20 అక్టోబర్ 2012

బివివి ప్రసాద్ కి ఇస్మాయిల్ గారి ఉత్తరాలు


ఇస్మాయిల్ గారితో సుమారు పదేళ్ళ అనుబంధం వుంది. కలిసింది చాలా తక్కువ సార్లు అయినా, తరచూ ఉత్తరాలు రాసుకొనేవాళ్ళం. ఎక్కువగా కార్డుమీద రాసేవారు ఆయన. శ్రద్ధగా రంగుల ఇంకులు వాడేవారు. చాలా ఉత్తరాలు కవిత్వంలాగానే ఉండేవి.

కవి కవిసమయంలో, లోకాన్ని ఎలా రసప్లావితంగా దర్శిస్తాడో, అట్లా, జీవితాన్ని ఎప్పుడూ రసాత్మకంగా అనుభవించే కవులు అరుదుగా వుంటారు. ఇస్మాయిల్‌గారి వర్తనా, కవిత్వమూ వేరుగా ఉండేవికావు. ఆయన కవిత్వంలో కనిపించే సరళతా, స్వచ్చతా, పరిశుభ్ర సౌందర్య స్పర్శా ఆయన స్నేహంలో కూడా స్పష్టంగా కనిపించేవి. అప్పుడే అక్షరాలు దిద్దుకొంటున్న వారిని కూడా తనతో సమానులన్నట్లు ఆదరించే అటువంటి సంస్కారం అరుదుగా వుంటుంది.

అటువంటి ప్రేమాస్పదమయిన కవిని తలుచుకొంటూ, వారు రాసిన ఉత్తరాలు కొన్ని ఇక్కడ మిత్రులతో పంచుకొంటున్నాను.చివరి ఉత్తరం ఒక చిన్న తమాషా సందర్భం. నా మూడవ హైకూ సంపుటి 'పూలు రాలాయి' ఇస్మాయిల్ గారికి అంకితమిచ్చాను, ఆయనకు ఒక మాటన్నా చెప్పకుండా. పుస్తకం ప్రింట్ అయి వచ్చాక, పోస్ట్ లో పంపాను. దానికి ఆయన ప్రతిస్పందన ఇది.

సుమారు పుష్కరం తరువాత గత ఏడాది, డాక్టర్ రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు గారు 'పిట్టల కాలనీ' హైకూ సంపుటి ముద్రించి పోస్ట్ లో పంపారు. తెరిచి చూస్తే 'బివివి ప్రసాద్ కి' అని వుంది ఇంకు అక్షరాలు కాదు, అచ్చు అక్షరాల్లో!