20 డిసెంబర్ 2022

కవిత : నువు

నువు


ఊహలాంటి మనిషివి నువ్వు
ఎప్పుడు, ఎందుకు వస్తావో తెలీదు
ఎలా మాయమౌతావో తెలీదు

జీవితంలాంటి మనిషివి
వస్తే ఎందుకు నిండి పోతానో
వెళితే ఎందుకు ఖాళీ అవుతానో తెలీదు

ఉదయంలాగా వచ్చి రాత్రిలా వెళ్ళిపోతావు
వెలుతురులాగా నిండి
చీకటిలా ఖాళీ చేస్తావు

నిన్ను వెదకటానికి పుట్టానా, పుట్టి వెదికానా
నిన్ను కలగని దిగులు పడ్డానా,
దిగులుపడి కలగన్నానా
కనుగొని ఊరట పొందానా
ఊరటపొంది కనుగొన్నానా

నా నుండి విడివడి నువ్వు నువ్వయావా
నీతో నిండి నేను నేనయానా

ఊరికే రావా జీవితంలోకి
సీతాకోకలా, ఉదయపు నీరెండలా,
నక్షత్రాల కాంతిలా, ఉత్తప్రేమలా

వచ్చి, వెళ్ళవా నాలోకి
వానగాలిలా, పసినవ్వులా

తీసుకుపోవా ఊరికే నీ లోకానికి
ఉత్తక్షమలా, దయలా, చివరికన్నీటిలా

అవేమీ కాదు గానీ
ఊరికే నన్ను చెరిపేసి,
నేను నువ్వుగా వెలగవా…
ఊరికే మిగలవా…


ప్రచురణ : ఈమాట, డిసెంబర్ 2022

కవిత : సున్నితమైన



ప్రచురణ : ఆంధ్రజ్యోతి వివిధ 21.11.2022