07 జూన్ 2015

పాత పసిడి ~ సాక్షి



బివివి ప్రసాద్ హైకూలు డౌన్లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://www.newaavakaaya.com/Short-Stories-Poetry-Essays/ebooks-bvvprasad-haiku.html

ఆన్ లైన్ లో చదవటానికి ఇక్కడ క్లిక్ చేయండి
http://bvvprasad.blogspot.in/2014/08/blog-post_9.html

06 జూన్ 2015

అసమాన్వి

ఆమె నాకు కవిత్వం
రాయిలాంటి జీవితంలో కోమలత్వం చూపుతోన్న శిల్పం
 
దయనీ, సౌకుమార్యాన్నీ, పసిదనపు ఆశ్చర్యాలనీ వెదజల్లే రసమయలోకం
ఉదయాస్తమయాకాశాల్లో  సూర్యుడు వెదజల్లే ఊహల్లోపలి ప్రపంచం
వెన్నెల కాయటం, రుతువులు మారటం, కాలం మృదువుగా కరిగిపోవటం

ఆమెని దర్శించాను పలుమార్లు
పూలు దయగా పూయటంలో, వికసించటంలో,
రేపటి పూలకి దయగా చోటువిడవటంలో

ఆమె ఆకాశమనీ, నేను దానిలో రాత్రిభాగాన్ననీ
ఎప్పటికైనా నేనూ ఆమెవలే పూర్ణవలయం కావాలనీ
సంతృప్తిలోకీ, క్షమలోకీ, సంతోషంలోకీ మేలుకోవాలనీ

ఎప్పటికైనా ఆమె మాత్రమే
ఆమెతో నిండిన మానవులు మాత్రమే లోకాన్ని నడిపించాలనీ
బలప్రదర్శనలతో విసిగివున్న ప్రపంచాన్ని
ఆమెలాంటి ప్రేమతో నింపాలనీ కలగంటాను
. . .
ఈ కవిత్వం రాస్తున్నది ఎవరు
నా లోపలి ఆమె మాత్రమే కదా..

3.3.2013 మధ్యాహ్నం 12.23

05 జూన్ 2015

పిలుపు

ఎప్పుడైనా, ఏ పనిలోనున్నా
అంతకన్నా అపురూపమైనదొకటి నీలోంచి నిన్ను పిలుస్తూవుంటుంది

పూలరేకులకన్నా సుతారమైన శూన్యమొకటి
సీతాకోకపై ఊగే రంగులకన్నా కోమలమైన ఖాళీ మెలకువ ఒకటి
తల్లికి పసిపాప నవ్వు స్మృతిలో నిలిచినట్టు నీలోపలి నేపధ్యమై చలిస్తూవుంటుంది

ఆకలితో కనలే కళ్ళలోని, స్పర్శలోని దైన్యంకన్నా మృదువుగా
నీలోపలి దయాగుణాన్ని తడుముతూ వుంటుంది

ఎప్పుడైనా, ఏ పనిలో వున్నా
లోలోపలి నిర్మలమైన లోకం ఒకటి
ఆట చాలించి రమ్మని గుమ్మంలోని తల్లిలా
దయగా, విసుగన్నది లేకుండా ప్రతిక్షణమూ నిన్ను తలుస్తూవుంటుంది

2.3.2015

04 జూన్ 2015

ఒంటరితనంలోకి..

అందరూ ఉన్నట్లే వుంటుంది, అకస్మాత్తుగా ఒంటరితనం పరుచుకొంటుంది
డాబామీది పావురాయి రెక్కల్నీ, కువకువల్నీ, నీడనీ వెంటపెట్టుకొని ఎగిరిపోతుంది
పావురాయి ప్రపంచం ఖాళీ అయినచోట శూన్యం సుడితిరుగుతూ తనలోనికి లాగేస్తుంది
లోకం ఎప్పట్లా మరోసారి దు:ఖమయమై కనిపిస్తుంది

నీతో ఏంపని చెట్లకీ, పిట్టలకీ, వాటిపై అలుపెరుగక ఎగిరే ఆకాశానికీ,
మనుషుల నీడలకీ, గోడలకీ, తలక్రిందుల తెలివికీ అనిపిస్తుంది

శుభ్రమైన శ్వాసలా బ్రతకాలని తలుస్తూనే 
కాలంకాని కాలంలోకి తొందరపడి జారిపడిన
పురా స్వప్నస్మృతి ఒకటి, దు:ఖపువాగులో గులకరాయై మెరుస్తుంది

ఇక్కడందరూ వున్నట్లుంటుంది, వెచ్చగా కప్పినట్లుంటుంది
ఎవరిలోనికి తేమచూపును పంపినా, 
వేసవిగాడ్పు వినా, పచ్చని ఆకైనా ఎగిరిన జాడలుండవు
. . .
దట్టమైన పొగమంచులా కమ్ముకొంటోంది ఒంటరితనం
అగాధమైన నిశ్శబ్దంలోకి అన్వేషణ తెరచాపయెత్తి ఎలా ప్రయాణించాలో
ఇప్పుడెవరు చెబుతారు..

21.8.2012

03 జూన్ 2015

సంకేతాలు

గర్భంలో ప్రశ్నార్ధకంలా జీవం నింపుకొంటాము
భూగోళం బిందువుపై ఆశ్చర్యార్ధకమై జీవిస్తాము
జవాబునిచ్చే వాక్యంలా మేనువాల్చి మరణిస్తాము

ప్రశ్న జీవం నింపుతుంది
ఆశ్చర్యం జీవింపచేస్తుంది
జవాబు మృత్యువవుతుంది

మృత్యువంటే ఏమిటనే ప్రశ్న
జవాబు తరువాత మిగిలే ఖాళీకాగితంలా
ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంది

13.04.2013

02 జూన్ 2015

పేర్లు

అందమైన దృశ్యమొకటి మేకుకి తగిలించినట్టు
కవిత రాసాక ఒక పేరుకి తగిలించటం అలవాటు

పేర్లెపుడూ ఎందుకో ఆకర్షించవు
తరచూ చూసే మనిషైనా పేరు గుర్తురాక
లోపలి మైదానంలో తడుముకొంటూ తిరుగుతుంటావు

జీవించటంకన్నా, పేరు తెచ్చుకోవటం ముఖ్యం గనుక  
పేర్లని గుర్తుంచుకొనే ప్రపంచంలో నువ్వొక వింతమనిషివి
ఒక మనిషి ఎలా నవ్వుతాడో, స్పందిస్తాడో గుర్తున్నట్టు అతని పేరు గుర్తుండదు

మనిషినొక పేరుగా, జాతిగా, జెండాగా గుర్తుంచుకొనే రోజుల్లో నిలబడి
ప్రతి మనిషీ తనదైన వెలుగునీడల చిత్రమనీ
భూమ్మీద అతనిలాంటి అద్భుతం అతనేననీ అనాలనిపిస్తుంది

ఫలమెంత రసవంతమని కాక, ఎలా కనిపిస్తుందో ముఖ్యమనే కాలంలో
పేర్లూ, శబ్దాలూ విడిచి జీవితం లోలోపలికి దూకి చూడమనీ,
సముద్రమంత ప్రేమ నీకోసం ఎదురుచూస్తుందనీ చెప్పాలనిపిస్తుంది

01 జూన్ 2015

ఒక కలయిక

గది బయటి అలికిడి ఎవరినో నీలో ప్రవేశపెడుతుంది
తలుపులు తెరిచి ఒక జీవితాన్ని ఆహ్వానిస్తావు
ఒక మనిషి, ఆయనతో కొంత కాంతి, కొన్ని రంగులూ, నీడలూ
ఆయనలో కొన్ని శబ్దాలు, వాటిలోపల అగాధమైన నిశ్శబ్దం

ఒకరినొకరు చూస్తారు
రెండు మూలాల నుండి, అనంతయాత్రల నుండి,
రెండు దహనక్రియల నుండి,
పూవులా వికసించే, ముకుళించే చూపులతో ఒకరినొకరు తాకుతారు

మాటలేవో చెబుతాయి, మౌనమేదో వింటుంది, అలలు ఉపశమిస్తాయి
ముసురుకొనే నిశ్శబ్దంలో దేనికోసమో వెదుక్కొంటూ చూపులు విడివడతాయి

రెండు పాలపుంతలు కలిసినట్టు రెండు జీవితాలు కలుస్తాయి
మరొక కృష్ణబిలంలాంటి వియోగం ప్రాప్తిస్తుంది
ఇదంతా ఏమిటని మరొకసారి ఆశ్చర్యపోతారు ఎవరో..

5.12.2014