20 అక్టోబర్ 2012

“ఆకాశం కవిత్వం” : నా అంతః చేతన - మనల్ని మరలా పుట్టించే ఆకాశం: సతీష్

మిత్రులు సతీష్ 'ఆకాశం' కవిత్వాన్ని అనుభవించి తన బ్లాగు లో ఇలా పలవరించారు.
కవిత్వం గురించి కవితాత్మకమైన ఈ మృదుభాషణను చూడండి.


మానవాళికీ, జీవితానికీ నేను రాసుకొన్న ప్రేమలేఖ ఈ ‘ఆకాశం’: బివివి ప్రసాద్ (పుస్తకం.నెట్)

మనిషి తనను నడిపించే ప్రకృతి ధర్మాల్ని పెనవేసుకునే నిరంతర ప్రక్రియలో నిమగ్నమై ఉంటాడు.
అందుకేనేమో ఇంద్రియానుభూతిని ఊహకందని దార్శనికతకు అన్వయించుకుంటాడు.
తారల ఇసుక మైదానంలాంటి చీకటి ఆకాశాన్ని వెన్నెల రాత్రి కంటే ఎక్కువగా ఆస్వాదింపజేయడం మిణుకు వెలుగుల్ని చినుకుల్లాకాక మన జీవితం పట్టలేనంత పెద్ద కాంతిలోకాలుగా దర్శింపజేయడం ఓ మర్మవిద్య.
చందమామ వామనుడై తన వెన్నెల పాదాన్ని ఈ కవి హృదయం పై మోపి నిజంగానే రహస్యాంతర లోకాలకి అణచి కవిత్వమై ప్రకాశించమని శాసించి ఉంటాడు. లేకపోతే కన్నీటితో ఈ ప్రపంచాన్ని కడిగేసే శక్తి బి.వి.వి.ప్రసాద్ అనే కలానికి ఎలా వస్తుంది! జీవనోత్సాహానికి మారుపేరై ఎలా నిలుస్తుంది!!
ఈ ప్రపంచమనే చిన్నిబంతిపై ఎప్పటికీ జీవించి ఉండాలనే తలంపుతో ఆకాశం నుంచి విరిసే కవితా కిరణాలతో లాలనగా తాకే ఇనబింబం కన్నా ఆకాశాన్ని ఎవరు గొప్పగా అందివ్వగలరు! మబ్బుల్లేని నిర్మలాకాశంలో దైవత్వం దర్శించినవాడు.. తనలో తనకే తెలియని అనంతాకాశాన్ని ప్రదర్శించి పరవశింప చేస్తాడు.
ఈ మిశ్రమ ప్రపంచంలో బలహీనతలను , ఎడారుల్ని చీకటిని ఓపిగ్గా బుజ్జగిస్తూ…. వెలుతురు బలాన్ని పూలతావితో కలిపి అందించడంలో ఆకాశం కవితా-సంచిక సర్వత్రా చర్చనీయాంశం అయింది. మనిషి తన ఇంటినీ, కలల్నీ సరిచేసుకోవడానికి వెలుగు రేఖల్ని పంచింది.

ఇటీవల కాలంలో వచ్చిన సారవంతమైన సృజనగా పలువురు మెచ్చి ఆదరించిన ఆకాశం సంపుటి ఈ సంవత్సరం ఇస్మాయిల్ అవార్డుకి ఎంపికైంది. నవంబరు 4న కవి BVV ప్రసాద్ కాకినాడలో పురస్కారం అందుకునే నేపథ్యంలో ఆత్మీయ భావనలతో కలగలిపిన తియ్యదనాన్ని నా మితృలందరికీ పంచే ప్రయత్నమే ఈ పరిచయం.

పుట్టగానే పిల్లలు ఏడుస్తూ దుఖమయ ప్రపమంచాన్ని వ్యాఖ్యానిస్తారెందుకని ప్రశ్నిస్తూ కపటంలేని కాలాల్లోనూ, భయరహిత ఏకాంతంలోనూ సంచరించాల్సిన అవసరం ఎదిగిన పెద్దలకూ గుర్తు చేస్తూ ఈ పుస్తకం మన ఆలోచనలకు కు ఆహ్వానం పలుకుతుంది. అర్థంకాని సంరంభాలలో పడి ఉన్న మనకు పిల్లల ద్వారా ఒంటరితనాన్ని దర్శింపజేస్తారు. ఆ ఒంటరితనమే అక్షరాలను మనలో తడిమి స్నేహం చేయిస్తుంది.

కొలనులాంటి జీవితంలో కలతపడే సందర్బాలు మట్టిపెళ్లల్లా జారినపుడు అలల తలపుల్ని తెరచి స్వాగతించడం జీవితానికి సహజమని, అవి జారి కరిగిపోవడం సహజాతమని అలల్లా ఒక దానినొకటి ఓదార్చుకుని నీటినీ, కన్నీటినీ తీర్చడం, తద్వారా మనో ప్రతిబింబంలో ప్రశాంత ఆవేశాన్ని సాక్షాత్కరించు కోవడం ధ్యానమని ధన్యమని ఆధ్యాత్మిక చింతనను అన్వయిస్తారు. చేయాల్సిన పనులకు వ్యతిరేకంగా ప్రయాణించే మనుషులకు ముక్తి కాంక్షను కలిగిస్తుంది ఆకాశం.

తనకు తెలియని ప్రశ్నలు హృదయంలో ప్రవేశించినపుడు మెదలిన ప్రతిప్రశ్న ఇందులో సమాధానమై నిలుస్తుంది. కళ్లు చెమరుస్తాయి. ప్రతి మనిషీ తన మాయాలోకాన్ని దాటి దైవత్వం చేరే అవకాశం కల్పిస్తుంది. గాయాల్ని మాన్పలేని జీవితాన్ని కౌగలించుకోవడం మనమూ నేర్చుకుంటాం. ఈ పుస్తకం నిండా స్నేహితలా పలుకరించి చల్లబరిచే చరణాలే .. మనలో మనకు నచ్చిన మనిషిని చూపించే కారణాలే.

ప్రతి అక్షరం దయకురిపిస్తూ జీవనభయానికి దూరంగా మనల్ని జరుపుతున్నట్లు.. మనలో మేలుకొన్నట్లు కలగంటాం. నవ్వులాంటి అందాలనూ, భయాల్లాంటి అరణ్యాలను సమానంగా మోసినా.. మనల్ని మనం వెక్కిరించుకుని తేలికైపోయే వరాన్ని ప్రసాదిస్తుంది ఆకాశం . ఈ పుస్తకం చదివిన పాఠకునికి ఏ మనిషైనా అపురూపంగా కనిపిస్తాడు . ప్రతి నవ్వులోనూ దర్శించేది అందాన్నే . గాఢమైన నిద్రతరువాత పొదవుకున్న మెలకువనూ పొందుతాం.


అందరినీ ఒకే ఆకాశం, ఒకే భూమి తయారు చేసుకున్నాయి. ఈ విషయాన్ని భిన్న ప్రవృత్తులను ప్రదర్శించే మనుషులను చూస్తే నిజం అనిపించదు కానీ.. మనల్ని విడిచివెళ్లిన మంచి మనుషుల్ని తలచుకోకుండా ఉండలేం కదా! అలా తలుచుకుంటున్నట్టే (కవి తన కోసం సృష్టించుకున్నదో, మన కోసమో తెలియకపోయినా) ఈ కవితా సంపుటిలో మాటలు మనలో ఉన్న తాత్త్విక చింతనను మన ఆకాశంగా మలుస్తాయి.

మనలో మనం మేలుకోనే మాటలు చదువుతున్నప్పుడు ఈ ఒక్క పుస్తకమే జీవిత సారమనిపిస్తుంది. రాతిలోని కప్పలాంటి జీవితాలకి రాయి చిట్లి ఆకాశం కనిపించినట్లు ప్రశాంతతను ముప్పొరిగొనే భావాలు ఈ పుస్తకం నిండా దర్శనమిస్తాయి.

నిస్పృహ, దుఖమో పీడించే కారకాలై లోకాన్ని విదిలించుకుని వెళ్ళే మనసులకు వెళ్ళిపోవాలనుందా తప్పక చదివి వినిపించాల్సిన కవిత. ఈ ఒక్క కవితే చాలు ఆకాశాన్ని నేలదించి మనకు అందించడానికి. ఒక్కసారి ఈ కవితోపదేశం విన్నాక, మంత్రశక్తిని మించిన చైతన్యం నరనరాల్లో ప్రవహిస్తుంది. ముందుతరాలను కాపాడుకోవడానికి ఈ కవితనే కవి నగారాగా మోగించాడనిపిస్తుంది.

గెలుపు జ్వరం తగిలిన లోకంలో పరాజితుడివై ఆరోగ్యంగా జీవించు
మర్యాదల ప్రాకారాల ఊపిరాడని మనషుల్ని దయతో పరిహసించు
సమర్ధుల్ని ఈతల్లో కొట్టుకుపొనిచ్చి జీవితంగట్టున ప్రశాంతంగా నిలబడిచూపించు
బతికేందుకు వచ్చావు కనుక బలంగా ఒక బతుకుబతికి చూపించు

నిజంగా బతుకు బతికి చూపించాలనిపిస్తుంది్. జీవితం ఆగినా మనిషి వెళ్లిపోయాక బాధించని ఙ్ఞాపకాల కిటుకుల గుట్టూ విప్పుతారు. ఉద్వేగాలనే కాదు వాటిని పొదలి పట్టుకుని ఓర్చుకోవడమే కాదు; అలవాట్లను మార్చుకుని నిశ్శబ్ధంగా బతికే విద్యను ప్రసాదించి సార్ధక నామధేయుడైనాడు కవి.

అడవిలో వికసించిన అనామక పుష్పంలా..
అక్షరాలు గుర్తించేలోపు అదృశ్యమైన ఊహలా….
నిశ్శబ్ధంగా బతికితే ఏమిటి ! నిరాడంబరంగా వెళ్లిపోతే ఏమిటి ?
అన్న ప్రశ్నల్లో దొరికే సమాధానాలు, ఎవ్వనిచే జనించు అన్నట్లు స్వయంపూరకాలు.

అలవాటు మహామాయై తిమ్మిరిలా కమ్మిందంటే బతుకు అందమూ, బాధ తెలియదు అంటూనే బతికి ఉండటం మాత్రమే అలవాటు కావాలంటారు. శాంతిని ప్రసాదించే నిండైన క్షణాలను మనపరం చేస్తారు.

ప్రసాద్ గారి కవిత్వంలోని మరో కొత్తకోణం సౌకుమార్యం. కన్నీళ్లతో కరిగించి గెలవడం తప్ప గట్టిగా అరచి చెప్పినమాట ఒక్కటీ లేదు . మృదువైన సమయాల్లో ధ్యాన సముపార్జనను , తపశ్శక్తినీ పరంపరగా అందించే తపన అక్షరాక్షరం పలుకుతుంది.

ప్రేమించే జీవితంలోకి కవితలో జీవనస్పృహ మేలుకొన్నా, మృదువిషాదం తో సారవంతం చేసినా.. తొంగి చూసే ఎడబాటు క్షణాల్లో సత్యాలు దర్శితమవుతాయి.
కలలా కరిగిన కళ్లకి జీవితం నిండునదిలా దర్శింపజేయడంలో ప్రసాద్‍ది విభిన్న కోణం.
ఉదాత్తభావాలతో అనుబంధాన్ని ఉన్నతీకరించుకునే తత్త్వం అహరహం ప్రవహించింది ఆకాశవీధిలో…

దృశ్యం నుంచి రహస్యంలోకి
ఉద్వేగాల నుంచి స్వచ్ఛతలోకి
భయం నుంచి స్వేచ్ఛలోకి..
శ్రమ తెలియక నడిపించే స్నేహం నా కవిత్వం

నా కవిత్వం పోరాడదు. బ్రతిమాలదు
తవ్వినకొద్దీ పుట్టుకువచ్చే చీకటిగని కళ్లముందు గుట్టపోసి భయపెట్టదు
నచ్చినట్లు ఎగిరేందుకు క్రొత్త ఆకాశాలని చూపిస్తుంది.
మనం ఎన్నుకొన్న రెక్కల కోసం కొంచెం పొట్లం కట్టిస్తుంది
మన లోలోపలి జీవితేచ్ఛలా మన ఉనికి చాలు ఉత్సవమని భరోసానిస్తుంది


మనకు నిజమేకదా అనిపిస్తుంది ఈ పుస్తకం చదివితే.

పిల్లల్ని ప్రేమిస్తే చాలు అంటూ వారినుంచి ప్రేమించడం నేర్చుకుంటూ వారు ప్రేమించడం మర్చిపోకుండా కాపాడుకుంటే చాలని నిజాయితీగా మనసులా స్పందిస్తారు. అసలు జీవితాన్ని అర్ధం చేసుకోవడానికే ఈ ఫుస్తకం చదవాలనిపిస్తుంది . ప్రపంచ రహస్యాలముడి ఏదో విప్పి చెప్పారనిపిస్తుంది.

చివర చూసినవాడు కవితలో పరిపూర్ణ జీవితాస్వాదనకు నిర్దేశం చేస్తూ సృష్టివలయాన్ని దాటించే ప్రయత్నంలో మన చేయి పట్టుకు నడిచే ఈ మాటలు మంత్రాలవుతాయి.

ఆనందిస్తే ఆకాశం పట్టనట్టు ఆనందించాలి
రోదిస్తే ప్రతి అణువూ కరిగిపోయేటట్టు రోదించాలి
సున్నితంగా ఉంటే ఆకాశం తాకినా చలించిపొవాలి
కఠినంగా ఉంటే అణువైనా చొరబడలేనంత కఠినం కావాలి


ఈ వాక్యాలు చదివినిప్పుడు భర్తృహరి చెప్పిన ‘వజ్రాదపి కఠోరానీ .. మృదూని కుసుమాదపి’ అన్న వాక్యానికి సరికొత్త వ్యాఖ్యానం అనిపించకమానదు.

కవి నిరలంకారితలో సౌందర్య కారకం సత్యమే. వికసించే పుష్పం మీద వేయి కవితలు రాయవచ్చు . వేయి భావాలు పువ్వు చుట్టూ సీతాకోకలై ఎగురవచ్చు.. అయినా పువ్వుపువ్వులా ఉండిపోతుందన్న సత్యమే.. ఏది ఉందో అది ఉంటుందన్న నిత్యమే.జీవితాన్ని దైవంలా భావించే కవి నుంచి ఆకాశం కన్నా తక్కువెలా ఆశించగలం !

As Above,
So Below.
As Within,
So Without. – The Emerald Tablet (about 3000 BC)

నా ఎమెరాల్డ్ టాబ్లెట్ నాకు దొరికింది ఆకాశం రూపం లో.. అంతఃచేతన ప్రతీకగా. 
కవి ర్మనీషీ పరిభూః స్వయంభూ:

*   *   * 
 
'ఆకాశం' సంపుటి దొరికేచోట్లు:
1. పాలపిట్ట ప్రచురణలు, హైదరాబాద్. ఫోన్: 040-27678430.
2. కినిగే.కాం లో ఈ బుక్ లేదా ముద్రిత ప్రతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

6 కామెంట్‌లు:

  1. సమీక్ష చాలా బావుంది. గొప్పగా రాశారు.

    రిప్లయితొలగించండి