15 జులై 2013

అంతర్ముఖీనత

Instead of searching for what you do not have, find out what it is that you have never lost.
~ Nisargadatta

మీకు లేనిది వెదికే బదులు, మీరు ఎప్పటికీ కోల్పోనిది కనుగొనండి.
~ నిసర్గదత్త

నిరపేక్ష సత్యం (absolute truth) ఉందని, మనిషి తనలోనికి తిరిగి సూక్ష్మమూ, సున్నితమూ అయిన ఎరుకతో గమనిస్తే తెలుస్తుందని దానిని తెలుసుకొన్న అనేక దేశకాలాలకు చెందిన జ్ఞానులందరూ చెబుతున్నారు.

ఈ క్షణంలో మనకు అనేక సంక్లిష్టలతో, వెలుగునీడల్తో నిండిన మానసిక ప్రపంచం ఉంది. మనస్సు నిండా చీకాకులున్నపుడు, వత్తిడి ఉన్నపుడు భౌతిక ప్రపంచం మనం అనుభవించకుండానే మాయమైపోతూ ఉండటం మనకు తెలుసు.

ఆ మానసిక ప్రపంచాన్ని మరిచి గమనిస్తే ఈ క్షణంలోనే కన్నూ మొదలైన జ్ఞానేంద్రియాల ద్వారా భౌతిక ప్రపంచాన్ని అనుభవిస్తూ ఉంటాము. ఇది మానసిక ప్రపంచంకంటే వాస్తవమైనది. సరళమైనది, కానీ మరింత నిగూఢమైనది. ఆద్యంతాలు తెలియని సృష్టి ఈ క్షణంలో యెట్లా ఎందుకు వ్యక్తమౌతుందో మన ఊహకి అందదు. కానీ జ్ఞానేంద్రియాలకు తెలిసే ఈ ప్రపంచం మన మానసిక ప్రపంచం కంటే మరింత అందమైనది, మరింతగా మనకి శాంతిని కలిగించేది. శక్తి నిచ్చేది. అందువల్లనే మనం వ్యాకులతతో నిండిపోయినపుడు ప్రకృతిలో కాసేపు గడిపితే లోపలి తెలియని వెలితి ఏదో నిండినట్లుంటుంది.

జ్ఞానులు కనుగొన్నది ఈ భౌతిక ప్రపంచంకన్నా మరింత సూక్ష్మమైనది. మరింత వాస్తవమైనది.  ఈ కాలానికి చెందిన ఎకార్ట్ టోలీ (Eckhart Tolle) దానినే వర్తమానం లేదా ఇపుడు (now) అంటారు. జ్ఞానేంద్రియ అనుభవాలని కూడా మరిచి మనస్సు మరింత శాంతిగా, నిశ్చలంగా ఉన్నపుడు కాలం ఆగిపోయినట్లు అనిపిస్తుంది. ఆ కాలరహిత స్థితినే టోలీ 'ఇప్పుడు' అంటారు. దానినే నిసర్గదత్త 'ఈ క్షణానికి ఆధారంగా ఉన్నఈ క్షణం' అంటారు. రమణ మహర్షి 'అనంతమైన వర్తమానం' అంటారు.

మానసిక ప్రపంచాన్నివిడిచి ప్రాకృతిక ప్రపంచంలోకీ, ప్రాకృతిక ప్రపంచాన్ని కూడా ఖాళీ చేసుకొని ఏ శబ్దమూ, దృశ్యమూ లేని మౌనంలోకీ, నిండుదనంలోకీ ప్రయాణించే క్రమాన్నే అంతర్ముఖీనత అంటారు. అంతేకాని తన మానసిక ప్రపంచంలోనే, దానిని పుట్టించే అహంకారంలోనే కూరుకుపోయి ఉండటం అంతర్ముఖీనత (introspection) కాదు. వాళ్ళు అంతర్ముఖీనులూ (introverts) కారు. అలా ఉండటం ఒక దైన్య స్థితి మాత్రమే.

అందుకు పూర్తి భిన్నంగా నిజమైన అంతర్ముఖీనత ధ్యానం వంటిది, ప్రార్ధన వంటిది, జీవితం పట్లా, సమస్త సృష్టి పట్లా ప్రేమ గీతం వంటిది. ఒక్కొక్క వాన చినుకునీ చేర్చుకొంటూ నెమ్మదిగా నిండే ఒక మహా సరోవరం వంటిది. బహుశా దానినే పూర్వులు మానససరోవరం అన్నారా అనిపిస్తోంది. ప్రేమా, దయా, వివేకం, సృజన వంటి పవిత్ర శక్తులేవో సంచరించే ఆ మానససరోవర యాత్ర చెయ్యటానికే మనిషి ఈ సృష్టి లోకి వచ్చాడా అనిపిస్తోంది.

బివివి ప్రసాద్ 
సోమవారం 15.07.2013

2 కామెంట్‌లు:

  1. మొదటి లైను దగ్గరే చాలా సేపు ఆగి ఆలోచించానండీ. మీ కవిత్వమూ మాటలూ రెండూ వేటికవే. చక్కటి వ్యాసం అందించినందుకు థాంక్యూ..! :)

    రిప్లయితొలగించండి