01 అక్టోబర్ 2012

ఒక విడిపోని స్మృతిలోకి

సరే, మన హృదయాలు ఒకరిలోకొకరివి వెళ్ళిపోయావా, లేదా
నీలోకి చూసుకో ఓసారి, తడికన్నులతో నేను కనిపిస్తున్నానో, లేదో
నా స్మృతి గులాబీలా వికసిస్తూ ఉందో, వాడిపోయిందో  

ఇక చెప్పేదేమీ లేదు
బహుశా, మన స్పర్శలలో అదనంగా మేలుకొనే కొత్త లోకాలూ లేవు
మనకి ప్రేమంటే ఒక శుభ్రమైన అవగాహన

మళ్ళీ ఎక్కడైనా ఎదురైనపుడు
మనమధ్య ఇంద్రధనువుని తట్టిలేపే చిరునవ్వే మన ఏకైక సంభాషణ
ఒకరికొకరం గుర్తొచ్చినపుడు పాపాయిలా కళ్ళుతెరిచే దిగులే సాంత్వన  

మృదువుగా విను నా చివరి మాటలు
వివరణలేవైనా మన ప్రేమపై వాలే నీడలని తెలిసినా
జాగ్రత్త నా బలహీనత గనుక
మనకీ కాస్త జీవించటం నేర్పిన మౌనాన్నుండి  
నీ దగ్గర మాత్రమే బహిరంగపరచే నా పసిదనం నుండి
దాని బేలతనపు పొరలే ఉత్సాహం నుండి వస్తున్న మాటలు        

నువు వినవని తెలుసు
నా అర్థాలకన్నా, నా పదాల చప్పుడే నీకు ఇష్టమని తెలుసు
వాటిని పరుగుపెట్టించే ఉత్సాహమే ఇష్టమని తెలుసు  
ఉత్సాహం కన్నా, నేనుంటే చాలు ఊరికే నిండిపోవటమే ఇష్టమని తెలుసు          

అయినా నాతో నడువు, ఈ చివరిమాటల చివరి అర్థాలలోకి

మన తొలి ఆశ్చర్యాలకు ముందే మనం తెలుసు  
మన జీవన మూలాల్లో ఎక్కడో యుగాలపర్యంతం కలిసే జీవిస్తున్నాము
మన పైపై బెంగల అలల లోతుల్లో ఎపుడో ఒకరితో ఒకరు నిండిపోయాము

నువు తొలిసారి ఎదురైనపుడు నాలోపలి వెలితి ఒకటి తెరలా తొలిగింది
నీ అద్దంలో నా రూపం చూసినపుడు నేనెపుడూ నిండుగా ఉన్నానని కనుగొన్నాను  

'ఇక ఎవరిదారిన వాళ్ళం, ఎపుడూ కొత్తగా జన్మించటంలోకి వెళిపోదాము '    

నిన్ను చూసిన క్షణం చాలదా జీవితమంతా విసుగులేకుండా బ్రతికేందుకు
నా దారిలో ఎదురైన పిట్టలకి కొత్త సంగీతపు పాఠాలు బోధిస్తూ తిరిగేందుకు
నా పగళ్ళని పూవులుగా, రాత్రుళ్లని నక్షత్రాలుగా జీవితమంతా వెదజల్లుకొనేందుకు

విడిపోయేవేళ మేఘావృతమైన ముఖాలూ, వర్షనేత్రాలూ చాలవా
ఇక్కడ జీవించి వెళ్ళిన గుర్తులేవో మిగిలేందుకు    

ఇక మాటలు లేవు ఎక్కడా

ఒక నక్షత్రమేదో మెరిసి మాయమయింది

ఇప్పుడిక దేనినీ గుర్తుపట్టాలని లేదు30.8.2012

ప్రచురణ: తెలుగువెలుగు అక్టోబరు 2012

2 కామెంట్‌లు: