ఇతరుల స్వేచ్ఛలో
ఒక అంగుళమైనా ఆక్రమించలేని
అతి సున్నితమైన సమాజాన్ని కలగంటావు
జరుగుతుందీ, జరగదని కాదు
కలగనటం సున్నితమైన పిలుపు
పూవు లేత ఎండని పిలిచినట్టు
లేత ఎండలాంటి సీతాకోకని పిలిచినట్టు
సీతాకోకలాంటి నీ చూపుని పిలిచినట్టు
సున్నితత్వం బోధిస్తే వచ్చేది కాదు
నిర్బంధించి నేర్పేది కాదు
భయపెట్టి తీర్చిదిద్దేది కాదు
అది లోపలి పొరల్లోకి మెలకువ
చేతన తనని విప్పుకోవటం
నువు సహజంగా సున్నితం
లేత ఎండకన్నా, పూవు వికసించటం కన్నా
సీతాకోక రెక్కలపై వాలే చూపు కన్నా
నీలోకి నువు
మరికాస్త దగ్గరగా జరిగినప్పుడు,
నిన్ను నువు ముడుచుకొన్నపుడు,
వాన వెలిసాక ముడిచిన గొడుగులో
పొరలు విప్పుకొనే వెచ్చదనంలా
నీలోకి నువు చేరుతున్నపుడు
నీకు తొలిసారి తెలుస్తుంది
నిజానికి నువు చాలా సున్నితమని,
చిరుగాలికి గాయపడేంత లలితమని,
తొలి వేకువ వెలుతురు కూడా
నిను తాకటానికి జంకుతుందని
నువు ఎంత సున్నితమో
నీకు తెలిస్తే చాలు
మనిషి కథ సుఖాంతమౌతుంది
ఆ క్షణం కోసం కదా
ఇంత విశ్వం
నానమ్మ కథలోని సుఖాంతం కోసం
పిల్లలు ఎదురుచూసినట్టు చూస్తోంది
14.1.25 11.17PM
ప్రచురణ : ' స్నేహ ' ప్రజాశక్తి 16.3.25