26 జనవరి 2015

సూర్యదేవుని..

సూర్యదేవుని దివ్యరథం దక్షిణ పొలిమేరల్లో ఆగింది
ఏడురంగుల గుర్రాలు ఉత్తరానికి చూస్తున్నాయి  

తండ్రీ, ఎందుకు దిశ మార్చి వెనుకవైపు తిరిగావంటాడు కవి
కాంతిలా ముందుకు చూసే క్రాంతదర్శి కవి 
కాంతిని ప్రసరించే సూర్యుడతని ఆత్మకు తండ్రి

కుమారా, ఇది భగవంతుని నిర్ణయం
సృష్టి సమస్తం ఆయన స్వప్నం
దక్షిణదిశగా స్వప్నం విస్తరిస్తూ వుంది 
ఆయన ఉత్తరాన విశ్రాంతిగా గమనిస్తున్నారు

నన్ను దక్షిణానికి అనుసరించేవారు
లోకం నిజమనే సరదాతో కాలంలో మునిగితేలుతుంటారు
ఇదేం బాగా లేదు, దైవానికి దూరమయే ఈ ఈతకు తుదిలేదని 
ఉక్కిరిబిక్కిరితో దు:ఖపడేవారు నాతో ఉత్తరానికి నడుస్తారు
ఈ లీలని కలగంటున్న ఆయన్ని చేరుకొంటారు 

ఆకాశంలో నేనూ, భూమ్మీద నువ్వూ
పరమాత్ముని అంతరంగం ముందుగా గ్రహిస్తాము 
ప్రజాపతులమై వారికి మరచిన దారి చూపిస్తాము 
సృష్టిని పసిబిడ్డలా ఎగరేసి పట్టుకొనే తండ్రి ఆజ్ఞ శిరసావహిస్తాము

సూర్యదేవుని దివ్యరథం మకరరాశిలోకి వేగం పుంజుకొంది
రంగురంగుల అక్షరాలను పలికి 
కవి భగవంతునివంటి మౌనంలో కరిగిపోయాడు

17 జనవరి 2015

కవిత్వం చదివేటపుడు

కవిత్వం చదవబోతున్నపుడైనా నీలో మెత్తదనం ఉండాలి
వెలితిగా వున్న ఆకాశంనిండా 
మెలమెల్లగా విస్తరిస్తున్న మేఘంలాంటి దిగులుండాలి
అక్షరాలపై సంచరించే చూపు వెనుక 
ఒక వర్షం కురిసేందుకు సిద్ధంగావుండాలి

కవిత్వాన్ని సమీపిస్తున్నపుడైనా
వానకాలువలో పరుగెత్తే కాగితం పడవలో ప్రయాణిస్తూ
సుదూరదేశాల మంత్రనగరుల్ని చేరుకొనే
అమాయకత్వం నీలో మేలుకోవాలి

కవి ఏమీ చెయ్యడు 
కన్నీటిలోకో, తెలియనిలోకాలపై బెంగపుట్టించే సౌందర్యంలోకో 
తను చూసిన దారిలోకి ఆహ్వానించటం మినహా
కవి నిన్ను పిలిచినపుడైనా
మగతనిదురలోంచి జీవించటంలోకి చకచకా నడిచివెళ్ళాలి

నిజానికి, కవిత్వాన్ని సమీపించినపుడైనా
మనందరి ఏకైక హృదయాన్ని సమీపించే రహస్యం గురించి  
నీకు నీదైన ఎరుక వుండాలి

_______________________
ప్రచురణ: వాకిలి.కాం  జనవరి 2014