15 జనవరి 2024
నిరామయ విరామం : డాక్టర్ కాళ్లకూరి శైలజ
ఉన్నట్టుండి తేనె పట్టు తన గదుల తలుపులు తానే తెరిచినట్టు,ఒక లోకం నుంచి మరో లోకానికి వెళ్లిపోతూ శాంతి దేవత అకారణంగా మనవైపు చూసి దయతో నవ్వినట్టు, ఉంటాయి బి.వి.వి. ప్రసాద్ గారి కవిత్వ వాక్యాలు.
వేదాంతం అంటే జీవిత అంత్యస్థితి లో చదువుకునే నాలుగు పడికట్టు రాళ్ల లాంటి పదాలతో మోగే సూత్రావళి కాదు.
ఏ ఏటికా ఏడు, మనసుని తేటపరుచుకుని, జీవితాన్ని మళ్లీమళ్లీ శుభ్రపరచుకునే ఒక ప్రవాహం.
బి.వి.వి. గారి కవిత్వ పుస్తకాలలో/ అలా సాగే దారి...../ ఆ దారిలోని కొత్త పూల చెట్లు..../ వాటి నీడల్లో రాలి పడిన పూలను ఏరుకొచ్చి మెల్లగా వేళ్ళతో అల్లే మాలలూ ఉంటాయి./ సంకల్పం కొరబడినది కాదు సుమా! / సత్సంకల్ప భారం మోస్తున్నదీ కాదు./మరెలా ఉంటాయి?
"వెన్న కరిగి నేయి అయినట్లు, అంధకారం కరిగి కాంతి అయినట్లు” అలా ఉంటాయి.
స్నేహంగా భుజం మీద చేయి వేసి, కళ్ళలో కళ్ళు కలిపి, పాత పాటలో చరణాలు పాడి, చేతులూపుతూ ఆడించే... చిన్ననాటి నేస్తం మాట్లాడినట్టు ఉంటాయి.
“మనం ఒకప్పుడు ఆడిన/ఇసుక తిన్నెల్లో ఇవాళ్ళ ఈ పిల్లలు ఆడుతున్నారు....../ ప్రతిదీ ఉండటం ఎంత బావుందో/ వెళ్ళిపోవటమంత బావుంది./ మనమిక వెళదామా,/ వచ్చినంత సంతోషంగా, నిశ్శబ్దంగా” అంటే, వింటూ ముగ్ధులై నిలబడిపోతాం. ఎక్కడా విరామ చిహ్నాలు అక్కర్లేదు. ప్రశ్నలు బహు తక్కువ.
వేరేవరో అన్న మాటల్ని ఉటంకించడం అస్సలు లేదు,
"కలలో అమ్మ లేక ఏడుస్తున్న ఒడిలోని బిడ్డని, తల్లి తట్టి లేపినట్టు, నిన్నెవరో ఇప్పుడు జీవితంలోకి తట్టి లేపాలి.”
ఈ వాక్యాల దగ్గర బెంగటిల్లి, అంతలోనే బెంగ తీరి, ఎన్ని రోజులు ఆగిపోవాలి! ఎన్ని గంటలు, నిశ్శబ్దంగా ఏ రుచీ లేని మదీ (నదీ) జలాలను కళ్ళు వర్షిస్తాయో! అది అనుభవైకవేద్యమే తప్ప చెప్పేది కాదు.
"పదాలన్నీ ఉత్త శబ్దాలు/ శబ్దాలన్నీ నిశ్శబ్దం పై తేలే అలలు”
"ఆకాశం నుంచి ఆకాశాన్ని తీసివేసినా, ఆకాశమే మిగిలినట్లు,/ నీ నుండి నిన్ను మాటల్లోకి ఒంపినా/ నువ్వు నువ్వుగానే మిగులుతావు”.
పై వాక్యాలను కనీసం ఐదారుగురు సీనియర్ సిటిజన్లకు ఈ అమృత గుళికలు పంపాను. వారంతా కొత్త ఆరోగ్యంతో చిక్కగా నవ్వుతూ, ఆ మెత్తటి సవ్వడిని నా చెవిలో పోసారు.
వాళ్ళకి జీవిత చరమాంకంలో పెన్షన్ సౌకర్యం కన్న ఇలాంటి సహృదయ స్పందనల గీతికలే మరీ మరీ వినిపించాల్సి ఉంది.
"ఆకాశంనుండి అకస్మాత్తుగా చినుకు రాలినట్టు/ కొమ్మనుండి నెమ్మదిగా పూవు రాలినట్టు/దిగుల్లోంచి తటాలున నవ్వు రాలినట్టు నవ్వుల్లోంచి నిశ్శబ్దంగా కన్నీరు రాలినట్టు/ ఉన్నట్టుండి నువ్వు వెళ్ళిపోతే ఏమౌతుంది/ నీ చోటు ఖాళీ చేస్తే ఏమౌతుంది/ నువు చలించటం మానేస్తే ఏమౌతుంది/ వెచ్చని స్పందనని ఏదో చల్లదనం కమ్మితే ఏమౌతుంది”
మనిషికి మరణం అంటే భయం అని చెబితే నేను నమ్మను. / చాలాసార్లు అది విడుదల./ ఒకోసారి ఐచ్ఛికంగా కోరుకునే హాయి. / ఏదేమైనా సంతృప్తితో కొందరు,/ తప్పదని –తప్పించుకోలేమని తెలుసుకున్నాక మెల్లగా సంసిద్ధమయే ఒకానొక దశ వస్తుంది./ అలాకాక ఆందోళన చెందేవారికి పై ప్రశ్నలు తెరతీసి నిజాన్ని చూపిస్తాయి./ ఎలా?/ ఉన్నట్టుండి వెళ్ళిపోయినచోట/ జీవితం నెమ్మదిగా కొత్త చిగుర్లు తొడుగుతుంది./ మొక్క కొత్త తొడిమెలని కలగంటుంది. / చీకటిలో దాగిన ముఖాలని/ తెలియెండ వెదికి మరీ ముద్దాడుతుంది/ ఉన్నట్టుండి నువు విడిచివెళ్ళిన లోతైన ఖాళీని/ జీవితం దయగా మరింత సారంతో నింపుతుంది”
ఈ మాటలు మది నెమ్మదిని అందించి, అలసిన మనసుకు కొబ్బరినీళ్లు ఇచ్చినట్టు, దాహం తీర్చి, బలాన్ని ఇస్తాయి.
ఋతువు మారి,కొత్త సంవత్సరపు లోగిలి లో నిలబడ్డప్పుడు, వెనక్కి, ముందుకీ చూడకుండా, లోపలికి, లోలోపలికి చూసుకునే ఒక 'స్థితి' తాలూకు ఉనికిని తెలియజేసే అద్భుతమైన పుస్తకం.
ఊరికే జీవితమై పుస్తకం పై సమీక్ష
ప్రచురణ : కవిసంధ్య , జూలై-ఆగస్టు, 2023
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి