15 జనవరి 2024

గాలి తెరల్లోంచి

1
గడ్డిపరక 
గడ్డిపరకలానే నటిస్తుంది చూడు
నక్షత్రం 
నక్షత్రంలా నటించినట్టు
నువు
నీలా నటించడానికి ఏం నొప్పి

2
ఇదంతా 
నువు అనుకునేంత అందమైంది కాదు
అనుకునేంత భయావహం కానట్టే
ఊరికే ఉండు
కాలువలో నిశ్శబ్దంగా పారే నీటిలా

3
బతకాలని చూడకు
పోవాలని కూడా
ఉండటమే చాలు
అంతకన్నా నీ నుండి 
ఈ గాలి కోరేదేమీ లేదనుకుంటాను

4
మనుషుల్నీ
వాళ్ళ భయాల్నీ , ధైర్యాల్నీ  
ప్రేమించు తేలికగా, లేదా పట్టించుకోకు
చిన్నపుడు ఆడి వదిలేసిన బొమ్మలకి
ఏమంత విలువ నివ్వకు 

5
ఈ రాత్రి చూడు 
ఎంత నల్లగా ఉందో
పగటి తెల్లగా కంటే చిక్కగా, చల్లగా
దీని గర్భం లోనైనా 
నువ్వు నువ్వుగా దొరుకుతావా, చూడు

6
ప్రేమించడానికి వచ్చావు
మరే పనికిరాని పనీ పెట్టుకోకు
ఆనందంగానో, గాయపడో
చాతనైనట్టు పాడి, వెళ్ళిపో
పిట్టల్ని చూడు,
వాటి కన్నా జ్ఞానివి కాలేవు

7
ఇదంతా ప్రేమాస్పదం
ఇదంతా నువ్వే గనక
ఇదీ, నువ్వూ కల గనక
పోయేవాటిని ప్రేమించాలి గనక
ఇక వెళ్ళనా, మరి.. 
రచనాకాలం : 21.7.2023 11.18 రాత్రి

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి