21 ఆగస్టు 2020

కవిత : ఇట్టి ప్రేమలు

ఎవరెవరినో ప్రేమిస్తావు

ఎవరెవరినో మోహిస్తావు

కనీసం కామిస్తావు

కారునల్లని మేఘమై కౌగలిస్తావు


నిజానికి ఎదుట ఉన్నది ఎవరో

నీకూ తెలియదు, వారికే తెలియనట్లే


తొలిసారి నీకు నువ్వు

దేహంగా తెలిసావు చూశావా

అప్పుడు విప్పుకొంది ఒక దుఃఖపు వానతెర

కాలం ఇన్నాళ్లుగా తడుపుతోంది నిన్ను


పూవులా కనులు విప్పి లోకాన్ని కన్నవాడివి

మొక్కలా, చెట్టులా ఎదిగి

చివరికి శిలాజంలా మిగులుతావు


ప్రేమలూ, మోహాలూ, వాంఛలూ

నీపై కుదురులేకుండా రంగుల్ని చల్లి వెళ్ళాక

చలించని రాయివై కూర్చుంటావు


ఏమీ ఫరవాలేదు

రాతిపై తేలుతున్న ఆకాశమే

రాయి లోపల కూడా తేలుతుందని

ఊరికే తెలిస్తే చాలు


ఆకాశమే ఆకాశాన్ని

ప్రేమించిందని, మోహించిందని, కామించిందని

కనుగొంటే చాలు


ఊహ ముగిసినట్టు

కల ముగిసినట్టు

కథ కూడా ముగుస్తుంది

కవిత : ఆ!