అలా ఎలా ప్రేమించావు జీవితాన్ని
బాల్యంలో బొమ్మల్నీ
యవ్వనంలో యువతుల్నీ
ప్రౌఢిమలో బంధాల్నీ, బాధ్యతల్నీ
పలుకుబడినీ, అలవాట్లనీ
నచ్చినవో, నచ్చబడినవో ప్రోవుచేయటాన్నీ
తీరికలోనో, పొరబాటునో
పిల్లలనీ, రంగులనీ, నవ్వులనీ
ఎప్పుడూ భయాన్నీ, భద్రతనీ
అలా ఎలా ప్రేమించేశావు
నువు పుట్టడాన్నీ
నీ ముందు ప్రపంచం పుట్టడాన్నీ
అవి నిద్రల్లోకి రాలిపోవడాన్నీ
అనుభవం గతంలోకీ
ఉత్సాహం భవితలోకీ జారిపోవడాన్నీ
ఇన్ని వేల శ్వాసల తరువాత
మరిన్ని వేల ఊహల తరువాత
అలసిపోయి కూర్చున్నప్పుడు, కాస్త చెప్పు
ఇదంతా ఎలా మొదలైంది
ఎలా ముగియనుంది
తీరనిదాహంలాంటి ప్రేమలోపల
ఏ రహస్యం నీ కోసం ఎదురు చూస్తుంది
ప్రచురణ : ఈ మాట ఏప్రిల్ 2021
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి