్

29 అక్టోబర్ 2025

కవిత : దిగులు

 మనుషులు దిగులు పడతారు
ఇతర్లకి కనిపించే ప్రపంచానికి తలుపులు మూసి,
తమకి తాము మిగిలే ప్రపంచంలోకి ప్రవేశించినపుడు

నక్షత్రాలు రాలిపోతాయి,
పాటలు గాలిలోకి చెరిగిపోతాయి,
బంధాలు మరపులో మునిగిపోతాయి,
దిగులు మాత్రం తోడుంటుంది 
వదలని కుక్కపిల్లలా తోకాడిస్తూ 

ఈ రాత్రి పగటిలో కరుగుతుంది,
పగలు రాత్రిలో కరుగుతుంది
రాత్రీ, పగలూ క్రమం తప్పక కౌగలించుకునే
కాలపు సంగీతనృత్యంలో
పగటిగానో, రాత్రిలానో మిగులుతుంటావు,
ఒంటిరెక్కతో ఎగిరే పక్షిలా దుఃఖపడతావు

ఇదంతా ఇలానే ఉంటుంది
జీవితమంటే తెలియనివాళ్ళు 
జీవితంలో సుఖపడతారు,
జీవనానందం తెలిసినవాళ్ళు దుఃఖపడతారు

జీవితం ఇలానే ఉంటుంది
తనని ప్రేమించినవాళ్లని దుఃఖపెడుతుంది,
పట్టించుకోని వాళ్ళని సుఖపెడుతుంది,
భయపడిన వాళ్ళకి ధైర్యం చెబుతుంది

ఏమైనా కానీ, ఒక ఆకు రాలినపుడు, 
పూవు రెక్కలు తెరిచినపుడు,
కాంతిరేఖ జీవనగీతం పాడినపుడు,
నిట్టూర్పు జీవితాన్ని నమ్మినపుడు

నువు అక్కడ ఉంటావు
కళ్ళనీ, ముఖాన్నీ పూర్తిగా తెరిచి,
హృదయాన్ని గాలిపటంలానో, 
కాగితం పడవలానో వదిలి,
సమస్తాన్నీ ప్రేమిస్తూ, ప్రేమించటాన్ని ప్రేమిస్తూ..

ఈ దిగులు కూడా గడిచిపోతుంది కదా.. 

బివివి ప్రసాద్

28 అక్టోబర్ 2025

కవిత : కనుల ముందు జీవితం

మన తెలివితక్కువ లెక్కలని,
అనుభవాలని, ఊహలని, అలవాట్లని ప్రక్కకు నెట్టి
జీవితం ముందుకు వచ్చి నిలిచే సందర్భాలుంటాయి

ఆ క్షణాల్లో నీలిగగనంలో బిందువులా కనబడిన పక్షి
క్షణాల్లో మన కిటికీ రెక్కపై వాలుతుంది

కాదనుకున్నవి, కాకపోవచ్చనుకున్నవి
కనుల ముందు నిలబడతాయి ఏమి సెలవంటూ 

జీవించటం చాలా కష్టం, చాలా తేలిక కూడా
టీ కప్పులో లేచే ఆవిరిలాంటిది జీవితం

జీవితం చాలా భయం, చాలా ప్రేమాస్పదం కూడా
ఆకుల మీది చీకటిపై 
పచ్చదనం పరిచే ఉదయకాంతి జీవితం

చాలా చేదు జీవితం, చాలా లోతైన ఇష్టం కూడా
వలలోంచి తప్పుకొని నదిలోకి జారే చేపపిల్ల జీవితం
 
చూస్తూ ఉండగా
బాధల్లో మునుగుతాం, బరువులతో ఈదుతాం
చూస్తూ ఉండగా
నవ్వుల్లో వాలుతాం, కాంతిలో తేలుతాం 

ఇంతా చేసి, వలలో చిక్కుకుంటాం,
వల నీటిలో మునిగి ఉందని,
నీరు భూమిపై ఈదుతుందని,
భూమి ఆకాశం లాంటి జీవితంలో
చల్లగా మునుగుతూ, తేలుతూ ఆడుకుంటుందని 
ఎప్పటికో మేలుకుంటాం

బివివి ప్రసాద్

27 అక్టోబర్ 2025

కవిత : తెలియదు..

నువు ఇవ్వటానికి పుట్టావు, తీసుకోవటానికి కాదు
ఇది అర్థమయేసరికి 
జీవితం చివరి అంచుకి జరుగుతుంది

అట్లాగని తీసుకోలేదని కాదు,
తీసుకున్నట్లు తెలియలేదు
ఇది కూడా జీవితం చివరి అంచున తెలుస్తుంది

ఈ అనుభవం ఇలాంటిది
తీసుకునేవాళ్లకి తెలీదు,
ఇచ్చేవాళ్ళకి తెలియకుండా పోదు 

భూమి నుండి సారం తీసుకున్న చెట్టుకి
భూమి ప్రేమ తెలీదు,
చెట్టునుండి ఫలం తీసుకున్న మనిషికి
చెట్టు ప్రేమ తెలీదు

ప్రేమ ఎప్పటికీ 
తెలియరాని విషయంలా దాగొని ఉంటుంది

ప్రేమ అంతే, అమాయకురాలు,
పొందేవాళ్ళు అంతకన్నా అమాయకులు

ప్రపంచం ఎందుకు పుట్టిందో, 
సూర్యుడెందుకు రోజూ ఉదయిస్తాడో,
నీరెందుకు అమాయకంగా
పంచుతూ, పరుగులు పెడుతూ ఉంటుందో 

పాడే పక్షులకీ, పరుగులు తీసే జీవులకీ,
నిలబడి నిదానంగా చూసే చెట్లకీ,
వాటన్నిటిపై పారాడే ఎండలకీ, వానలకీ తెలీదు

ఉత్త ప్రేమ ఇలా వెలుగుతుందని
ప్రేమలో మునిగిన సృష్టికి తెలీదు,
ఇలా ప్రేమించటం మినహా ఏం చెయ్యాలో
దీనిని సృష్టించిన దైవానికి తెలీదు

బివివి ప్రసాద్

26 అక్టోబర్ 2025

కవిత : తన నిద్ర

నువు ఈ రాత్రి నిద్రపోతున్నావు
ఇంకా మెలకువలో మిగిలిపోయిన
ఇతనికి దూరంగా ఎక్కడో,

బహుశా, నీ గదిలో గాలి అలలు
ముఖాన్ని మెత్తగా తాకుతూ వుంటాయి,
సుఖదుఃఖాల అలల నదిలో ఈదిన
దేహం గాఢమైన విశ్రాంతిలో మునిగివుంటుంది

దాచుకున్న గాయాలూ, ఆశలూ
నిన్ను వదలలేక కలల బుడగల్లా
నీ సుషుప్తిపై తేలుతూ వుంటాయి 

బహుశా, గది పైన ఆకాశం నల్లనిదేహం దాల్చి
నిన్ను రెక్కల్లో పొదువుకుని ఉంటుంది,
ఆకాశంలో తేలే చంద్ర, తారకల మసకకాంతులు
కన్నతల్లి శ్వాసలా తగులుతూ ఉంటాయి

ఇది జీవితం, ఇది అనుభవం
ఇది దుఃఖం, అనిర్వచనీయమైన ఆనందం

ఈ రాత్రి కాసేపు నిద్రపోగలుతున్నావు
కోరలు చాపే భయపూరిత విషాల మధ్య,
ఎప్పటిలా తెల్లవారబోతుందన్న నమ్మకంతో,
రేపటి కాంతి అయినా 
కలల గాలిపటాలు ఎగరేయకపోతుందా అనే ఆశతో,
జీవితమ్మీద తరగని మోహంతో 

కరుణగల నిద్రతో
నీ రెప్పల్లో బరువు నింపిన ఈ రాత్రి
రేపైనా వాటిని పక్షుల్లా ఎగరేస్తుందా చూడాలి

బివివి ప్రసాద్

25 అక్టోబర్ 2025

కవిత : కొంత దూరం వెళ్ళాక

కొంత దూరం వెళ్ళాక
నీకు మనుషులకీ, రంగులకీ భేదం తెలీదు,
శబ్దాలకీ, ఉద్వేగాలకీ, అనుభవాలకీ కూడా

ఇదంతా ఒకే అనుభవం,
ఒకే మెలకువ, ఒకే జీవితం

ఒకే వాన, ఒకే పగలు
ఒకే వెన్నెల, ఒకే నక్షత్రాల నిశ్శబ్దం

కొంత దూరం వెళ్ళాక
లేదా వెళుతూ ఉండగా
ఒంటరిగా మిగులుతావు
చుట్టూ ఉన్నవన్నీ చెరిగిపోతాయి

విడిగా చెరిగి, ఒకటిగా తేలుతాయి
అలలపై చెదిరిన చందమామ
నిశ్చల తటాకంపై తేలినట్టు

కొంత దూరం వెళ్ళాక
జీవించేవాడిగా కాక
జీవితంగా మిగులుతావు

బివివి ప్రసాద్

24 అక్టోబర్ 2025

కవిత : ఆమె నవ్వుని

 నీకెందుకో ఆమె నవ్వుని కాపాడాలనిపించింది
గాజుపాత్రని కాపాడినట్లు
కిటికీలో వాలిన బంగారు కిరణాన్ని కాపాడినట్లు,
పిట్టల కువకువల్లోని జీవితేచ్చని కాపాడినట్లు
ఆమె నవ్వునీ, నవ్వగల సందర్భాలనీ,
నవ్వగల ఆశలనీ కాపాడాలనిపించింది

ఆమె ఎవరో తెలీదు, ఎందుకు మాట్లాడావో తెలీదు
మాటల్లోని ఏ భారమైన నల్లని మేఘాలు,
చూపుల్లోని వాన ముందటి తేమగాలులు,
కదలికల్లోని రాలిపడే ఎండుటాకుల చప్పుడులు

నీలో కనికరాన్ని వెన్నెలదీపంలా వెలిగించాయో తెలీదు,
నీలో, ఆమెలో, అందరిలో అంతర్వాహినిలా ప్రవహించే
ఏకైక జీవనస్పృహకి నిన్ను నడిపించాయో తెలీదు

ఆమెని వెలిగించడం 
నిన్ను వెలిగించుకోవటమేమో తెలీదు,
ఆమె దుఃఖాన్ని సుతారంగా తప్పించటం 
నీ దుఃఖాన్ని తప్పించుకోవటమేమో తెలీదు,
ఆ నవ్వుకాంతిలో తెరుచుకునే సౌందర్యలోకాల్లోంచి
ఏ పసిదనాల్లోకి ప్రయాణిస్తావో తెలీదు

ఎందుకైనా కానీ, ఏమైనా కానీ
ఆమె నవ్వుని కాపాడాలనిపించింది

బివివి ప్రసాద్

23 అక్టోబర్ 2025

కవిత : ఉత్త ప్రేమ

ఇంత ప్రపంచంలో ఒక భాగం కాక,
ప్రపంచం నువ్వే అయిన అనుభవానికి వస్తావు

మసక చీకటిలోనో, మగత నిదురలోనో,
మైకమో, మైధునమో, ధ్యానమో
నీ నుండి నిన్ను రాల్చిన క్షణంలోనో

ప్రపంచం గాలిలో దూదిపింజలా ఎగురుతుంది,
బరువైన జీవితం కొలనులో ప్రతిబింబమై తేలుతుంది,
గాయపడిన హృదయం
వేకువలో నాటిన కాంతిలా మొలకెత్తుతుంది

చాలా చూసావు, చాలా ఏడ్చావు నిజంగా,
చాలా నవ్వావు నిజంగానో, నటనగానో 
కానీ విలవిలలాడావు,
ఒడ్డుకి దొరికిన చేపలా అల్లల్లాడావు

ఇంత ప్రపంచంలో ఒక భాగం కాక,
ప్రపంచం నువ్వయిన అనుభవముంది చూసావా

దాని ముందు నీ దుఃఖమంతా 
పూవు విచ్చుకోక ముందు దానిలో దాగిన చీకటి,
సీతాకోక రంగుల ఆటలకి ముందు
దాగిన చిక్కని ఏకాంతం,
మధురగానానికి ముందు సవరించుకునే కంఠధ్వని

జీవితం ఉత్త ప్రేమ,
దుఃఖమంతా రహస్యం రాల్చిన ఎండుటాకులు

బివివి ప్రసాద్

22 అక్టోబర్ 2025

కవిత : మనుషుల్లోకి తాను

ఆమె మనుషుల్లోకి చకచకా నడిచేయటం చూసావు
కాస్త నవ్వుతో, కాస్త జీవితమ్మీద ఆశతో, ప్రేమతో;
అలాంటి వాళ్ళుంటా రక్కడక్కడ 
సరాసరి సూర్యకిరణాల్లోంచి పుట్టినట్టు,
పూలకలల్లోంచి గాలితాకితే రాలినట్టు 

ఇంత బరువుగా, 
ఊబిలాంటి కాలంలో కూరుకుపోతున్నపుడు 
కొమ్మ మీంచి పక్షి రెక్కలు విదుల్చుతూ ఎగిరినట్టు,
పక్షిలోంచి కిలకిలారవం ఆకాశంలో వాలినట్టు
ఇంత భారమైన మనుషుల ముఖాల మధ్యన
ఆమె చకచకా నడవటం చూసావు

ఆమె ఆశల వనదేవత కాకపోవచ్చును,
ఆమె జీవితం పూలనడక కాకపోవచ్చును,
ఇప్పుడామె నేవో వెలిగించి ఉండవచ్చును,
ఏ బంధనాలు తెగిన ఊహలకో,
ఏ భయాలను తెగించిన ఉద్వేగాలకో
ఆమెలో అకస్మాత్తుగా గట్లు తెగి ఉండవచ్చును

ఏమైతేనేమి
ఇప్పుడామె నడుస్తుంది మనుషుల్లోకి,
ఆమె నవ్వులతో తెరుచుకునే హృదయాల్లోకి,
హృదయాల్లోంచి వరదై పొరలే ప్రేమల్లోకి 

ఇప్పుడామె
వాన వెలిశాక ప్రశాంతంగా పరుగెత్తే వానకాలువపై
కాగితం పడవై, పడవపై ప్రయాణించే సూర్యకాంతై
జీవితాన్ని నిండుగా అనుభవిస్తోంది

బివివి ప్రసాద్

21 అక్టోబర్ 2025

కవిత : వేసవిరాత్రి వాన

వీధిలో నడుస్తూ అమ్మ
భుజంపై నిద్రపోయే నిన్ను పొదివి పట్టుకున్నట్లు 
వేసవిరాత్రి ఉన్నట్లుండి వాన కురుస్తుంది

వాన నీటిని మాత్రమే ఒంపదు 
నీటితో నిండిన గాలినీ, గాలితో నిండిన శబ్దాలనీ,
వాటి వెనక దాగిన ఆకాశాన్నీ, నిశ్శబ్దాన్ని కూడా

వాన కురిసినపుడు కరుణ కురిసినట్లుంటుంది
జీవితమ్మీద లాలస కురిసినట్లు,
జీవితేచ్ఛ విత్తనమ్మీద అగాథ నిశ్శబ్దమేదో కురిసినట్లు

వాన కురిసిన రాత్రి ఒంటరిగా మిగులుతావు,
చుట్టూ ఖాళీ స్థలం ఒంటరిగా మిగులుతుంది,
ఖాళీలో కలలు ఒంటరిగా మిగులుతాయి
వాన అంటుంది
ఈ క్షణం బ్రతుకు, ఇంతకన్నా ఏమీలేదు

వాన రాలే వేళల నీకేమీ పని వుండదు 
వానని ప్రేమించటం మినహా,
వానలో ఎంతకీ తడవని చీకటినీ, 
చీకటిలో ఎంతకీ మునగని జీవితాన్నీ
మోహించటం మినహా

లోపలికంటా కురిసే ఒక వాన చాలు
మానవ హృదయాలలోని
ఇంత చీకటి చెరిపేయడానికి

బివివి ప్రసాద్

20 అక్టోబర్ 2025

కవిత : రంగుల పిల్లలు

రంగులు అమాయకమైనవి,
నలుపు, తెలుపుల్లా కలలు రాలిపోయినవి కావు,
పసిపిల్లలు ఉల్లాసంగా మేల్కొన్నట్లు
ఉదయాన గగనంలో మేలుకొంటాయి

ఇంద్రధనువుల మీదుగా,
సీతాకోకల రెక్కల మీదుగా, పూలని చేరి, 
నీ వైపు నవ్వుతూ దర్శనమిస్తాయి

రంగులు ఈ లోకం మీద నీ ఆశలు నిలిపేవి,
ఆశల మీద ఈ లోకాన్ని నిలిపేవి

ఎంత దుఃఖంలోనూ
ఎక్కడో ఆశ ఉంటుంది చూసావా
అస్తమయ బింబం ఆకాశంలోకి విసిరే 
చివరి నారింజ కాంతిలా

అట్లా, నలుపు, తెలుపుల
దుఃఖానందాల కెరటాల మధ్య
రంగులు నీకు ఆశ కల్పిస్తాయి అమాయకంగా
ఇక్కడింకా ఏదో ఉందని

తెలియందేదో లోకంగా వికసించిన ఇక్కడికి
పసిపిల్లల్లా గునగునా నడుస్తూ 
ఆరిందాల్లా వస్తాయి రంగులు,
అంతటినీ చక్కదిద్దే ఘనుల్లా

ఆడింది చాలు పడుకోండని 
అమ్మా, నాన్నల వంటి
నలుపు, తెలుపులు పిలిచినపుడు,
బొమ్మల్లాంటి మనని విసిరేసి
ఏకైక మహాశాంతిలోకి జారిపోతాయి

రంగుల్ని నమ్ముకున్న మనం
ఏకైక శూన్యంలో
లోలకంలా వ్రేలాడుతూ ఉంటాం
...

ఇప్పుడు కలల్లోకి ప్రాకుతూ వచ్చిన రంగులు
నీతో ఏం మాట్లాడుతున్నాయి

బివివి ప్రసాద్ 

ప్రచురణ : ‘వివిధ’ ఆంధ్రజ్యోతి 20.10.25
https://epaper.andhrajyothy.com/article/NTR_VIJAYAWADA_MAIN?OrgId=201084adc9f1&eid=0&imageview=1&standalone=1&device=desktop

19 అక్టోబర్ 2025

కవిత : వేసవి మధ్యాహ్నం

ఎండ కాస్తున్నపుడు 
నీకొక కల మొదలైనట్లుంటుంది
లేదా, కలలో ఎండ కాస్తున్నట్లుంది

జీవితం నిన్ను గట్టిగా పిలుస్తుంది అపుడు
సీతాకోకరెక్కల్లో ఒదిగిన సంగీతంలానో,
ఇంద్రధనువులో ఒదిగిన సంధ్యాకాశంలానో,
కొలనుచంద్రునిలో ఒదిగిన శాంతిలానో కాక

అమ్మ నిన్ను ఒక్కసారి అరిచినట్లు,
మాష్టారు గట్టిగా పాఠం చెప్పినట్లు,
మిత్రుడు నీపై భళ్ళున నవ్వినట్లు
ఎండ ఒకసారి విరబూస్తుంది 
ఏ పదకొండు దాటిన వేసవిరోజునో

ఉన్నట్లుండి మేలుకుంటావు
ఎండలో చిక్కబడుతున్న నీడల్లా 
నీలో చిక్కబడుతున్న సందేహంలోకి,
ఇదంతా నిజమా, అసలంటూ నిజమొకటుందా,
నిజమైనా నిజంగా ఉందా అంటూ

భళ్ళున పగిలిన అద్దంలాంటి ఎండ
మెరుస్తుంది, లోకాన్ని గుచ్చుతుంది, 
మెత్తగా పాములా పడగ విప్పిన సందేహం
మెరుస్తున్న కళ్ళతో నీ కళ్ళలోకి చూస్తుంది

వేసవి పదకొండు మధ్యాహ్నం
ఇది కలా, నిజమా అని నిన్ను అడుగుతుంది

బివివి ప్రసాద్

18 అక్టోబర్ 2025

కవిత : ఒక మిత్రుడు

ఒక మిత్రుడుండేవాడు
ఉదయపు సూర్యకాంతీ, మధ్యాహ్నపు వేడిమీ,
సాయంత్రపు గాలితెరలూ, నక్షత్రాల గుసగుసలూ 
కలిపి తయారుచేసినట్లు

వాడుంటే సందడుండేది, సందడుంటే వాడుండేవాడు,
ఒకానొకరోజు ఇక చాలురా అని వెళిపోయాడు
కాంతీ, వేడిమీ, తెరలూ, గుసగుసలూ పుట్టేచోటికి

వాడిక రాడు, అలాగని నువ్వూ మిగిలేది లేదు,
వాడిలాగా జీవితాన్ని అనుభవించలేదు నువు,
మనుషుల్ని ప్రేమించలేదు,
వాడిలాగా బ్రతుకుపండగ చాతకాలేదు

ఇలా ఉంటుంది జీవితం
ఉండవలసినవాళ్ళు ఉండరు,
వెళ్ళవలసినవాళ్ళు వెళ్ళరు 

వాడిని తలిస్తే దుఃఖమేమీ రాదు,
ఉన్నట్లుండి వీచే గాలితెరలా
వాడి జ్ఞాపకాలలోంచి రాలే సంతోషం తప్ప,

వాడికి కళలు తెలియవు,
గెలుపుపందెంలో పరుగు కోరుకోలేదు,
సామాన్యంగా బ్రతికి, సామాన్యంగా వెళిపోయాడు,
నువు చూడని రోజుల్లో కూడా
నీ ఊరిచుట్టూ నిశ్శబ్దంగా ప్రవహిస్తున్న కాలువలా

(చక్కా శ్రీనివాస్ స్మృతిలో)

బివివి ప్రసాద్

17 అక్టోబర్ 2025

కవిత : అనుభవం

 అనుభవానికి దగ్గరగా జరుగుతావు
జీవితం చాలా గడిచిపోయాక,
చివరి మలుపు తిరిగి
ముగింపు దూరాన కనబడుతున్నపుడు

కలలూ, ఆశలూ కొన్ని ఫలిస్తాయి, 
చాలా ఫలించనట్లే
గడిచిన కాలమంతా గుప్పిటలోకి తీసుకుని
దీనిలో సారమేమైనా ఉందా అని వెదుకుతావు

గడిచిన ఊహల్నీ, ఆందోళనలనీ 
తడుముకొని చూస్తావు
చాలా సంగతులకి అర్థం ఉండదు,
చాలా ఊహలు ఏ ఫలితం చూపకనే ఆవిరయాయి
ఎండమావులలోని నీటిలా

మరోసారి గడిచిన కాలాన్ని జీవించే అవకాశం వస్తే 
చాలా పనులు చేయవు,
చాలా అనుభవాలు కోరుకోవు

ఉదయపు కాంతి దీవించిన అనుభవం, 
తాజాగాలులు తాకుతూ వెళ్లిన అనుభవం,
పూలు విప్పారుతూ ఆశ్చర్యపరిచిన అనుభవం,
పక్షి కూత గాలిలోకి పలుచని వల విసిరిన అనుభవం 

వీటికన్నా అపురూపమైనవేమీ లేవని
నీ భయాల, గర్వాల, దుఃఖాల తర్వాత తెలుస్తుంది

చివరిమలుపులో నీకు తెలియవస్తుంది
సూర్యకాంతీ, నక్షత్రాలూ నిన్నెంత ప్రేమించాయో,
నిను కన్నతల్లి 
నీలో ఎన్ని పగళ్ళనీ, రాత్రుల్నీ కలగన్నదో,
తల్లినీ, జీవితానుభవాన్నీ ఎంత నిర్లక్ష్యం చేసావో

బివివి ప్రసాద్

16 అక్టోబర్ 2025

కవిత : పొడి సాయంత్రం

 అవును, సాయంత్రపు రంగులకాంతి 
విరజిమ్ముతుంది సమానంగా
ఎడారిలోనూ, అడవిలోనూ, 
నది మీదా, సమూహాల మీదా

ఎడారి రంగులకాంతిని పిలుస్తుంది, 
అడవి తనలోకి ఒంపుకొంటుంది,
అలలనది ఆటలాడుతుంది తనతో,
సమూహం తనని అంటకుండా
ధూళి నిండిన పనుల్లో మునుగుతుంది

ఇంత అందమైన కాంతిని,
కాంతిని ఒంపే విశాలమైన గగనాన్ని కాదని
వీళ్ళేం చేస్తున్నారని విస్మయపడుతుంది సాయంత్రం

ప్రతి సాయంత్రం జీవితమొక ప్రేమలేఖ పంపిస్తుంది
అవని సమస్తానికీ
జీవితమెంత అందమైనదో చూడమని,
జనులు మాత్రం, 
సాయంత్రాలని గడియారాల్లో గుర్తుపడతారు

చూస్తూ ఉండగా చీకటి పడుతుంది
ఆకాశంలో కొంత వెన్నెల ప్రసరిస్తుంది,
చీకటిలో మునిగినవారిలోకి
వెన్నెల ఏ మాత్రమూ ఇంకకపోగా
చివరి చీకటి మరికాస్త వేగంగా సమీపిస్తుంది

బివివి ప్రసాద్

15 అక్టోబర్ 2025

కవిత : బాల్య స్నేహం

జారిపోయే నిక్కరు పైకి లాక్కుంటూ
ఆవేశంగా కబుర్లు చెప్పుకునేటపుడు 
విడిపోయిన అమ్మాయి
అరవై ఏళ్ళకి కనబడి, ఏడుస్తూ అంది
ఇన్నాళ్ళూ ఎక్కడికి పోయావు

అతనన్నాడు
సరే, ఇప్పుడు నేనేం చేయాలి
అప్పటి ఆకాశాన్ని మళ్ళీ పట్టుకురానా,
అప్పటి గాలిని వీచమని బ్రతిమాలనా,
అప్పటి అమాయకత్వాన్ని వెదుకుతూ వెళ్ళనా

తను అంది 
వద్దులే, ఇప్పుడు వెళితే, ఎప్పుడు వస్తావో 
ఇక్కడే ఉండు కళ్ళముందు, చాలు

అవాళ్టి సూర్యుడు
ముసిముసి నవ్వులు నవ్వుతూ నిద్రపోయాడు,
ఆ రాత్రి నక్షత్రాలు గుప్పున విరబూసాయి,
మళ్ళీ క్రొత్తగా పుట్టిన ఇద్దరు పిల్లలు
కాలం జారుడుబల్లపై
గాఢమైన శాంతిలోకి జారిపోయారు 

బివివి ప్రసాద్