17 ఏప్రిల్ 2021

కవిత : వెళదామా..

బొమ్మలు గీయి
రంగులు వేస్తూ వాటిల్లోకి తప్పిపో
పాటలు పాడు
స్వరాల అలలపై సవారి చేయి
ప్రేమించు కళ్ళు మెరిసేలా
హృదయం పగిలి కన్నీటికాల్వలు కట్టు
తోచినట్టు బ్రతుకు
బ్రతికినదానికి దుఃఖపడు లేదా తృప్తిపడు

నువ్వు వెళ్ళగానే
అద్దంలోని ముఖం వెళ్లిపోయినంత నిశ్శబ్దంగా
నీలోంచి ప్రతిదీ వెళ్ళిపోతుంది
గోడమీద వాలిన బంగారుకాంతిలా
ఆనవాలైనా మిగలకుండా మాయమౌతుంది

మనం ఒకప్పుడు ఆడిన ఇసుకతిన్నెల్లో
ఇవాళ ఈ పిల్లలు ఆడుతున్నారు
మన హృదయాల్ని చల్లబరిచిన వెన్నెల్లో
ఆ యువతీయువకులు బిడియపడుతూ
హృదయాల్నీ, మౌనాన్నీ విప్పుకుంటున్నారు

ప్రతిదీ ఉండట మెంత బావుందో
వెళ్లిపోవట మంత బావుంది
మనమిక వెళదామా
వచ్చినంత సంతోషంగా, నిశ్శబ్దంగా..

ప్రచురణ: కవిసంధ్య ఏప్రిల్ 2021

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి