24 సెప్టెంబర్ 2026

కవిత : విశాలమైన రాత్రి

విశాలత్వం చూడగానే 
నీకు ప్రాణం లేచి వస్తుంది

విశాలమైన మైదానాలూ, నీలి జలాలూ,
ఆకుపచ్చని అరణ్యాలూ, 
వాటన్నిటిపై ఊగే విశాలమైన నీలి గగనమూ 

యుగాలుగా మనుషులు 
శ్రమించి నిర్మించిన పంజరాల్లోంచి
నిన్ను విడుదల చేస్తాయి కాసేపు

మానవ హృదయాలెందుకని
ఇలా విశాలంగా ఉండవని దుఃఖపడతావు

నీ దుఃఖంపై రాత్రి వాలుతుంది
రాత్రిలోంచి నక్షత్రాలు రాలుతూ ఉంటాయి
ఎంతకీ ఆగని వానజల్లులా

నీ లోపలి ఇరుకులన్నీ
నక్షత్రాల వానలో కొట్టుకుపోతాయి 
లోకం ఇలానే ఉండాలనే కోరికనే
లోకాన్ని ఇంత ఇరుకు చేస్తుందని
లీలగా తెలియ వస్తుంది

ఇరుకు లోకాన్ని నక్షత్రాలకి అప్పగించి
విశాలమైన తెలియనితనంలోకి
నిన్ను కనులు మూసుకొని అప్పగిస్తావు

బివివి ప్రసాద్

22 సెప్టెంబర్ 2026

కవిత : వానలోకం

 https://www.instagram.com/reel/DdgV7xbPXnG/?stkn=dGRtaHg5aDU5ZzFx

వానలోకం

ఊహించనిరోజున ప్రియమైనవ్యక్తి ఎవరో నీ గుమ్మంలో నిలబడినట్టు 
ఈ వేసవి ఉదయం లేచేసరికి నీ ఇంటిచుట్టూ వానపంజరం

చెట్ల ఆకులమీద వాన, కొమ్మలమీద వాన, 
వాన నీటిమీద వాన, నీటిలోని ప్రతిబింబాలమీద వాన

వాననెమలి నీ ఇంటిచుట్టూ పురివిప్పి తిరుగుతున్నపుడు 
నీ ఇల్లు అరణ్యంలో వున్నట్లూ, 
సరిహద్దుల్లేని మరోలోకంలోకి నువ్వు ప్రవాసం వెళ్ళినట్లూ వుంటుంది

మూగవెలుతురులో మునిగిన ప్రపంచం ఇప్పుడు ఆటలన్నీ కట్టిపెట్టి వానధ్యానంలోకి తనని కోల్పోతుంది కాసేపు

జీవితమంటే నీ మనోలోకాల గోల కాదని 
వెళ్ళిపోతున్న ఆకాశాన్ని కన్నార్పక చూడమనీ 
చెప్పీ, చెప్పీ విసుగు పుట్టినట్లు 
చల్లని చినుకై చరిచి నీకంటిన నల్లని కాలాన్ని కడుగుతుంది వాన

నువ్వు మనిషిలా రాకపోయి వుంటే 
వానవై పుట్టేవాడివనుకొంటాను 
బహుశా, లోకపు ఏ కొలతలోనో నువ్వొక వానవయ్యే వుంటావు 
లేకుంటే వాన కురిసినపుడల్లా 
నీకు దిగులు ముసురుకొన్న చల్లని సంతోషం ఎందుకు కలుగుతోంది

బివివి ప్రసాద్ 

21 సెప్టెంబర్ 2026

నాలోంచి పలికే వాక్యం దొరికింది : బివివి ప్రసాద్

 1966లో మధ్యతరగతి వ్యవసాయకుటుంబంలో తణుకు ప్రాంతంలో పుట్టాను. ఊహ తెలిసేసరికి మాతామహుల ఉమ్మడి కుటుంబంలో సూర్యారావుపాలెంలో ఉన్నాను. అయిదారేళ్ల వయసులో నాన్న ఉద్యోగం చేస్తున్న చాగల్లు చేరాను. పన్నెండేళ్లపుడు కుటుంబం తణుకు చేరాము. నాన్న కోళ్ళమందుల వ్యాపారం ప్రారంభించారు. పల్లె నుండి గ్రామానికి, అటునుండి పట్టణానికి చేరే క్రమంలో; బాల్యం నుండి కౌమారానికి, అటునుండి యవ్వనానికి చేరే క్రమంలో నాకు నేను దూరమవుతున్న ఒంటరితనమేదో పెరుగుతూ ఉండేది.

పదేళ్ళవయసునుండి చదవటం ఇష్టంగా ఉండేది. టెన్త్ పూర్తయేనాటికి సీరియస్ సాహిత్యంలోకి వెళ్ళాను. శరత్ మొదలు టాల్ స్టాయ్ వరకూ చదువుకుంటున్న దశలో, ఇంటర్ లో, చదవటానికి ఏమంత ఆసక్తి లేని కవిత్వం రాయటం మొదలుపెట్టాను. ఏదో ఒక ఉద్వేగం, మెరిసే ఆలోచన తోచాక, రాసేవరకూ మనసు నిలిచేది కాదు. ఇంటర్ తెలుగు లెక్చరర్ జీయస్వీగారి సలహాపై మహాప్రస్థానం చదివాను. ముందుమాట రాసిన చలం మరింత ఆకర్షించారు. ఒకవైపు చలం, మరోవైపు కమ్యూనిస్టు సాహిత్యంతో ఆ రోజులు ఆదర్శాల ఉద్వేగాల్తో వెలుగుతున్నట్లుండేవి. కానీ, పంచుకొనే తోడెవరూ ఉండేవారు కారు.  

కొన్నాళ్ళకి, బాహ్య విషయాల ఉద్వేగాల కన్నా లోతుగా హృదయంలో నిలవనీయని వెలితి ఏదో తోచింది. జిడ్డు కృష్ణమూర్తి జీవనవ్యాఖ్యలు దొరికింది. బావున్నట్టు అనిపించింది. అనేక సందిగ్ధతలతో ఉండగా, డిగ్రీ చివర్లో, చలం రాసిన భగవాన్ స్మృతులు దొరికింది. శ్రీ రమణమహర్షి తీవ్రంగా ఆకర్షించారు. నేనెవరో తెలిస్తే ఇన్ని దుఃఖాలనుండి విముక్తి అని లోతుగా, బలంగా తోచింది. పెనుగులాట మొదలైంది. అదేమీ తేలిక విషయం కాదని, లోకం పట్టు గొప్పదని, దీనిని తప్పుకోవడం చిన్న విషయం కాదని, ఇప్పటికీ అనిపిస్తూ ఉన్నా, ఈ వెదుకులాటతో పోలిస్తే మిగిలినవి ఏమంత కాంతిగా తోచవు. లోచూపు పెరిగేకొద్దీ విస్తృతి, వైవిధ్యాలపై ఆసక్తి తగ్గింది., చదువుపై కూడా. లోతులోకి, సారంలోకి చూడటం ఒకటే ఆకర్షణగా మిగిలింది. 

భగవాన్ బోధన, టాగోర్ కవిత్వ ప్రభావాలతో రాసుకున్న కవితలతో తొలిసంపుటి ఆరాధన 89లో వచ్చింది. ఆరాధన వలన చిక్కాల కృష్ణారావు గారి ద్వారా ఆలపాటి రాంబాబు పరిచయమయ్యారు. అనేక సాయంకాలాలు, రాత్రులు ఆయనతో, జీయస్వీ, సక్సేనారాజుగార్లతో తాత్విక చర్చలలో గడిచాయి, 18లో ఆయన కాలం చేసేవరకూ.

94లో కొప్పర్తి తణుకు చేరారు. ఆయన స్నేహంతో ఆధునిక తెలుగు కవిత్వలోకం విస్తృతంగా పరిచయమైంది. ఈ సమయంలోనే, సంజీవదేవ్ వ్యాసాల్లో హైకూ గురించి చదివి, ఇస్మాయిల్ గారికి నా తొలి హైకూలు చూపించటమూ, తర్వాత ఆయన రాసిన హైకూలతో ఒక్కసారిగా హైకూకి తెలుగునాట గుర్తింపు రావటమూ జరిగాయి. కొప్పర్తిగారి సహాయంతో ఎడిటింగ్ చేసి, తొలి హైకూ సంపుటి దృశ్యాదృశ్యం 95లో తెచ్చాము. తణుకులో చేరా, ఇస్మాయిల్, కె.రామ్మోహన్ రాయ్ లతో ఆవిష్కరణసభ జరిపాము. 97లో హైకూ, 99లో పూలు రాలాయి హైకూ సంపుటాలు వచ్చాయి. పూలురాలాయి నాటికి, కంజిరలో నాసరరెడ్డి అనువదించిన జపనీయ హైకూల స్థాయిలో రాయగలిగాననిపించింది. 

తర్వాత సుమారు దశాబ్దంపాటు జీవితపు వత్తిడులతో నిశ్శబ్దకాలం. ఆ కాలంలో మూడేళ్ళు ఒక స్కూల్ నడిపాను. 2006లో అప్పటికి రాసిన వచనకవిత్వంతో నేనే ఈ క్షణం సంపుటి తెచ్చాను. నాదైన శైలి కోసం, వస్తువు కోసం తపన పడటం ఈ సంపుటిలో కనిపిస్తుంది.
 
2010లో నిసర్గదత్త సంభాషణలు చదువుకున్నాక, లోపలంతా గొప్ప శక్తి, కాంతి నిండినట్లు ఉండేది. మళ్ళీ కవిత్వం తెరుచుకుంది. ఊహలు, వాక్యాలు ప్రవహించటం మొదలైంది. 2011లో ఆకాశం వచ్చింది. పూర్తిగా నాలోంచి పలికే వాక్యం దొరికింది. 15లో నీలో కొన్నిసార్లు వచ్చింది. 21లో నాన్న కాలం చేశాక, వ్యాపార, కుటుంబ బాధ్యతలతో కవిత్వసృజన నెమ్మదించింది. 23లో ఊరికే జీవితమై ప్రచురించాక, ఇక కవిత్వం సరిపెడదామనుకున్నాను. మళ్లీ, ఏకాంతపు రాత్రులలో కవిత్వం పుష్పించింది. 25లో సృష్టి వచ్చింది.

ఈ క్రమంలో గ్రహించింది ఏమంటే, రాసేది ఏమైనా కానీ, హృదయం నుండి పలికితేనే హృదయాన్ని చేరుతుందని.
హృదయం నుండి జీవిస్తేనే హృదయం నుండి రాయగలమని. ఈ దశకి చేరాక పలికితే రాయని సందర్భాలున్నాయి గానీ, బలవంతంగా రాసింది లేదు. మొత్తంగా ఇప్పటికి మూడు హైకూ, ఆరు వచన కవితా సంపుటాలు వచ్చాయి.

బివివి కవితలన్నీ ఒకలానే ఉంటాయి అనేవారున్నట్లే, ఒకలా కనబడుతూ, అనేక ఛాయలు, గాఢతలు చూపుతాయని ప్రేమించేవారున్నారు. అర్థంకావనేవారిలానే, శాంతినీ, ఊరటనీ ఇస్తాయనేవారున్నారు. ప్రక్కనపెట్టిన వారిలానే, తరచూ ఒకటి, రెండు కవితలో, హైకూలో చదువుకొనే, తలచుకొనేవారున్నారు. రచనలు ఆసక్తి ఉన్నవారికి అందుబాటులో ఉండాలని bvvprasad.blogspot.com లో ఉంచాను.

ప్రచురణ : నేను - నా సాహితీ యాత్ర సిరీస్. 30.

https://epaper.manatelangana.news/reader/4201223/HYDERABAD/21-09-2026/page/4/2/rw





17 సెప్టెంబర్ 2026

కవిత : నువు కూడా..

ఉదయాకాశంపై ఎంత బంగారుద్రవం ఒలికిపోనీ,
పసిపాపనవ్వుల ఎన్ని తెల్లని సీతాకోకలు ఎగరనీ,
యువతికన్నుల ఎన్ని ఇంద్రధనువులు గాలిపటాలై ఊగనీ,
కెరటాల చివర్ల నిండువెన్నెల ఎన్ని వజ్రాలు పొదగనీ,
దయగల హృదయాలెన్ని భూమిని సారవంతం చేయనీ,
దుఃఖితుల కన్నీరెంతగా జీవితాన్ని ప్రార్థించనీ, శపించనీ 

అవన్నీ 
పరుచుకున్న ఆకాశంలోనే నువ్వూ..
జ్వలిస్తున్న కాంతిలోనే నువ్వూ..
తడుస్తున్న జీవితంలోనే నువ్వూ..

భాగంగా.. ఎడంగా..
దీనంగా.. గర్వంగా..
దైవంగా.. హీనంగా..
కలగంటూ.. మేలుకొంటూ..
మొదలౌతూ.. ముగుస్తూ..
కాలంలా, స్థాణువులా ఉన్నట్లూ, లేనట్లూ

అవన్నీ ఉన్నాయో, లేవో అవసరం లేనట్లు, 
నువు ఉన్నావో, లేవో తెలిసీ, తెలియనట్లు..
కదిలీ, కదలని గాలితెరలా..
రాలీ, రాలని కలలా.. 

బివివి ప్రసాద్

13 సెప్టెంబర్ 2026

కవిత : ఒక సంభాషణ

ఇంతకూ నీకేం కావాలి అన్నారాయన
ఒక ఉదయ కిరణం, కాస్త మధ్యాహ్నపు నీడ,
ఎపుడైనా ఒక తడిసిన ఇంద్రధనువు,
సాయంత్రపు రంగుల్లో ఈదే గాలి, 
చీకటిలో వికసించే దీపాలూ, ముఖాలూ అన్నావు

ఇప్పటికే ఇచ్చాను,
నిత్యమూ ఇస్తూనే ఉన్నాను అన్నారు

మీ లోపం ఏమీ లేదు, నాదే లోపం
కానీ మీరిచ్చిన ఇన్ని బొమ్మలు 
నాకెందుకు హాయినివ్వటం లేదన్నావు

నవ్వుతూ అన్నారు
తల్లి కౌగిలిలో ఉన్న బిడ్డలా
నా లోపల ఉండి చూడు
ప్రతిదీ హాయినిస్తుంది,
నాకు దూరం జరిగి చూడు
ప్రతిదీ దుఃఖపెడుతుంది అన్నారు

మీ పేరేమిటి అన్నావు
ఉత్త అమాయకమైన ప్రేమ అన్నారు
మీ లోపల నేనెలా ఉండాలి అన్నావు
ఇలా అంటూ మాయమైపోయారు 

బివివి ప్రసాద్
ప్రచురణ : తొలివెలుగు, 13.9.26



12 సెప్టెంబర్ 2026

కవిత : ఒకటే రోజు

ఒకటే రోజు

అన్ని జీవులతో పాటు
నీకూ ఒకటే రోజు ఇవ్వబడుతుంది
దాని నుండి 
ఎంత జీవితం నింపుకుంటావో ముఖ్యం

జీవించటమంటే అనుభవంతో నిండటం,
ఉత్త ప్రేమగా వెలగటం, 
ఉత్త కోల్పోవటం, కరిగిపోవటం
పంజరంలోంచి వినీలగగనంలోకి ఎగిరిపోవటం

ఒకరోజున దుఃఖపడు, భయపడు,
భయంనుంచి హీనత్వంలోకి జారిపో,
ధైర్యం వైపు తిరిగి దేదీప్యంగా వెలుగు
జీవితం అడిగేది అవేమీకాదు,
నీ విషయాలేవీ పట్టింపు లేని అమ్మ 
నిన్ను అన్నం తిన్నావా అని అడిగినట్లు
ఈ రోజున ఎంత జీవించావని అడుగుతుంది

ఎన్ని వెలుగునీడలు చూడగలిగావు,
ఎన్ని శబ్దాలు శ్రద్ధగా విన్నావు,
ఎన్ని కదలికలు కనులారా చూసావు,
దేహంలో అనుభవించావు

దృశ్యాల్లోంచి ఎంత శూన్యాన్ని తాకావు,
శబ్దాల్లోంచి ఎంత నిశ్శబ్దం విన్నావు,
ఊహల్లేని ఏకాంతంలోకి ఎంతగా కరిగిపోయావు

ఆ రోజున, నీ లోతుల్లో మునిగి
ఎన్ని పాలపుంతలు దాటి ప్రయాణించావు,
ఎక్కడా నువు తప్ప ఏమీ లేదని గ్రహించావు,
ప్రపంచం లోతుల్లోకి వెళ్ళి
ఎంత సారవంతమైన జీవితాన్ని తాకావు

లేదా, ఏమీ చేయలేక ఎప్పటిలా, 
కేవలం సముద్రం పైన అలలా ఊగావు 

బివివి ప్రసాద్

08 సెప్టెంబర్ 2026

కవిత : కాలిపోయాక

కాలిపోయాక 
అద్దంలో సిరులొలికేలా నవ్వుతున్న
ఈ ముఖాన్ని ఇక చూడలేవు

ప్రపంచాన్నీ చూడలేవు గానీ
అదేమంత ముఖ్యమైన సంగతి కాదు
మనుషుల్ని నువూ, నిన్ను మనుషులూ
ఏనాడూ, ఏమంత పట్టించుకోలేదు

కానీ, పగలు మెరిసే సూర్యబింబం,
బింబం కింద కదలాడే 
వెలిగే రంగుల, ఊగే నీడల ప్రపంచమూ,
ప్రపంచంలో కదిలే గాలీ, తేలే శబ్దాలూ,
శబ్దాలతో కావలించుకుంటూ, విడిపోతూ
ప్రేమలో మునిగి, తేలే దృశ్యాలూ,
దృశ్యాలతో దాగుడుమూతలాడే నిశ్శబ్దాలూ
ఎంతోకొంత ఇష్టం నీకు

ఒకసారి ఊపిరి ఆగిపోయాక,
నిశ్శేషంగా కాలిపోయాక
మనుషుల్నీ, ప్రపంచాన్నీ వదిలి
ఖాళీ గాలిలా ఊగుతావు, బహుశా

మెరిసేదేదీ కలకాలం నిలబడదని
నీ ఖాళీ గాలికి తోస్తుంది
ఒకసారి కాలిపోయాక,
అనుభవాలు బూడిదలా రాలిపోయాక,
తెలియరానిదేదో, బహుశా
నిను కౌగలించుకోవటానికి
ఉద్వేగంతో వేగంగా నిను సమీపిస్తుంది 

బహుశా, కాలిపోయాక
బ్రతికిందంతా అర్థవంతమవుతుంది

బివివి ప్రసాద్

06 సెప్టెంబర్ 2026

కవిత : చాలా ఖాళీ..

చాలా ఖాళీ కావాలి వెలుపలా, లోపలా..
ఒక విశాలమైన అనుభవాన్ని ఆవాహన చేయటానికి,
పగటి ఆకాశం కింద కాంతిలో తేలే ప్రపంచాన్ని
నీ నిండా నింపుకోవటానికి..

ఈ పగటిని తన పని తాను 
కుదురుగా చేయనీయటానికి
నువు ఒక ప్రక్కన నిలబడి చూడాలి,
మహానదీ ప్రవాహాన్ని 
ఒడ్డున చెట్టు క్రింద నిలిచి గమనిస్తున్నట్లు
పగటి కాంతిని గమనించాలి

కాంతిలో ఈదే జీవుల కదలికల్నీ, 
చరాచరాల తలలపైనుండి 
నేల కౌగిలిలోకి దుమికే నీడల్నీ,
వెలుగునీడల తెరల నడుమ 
పొందికగా ఆడుకొనే కాలాన్నీ
ఊపిరి కూడా కలవరం కలిగించనంత
నెమ్మదిగా, తేలికగా, 
దిగులంత మృదువుగా తాకాలి

ప్రవాహంపైకి తీరికగా వాలిన ఎండుటాకు 
మరింత తీరికలోకి ప్రవహిస్తూ మాయమైనట్లు..
చాలా ఖాళీలోకి నిన్ను తెరుచుకొని చూడాలి
తెలవారుతూనే కాంతితలుపు తెరుచుకొన్నట్లు..
రంగులు పూలని మెల్లగా తెరిచినట్లు..
ఊపిరి ఇక చాలునేమో అన్నట్లు..

బివివి ప్రసాద్

16 ఆగస్టు 2026

కవిత : నీకు నువ్వు, నీ భాషలో..

సాయంత్రపు గగనంలోని రంగుల్లోకి దూకినట్లు
ఆమె చూపుల్లోకి దూకాలని ఉంటుంది
దూకి, మరి పైకి తేలకుండా,
రంగుల లోతుల రహస్యాల్ని పట్టుకోవాలని

నిజంగా, ఆమె చూపుల్లో రహస్యమేమీ లేదు
ఆమె నీలాంటి, అందరిలాంటి మట్టిబొమ్మ
ఆమె రూపం వెలిగ్రక్కే కాంతులు
నీ చిత్తభ్రమలే కానీ, ఆమెకేమీ తెలీదు

ఆమె నుంచి ఏ సుఖలాలసనో ఆశిస్తావు,
నీ పుటుక నుంచి 
అద్భుత ప్రపంచానుభవం ఆశించినట్టు

ఆశల ఇసుక కళ్లలో మెరమెరలాడి 
ఏవో రంగులు మెరిసినట్లనిపించడం మినహా
నిజానికి ఇక్కడ మెరుపులూ లేవు, రంగులూ లేవు 
ఈ ప్రపంచం, ఈ జన్మం 
నీలాంటి, ఆమె లాంటి మట్టిబొమ్మలు

అట్లా అని, మట్టి విడిచిపెట్టాల్సినది కాదు
అది సత్యం నుంచి రాలిన స్వప్నం

మట్టి సత్యాన్ని కలగంటుంది 
నువు ఆమెని కలగన్నట్లు,
ఆమె అనుభవాన్ని కలగన్నట్లు,
సత్యం మట్టిని కలగన్నట్లు,

ఏదీ బాలేనంతగా అంతా బావుంది,
ఈ ఉక్కపోతే లేకపోతే
నువు తలుపులు తెరవవు కదా..

బివివి ప్రసాద్

25 జులై 2026

My daughter Bhargavi, Psychologist

 మా చిన్నమ్మాయి భార్గవి. 

బీ టెక్ చేసింది. MNC కంపెనీలో జాబ్ తెచ్చుకుంది. 

ఏడాది పైగా చేశాక, ఇది తన కెరీర్ కాదనుకుంది.

తనకి ఇష్టమైన సైకాలజీ మాస్టర్స్ కోర్సు చేసింది. 

ఇప్పుడు స్వంతంగా కౌన్సెలింగ్ మొదలుపెడుతోంది. 

ఇవాళ్టి జీవన విధానంలోని వత్తిడి నుండి ఉపశమనానికి, జీవితం పట్ల కోల్పోయే ఆశ ను నిలబెట్టుకోవడానికి అవసరమైన పని ఇది. 

మిత్రులు ఆశీర్వదించండి. 

అవసరమైన వారికి పోస్టర్ షేర్ చేయండి. 

ధన్యవాదాలు.. 🙏

She says..

I’m sharing with gratitude that I’ve begun my private practice as a Counselling Psychologist. I hope to offer a space that feels warm, calm, and safe for those who need support.

My approach is gentle and collaborative, with room to talk, reflect, and feel understood at your own pace.

I also offer a free 15-minute call for anyone who would like to clarify doubts or simply see whether working with me feels like the right fit.

If someone in your circle may benefit from this, I’d be very thankful if you could share it.

Contact details:

Phone/WhatsApp: 8074499658

Email: bhargavi.bollina1998@gmail.com



కవిత : చాలవూ, కొన్ని క్షణాలు

నిజంగా, చాలవూ, నీరు నింపిన కడవలా 
హృదయం ప్రేమతో బరువెక్కిన కొన్ని క్షణాలు
ఇంత జీవితానికి అర్థం ప్రసాదించడానికి

ఉదయాకాశంలో ఎవరో 
బంగారు రజను నింపిన బిందెను 
వదిలేసి వెళ్ళారు, చూడు
గగనం నిండా గాలికి చెదురుతోంది బంగారుపొడి 
ప్రేమతో ఒకసారి నిండిన నీ కడవ కూడా అంతే
జీవితం నిండా చల్లుతుంది ప్రేమ రజను

భయాల దుర్గమారణ్యాల గుండా,
కరుణ లేని ఎడారుల గుండా నడుస్తూ,
భీతావహ నేత్రాల జలధారలు వర్షిస్తూ
ఎన్ని పవళ్ళు, రాత్రులు 
జీవితాన్ని అభిషేకించి ఉంటావు 
నీ హృదయమంతా 
ప్రేమ నిండిన అనుభవమై పండే వరం కోసం

మరీ కొన్ని క్షణాలు, 
కనుకొలకుల జలజలరాలే ఆనంద బాష్పాలతో
నీ చుట్టూ దిగులుగా తిరిగే గాలిని
తడితడిగా పలకరిస్తే చాలు

నువు నిలువునా కరిగి నీరైపోయిన క్షణాలు,
దయామేఘాలు తల్లిలా హత్తుకున్న క్షణాలు,
మనుషులంతా పసివాళ్ళలానో, వెర్రివాళ్ళలానో 
నీ క్షమకి నోచుకున్న క్షణాలు

బహుశా, నీ ఉనికిని, నీ జీవితాన్ని
నువు మనసారా క్షమించిన క్షణాలు

బివివి ప్రసాద్
ప్రచురణ : కవిసంధ్య, జూలై 26





20 జులై 2026

కవిత : హృదయాన్ని...

ఎవరిని నమ్మాలో అర్థం కానపుడు,
నీ హృదయాన్ని నమ్మావు
దేనినీ హత్తుకోలేనపుడు
హృదయాన్నే హత్తుకొన్నావు

నీ బిడ్డలు పసిపాదాలతో అడుగులేస్తూ
నీ ప్రక్కలో చేరి, నిద్రించినట్టు
హృదయాన్ని కౌగలించుకొని నిద్రపోయావు

మానవలోకం మాయ, మొసళ్ళ కొలను
హృదయం పడవలో చేరి
తేలికగా దీనిని దాటావు చాలాసార్లు

లోకాన్ని నమ్మి మోసపోనివాడు లేడు,
హృదయాన్ని నమ్మి మోసపోయినవాడు లేడు 

సంపదలూ, విజయాలూ, 
అధికార గర్వాలూ కాదు కదా నిన్ను నింపేవి,
ఉత్త డొల్ల విలువలు ఆదుకోలేవు 

హృదయం నుండి నవ్వే ఒక నవ్వు, 
చూసే ఒక చూపు, తాకే ఒక స్పర్శ
ఇన్ని విలువలని తలకిందులు చేస్తుంది

ఇంతాచేసి ఈ జీవన సారం
హృదయం నుండి జీవితం అనుభవించటం,
కావాలంటే చూడు, ఇవాళ్టి సూర్యోదయం
ఆకాశం నిండా ఎవరో ఆశను పరుస్తున్నట్టు లేదూ,
ఇవాళ్టి అస్తమయం
ఆకాశం నిండా ఏదో దిగులు వ్యాపిస్తున్నట్టు లేదూ

నీ జీవితం ఎవరో గొప్ప ప్రేమికుడు
తన లోతుల్లోంచి కంటున్న గొప్ప కల
ఇంతకన్నా ఏం కావాలి

బివివి ప్రసాద్
ప్రచురణ : నవమల్లెతీగ, జూలై 2026



19 జులై 2026

కవిత : ఆశ

పెద్దగా ఏమీ ఆశించలేదు నువ్వు
ప్రేమ నిండిన ఒక స్పర్శ, ఒక చూపు,
కనీసం ఒక మాట
దానిని పట్టుకొని తీగలాగా ప్రాకి 
జీవితమ్మీద ఇష్టం పెంచుకుందామనుకున్నావు

నీ ఆశలకి వేసవిగాడ్పు తగిలినపుడు, 
నీ పచ్చదనం తీగలోకి ముడుచుకుపోయింది,
తీగలోంచి తెలియని తీరాలకి తరలిపోయింది

జీవితం నిజంగా అద్భుతం
గాఢనిద్ర కన్నా, మృత్యువు కన్నా,
బహుశా జ్ఞానం కన్నా..
కానీ జీవితాన్ని నిజంగా జీవించగల వరం సంగతి?

భయాల తుపాను అలల మధ్య
జీవించటం ఎవరికి కావాలి,
గాయాల లోయల్లో పడిపోయేటపుడు
ప్రేమవాయువుల పరిమళాలు
ఎవరు ఆస్వాదిస్తారు

ఇదంతా మృత్యువు విసిరే ఇంద్రచాపం,
జీవితం కొందరికైనా పూల వికాసమో, కాాదో, 
పూలలోంచి ఎగిరే పరిమళమో, కాదో,
పూలు పరిచే రంగుల కలనో, కాదో 
నీ కెలా తెలుస్తుంది
నీ కిది శాపం కదా, పోనీ, తీపి గాయం

పెద్దగా ఏమీ ఆశించలేదు ఇక్కడ
నరకం లేని స్వర్గం మినహా

బహుశా, దైవమెవరేనా ఉంటే,
బొరుసు లేని బొమ్మని కోరుకునే
నిన్ను చూసి నవ్వుతారని అనిపించినా
పెద్దగా ఆశించవు,
ఆశ దుఃఖమని తెలుస్తున్నా

బివివి ప్రసాద్

26 జూన్ 2026

కవిత : సాయంత్రపు నీడలు

వాళ్ళ పొడవైన సాయంత్రపు నీడలు,
నేలనీ, నీటినీ, నీటిమీది మెరుపులనీ 
గడ్డిమైదానంపై కదలాడే నీడలనీ 
తడుపుతూ, ఆర్పుతూ కదిలే
ఇద్దరి నడకల నీడలు

వాళ్ళ మాటల్లో 
ఏ స్వప్నాలు మేలుకొంటున్నాయో,
ఏ నిరాశల చీకట్లు కమ్ముతున్నాయో,
ఏ ఆనందాల వేకువలు 
సుదూర పర్వతాలలో ఉదయిస్తున్నాయో
మనకైతే తెలీదు, బహుశా వారికి కూడా

నీడలు నడుస్తున్నాయి,
వాటి మానవులని నడిపిస్తున్నాయి,
వాటి చెట్లకి శాంతినిస్తున్నాయి,
నీడలపై వాలే చీకటిని 
త్వరగా రమ్మని, నెమ్మదిగా పిలుస్తున్నాయి

సాయంకాలపు నీడలు,
నీడల్లోకి ఒదుగుతున్న సాయంకాలపు జీవితం
నిన్ను ఈ క్షణానికి 
తమతో ఉండిపొమ్మని బ్రతిమాలుతున్నాయి

బహుశా, ప్రతి క్షణమూ 
పేదవాని ప్రేమ నిండిన పూరి గుడిశ 
అన్నీ విడిచి లోనికి రమ్మంటుంది,
ఏదీ విడువలేని నిన్ను
దీనంగా, కరుణతో చూస్తూ వుంటుంది

బివివి ప్రసాద్
ప్రచురణ : ఉదయిని 15.6.26

25 జూన్ 2026

మరేమీ కాదు ఒట్టి ప్రేమ సారమీ కవిత్వం : మల్లవెల్లి శ్రీరామ నాగ వర ప్రసాద్

సీతాకోకఒకటిఎగురుతూ ఉంటుందిమనంఉన్నచోటే. దానిని పరికించే మనసు ఎంతమందికి ఉంటుంది. దానికి కొంత సున్నితత్వం కావాలి. ప్రకృతిని చూసి పరవశించే మెత్తదనం ఉండాలి.దానితో మమేకమయ్యే స్వభావం ఉండాలి. అదో ధ్యాన స్థితి.విషయీ విషయాల ఏకత. హైకూ కవిత్వానికి ఇదే మూలవనరు. దానిని దాటి,సీతాకోక రావడానికి ముందు శూన్యాకాసాన్ని అది వచ్చి వాలి తారాడిన క్షణాలను, ఎగిరిపోయిన తర్వాతి శూన్య సౌందర్యాన్ని అద్వైతాంశతో కవిత్వం చేస్తున్నారు బివివి ప్రసాద్.

వీరి కవిత్వం నిండా, కవి తనను తాను తెలుసుకునే ప్రయత్నం ఉంటుంది. దానికి కవి నిర్మించుకున్న వాతావరణం మానవ జీవితం పట్ల అపారమైన శ్రద్ధ,అవ్యాజమైన ప్రేమ, అనంతమైన దయ మరి ఏమీ కాదు ఒట్టి ప్రేమ సారమీకవిత్వం.అందుకే వీరి నుండి నిసర్గమయ్యే ప్రతి వాక్యం తాజాగా అప్పుడే పూసిన గులాబీల్లా గుబాళిస్తుంది.మనసుని ఓ మత్తుకు గురిచేసి ప్రశాంతతనిస్తుంది.

 ఇది మార్మిక కవిత్వం. నిజానికి కవిత్వం కళ అవుతుంది. మార్మికత కళకాదు. కానీ ఈ కవి మార్మికంగా కవిత్వం అల్లడం మనం గమనిస్తాం. ఇదో వినూత్న పంథా. ఆధ్యాత్మికత అంటే మన మూలాలను మనం తెలుసుకోవడం. ఎరుకతో జీవించడం ఆ అనుభూతి గాఢతలోనే ఈ కవిత్వమంతా సాగుతుంది. 

వీరి భావనా ప్రపంచం మాటల కందేది కాదు. మరి కవి ఎలా పద సృష్టి చేస్తున్నారు. కవితా వాక్యాలను ఎలా నిర్వహిస్తున్నారు. అనేది ఆసక్తి కలిగించే విషయం. ఆశ్చర్యంగా కోకొల్లలుగా వచ్చి వాలే సుతిమెత్తని "కాయిన్డ్వర్డ్స్" ఈ కవిత్వ వాక్యాలకు పుష్టినివ్వడం మనం గమనిస్తాం. ఉదాహరణకు చీకటి వరద, రంగుల కాంతి, ఏకాంత సంగీతం, పరాయి శబ్దం, విసుగు పురుగు, ప్రేమ తునక, తెలికాంతి, జీవితేచ్చవిత్తనం, చీకటి ద్రవం, ఖాళీ వెలుతురు, లోకపు చిటికెన వేలు మొదలైనవి.

వీరి కవిత్వం చదివి ఒక అనుభూతి గాఢతకి గురికాని వారు లేరు చదివినా మళ్లీ చదవాలనిపించే కవిత్వం అంతేకాదు కొత్త వాక్యాల కోసం చకోరకాల్లా ఎదురు చూస్తాం. ఇప్పుడదే తారసపడింది .మన ముందు ఈ కవిత్వ వాక్యం పుష్టిగా రెక్కలు కట్టుకువాలింది "సృష్టి"గా.ఈ పుస్తకానికి “రమణ జీవి”వ్రాసిన అభిప్రాయం “గంగారెడ్డి” గారి మాటలు ఈ కవిత్వం పట్ల చాలా క్లారిటీ ఇస్తాయి. దీనిలో మొదటి కవిత "సృష్టి" అనే శీర్షికతోనే ప్రారంభమవుతుంది .

"ఖాళీ మనసులో కొన్ని రంగులు ఒంపు/ అవి ఆకాశమూ గాలీ నీరూ/ కాంతీ, చీకటిలో వెన్నెలా/ రంగుల పై కొన్ని గీతలు గీయి/ నదులూ, కొండలూ, మైదానాలూ/ఉదయాస్తమయ,మేఘాలూ, పాలపుంతలూ/
కదలికలలో ఉద్వేగాలు కలుపు/ చిక్కగా లేతగా తీవ్రంగా,తేలికగా/మంచీ,భయమూ,బాధా,ప్రేమా/
ఇంతకన్నా ఊహించేదేమీ లేదు/ నువ్వైనా దేవుడై నా/మళ్లీ మొదటికి రావాల్సిందే/నిద్రలోనో మరణంలోనో జ్ఞానంలోనో.

ఈ కవిత మొదటి పంక్తుల్లో ఖాళీ మనసు శూన్యానికి ప్రతీక సృష్టికి ముందు స్థితి. ఎత్తుగడలోని ఆ ఖాళీ మనసుతో కాసేపు రమిస్తాం.ఆ శూన్య సౌందర్య అనుభవంలో కాసేపు ఉండిపోతాం. కవిత మొత్తం చదివి మరలా రెండోసారి చదవడం మొదలుపెట్టినప్పుడు కలిగే అనుభవం ఇది.

ఇప్పుడు అందులో కొన్ని రంగులు ఒంపమన్నారు కవి. ఎంత అందంగా సరళంగా ప్రారంభమయ్యింది ఈ కవిత్వ “సృష్టి"అవే పంచభూతాలన్నమాట. భూమిని 'చీకటిలో వెన్నెల' అన్నారు. జ్ఞానానికి ప్రతీక కాబట్టి.రంగులపై గీతలు గీస్తే నదులూ కొండలూ, మొదలైన స్థావరాలు ఏర్పడ్డాయట.గీతల్ని కొంచెం కదిలిస్తే చెట్లు పిట్టలూ మనుషులూ మొదలైన జంగమ ప్రపంచం నిర్మాణమైందట. ఇప్పుడు వాటికి ఉద్వేగాలు కలిపారు కవి. అవి చిక్కగా లేతగా బాధ ప్రేమ అయ్యాయట.చివరి వాక్యాల్లో కవి నిద్ర,మరణం, జ్ఞానం మూడిటిలో కూడా మళ్లీ మొదటికి రావాల్సిందే మనమైనా దేవుడైన అంటారు. ఇక్కడ ఈ మూడూ లయానికి ప్రతీకలు. అత్యంత నేర్పుతో గిజిగాడి ఊయల గీము నిర్మాణాన్ని తలపించేలా కదలాడే భావ చిత్రాలను మన ముందు ఉంచారు కవి బివివి.
 
"రంగుల పిల్లలు" అనే కవితలో.. రంగులు అమాయకమైనవి/ నలుపూ తెలుపుల్లా కలలు రాలి పోయినవి కావు/ పసిపిల్లలు ఉల్లాసంగా మేల్కొన్నట్లు ఉదయాన గగనంలో మేలుకుంటాయి"
 ఇంద్ర ధనువుల మీదుగా /సీతాకోకల రెక్కల మీదుగా పూలని చేరి/ నీ వైపు నవ్వుతూ దర్శనమిస్తాయి....
అని సాగే ఈ కవితలో కవి రంగులు మనకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి, దుఃఖంలో మరలా నిలబడేట్టు వెన్ను తడతాయి. నలుపూ తెలుపూ అనే దుఃఖానందాల మధ్య ఆశని రగులుస్తాయి అంటారు. తర్వాత వాక్యాల్లో తెలియందేదో లోకంగా వికసించడం అని వేదాంతపరంగా లోకాన్ని నిర్వచించడం బాగుంది. ఆడింది చాలు, పడుకోండని అమ్మానాన్నల వంటి నలుపూ తెలుపులు పిలిచినపుడు, బొమ్మల్లాంటి మనని విసిరేసి ఏకైక మహాశాంతి లోకి జారిపోతాయి.
ఇక్కడ ఏకైక మహాశాంతి లోకి జారిపోయిన రంగులు మనల్ని ఏకైక శూన్యంలో తేలేలా చేసాయి. చివరి వాక్యాల్లో "ఇప్పుడు కలల్లోకి పాకుతూ వచ్చిన రంగులు/ నీతో ఏం మాట్లాడుతున్నాయి" అని ఉంటుంది 
ఇక్కడ 'అందరి నిద్రా ఒక్కటే అది ఏకైక శూన్యం' అక్కడ రంగులు మీతో ఏం అంటున్నాయి అని ప్రశ్నిస్తారు కవి 
నలుపూ తెలుపులు మన మూలాలకి, ఏకైక శాంతికి సంకేతాలు అక్కడి నుండి వచ్చిన మనం ప్రకృతికి అద్దిన రంగులనే ఆశల వలన జీవిస్తూ ఉంటాం. సత్యం బోధపడ్డాక వాటిని వాటిగానే యథార్థ స్థితిలో చూడగలుగుతాం.ఈ కవితా శిల్పం కవి ప్రతిభకు గీటురాయిగా చెప్పవచ్చు. 

"పుట్టినరోజున"అనే కవిత లో 
     "ఇవాళ నీకు నువ్వే గుర్తుకొస్తుంటావు/ ఉదయం పూలూ చినుకులూ రాలినట్లు/ ఒకనాడు ఇక్కడకు రాలావు/వాటికి కరిగి మాయమైపోవడం తెలుసు/ మరి నీ సంగతి అంటారు ఎవరో?... అని సాగే ఈ కవితలో కవి ఎంత సున్నిత వాక్యాలతో ప్రారంభించారు కవితని. మనిషి పుట్టుకలోని సహజత్వాన్ని ఇంత మృదువుగా ఉత్ప్రేక్షించిన కవిని ఇంతకు మునిపెన్నడూ మనం చూడము.

సృష్టిలో ప్రతి జీవి ఎంత సహజంగా వచ్చిందో అంత సహజంగా జీవించి వెళ్ళిపోతుంది.మరి మానవుడు, ఇదే ప్రశ్న కవి వేశారు " మరి నీ సంగతి అంటారు ఎవరో? ఆ 'ఎవరో 'అనడంలోనే వాక్య బలం రెండింతలు అయింది.
ఈ కవితలో బతుకుని నైరూప్య చిత్రమనీ నిర్వచించి అర్ధాల ఇరుకునుండి ఎంత విముక్తమయితే అంత సారవంతం అవుతుందని ఎంత స్వేచ్ఛ లోకి మేలుకుంటే అంత ఆర్ద్రతలోకి వికసిస్తుందని జీవనమాధుర్యాన్ని ఎలా చవిచూడాలో పాఠకుడిని శిశువుగా చేసి మరీ కవిత్వపు ఉగ్గుపడుతున్నారీ కవి. 

నైరూప్యఛాయాచిత్రణ లో చిక్కబడ్డ అద్వైతం ఈ కవిత్వం
"ప్రేమ ఉంటే" అనే కవితలో ప్రేమ ఉంటే పెద్దగా చెప్పడానికి ఏమీ ఉండదు/ మాటలన్నీ మంచు ముక్కల్లా ప్రేమలో కరిగిపోతాయి/పూలరంగులు వెలుగుతాయి/ నక్షత్రాలు అనంతాన్ని విరబూస్తాయి/ స్పర్శ జీవితాన్ని సారవంతం చేస్తుంది. కవి ఇక్కడ ఓ మాట అంటారు "జీవుల చూపుల సారం ప్రేమ కోసం ఎదురుచూపు. భయాలు కోరికలు ప్రేమ దక్కక చేసే వెర్రి పనులు" ఇది మానవాళికి అందాల్సిన ఓ అద్భుతమైన 'మోరల్ స్టేట్మెంట్'. నిజమే కదా లోకంలోని సమస్త సమస్యలకు దుఃఖాలకి సరిపడా ప్రేమ లేకపోవడమే కారణం. అనంతమైన ప్రేమలోకి ఒక్కసారి మేల్కొనగలిగితే బాధలు అన్నిటికీ ఉపశమనం దొరికినట్టే.      
 
'అద్వైతం'అనే మరో కవితలో 
సాంద్రమైన స్వచ్ఛమైన ఒక జీవితానుభవం చాలదా బ్రతుకంతా వెలగడానికి అంటారు. పాఠకుడు తాను కూడా లోతుగా మౌనంలోకంటూ మేల్కొంటే గాని ఈ కవిత్వం ఒంటపట్టదు.
 
"ఒకరికొకరు" అనే కవిత ఉంది.రెండవ భాగంలో
 ఆమె ముఖంలోకి చూసేటపుడు/అతని ముఖంలో చలిమంట వెలుగుంటుంది/ చల్లని గాలుల పూతరేకుల శబ్దాలుంటాయి /వెన్నెలలో వినిపించి ఆగే పిట్ట పాట ఉంటుంది/చినుకుల్లో మాయమయ్యే ఇంద్ర ధనువులుంటాయి అంటారు.

ఇక్కడ పిట్ట పాట ఆగిన తర్వాత, ఇంద్రధనువు మాయమైన తర్వాత, కలిగే సౌందర్యానుభవం చాలా గాఢమైనది. కాలాల కావలి నిశ్శబ్దంలోకి మనల్ని జారిపోయేలా చేసే సుతి మెత్తని వాక్యం. 

"ఉత్తప్రేమ" అనే కవితలో 
పూవు విచ్చుకోక ముందు దానిలో దాగిన చీకటి/సీతాకోక రంగుల ఆటలకి ముందు దాగిన చిక్కని ఏకాంతం/మధుర గానానికి ముందు సవరించుకునే కంఠధ్వని/ జీవితం ఉత్త ప్రేమ/ దుఃఖమంతా రహస్యం రాల్చిన ఎండుటాకులు. అందుకే ఈ కవిత్వం ఉత్త ప్రేమ సారం 

"లోపలికి" అనే కవిత లో 
కొలతలకి లొంగకు లెక్కల నుండి ఎగిరిపో/లొంగనట్టు కనబడడానికి కూడా.... అప్పుడు మేలుకుంటావు/ నిశ్శబ్ద రహస్య ప్రశాంత తటాకం ఒడ్డున..... కొంచెం తడిగా ఉండటం మినహా/ ఇక్కడ వేరేది చేయదగింది లేనట్లుంది. మన అసలుని మనకు అప్పగించే మాటలు ఇవి. ఇంకా ఇంత ప్రపంచం అతనికి/ రాలుతున్న ఎండుటాకు పాటి కాకపోవచ్చు. 
ఇక్కడ అవ్వచ్చు అనడానికి ఎలా నిర్ధారిస్తారు కవి అది కావచ్చు కాకపోవచ్చు కాబట్టి కాకపోవచ్చు వాడారు కవి. ఎంత సమయోచిత ఉపమానమిది. చివరిగా "బహుశా అతనే నీలా ఉన్నాడు/ ఇప్పుడు నువ్వు చేయాల్సింది/ ఏమైనా మిగిలి ఉందా ఇక్కడ.
 ఏమి ప్రశ్న వేదాంతానికి పరాకాష్ట.మనకి మనం వేసుకోవాల్సిన ప్రశ్న. అలవోకగా అత్యంత సహజంగా వచ్చి చేరే ఉపమానాలు అభివ్యక్తి కి మంచి బలాన్ని ఇచ్చాయి.

"వాన రాత్రి" కవిత 
వాన చప్పుడు ఒడిలో వాలి మనుషులు సుఖంగా నిద్రిస్తున్నారు/ తమ వారు అనుకుంటున్నా వారి మధ్య భద్రంగా/ఎప్పటికీ ఇలానే ఉంటామని కలలు కంటూ.

మనిషి లౌకికలంపటంలో పడి అదే శాశ్వతం అన్న భ్రాంతిలో బతికి అలాగే వెళ్ళిపోతాడు.కానీ ఒంటరిగా ఈ లోకంలోకి వచ్చిన వాడు సమూహంలో జీవిస్తూ చివరికి ఒంటరిగా వెళ్లాల్సిందే. ఈ లోపులో సుఖాలు దుఃఖాలూ, వేదనలూ, ఆనందాలూ, ఉద్వేగాలూ వీటితో సహచర్యం చేస్తూ ఒక స్పష్టత లేక ఇంత విలువైన జీవితం నిస్సారంగా గడిపేస్తాడు.  

జీవితానికి ఒక స్పష్టత అవసరం. కొన్ని మౌలిక ప్రశ్నలవసరం. ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము?ఎందుకు జీవిస్తున్నాము? ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఈ ప్రశ్నలకు ఊరట ఈ కవిత్వం. కవిత చివరి వాక్యాలను శిల్పించిన తీరు అమోఘం.

"కలలు కంటావు"
 కొన్ని కలలు కంటావు ఉదయాన పూలపై వాలిన నీరెండవి అయినట్లు ఎంత చిక్కని వాక్యం అంతేనా ఆ వాలిన ఎండ ఎవరో కాదు మనమే, కలగంటూ ఆ తాజాదనపు ప్రశాంత అనుభవాన్ని మనకు ఇస్తుంది. ఇక్కడ కలనిజంగా నువ్వు కనాలి లేదా ఊహలోనైనా జీవించాలి.తాథాత్యము చెందాలి. అప్పుడే ఈ కవిత చదివిన పాఠకుడు ధ్యాన ఫలితాన్ని పొందినట్లు. సీతాకోక సృష్టించే కొత్త శూన్యమైనట్లు. 
కవి ప్రయోగించిన వాక్యం పాఠకుని అనుభవంలోకి తేగలిగే వాతావరణాన్ని ఇవ్వగలగాలి. 

"ఉద్వేగాల నుండి"
ఉద్వేగాలని అడవిలోని వృక్షాలుగా వృక్షాల నుండి జాలువారే కిరణాలుగా కిరణాల్లో మిల మిలలాడే సెలయేళ్లుగా సెలయేళ్లలో దప్పిక తీర్చుకునే కీటకాలూ పక్షులుగా ఉత్ప్రేక్షించడం సముచితంగా కొత్తగా ఉంది. 

" దయ నుండి" ....
ముందుగా శబ్దం ఉందని వారంటారు కానీ ముందుగానే దయనుండి ఆకాశం పుట్టిందని దయగల ఆకాశం నుండి సమస్తము పుట్టాయని సృష్టికి కొత్త నిర్వచనం ఇచ్చారు బివివి ప్రసాద్. సృష్టి ఆవిర్భావం దయతో జరిగిందని అక్షరాల దయను వర్షింప చేస్తారీ కవి.

" జీవనోద్వేగం" 
   ఈ కవిత జీవితం పట్ల ఒక స్పష్టతను కలిగిస్తుంది. " ఇంత విశ్వం" అనే కవితలో ఇంత విశ్వం నిన్ను జీవితంలా చిలికి నీ నుండి శాంతి అనే వెన్న తీస్తుంది.అంటారు" కాస్త ఆశలోకి"...జీవితాన్ని గురించి కవి, ఈ కవితల వెలువరించిన తీరు అతి సరళంగా అత్యంత కవితాత్మకంగా ఉంటుంది మనలో ఆశని మేల్కొల్పే కవిత ఇది. మెత్తని పూలరేకులు లాంటి శబ్దాలు,చక్కటి ఊహలు ఈ "సృష్టి" కవిత్వం.
"ప్రాతః కాలపు పొగ మంచును చూసావా/ సాలె గూటి పై పొందికగా ముత్యాలు పేర్చుతుంది/ అవి ఎండలోకి రంగులు చల్లుతూ మాయమవుతాయి/ ఊరికే మంచు బిందువులా నిలిచి మాయం కావాలి" అంటున్నారు ఎంత నిర్మలం ఎంత కోమలం చెట్ల ఆకుల వెనుక ఆకాశాన్ని గుర్తించటం కవి దార్శనికత కి నిలువెత్తు నిదర్శనం. ఇలాంటి ఊహలు కోకొల్లలు ఈ పుస్తకం నిండా.

“మోహం”అనే కవితలో 
జీవితం మీద ఇంత మోహం ఏమిటి అంటారు ఏ రోజైనా వెళ్లిపోయే విరక్తి ఉంది గనుక అంటావు.
చివరి వాక్యాల్లో “నువ్వు ప్రేమించేది దేనినో చెప్పమంటారు/ దేనిని ప్రేమిస్తున్నానో నాకు తెలియదు/బహుశా ఈ వెలుగునీడల కదలికల్లో/ నన్ను నేనే పొందుతున్నాను/ దాచుకుంటున్నాను/ జీవితం ప్రియురాలు రూపంలో/నన్నే చూసుకుని ఆశ్చర్యపోతూ, ప్రేమిస్తున్నాను”.
ఈ కవితలో ప్రేమ అయితే ఉంది గాని అది దేని మీద తెలియదు అంటారు అవును హృదయంలో ప్రేమ ఉండటం ప్రధానం దేని మీదో చెప్పగలిగితే అది పరిమితం అయిపోతుంది. అది అవధులు దాటాలి, పరిధి విస్తరించి విశ్వవ్యాపితం అవ్వాలి.

"జాగ్రత్త" అనే కవితలో 'మృత్యువు లోపలి కరుణ' అని కవి చేసిన వాక్య ప్రయోగం మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మృత్యువును దయారహితంగా భావిస్తాం. కానీ కవి మాత్రం మృత్యువు లోపలి కరుణను దర్శించే అరుదైన నూతన సంస్కారాన్ని మనలో మేల్కొలుపుతున్నారు. 

"సృష్టి"కవిత్వం విసిరిన సౌందర్యపు చెణుకులు కొన్ని.. 
1. కవి జీవితం రహస్యాలు ఎంతకీ అర్థం కావని చెబుతూ 'ఎంతకీ పగలని కొబ్బరికాయలా' అని చమత్కరిస్తారు. 
2. మిత్రుడు వెళ్ళ వలసిన రైలు లేటుగా టైముకే వచ్చి నిలబడింది. 
3. కలలో అందమైన మొహాన్ని మెలకువలో వెతకబోయినట్లు 
4. సాయంత్రపు గగనంలో చివరి రంగులు ఆగి, ఇంకెవరైనా చూసేవారు ఉన్నారా అని అడిగినట్లు 
5. పాత ఉద్యోగుల్లా వచ్చి వెళ్ళే ఋతువులు 
6. మీట నొక్కినట్లు వెలిగి ఆరే ప్రేమలు ఉద్వేగాలు 
7. నీడలు సంధ్యలో దీర్ఘమవుతూ మధ్యాహ్నాలు దాక్కుంటాయి 
8. టీ కప్పులో లేచే ఆవిరి లాంటిది జీవితం. 
9. తలపై బుడగలా ఎగురుతోంది గగనం 
10. రాలిపోయే ఎండుటాకు మరో క్షణం ఆగినట్లు 
11. కదలాడే నీటి బుడగపై తిరుగాడే బొమ్మ లాంటిది ప్రపంచం 
12. గోడలపై బొమ్మల రంగులు గతకాలపు పిల్లల్లా శాంతిగా చూస్తున్నాయి. 

ఇలాంటి 'ఎపిగ్రమేటిక్ అభివ్యక్తి' తో కూడిన వాక్యాలు కవిత్వం చదవాలనే ఆసక్తిని కలిగిస్తాయి. 
వారు చెప్పినట్లుగానే ఈ కవిత్వం మనల్ని మహా శాంతి లోకి జారిపోయేటట్టు చేస్తుంది. మరేమీ కాదు ఒట్టి ప్రేమ సారమీ కవిత్వం.

మల్లవెల్లి శ్రీరామ నాగ వర ప్రసాద్ 
పార్ట్ టైం పరిశోధక విద్యార్థి 
ఆంధ్ర విశ్వ కళా పరిషత్, విశాఖపట్నం 
9441350260 
sriram9441350260@gmail.com

ప్రచురణ : సాహిత్య ప్రస్థానం జూన్ 2026

బి.వి.వి.ప్రసాద్ కవిత్వ పరిశీలన : మల్లవెల్లి శ్రీరామ నాగ వర ప్రసాద్

 బి.వి.వి.ప్రసాద్ కవిత్వ పరిశీలన : మల్లవెల్లి శ్రీరామ నాగ వర ప్రసాద్

వ్యాససంగ్రహం :-

ఈ వ్యాసం "మానవ జీవితం అనేక జీవితాలుగా కాక ఒకే జీవితంగా, ఉన్నదంతా ఒకే సారంగా భావించి కవిత్వం చేయడం బి.వి.వి. ప్రసాద్ కవిత్వ దృక్పథంగా గుర్తిస్తుంది". మనలో "ఎరుక/ఇంటెన్షనాలిటీ" ఒకటి ఉంటుంది. అది మన మూలాలకు చెందినది. దాని మూలకాలు ప్రేమ, దయ, శాంతి, ఓర్పు, మొదలైన మౌలిక భావనలు. ఇవే మనలను పరిపూర్ణ మానవుడిగా తీర్చిదిద్దేవి అని ఈ కవిత్వం ద్వారా స్పష్టం చేస్తుంది ఈ వ్యాసం. కవి వ్యక్తిత్వం లోని సున్నితత్వం, వినూత్న ధోరణితో కవిత్వం అల్లడానికి నిర్మించుకున్న వాతావరణం మరియు సహజ అనలంకారిక శైలి, అభివ్యక్తి నవ్యత మొదలైన విషయాలను ఆధునికత కలిగిన కవితా రీతిగా వివరిస్తుంది ఈ వ్యాసం, ఆధ్యాత్మికత లో వుండే సమర్పణ భావం విశ్వచైతన్యం పట్ల హైకూ ఏవిధంగా పాఠకుడిలో మెలకువ కలిగిస్తుందో చెబుతుంది ఈ వ్యాసం. "నేనే ఈ క్షణం" సంపుటిలో కవి మెటానమీ టెక్నిక్/పద చిత్రాలద్వారా ఏవిధంగా జీవన సారం, ప్రాకృతిక సౌందర్యం కవిత్వం చేసారో వివరిస్తుంది. 'ఆకాశం', 'నీలో కొన్ని సార్లు', 'ఊరికే జీవితమై', 'సృష్టి' సంపుటులు అందించిన తాత్వికానుభూతిని లోతుగా విశ్లేషిస్తుంది ఈ వ్యాసం. ఈ కవి కవిత్వాన్ని తమ సమకాలీన ప్రసిద్ధకవులు ఎలా ఆదరించారో రికార్డు చేయడం ద్వారా కవిత్వ పరిశీలనద్వారా బి.వి.వి. ప్రసాద్ కవిత్వంలోని నవ్యతను వివరిస్తుంది. విశ్లేషణాత్మక, వర్ణనాత్మక పద్ధతిలో ఈ పరిశోధన సాగింది. తాత్విక నేపథ్యమున్న భవిష్యత్ పరిశోధకులకు ఈ వ్యాసం ఉపకరిస్తుంది.

కీలక పదాలు :- మౌలిక భావనలు, తాత్వికానుభూతి, నూతన దృక్పథం, హైకూ, మెటానమీ టెక్నిక్, ఆకాశం, కొత్తదైన మెలకువ, ఎరుక, ఒక ఫిల్టర్. ప్రధాన స్రవంతి కి భిన్నంగా, అద్వైతాంశ.

2 :

బి.వి.వి. ప్రసాద్ కవిత్వ దృక్పథం

ఆధునికత/నవ్యత :
ఆధునికత :- "కవిత్వంలో ఆధునికత్వం అనగా స్వభావమును బట్టి ఆధునికత్వమే గాని కాలమును బట్టినది కానేకాదు" డా॥ సి.నారె. ఈ నిర్వచనాన్ని ఆధారంగా చేసుకొని బి.వి.వి. ప్రసాద్ కవిత్వంలోని నవ్యతను వివరిస్తుంది ఈ వ్యాసం.

సాహిత్య ప్రయోజనం సమాజ హితమే. అది ఏదో ఒక వాదమునకు పరిమితమైతే ఆ సమస్య మాత్రమే పరిష్కరించబడుతుంది. అది కూడా మంచిదే. కాని పరిపుష్టమైన, సమగ్రమైన సమాజనిర్మాణానికి మార్పు అనేది ముందు నీ నుండి రావాలని అంటారు బి.వి.వి. ప్రసాద్. మనలో తేలికదనము ఉండాలి, సరళత ఉండాలి. ఏ పని చేసిన ఏమి ఆలోచించినా దయ, ప్రేమ నింపుకొని చేయాలి అనే నూతన దృక్పథంతో వీరి కవిత్వం పరిమళిస్తుంది.

నువ్వు చెప్పేది ఏదైనా నీ అనుభవంలోంచి పలకాలి అన్న ఆర్.ఎస్.సుదర్శనం గారి మాటలు తూచా తప్పకుండా పలికాడు ఈ కవి.

ఐతే ఇతని భావజాలం, కవితా వస్తువులు, భావ చిత్రాలు, మర్మంగా లోతుగా అనుభవంలోంచి చెప్పడం ఒక నూతన కవితా రీతిని కలిగి ఉన్నాయి.

1) సహజ అనలంకారిక శైలి :
ఇప్పటి వరకూ ఫిగరేటివ్ లాంగ్వేజ్ / అర్నేట్ స్టైల్ చదవడానికి అలవాటు పడిన పాఠకుడు
ఒక్కసారిగా ఈ సహజ అనలంకారిక రచనా విధానాన్ని తీసుకోవడం కొంత కష్టమే కానీ ఇదే మన అసలు సహజ స్థితిని ఎరుక చేసే శైలి అని తెలుసుకున్నాక పాఠకుడు సాంత్వన పొందుతాడు. అంతే కాకుండా ఈ కవిత్వానికి అంకిత మయిపోతాడు.
ఈ కవిత్వం మనకు అందించేది ఒక్కటే హాయిగా జీవించడమెలానో నేర్పుతుంది. ఏ పేచీ లేకుండా శాంతంగా ఎలా మనవచ్చో తెలుపుతుంది. ఊరికే జీవితమై అన్నంతగా, ఇదే బి.వి.వి.ప్రసాద్ కవిత్వం మనకందించే గొప్ప కవిత్వ కానుక.

2) వ్యక్తిత్వం లోని సున్నితత్వం
బి.వి.వి.ప్రసాద్ స్వభావ రీత్యా సున్నితస్థుడు, లోతైన అన్వేషి, తగినంత ఆర్ద్రత, నిజాయితీ, చేసే పనిపట్ల ప్రాణం పెట్టి చేయడం నచ్చని వాటికి దూరంగా ఉండడం, ఇతరుల్లో మానవీయ విలువలు ఆశించి తరచూ నిస్పృహకు గురికావడం తన వ్యక్తిత్వంగా గమనించి. తన లోపలి వెలితి ఒకటి తన జీవిత గమనాన్ని శాసిస్తుందని భావించి ఆ వెలితిని నింపే ప్రయత్నంగా కవిత్వాన్ని ఆవిష్కరించారు.

3) కవిత్వం కోసం నిర్మించుకున్న వాతావరణం
వైరుధ్య భావాలతో జీవించే మానవ లోకంలో మనందరి మనస్సు ఉపశమించే మంత్రనగరి ఒకటి కావాలి. అక్కడ అందరం కలసి చెట్టపట్టాలేసుకుని హాయిగా తిరగాలి, బిగ్గరగా నవ్వుకోవాలి.

3:
మనస్పూర్తిగా ఏడవాలి. అదో పరమ శాంతిమయ లోకం కావాలి. ఈ విశ్వంలో చెలరేగుతున్న మనో మాలిన్యపు రాశులను బూడిద చేయగలగాలి. ఆ పరమ శాంతి ధామమే ఈ కవిత్వం.

II మొదటి వచన సంపుటి "ఆరాధన" సమర్పణ భావన

బి.వి.వి.ప్రసాద్ తన 23 ఏళ్ళ వయస్సులో మొదటి కవితా సంపుటి 'ఆరాధన' వేసారు. దీని నిండా సమర్పణ భావన వుంటుంది. దీనికి ముందుమాటలో కవి తనను తాను వెతుక్కునే ప్రయత్నమే ఇందులో వుంది. అంతేకాక ఇతరులలో తను గుర్తించడాన్ని ప్రేమ అంటారనుకుంటాను. ప్రేమను తెలియజేయడంలో 'ఆరాధన' ఒక పద్ధతి అంటారు.

మానవ జీవితం అనేక జీవితాలుగా కాక ఒకే జీవితంగా ఉన్నదంతా ఒకే సారంగా భావించి కవిత్వం చేయడం వీరి దృక్పథంగా కనిపిస్తుంది.

నిన్ను సేవించుదామని / ఎన్నో సుందర పుష్పాలు ఏరి తెచ్చి తుదకు / వాటి సౌందర్యం పై మోహంతో / నిన్నే విస్మరించాను అంటారు. 
(ఆరాధన వచన కవిత్వం- 1989)

మనం చేసేదిదే. ఈ లోకంలోకి ఎందుకొచ్చామో మరచిపోయి ఇతర వ్యామోహాల్లో పడిపోతాము. అంటే మన అసలుని మరిచి పోవడం, అదే మాయ. అలాంటి మాయలో పడవద్దని కవిపిలుపు. సాధారణంగా మనందరికీ మృత్యు భయం వుంటుంది. ఏ రమణ భగవానో, ఓషో లాంటి తాత్వికులను మినహాయిస్తే. ఈ కవి తన కవిత్వంలో చాలా విరివిగా మృత్యువును గురించిన కవితలు అల్లారు. మృత్యువనేది జీవితంలో తప్పని సరి భాగం అయినప్పుడు దాన్ని సానుకూలంగా ఎలా తీసుకోవాలో మరింత ఎరుకతో జీవితాన్ని ఎంత చక్కగా పండించుకోవచ్చునో తెలుసుకోవడమే కాక సాంత్వన పొందుతాము.

మృత్యుస్పృహ / మన మనస్సులో / ప్రధానమైన అంతర్వాహిని అయ్యే కొలదీ// మన జీవితాలలో అనుబంధాలలో/ లాలిత్యమూ, ప్రేమా ఉన్నతంగా దర్శనమిస్తాయి// 
(ఆరాధన- 1989- మృత్యుస్పృహ)

III హైకూ కవిత్వం తాత్విక సాంద్రత

తెలుగు హైకూకి వెలుగులద్దిన ప్రసిద్ధ హైకూ కవిగా బి.వి.వి. ప్రసాద్ సుపరిచితులు. తెలుగు హైకూని పరిపుష్టం చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. హైకూ అనేది ఒక పదచిత్రం. కవి ఇస్మాయిల్ గారన్నట్లు చంద్రుణ్ణి చూపించే వేలు, చంద్రుణ్ణి చూపించాక వేలు అవసరం లేనట్లు హైకూను చదివాక అనుభూతి మాత్రమే మిగలాలి. క్లుప్తత, సాంద్రత, గాఢమైన తాత్విక చింతన, సౌందర్యాత్మకత ప్రకృతిలో మమేక మయ్యే స్వభావముండాలి. తేలిక దనం వుండాలి. ఇవన్నీ స్వభావరీత్యా బి.వి.వి. ప్రసాద్ లో సహజంగా వుండడం వలన హైకూ పేరు చెబితే బి.వి.వి. హైకూలు గుర్తుకొచ్చేట్లుగా హైకూలు రాసారు. బివివి మూడు హైకూ సంపుటాలు తీసుకొచ్చారు.

1.దృశ్యాదృశ్యం,(1995), 2. హైకూ (1997). 3. పూలు రాలాయి (1999) వీరు 'బషో' హైకూలను స్వేచ్ఛానువాదం కూడా చేసారు. రెండు ప్రసిద్ధ హైకూ వ్యాసాలు 1. ప్రకృతీ, జీవితం హైకూల మయమే, 2. హైకూ అంటే జీవన స్పృహ రచించారు. ఇవి సాహితీ లోకంలో చిరస్థాయిగా నిలిచిపోయే రచనలు.

4:

వర్షం / క్షణం పూచే నీటి పూలతో / ఊరు నిండిపోయింది// ఈ హైకూని వినగానే ఓ గొప్ప సౌందర్యానుభూతికి గురవుతాము. వర్షపు చినుకులను క్షణం పూచే నీటి పూలు అనడం ఎంత బాగుంది. పాఠకుడు ఒక అవ్యాజమైన అనుభూతికి గురవుతాడు. సౌందర్యం క్షణికమనే అవగాహన నుండి పుట్టిన ఒక వైరాగ్య వీచిక ఈ హైకూ ఈ అనుభూతిని 'అవారే' అంటారు.

మరో హైకూ :
పధికుని పలకరింపుకై / చూసి, నవ్వి, చిన్న బోయిన /వీధి దీపం//
(దృశ్యాదృశ్యం,(1995).

హైకూ పరిభాషలో దీనిని "సతోరి" అంటారు. మనం ప్రకృతిలోని చరాచరములనుండిఎంతో మేలు పొందుతాము. కానీ కనీసం ఆ స్పృహ కూడా మనకుండదు. అంత సున్నిత విషయాలపట్ల కృతజ్ఞతను మేల్కొల్పడం ఇక్కడ హైకూ కవి ఉద్ధేశ్యం. ఇంత సున్నిత విషయాలపట్ల స్పృహ ఉంటే మనం జీవించే తీరు ఇంకా ఉన్నతంగా వుంటుంది కదా!

రాత్రి తారలు / నదినిండా కురిసాయేమో / తీరమంతా ఇనుకమయం//
దృశ్యాదృశ్యం,(1995)

నదీ తీరమంతా ఇసుక మేటలతో నిండి వుంటుంది. మనం అంతవరకే గమనిస్తాం. కానీ హైకూ కవి ఆ ఇసుక రేణువులు సూర్యకాంతికి మెరవడం ఎలా ఉందంటున్నాడంటే అది చిన్ని చిన్ని తారలు చిన్ని రేణువులుగా కుప్ప బోసినట్లుందట. అది రాత్రంతా తారలు కురవడం వలన అలా అయిందట ఏమీ సౌందర్యం. ఇది ఒక అమోఘమైన అనుభూతి చిత్రం కదా!

IV "నేనే ఈ క్షణం" అనుభూతి సౌందర్యం

వీరు 2006లో 'నేనే ఈ క్షణం' అనే కవితా సంపుటి వేసారు. ప్రాకృతిక సౌందర్యాన్ని, జీవనతత్వాన్ని పెనవేసుకొని అద్భుత భావచిత్రాలుగా ఆవిష్కరించబడ్డ కవితా సుగంధం "నేనే ఈ క్షణం"

ఎండకురిస్తే / చెట్టునిండా / ఆకు పచ్చని చినుకులు//
చీకటి కురిస్తే / చెట్టు నిండా / నల్లని మబ్బులు //
మబ్బుల్లోని చినుకుల్ని కురుస్తూంది చెట్టు //

ఈ కవితలో కవిగీసిన పదచిత్రాలు "మెటానమీ" టెక్నిక్ లో వుండడం వల్ల పాఠకుణ్ణి చురుకుగా ఆలోచింపజేసి, సమాధాన పడ్డాక చక్కటి ఆనందానుభూతిని కలిగిస్తాయి.

V "ఆకాశం" ఓ మార్మిక పరిమళం

ఒక దశాబ్ద కాలంపాటు కవిత్వానికి దూరంగా వున్న ప్రసాద్ గారు ఆ సమయంలో చేసిన అంతర్ముఖ సాధన, జీవనానుభవాలను దగ్గరగా దర్శించడం అదే కవిత్వంగా ఒక వినూత్న ధోరణితో మూడు, నాలుగు నెలల వ్యవధిలో 100 ప్రసిద్ధ కవితలుగా 'ఆకాశం' వెలువడడం గమనార్హం. హైకూ కవిగా సుపరిచితులైన బివివిని 'ఆకాశం' కవితా సంపుటి వచనకవిగా సమున్నత సాహితీ శిఖరంపై కూర్చోబెట్టింది.

"ఆకాశం" వ్రాసేటప్పుడు వారు పెట్టుకున్న నియమాలు తూచా తప్పకుండా పాటించడం మనం చూస్తాము.

5:

ఏ భావం పలికినా మార్దవంగా, తాత్వికానుభూతిని, సౌందర్యాన్ని రంగరించి 'దయ' అంతర్లీనంగా వుండేట్టు కవిత్వీకరించడం మనం గమనిస్తాము.

పుట్టగానే పిల్లలు నవ్వరెందుకని వాళ్ళు ఏ వెలుతురులో ఈది వచ్చారు/ ఏ ఆనందాలు దాటి వచ్చారు/ ఏ హద్దుల్లేని దేశాలు ఎగిరి వచ్చారు/ పుట్టగానే పిల్లలు నవ్వలేరెందుకని ఏ పవిత్ర సీమలు విడిచి వచ్చారు/ ఏ దయాపూర్ణ హస్తాలు విడిచి పెట్టారు / ఏ కపటం లేని లోకాలు పోగొట్టుకున్నారు//

పుట్టగానే పిల్లలు ఎప్పుడూ ఏడుస్తారు ఎందుకని / దుఃఖమయ ప్రపంచాన్ని వ్యాఖ్యానిస్తారెందుకని// (పుట్టగానే పిల్లలు ఆకాశం - 2011)

పిల్లల్ని గురించిన మరోకవిత:-
పిల్లల్ని ప్రేమించడం నేర్చుకుంటే చాలు/ పిల్లల్ని ప్రేమిస్తే చాలు వారికోసం ఒక మంచి ప్రపంచాన్ని వారే సృష్టించుకుంటారు (ఆకాశం 2011)

ఈ వాక్యం మనం మరవకుండా వుండగలిగితే చాలు. నేటి సమాజంలో పిల్లల్ని ప్రభావితం చేయడంలో పెద్దలు విఫల యత్నం చేస్తున్నారు. దీని వలన పిల్లలు ఒత్తిడికి గురయి వారి సహజత్వాన్ని, సృజనని కోల్పోతున్నారు. పిల్లల్ని వారి మానాన్న వారిని ఎదగనిస్తే చాలు అద్భుతాలు సృష్టిస్తారు. వారి స్వచ్ఛమైన లేత మనసుల్ని కలుషితం చేయకుండా వుండగలిగితే చాలు. సినారె. అంటారు. "పాపాలను కడిగి వేస్తుందిలే పాల నవ్వుల నురుగు" అని

VI "నీలో కొన్ని సార్లు" లోతైన మౌనం పలికే వాక్యాలు

బి.వి.వి.ప్రసాద్ కవి "నీలో కొన్ని సార్లు" అనే కవిత్వ సంపుటిని 2015 లో వేసారు. ఇది ''ఇతను' అనే కవిత తో ప్రారంభమవుతుంది. మానుష ప్రపంచం మరీ అంత భయావహమైంది కాదని/ నీ కలలోని భూతమే నిన్ను మ్రింగ బోయినట్లు / నువ్వు విలువిస్తే బ్రతికే సముహం నిన్ను కమ్ముకుంటుందని/ సమూహాన్ని చెరిపేస్తూ నిన్ను గుర్తు చేయాలనే ఇతను మాట్లాడుతున్నాడు... ఎప్పుడూ పాతదైన నిద్రలోంచి, ఎప్పటికీ కొత్తదైన మెలకువలోకి/ మెలకువలాంటి పూలలోకి, గాలిలోకి, మౌనంలోకి, కాంతిలోకి / జీవితం పంపిన దూతలా పిలుస్తున్నాడు.

ఈ కవితలో ఎప్పటికి కొత్తదైన మెలకువలోకి అనే మాట పాఠకుడు చాలా పట్టుకోవాల్సిన మాట. ఆదమరిచిన నిద్ర అనడంలో భౌతిక సుఖాల్లో పడి మనతో పాటున్న తోటి చరాచరాలకి ఇవ్వాల్సినంత విలువ ఇవ్వడం మరచిపోయిన మనకి మన మూలాల్ని పరిచయం చేస్తూ అక్కడి లోతైన దయాప్రేమలతో నిండిన సూక్ష్మ ప్రపంచాన్ని మనలో జాగృతం చేస్తున్నాడీ కవి. దీనిని ఇంటెన్షనాలిటీ/ ఎరుక అని అంటాం. 

మరో కవిత:-
తోటి వారిని గాజులానో, పూలలానో / కదలని నీటిపై నిదురించే చంద్రుని బింబంలానో చూడలేమా/ బహుశా ఏ గ్రహాంతరాలలో ఏకాకులమై ఎదురైతే / అద్దంలో ప్రతి బింబంలా మృదువుగా చూసుకుంటాం ఒకరినొకరం ... అని సాగే ఈ కవితలో కవి ఇతరులతో మనం మెలగాల్సిన తీరు పట్ల ఒక అపురూపమయిన కొత్త సంస్కారాన్ని మనకందిస్తున్నారు.

:6:

VII "ఊరికే జీవితమై" - అన్నంతగా

బి.వి.వి. ప్రసాద్ కవితా సంపుటి "ఊరికే జీవితమై" (2023) నుండి

నిద్రలో ఎక్కడుంటావు నువ్వు/ మెలకువలో నీ దేహాన్ని మోసీ మోసీ అలసి పోయాక / దానిని ఎక్కడకు విసిరేసి, ఎటు వెళ్ళిపోతావు// సృష్టికి పూర్వం వున్న ఏ శీతల నిశ్శబ్ద ప్రశాంతతలోకి నిదురించేవేళల రహస్యంగా ప్రవేశిస్తావు/

అని సాగే ఈ కవితలో మనము నిద్రపోయేటప్పుడు ఏ లోపలి సీమలోంచి విహరిస్తామో అక్కడి మెలకువడి సంబంధించిన అనుభూతిని కవిత్వంగా పలకాల్సివుంటుంది. ఇది ఒక దార్శనికునికో, యోగికో, తాత్వికునికో సాధ్యమయ్యేపని.

ఈ కవి కవిత్వం పరిశీలించాక "అనుభూతి వాదం" భూమికగా కనబడుతుంది. నువు చెప్పేదేదయినా నీ అనుభవంలోంచి పలకాలి అన్నది అనుభూతి వాదం ప్రాధమిక సూత్రం.

VIII "సృష్టి" ఒట్టి ప్రేమసారం ఈ కవిత్వం

ఇటీవల వెలువరించబడిన బి.వి.వి. ప్రసాద్ గారి కొత్త పుస్తకం "సృష్టి" నుండి "ప్రేమ ఉంటే" అనే కవితలో

ప్రేమ ఉంటే పెద్దగా చెప్పడానికి ఏమీ ఉండదు/మాటలన్నీ మంచు ముక్కల్లా ప్రేమలో కరిగి పోతాయి/పూలరంగులు వెలుగుతాయి./ నక్షత్రాలు అనంతాన్ని విరబూస్తాయి./ స్పర్శ జీవితాన్ని సారవంతం చేస్తుంది..

కవి ఇక్కడ ఒక మాట అంటారు. "జీవుల చూపుల సారం ప్రేమకోసం ఎదురుచూపు/భయాలు, కోరికలు ప్రేమ దక్కక చేసే వెర్రి పనులు". ఇది మానవాళికి అందాల్సిన అద్భుతమైన "మోరల్ స్టేట్మెంట్" నిజమే కదా లోకంలోని సమస్త సమస్యలకు దుఃఖాలకు సరిపడా ప్రేమలేక పోవడమే కారణం. అనంతమైన ప్రేమలోకి ఒక్కసారి మేల్కొనగలిగితే బాధలన్నిటికి ఉపశమనం దొరికినట్టే.

శుద్ధవేదనా జగత్తునుండి వెలువడ్డ నిర్మల స్వచ్ఛగంగాజలం వీరి వాక్యం.

మరో పద చిత్రాన్ని చూద్దాం.

నల్లని కాన్వాసు పై / మరింత నల్లని చిత్రాలయి/ ఇళ్ళూ చెట్లూ// (దృశ్యా దృశ్యం - 1995)

ఇదొక రంగుల పద చిత్రం నల్లని రంగుపైన మరింత నల్లని రంగుని పులమడం ఎంతో

రమ్యమైన శిల్పం ఆవిష్కరించబడింది.

డా||అద్దేపల్లి వారన్నట్లు ఆలోచనలోనే వినూత్నత వుండడం వీరి శైలికి బలం. (నీలో కొన్ని సార్లు 144 పేజీ ఉత్తరాల నుండి)

వీరి కవిత్వం పైపై ఉద్వేగల అణచివేతకాదు. లోలోపల జరిగే మధనం ఒక విచికిత్స. నీ మూలాలతో నీవు శృతి చేసుకుంటేగాని ఈ కవిత్వం నీకు కనెక్ట్ అవ్వదు. పాశ్చాత్య విమర్శకుడు 'కెబుల్' చెప్పినట్లు "వెంట్ ఫర్ ఓవర్ చార్జుడ్ ఫీలింగ్/ ఉప్పొంగు అనుభూతుల అభివ్యక్తి" వీరి కవిత్వం.

:7:

వీరి ఉపమానాలు, రూపకాలు అప్పుడే పుట్టిన పిట్ట కూనల్లా పాఠకుణ్ణి అబ్బుర పరుస్తాయి.

ఉదా|| భూమి వంటి అమ్మమ్మ, ఆకు పచ్చని చెట్లు బడి పిల్లల్లా, కాలంనది, చినుకు శిశువు నీడల కాలువలు, వెల్తురు పుప్పొడి, పడవ చంద్రుడు, తారల ఇసుకమైదానం మొదలైనవి.

ఒక విధంగా ఈ కవిత్వం ఒక ఫిల్టర్ వంటిది. మనం చదివే ప్రతి వాక్యం మనల్ని ప్యూరిఫై చేయడమే తప్ప కొత్తగా మనకేదో నేర్పాలనే ప్రయత్నం చేయదు. మన మానసిక స్థౌల్యతని కరిగించి తేలిక పరచి స్వస్థత కలిగించి మన అసలుని మనకు అప్పగించే ప్రయత్నం చేస్తుంది.

వీరి కవిత్వం పై సమకాలీన ప్రముఖ కవుల అభిప్రాయాలు

అందుకే సమకాలీన కవులంతా వీరి కవిత్వాన్ని అత్యంతగా ఇష్టపడతారు దీనికి కారణం వారు కూడా ఈ కవిత్వంలో ఉపశమనం పొందడమే

ఆకాశం కవితాసంపుటిని గురించి డా॥ రెంటాల వారు ఇది 'ప్రొఫెట్' తరువాత పుస్తకం. ఇది ఆంగ్లంలోకి అనువాదమైతే భారతీయ ఖలీల్ జీబ్రాన్ ఇలా వుంటాడని అందరికీ తెలుస్తుంది. అని అంటారు.

ఆకెళ్ళ రవిప్రకాష్ గారు తన వ్యాసంలో బి.వి.వి.ప్రసాద్ గారిని యువచలం అన్నారు. (ఆంధ్రజ్యోతి దినపత్రిక, వివిధ 18/05/2020)

నాకనిపిస్తారు వీరు శ్రమణకుల ఆర్తిని తీర్చిన గౌతమ మునిలా

కళ్ళలో దయా స్పర్శలో నిర్మలత్వం
మాటలో నిజాయితీ, మనిషిలా స్పందించడం మరచిపోకుండా ఉంటే చాలు

హాయిగా నవ్వడమూ, హాయిగా ఏడవటమూ పోగొట్టుకోకుండా ఉంటే చాలు 
(ఆకాశం - 2011 చాలు)

ముగింపు :-

బి.వి.వి. ప్రసాద్ కవిత్వంలో శాంతి, కరుణ, ప్రేమ, క్షమ, వంటి మౌలిక భావనలు ఎంతో లోతుగా అనుభూతి ప్రధానంగా అద్వైతాంశతో దర్శనమిస్తాయి.

మానసిక కాలుష్యంతో, వైషమ్యాలతో కొట్టు మిట్టాడుతున్న మానవ లోకం ఉపశమించే పరమశాంతి ధామమీకవిత్వం.

నేటి ప్రథాన స్రవంతికన్నా భిన్నమైన ఆధునిక ధోరణితో వెలువడుతున్న ఈ కవిత్వం తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

8:

ఆధార గ్రంథాలు :

1. ఆరాధన, బి.వి.వి. ప్రసాద్, వచన కవిత్వం, రవి ప్రింటర్స్, తణుకు, 1989.

2. బి.వి.వి. ప్రసాద్, హైకూలు (దృశ్యాదృశ్యం 1995, హైకూ 1997, పూలు రాలాయి 1999) బి.వి.వి. ప్రసాద్, శ్రీ శ్రీ ప్రింటర్స్ విజయవాడ.

3. నేనే ఈ క్షణం, బి.వి.వి. ప్రసాద్, వచన కవిత్వం, శ్రీ రత్న ప్రింటర్స్, రాజమండ్రి. 2006

4. ఆకాశం, బి.వి.వి. ప్రసాద్, వచన కవిత్వం, పాలపిట్ట బుక్స్, హైదరాబాద్, 2011.

5. నీలో కొన్నిసార్లు, బి.వి.వి. ప్రసాద్, వచన కవిత్వం, వాసిరెడ్డి పబ్లికేషన్స్, హైదరాబాద్, 2015.

6. ఊరికే జీవితమై, బి.వి.వి. ప్రసాద్, వచన కవిత్వం, ప్రేమలేఖ ప్రచురుణలు, 2023.

7. సృష్టి బి.వి.వి. ప్రసాద్, వచన కవిత్వం, స్వేచ్ఛా ప్రచురణ, తణుకు. 2026.

8. ఒలుపు సాహిత్య వ్యాసాలు, డా॥ రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు, చినుకు పబ్లికేషన్స్, విజయవాడ, 2017.

9. ఆలోచన, సాహిత్య వ్యాసాలు, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ M.A.I Books, సికింద్రాబాద్, 2014.

10. ఆధునిక ఆంధ్రకవిత్వం, సంప్రదాయాలు, ప్రయోగాలు. డా॥ సి.నా.రె. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్.

మల్లవెల్లి శ్రీరామ నాగ వర ప్రసాద్, 
పి.జి.టి. (తెలుగు)
ప్రభుత్వ పోస్ట్ బేసిక్ పాఠశాల ప్లస్, పెంటపాడు
పశ్చిమగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.
(ఆంధ్ర విశ్వకళాపరిషత్, విశాఖపట్టణం, తెలుగు శాఖ, పార్ట్ టైం పి. హెచ్. డి. రీసెర్చి స్కాలర్)
9441350260, 7013543732, sriram9441350260@gmail.com

ప్రచురణ : 
భావ వీణ - ప్రత్యేక సంచిక 28.2.26
ప్రభుత్వ డిగ్రీ కాలేజి, రాజోలు, డా॥ బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆంధ్రప్రదేశ్ తెలుగు విభాగం

24 జూన్ 2026

కవిత : వారూ - వీరూ

చాలా చెబుతారు 
తెలివైనవాళ్ళం, బ్రతక నేర్చినవాళ్ళం 
అనుకొనేవాళ్ళు 
కానీ, జీవితం అమాయకుల స్వర్గం

రాత్రి నీమీద వాలినపుడు
రాత్రి లోంచి కొన్ని దీపాల కాంతులు
నిన్ను తడిపినపుడు,
వాటి నీడలు దృశ్యాలనుండి 
ధారలు కట్టినపుడు,
నువు కాంతుల్లోకీ, నీడల్లోకీ తప్పిపోకుండా 
ఒడ్డున తచ్చాడితే, తెలివైన బుద్ధిహీనుడివి
తప్పిపోతే, అమాయకంలోకి మేలుకొన్నవాడివి

పగలు మనుషుల ముఖాలపై తేలే
భయాలనీ, వెలితినీ చూస్తే 
తెలివిలో ఇరుక్కున్నవాడివి
ముఖాలపై వాలే ఎండనీ, నీడనీ చూస్తే
అమాయకంలోకి రెక్కలు విప్పినవాడివి 

ఎవరు జీవితాన్ని జయించామనుకొంటారో
వాళ్ళు జీవితానికి బానిసలు,
ఎవరు జీవితానికి లొంగిపోయారో 
వాళ్ళు జీవితం పసిపాపలు 

చివరిరోజున నీ ముఖం పై
చిరునవ్వు తారాడకపోతే నీ జీవితం ఉత్త డొల్ల,
నీ కనుకొలకుల్లో ఆనందాశ్రువులు మొలకెత్తితే
నీ జీవితం సారవంతం

ఏమీ చెప్పరు 
అమాయకులం, నిర్బలులం అని తలచేవాళ్ళు
కానీ, వాళ్ళ శ్వాసలో అనేకలోకాలు వికసిస్తాయి

బివివి ప్రసాద్
ప్రచురణ : సారంగ 15.6.26

21 జూన్ 2026

కవిత : సందిగ్ధ స్వప్నం

నిన్ను మనుషులు కాదన్నపుడు
నువు ఎక్కడికి చేరుతావు

మలిసంధ్యలోని చివరికాంతులలోనికా, 
మండువేసవిలో వెలిగే నీడల్లోనికా,
ఎడారి కడుపున పండే ఖర్జూరపు రుచిలోనికా,
దైవం దయగా పంచే చిరునవ్వులోనికా 

ఏ మూలన నువు దాక్కోవాలని చూస్తావు
జనన, మరణాల సరిహద్దులోనా,
నవ్వుకీ, కన్నీటికీ నడుమ తేలే రేఖలోనా,
చలికీ, వేసవికీ నడుమ నలిగే రోజుల్లోనా

ఇదంతా అద్భుతం, అసంబద్ధం కూడా

నీ ఆలోచన పొట్లిన కాగితం కానున్నపుడు, 
నీ ఊహ పచ్చదనం నుండి 
ఎండిపోవటంలోకి తిరుగుతున్నపుడు,
నువు నవ్వుకీ, ఏడ్పుకీ నడుమ పరుగెడుతున్నపుడు

నీకు నిజంగా బ్రతకాలనిపిస్తుందా, ఇక చాలనా
శ్వాస ఆగిపోవాలనుంటుందా, కొనసాగాలనా

జీవితం సందిగ్ధ స్వప్నం
సూర్యకాంతినీ, మంచిచెడ్డల మీమాంసనీ
నీ కలలకి వదిలి 
నిన్ను నిన్నుగా కావలించుకునే ప్రేమ, ఆర్తి

కొనసాగమని మినహా జీవితమేమీ అడగదు నిన్ను,
భయం లేని లోకం మినహా 
జీవితాన్ని ఏమీ అడగబుద్ది కాదు నీకు

ఒక సందిగ్ధం నీలోకి నిన్ను నెడుతుంది,
నీ తలుపులు తెరవమంటుంది
సందిగ్ధ సాయంవేళ 
నీతో నువు కాసేపు గడుపుతావు

బివివి ప్రసాద్
ప్రచురణ : స్నేహ, ప్రజాశక్తి 21.6.26



17 జూన్ 2026

కవిత : అక్కడ ఉంటావు

ఆటలాడీ, ఆడీ పరుగున వచ్చి
అమ్మని కావలించుకుంటావు చూసావా
అక్కడ నువ్వు నువ్వుగా ఉంటావు

యవ్వనంలో స్నేహితుని భుజం మీది చేయిలోనో,
ప్రియురాలి చూపులోనో కరిగిపోయినపుడూ,
జీవననేస్తం తొలి కౌగిళ్ల నమ్మకమైన స్పర్శలో,
బిడ్డల అమాయకపు లేత చూపుల్లో,
వాళ్ళు నీ కొనసాగింపనే ఉద్వేగంలోనూ 
నువ్వుగా ఉంటావు 

స్థిమితంగా ఉన్నపుడు
దయగా నీలోపలికి చేరే బంగారు ఎండలోనో,
వెండి వెన్నెల లోనో, కాటుక కన్నుల వంటి చీకటిలోనో,
ఉండి ఉండి, నేనున్నాను కదా అని వీచే గాలితెరలోనో,
వేగిన గాలిలోంచి పసిపాప చిరునవ్వులా జారే 
చల్లని వాన చినుకులోనో,
వానచినుకు పుష్పించే ఇంద్రధనువులోనో,
వాన తరువాత నేలలోంచి పూచే ఇంద్రధనువులలోనో
నువు మెల్లగా, సముద్రంలోకి మరలిపోయే అలలా కరిగిపోతున్నపుడు నీకు నువు ఉంటావు

వేసవి నీడలోనూ, దుఃఖార్తుడి తృప్తిలోనూ,
కఠినులలో కలిగే పశ్చాత్తాపపు కదలికలోనూ,
సమస్తాన్నీ ప్రేమించే మహనీయుల చూపులోనూ,
చెట్ల ఆకుల్ని కదలీ, కదలించని మెల్లని గాలితెరలోనూ,
వాసంత కోయిల మధ్యాహ్నపు బద్దకపు పాటలోనూ,
ఇంకా, అనేక మృదువైన సమయాల,
జీవితం ఊరికే గాలితెరలా తాకిపోయే వేళల
నువు అక్కడే మెలకువగా,
కెరటం అంచున మెరిసే వెన్నెలలా నిలిచి ఉంటావు

ఇవన్నీ సరే,
నువు నువ్వుగా ఎప్పుడూ ఉన్నావు కదా,
వీటన్నిటికీ ఇక్కడేం పని అంటారెవరో
ఎవరా అని వెనుతిరిగి చూస్తే తాకుతుంది 
ఏదో మృదువైన, బలమైన, లోతైన నిశ్శబ్దం
బహుశా, నువ్వు

బివివి ప్రసాద్
ప్రచురణ : ఈ మాట జూన్ 2026

16 జూన్ 2026

కవిత : పండిన ప్రేమ

నువు కూర్చున్నపుడు
నారింజ మేఘాలు నీ ప్రక్కన కూర్చుంటాయి

కనురెప్పలు పైకెత్తినపుడు
నీ చూపులు సీతాకోకలయి ఎగురుతాయి

మాటలకై పెదవులు తెరిచినపుడు
తేలికగాలులలో పరిమళాలు మునకలేస్తాయి

లోపలినుండి చిరునవ్వు నవ్వినపుడు
ఎవరం పోటీ పడదామని
నక్షత్రాలూ, సూర్యుడూ తడబడతారు

ప్రపంచం మీద ప్రేమతో 
నీ హృదయం నిండినపుడు
చంద్రుడు తృప్తిగా బెంగ విడుస్తాడు 
ఇవాళొక హృదయం ఆశ్రయం ఇచ్చిందని

ఇంతకూ నువు ఏ ఒకర్నీ ప్రేమించలేదు
నీలో ఇంత అందానికి

జీవితాన్ని ప్రేమించి, ప్రేమించి
జీవితానివీ, ప్రేమవీ అయిపోయావు
కదులుతున్న రాత్రిలో రాత్రిలా కరిగిపోయావు

బివివి ప్రసాద్
ప్రచురణ : మహా పత్రిక 15.06.26



10 మే 2026

కవిత : కొంచెం ప్రేమలోంచి

కొద్దిగా ప్రేమించు
గదిలో వాలిన బంగారు కిరణాన్ని,
కిటికీ బయట తలలూపే పూల మొక్కలని, 
మొక్కలపై కనబడని ఆటలాడే పసిగాలి తరగలని,
గాలికి ఊగే ఆకాశాన్ని,
ఊగే ఆకాశంలాంటి మనసుని,
మనసులో ఊగే జీవితాన్ని

కొద్దిగా ప్రేమించు 
ఇక్కడ ఉండటాన్ని, 
ఒకనాడు ఇక లేకపోవడాన్ని,
నువు లేని కాలంలోంచి నువు రావటాన్ని,
కాలం మళ్ళీ చెరిగిపోవటాన్ని

కొద్దిగా ప్రేమించు,
కొద్దిగా హృదయాన్ని తెరువు,
నీటిబిందువులాంటి హృదయం తెరిచి
జీవితానుభవమనే సముద్రంలో కరుగు

ఇపుడు నువు కదా జీవితానివి 
ఇక దుఃఖం ఎక్కడుంది, భయం ఎటు పోయింది
ఇపుడు నువు ఏకకాలంలో
ఇంద్రధనువువి, దానిలోని రంగురంగుల అణువువి

బివివి ప్రసాద్
ప్రచురణ : తొలివెలుగు 10.5.2026



27 ఏప్రిల్ 2026

కవిత : ఆ క్షణాలు

 ఎవరినైనా హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నపుడు
కాసేపు ఆ క్షణాల్లో మునిగి ఉండు
వేకువ బంగారు కాంతిలో మునిగినట్లు
సీతాకోక రెక్కల నిశ్శబ్దంలోనో,
పూల మెల్లని వికాసంలోనో,
పసిపాప తెరుచుకునే చిరునవ్వులోనో మునిగినట్లు

దేనినైనా హృదయపూర్వకంగా ప్రేమించేవేళ
కాసేపు ఆ క్షణాలని పట్టుకొని ఉండు
చేతిలో కరుగుతున్న మంచుముక్కనో,
దుప్పటిలో మాయమవుతున్న నిదురనో,
చేయి విడిచే ప్రేమ నిండిన స్పర్శనో పట్టుకొన్నట్లు 

మరి ఒకటి, రెండు క్షణాలు
మరి ఒకటి, రెండు యుగాలు

మళ్ళీ, నీకు దొరకక పోవచ్చును
ఆ నమ్మకం, ఆ ప్రేమ, ఆ స్పర్శ
ఆ అమాయకత్వం, ఆ బేలతనం, ఆ లాలన

ఇంత జీవితానికి సారంలాంటి ఆ క్షణాలు
మళ్ళీ జీవితంలో ఎదురు కాకపోవచ్చును

కాసేపు, గాఢంగా ఊపిరి వదిలి
నువు ప్రేమించిన క్షణాలని,
నిన్ను ప్రేమించిన క్షణాలని
ఊపిరినిండా తీసుకొని, నిలుపుకో

తరువాత, జీవితం ఏ మలుపు తిరగనీ 
ఆ ప్రేమకాంతిని నీ బాట నిండా పరుచుకోనివ్వు 

బివివి ప్రసాద్
ప్రచురణ : వివిధ, ఆంధ్రజ్యోతి 27.4.26



26 ఏప్రిల్ 2026

వ్యాసం : అనుభవ కవిత్వం

1
అనుభూతి కవిత్వం గురించి మీరు మాట్లాడాలి అన్నారు మిత్రులు చక్రధర్. నాకు ప్రసంగాలు చేయటం రాదు. పుస్తకాలు చదవటం మానేసి చాలా కాలమైంది. కనక నేనేమీ మాట్లాడలేనన్నాను. అని ఊరుకుంటే బావుండేది. కవిత్వం ఏదైనా అనుభూతే. కనక, అనుభూతి కవిత్వం అనే మాట సరైనది కాదు, దానికన్నా అనుభవ కవిత్వం అనటం సరైనది అన్నాను, ఇస్మాయిల్ గారు కూడా ఆ లేబిల్ ఒప్పుకోలేదు అని కూడా అన్నాను. మీడియావాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడాలన్నది అనుభవంలో లేక తొందరపడ్డాను. అయితే అనుభవ కవిత్వం మీద మీరు మాట్లాడుతున్నారు అన్నాడు.

సీరియస్ గా సాహిత్యం చదువుకుని రెండు దశాబ్దాలు దాటింది. ఎప్పుడైనా ఒకటీ, అరా పుస్తకాలు మినహా ఎలాంటి చదువూ లేని, ఈ మిత్రుని మాటలు మిత్రులు సీరియస్ గా తీసుకోనవసరం ఉండకపోవచ్చని ముందుగా సూచిస్తున్నాను.

చదవకుండా ఇంత కవిత్వం ఎలా రాస్తున్నారు, మీరు ఏదో చదువుతున్నారు అన్నారు చక్రధర్. అవును, చదువుతున్నాను. నా అస్తిత్వాన్నీ, నా అస్తిత్వం చుట్టూ విస్తరించిన అనంతమైన అస్తిత్వాలనీ, విశ్వం నాలోకి ప్రసరిస్తున్న ప్రతిఫలనాలనీ చేతనైనంత శ్రద్ధగా చదువుకుంటున్నాను. నా జీవితానుభవాన్ని వీలైనంత దగ్గరగా చదువుతూ, కదిలే సమస్తం వెనుక కదలని మూల ద్రవ్యం ఏదన్నా వెండితెరలా ఉందా అని వెదుకుతున్నాను. 

2
ఈ మౌలికమైన వెదుకులాట ఆధారంగా కవిత్వం ఏమై ఉంటుంది అని ఆలోచించినప్పుడు, కవిత్వం ప్రధానంగా మూడు శక్తుల కలయికగా తోస్తుంది. అవి ఆలోచన, ఉద్వేగం, అనుభూతి. ఒక వస్తువుకి సంబంధించిన సమాచారాన్ని ఆలోచన అనవచ్చును. ఉదాహరణకు అది మామిడిపండు అని తెలియటం ఆలోచన. ఆ వస్తువుతో సంబంధం కోసం మనస్సులో కలిగే చలనాన్ని ఉద్వేగం అనవచ్చును. మామిడిపండు తినాలి అనిపించటం ఉద్వేగం. వస్తువుతో సంబంధం ఏర్పడినపుడు మనసులో కలిగే సంవేదనను అనుభూతి లేదా అనుభవం అనవచ్చును. మామిడిపండు రుచి చూస్తున్నపుడు కలిగేది అనుభూతి లేదా అనుభవం. 

అయితే, అనుభూతి, అనుభవం ఒకటేనా అని అంటే, ఒకలానే కనిపిస్తాయి కానీ, కొంత సూక్ష్మమైన భేదం ఉన్నట్లు తోస్తుంది. అనుభూతిలో కొంత ఉద్వేగం పాలు కూడా ఉంటుంది. ఉద్వేగమూ, అనుభవమూ కలగలిసిన ఒకానొక చలనాన్ని అనుభూతి అనవచ్చును అనుకుంటాను. అనుభవంలో ఉద్వేగ సంబంధంలేని శుద్ధ సంవేదన మాత్రమే ఉంటుంది అనిపిస్తుంది. ఇస్మాయిల్ గారు ఏమన్నారని మళ్ళీ చదివి చూస్తే, ఆయన రెండిటినీ సమానంగానే చూసినట్లు కనిపించింది. అయితే పైన చెప్పిన సూక్ష్మ భేదం జోలికి పోనట్లయితే, అనుభూతి కవిత్వంగా స్థిరపడ్డ అభిప్రాయాన్ని కూడా కాదనలేము.  

3
ఇక ఒక కవితలో మూడు శక్తులూ ఉన్నట్లయితే, కవిత్వాన్ని ఆలోచనాత్మక, ఉద్వేగపూరిత, అనుభూతి కవిత్వాలని మూడు పాయలుగా చూడటం ఎలా కుదురుతుంది అన్నపుడు, దాని జవాబు తేలికగానే తడుతుంది. 

ఒక బలమైన లేదా సాంద్రమైన కవితలో మూడు శక్తులూ ఉన్నప్పటికీ, ఆ శక్తుల ప్రాధాన్యతను బట్టి, శాతాన్ని బట్టి వాటిని ఆలోచన, ఉద్వేగ, అనుభూతి కవితలుగా మనం గుర్తించవచ్చును. 

గురజాడ రాసిన 'మంచి, చెడ్డలు ఎంచి చూడగ రెండె కులముల లోకమందున, మంచి యన్నది మాల యైతే మాల నేనౌతాను' అన్న వాక్యాలు గానీ, బసవరాజు అప్పారావు రాసిన ' ప్రేమించు సుఖముకై, ప్రేమించు ముక్తికై, ప్రేమించు ప్రేమకై, ఏమింక వలయురా ' అన్న వాక్యాలు గానీ, ఆలోచన ప్రధానమైన కవిత్వంగా మనకి తోస్తాయి. 

టాగోర్  ' నక్షత్రాలన్నింటితో ఆకాశము, అంతులేని ఐశ్వర్యాలతో ప్రపంచమూ అన్నీ నాకు ఉన్నా నేనింకా కావాలని అడుగుతాను, కానీ ఈ ప్రపంచంలో మరీ మూల కాస్త చోటుంటే చాలు, ఆమె  నాదైతే ' అన్నపుడు మనకి ఒక కవి శుద్ధ ఉద్వేగంతో చలించటం కనిపిస్తుంది. 
ఎంకెవ్వరని లోకమెపుడైన అడిగితే, వెలుగునీడల వైపు వేలు చూపింతు అన్న నండూరి మాటలు కూడా నిండైన ఉద్వేగం నుండి ఉబికి వచ్చినట్లు కనిపిస్తాయి.

ఇక ఇస్మాయిల్ గారు రాసిన ' తరుచాపము వీడి దివిని గురి మరచిన బాణంలా తిరుగాడును పిట్ట ' అన్న వాక్యాలు కానీ, ' అంతా తెల్లకాగితం, ఒక మూలన నిలువుగా ఒక గీత, అడ్డంగా ఒకటి. తెరచాప ఎత్తిన పడవ. కిందిది నదీ, పైది ఆకాశమూ కావచ్చును ' అన్న వాక్యాలు కానీ చదివినపుడు, ఆలోచన, అనుభూతీ చెరిగిపోయి, కవి అనుభవించిన శుద్ధ ఇంద్రియానుభవం మనకి బదిలీ అవుతుంది.  

4
కవిత్వం ఏదైనా, కవి తనని వ్యక్తీకరించుకోవటానికీ, తనకి ఒక ఔట్ లెట్ గానూ భావించి, బలమైన వత్తిడి నుండి రాసినపుడు సాంద్రమైన అభివ్యక్తులు ప్రకటమవుతాయి.  అయితే ఈ ప్రకటమయ్యే క్రమంలో కవి తన పాఠకునికి ఇవ్వదలచిన అనుభవంలో స్పష్టత ఉన్నపుడు ఆయా కవులు బలమైన ఆలోచననో, ఉద్వేగాన్నో, అనుభవాన్నో ఇవ్వగలుగుతారు. 

వీటిలో ఆలోచనాత్మక కవిత్వం ఆలోచనల విస్తృతి పెంచితే, ఉద్వేగ కవిత్వం పాఠకుని ఉద్వేగాలను బలమైనవిగా తయారు చేస్తుంది. అనుభవ కవిత్వం వీటికి భిన్నంగా మనిషిని ఆలోచనల నుండీ, ఉద్వేగాల నుండీ ఉపశమింపచేసి, తన నిజమైన, సాత్వికమైన అస్తిత్వంలోకి మేలుకోలుపుతుంది. దేని ప్రయోజనం దానికి ఉంటూనే, మూడు పాయలూ కూడా చైతన్య పరిధిని విస్తరింప చేసేవి గా, పరస్పర పూరకాలుగా కూడా ఉంటాయి. 

మనం మన మానసిక స్థితిని బట్టి, అవగాహనని బట్టి, అవసరాన్ని బట్టి ఆయా కవిత్వాలని ప్రేమిస్తాము.

( మిత్రులు ముక్కామల చక్రధర్  ఏప్రిల్ 25, 26 తేదీలలో చిత్ఫలపాలెం లో నిర్వహించిన గోదావరి కోనసీమ సాహితీ సమాలోచన కోసం రాసుకున్న ప్రసంగ పాఠం. )

బివివి ప్రసాద్
22.4.26










14 ఏప్రిల్ 2026

ఒక దృక్పథం నుండి ప్రేమ, స్నేహం, ఆకర్షణ:

ఒక దృక్పథం నుండి ప్రేమ, స్నేహం, ఆకర్షణ:

తానూ, నేనూ ఒకటే అనిపించటం ప్రేమ,
తానూ, నేనూ ఒకలాంటివాళ్ళం అనిపించటం స్నేహం,
తాను నాకు కావాలి అనిపించటం ఆకర్షణ

ప్రేమలో అహంకారాలు కరిగిపోయి, సన్నిధి మాత్రమే మిగులుతుంది. తాను నా సమీపంలో ఉంటే చాలనిపిస్తుంది. దూరంగా ఉన్నా తనతోనే ఉన్నట్లనిపిస్తుంది. 

స్నేహంలో అహంకారాలు వెలుగునీడల్లా దోబూచులాడతాయి. కొంత ప్రేమ వెలుతురు ప్రసరించినా, కొంత ఆకర్షణ ఉన్నా, తాము సములం అనిపిస్తుందే గానీ, తానే నేను అనిపించకపోవచ్చు.

ఆకర్షణ (మోహం, ముదిరితే కామం) లో అహంకారాలు బలపడతాయి. తాను నాకే దక్కాలి అనిపిస్తుంది. దక్కకపోతే తనని నశింపచేయాలని కూడా. నాకు పూర్తిగా లొంగి, నా మనో, దేహాలకి కావలసిన అనుభవాలు ఇస్తూ ఉండాలి అనిపిస్తుంది.

ప్రేమలో కొంత స్నేహం, కొంత ఆకర్షణ ఉంటాయి.
స్నేహంలో కొంత ప్రేమ, కొంత ఆకర్షణ ఉంటాయి. 
ఉత్త ఆకర్షణలో ప్రేమ, స్నేహం ఉన్నట్లు కనిపిస్తాయి కానీ ఉండవు. ఉండలేవు. 

బివివి ప్రసాద్

09 ఏప్రిల్ 2026

కవిత : ఒకమాట

ఒకమాట నువు మాట్లాడలేవు
దూరాలని, కాలాలని, భారాలని 
చెరపగల ఒకమాట 
హృదయం నుండి బయలుదేరి 
ఎందుకనో ఆగిపోతుంది శబ్దంగా మారకుండా,
చేరవలసిన చెవిని చేరకుండా

దూరాలు పెరుగుతాయి,
కాలాలు మారుతూ వెళతాయి,
భారాలు మిగులుతాయి

సమయానికి ఆ ఒక్కమాట మాత్రం
ఎందుకనో పక్షిలా ఎగరదు,
పూవులా వికసించదు, 
ఉదయకాంతిలా ఆకాశాన్ని తెరవదు

ఎవరు ఆపారు ఆ మాట రాకుండా
ఏ ప్రేమ లోతులు, ఏ దుఃఖపు రాగాలు,
జన్మమూలాల్లోని ఏ జీవన ధాతువులు,
ఏ అనుభవాలకై ఎదురుచూపులు

ఆ మాట నీ నోట పలికించకుండా ఆపుతాయి,
ఆ క్షణాన చూపులకి రెప్పల తెరలు వాలుస్తాయి,
నీ విలువైన వ్యక్తికీ, నీకూ నడుమ
మంచుద్వీపాలు కలలాగా తేలుతాయి,
కాలం గాలి తాకని ఆకులా నిలబడిపోతుంది,
ఆ మాట ఎందుకు గడ్డకట్టుకు ఉండిపోతుంది

బివివి ప్రసాద్