హైకూ చదవడానికి కూడా ఓ అభ్యాసం కావాలి. ఒక హైకుతో సంచలించిన నీ మనస్సును మరో హైకూను తాకే ముందు నిశ్చల సరోవరంలా మార్చుకోవాలి. కదులుతున్న నీళ్ళలో మరో ప్రతిబింబం ఉదయించదు. ఒక అనుభవంతో చలించిన అలలు క్రమంగా నెమ్మదించి నెమ్మదించి అద్దంగా స్థిరపడిన స్థితిలోనే మరో అనుభవాన్ని స్వీకరించడం సాధ్యమవుతుంది.
హైకూ కవి ఒక అనుభూతిని పంచుతాడు. హైకూ పాఠకుడు దాన్ని స్వీకరిస్తాడు. అచ్చమైన హైకూ విషయంలో అదే జరుగుతుంది. రాయడమూ, చదవడమూ ఉండవు. పంచుకోవడం, తీసుకోవడమే ఉంటాయి. ఇంద్రియగతమైన అనుభవాన్ని మరో హృదయానికి కానుకగా ఇచ్చేందుకు హైకూ కవి తనకు ఆ అనుభవాన్ని ప్రసాదించిన దృశ్యాన్ని మాత్రమే మాటల్లో చూపిస్తాడు ఏ అలంకారాలూ, ఊహలూ, గమ్మత్తులూ లేకుండా. అవే మాటల నుంచి అదే దృశ్యాన్ని స్వీకరిస్తాడు పాఠకుడు. అయితే, ఆ దృశ్యం నుంచి విచ్చుకునే అనుభవం మరింత ఉజ్వలంగా, ఉద్విగ్నంగా ఉండవచ్చు. విభిన్నంగానూ ఉండవచ్చు. ప్రకృతిలోని ఒకే దృశ్యాన్ని చూసినప్పుడు ఒక్కొక్కరూ ఒక్కోలా అనుభూతి చెందడం లాంటిదే హైకూను తీసుకోవడం అంటే. ఎవరి హృదయాన్ని బట్టి వారి ప్రయాణం ఉంటుంది. ఈ ప్రయాణం సాగుతున్న కొద్దీ హృదయ మాలిన్యం తొలగిపోతుంది. మార్దవం పెరిగిపోతుంది. ఇంద్రియాలు సునిశితమవుతాయి. చుట్టూ ఉన్న ప్రపంచంతో, ప్రకృతితో సాన్నిహిత్యం పెరుగుతున్న స్థితి సహజమైన మానవీయత వైపు నడిపిస్తుంది. కళలు, ముఖ్యంగా కవిత్వ ఉత్కృష్ట పరమార్థాలలో అదొకటి. సత్యాన్ని తెలుసుకోవడం కాదు, సత్యంలో కలిసిపోవడమే ధ్యానం పరమార్థం అంటుంది జెన్ బౌద్ధం. ఆ ధ్యానానికి దారులు తెరిచే దీపమే హైకూ. జెన్ తాత్వికతకు కవిత్వ ప్రక్రియగా హైకును నిలబెట్టిన మత్సువో బషో, "ప్రకృతితో మమేకమైన మనసుకు కనిపించే ప్రతిదీ పుష్పమే. దానికి వచ్చే ప్రతి కలా వెన్నెలే" అంటాడు.
గత రెండు రాత్రులుగా బివివి ప్రసాద్ హైకూలు చదువుతుంటే కప్ప దుమికిన సరస్సులా కదిలిపోయాను. ఆపై నిశ్చలించాను మరో సంచలనం కోసం. శబ్దం నుంచి నిశ్శబ్దానికి, నిశ్శబ్దం నుంచి శబ్దానికి ప్రయాణం అంతా నిశ్శబ్దంగానే సాగిపోయింది. ఒక కవి రాసిన అన్ని హైకులూ ఈ ఉత్కృష్ట స్థితికి తీసుకుపోలేకపోవచ్చు. ఇంద్రియానుభూతిని భాషలో వెలిగించడంలోని పరిమితులు, నిర్మాణ వైఫల్యాలు ఉండనే ఉంటాయి. ఆ వైఫల్యాలను దాటుకుంటూ పోతున్నప్పుడే వెన్నెలను కలగనే కొన్ని పుష్పాలు హైకూ కవిని వరిస్తాయి.
అయితే, వాటిని తీసుకోవడంలో ఒక్కోసారి చదువరి కూడా విఫలం కావచ్చు. ఒకసారి చదివినప్పుడు తగలని అనుభూతి మరోసారి చదివినిప్పుడు మనల్ని ఉక్కిరిబిక్కిరి చేయవచ్చు. ఏమైనా, హైకూలు రాసే కవి కాలక్రమంలో తాను రాసిన వాటిలో ఎన్నింటినో వదులుకుంటాడు. వాసిగలవేనని నమ్మిన వాటినే రాసులు పోసి పారబోసుకున్నవారెందరో. మూడు వేల హైకూలు రాసి చివరికి మూడింటినే దాచుకుని మిగిలిన వాటిని తగలబెట్టేశాడు Teishitsu' అనే జపనీ కవి. హైకూ కవిగా జీవించడం తెలుస్తున్న కొద్దీ ఈ పరిత్యాగం పెరిగిపోతుంది. ఆ సంగతి బివివి ప్రసాద్కు బాగా తెలుసు. అందుకే అంటాడు: 'హైకూ రాయడం సులువే. మంచి హైకూ రాయడం మరీ సులువు. హైకూ కవిగా జీవించడమే కష్టం.' 'Aesthetic of austerity అనే చైనా, జపాన్ బౌద్ధ భిక్షువుల కవిత్వాభివ్యక్తికి పరాకాష్ఠగా హైకూ ఒక ప్రక్రియగా స్థిరపడింది. కవికీ, అనుభవానికీ మధ్య వెంట్రుకవాసి అంతరం ఉండడానికి కూడా వీల్లేదంటాడు బషో. ఓ కొండ మీద గుడి ఉంటే అక్కడికి వెళ్తాడు బషో ఓసారి. అక్కడ నాచును కప్పుకున్న పెద్ద పెద్ద బండరాళ్ళను చూస్తాడు. అది చూసి ఇలా అంటాడు : ఆహా... ఏమి నిశ్శబ్దం కీచురాళ్ళ గోల కూడా రాళ్ళల్లోకి ఇంకిపోతోంది బషో రాసిన "Narrow Road to the Deep North" అనే యాత్రా రచనలోనిదీ హైకూ. ఆయన కాలంలో వాటిని హైకూ అనే మాట లేదు. బషో వాటిని హెుక్కు అని పిలిచేవారు. 'ప్రయాణమే ఇల్లు' అని చెప్పుకున్న బషో 'హైబన్' అనే మరో సాహిత్య ప్రక్రియకు కూడా ఆద్యుడే. హైబన్ అంటే హైకూ వచనమని అర్థం. ఆయన యాత్రా రచనలని హైబన్ సాహిత్యమని అంటారు. దీన్ని వచన కవిత్వమని కూడా చెప్పవచ్చు. ఐరోపాలో 'vers libre' పుట్టకముందే జపాన్లో ఈ ప్రక్రియ మొదలైంది. హైబన్ రచన సాధారణంగా ఒక హైకూతో ముగుస్తుంది. గాఢమైన అనుభవాన్ని కలిగించిన ఒక దృశ్యాన్ని హైకూగా మలిచేటప్పుడు భాషను ఎంతో పరిమితంగా, క్రమశిక్షణతో వాడాల్సి ఉంటుంది. విభక్తులు, ప్రత్యయాలు వంటి వ్యాకరణ నిర్మాణాలను ప్రయత్నపూర్వకంగా పక్కన పెట్టి పదాలను నాటకీయత ధ్వనించేలా సరళంగా ఉపయోగించాలి. సౌందర్యాత్మక ఆసక్తిని వెలిగించగల కౌశలం మరీ ముఖ్యమని కూడా చెబుతారు హైకూ లాక్షణికులు. ధ్యానం నుంచి ధ్యానాన్ని ప్రేరేపించే ఈ కౌశలాన్ని తెలుగులో బలంగా పట్టుకున్న కవుల్లో నాకు తెలిసినంతవరకు ఇస్మాయిల్, గాలి నాసరరెడ్డి, బివివి ప్రసాద్ ముందువరసలో ఉంటారు.
దూరంగా దీపం
దానిని కాపాడుతూ
అంతులేని చీకటి
నిద్రపోయాను
చీకటిలో
చీకటి పడింది
యుగాలు ప్రయాణించి వచ్చింది
వెలుగు రేఖ
లేత ఆకును చుంబించడానికి
పాట బాగుంది
దూరం నుంచి వినిపించడం
ఇంకా బాగుంది
రెక్కలున్నాయి కదా
ఎగురు పిట్టా
నాకు రెండు కళ్ళున్నాయి.
ఓహ్ మిణుగురు
అటుచూడు
మరొకటి
పర్వతం
చుట్టూ తిరిగి
వేయి పర్వతాలు చూసాను
అటూ ఇటూ నడిచి
ఏమీ తోచక
పాప నిద్రలోకి నడిచింది.
చెట్టు కూలింది
మోసుకుపోయారు
నీడను సైతం
గోడలో పూచిన పూవు
పరిచయం చేసింది
మా గోడను
అందమైన పూవు
రాలిపోక ముందే
వెళ్ళిపోవాలి
గాఢమైన అనుభూతుల్లోకి పదచిత్రాలతో లాక్కుపోయే హైకూలు ఎన్నో ఉన్నాయి బివివి ప్రసాద్ 'హైకూలు' సంకలనంలో. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. గతంలో ఆయన ప్రచురించిన దృశ్యాదృశ్యం, హైకూ, పూలురాలాయి అనే హైకూ సంకలనాలన్నింటినీ కలిపి ఒకటిగా ఈ పుస్తకం తీసుకొచ్చారు ప్రసాద్. బషో హైకూల అనువాదాలు, హైకూ తత్వం అనే వ్యాసాన్ని కూడా ఇందులో చేర్చారు. 2015లో ఈ పుస్తకం రాకముందే ప్రసాద్ రాస్తూ వచ్చిన హైకూలను నేను చదువుతూనే ఉన్నాను. ఈ మధ్య వాబీ సాబీల గురించిన ప్రస్తావన ఎక్కడో ఎదురవడం ఈ సంకలనాన్ని మరోసారి చేతుల్లోకి తీసుకునేలా చేసింది. మంచి కవిత్వాన్ని కొంత కాలం తరువాత మళ్ళీ చదివితే ఆ అనుభవం ఎంత గొప్పగా ఉంటుందో ఇప్పుడు మరోసారి తెలిసింది. అలాగని, ఈ సంకలనంలోనివన్నీ గొప్ప హైకూలనేమీ చెప్పడం లేదు. ఇందులో చాలా గొప్ప హైకూలు ఉన్నాయని మాత్రం కచ్చితంగా చెబుతున్నాను. ఇందులో కొన్ని హైకూలు కాని గొప్ప కవితలున్నాయి.
కవులు
పెద్దయ్యాక పరిచయమయ్యే
బాల్యమిత్రులు
కలలో కనిపించిన
మిత్రుడు
నన్నూ కలగని ఉంటాడా
శిశిర సాయంత్రం
ఎవరో సమీపించి
నా ఏకాంతాన్ని తీసుకువెళ్ళారు
ఇలాంటివి కొన్ని మంచి కవిత్వంగా తీసుకోవచ్చేమో కానీ... హైకూలని అనాల్సిన పని లేదేమో అనిపిస్తుంది. సముద్రంలాగ, నది పన్నిన వలలో.. జాలి దానం చేసిన అనాథ బాలిక వంటివి పోలికలు, క్రియా పదాలు, విశేషణాలు, పనిగట్టుకుని చూపిన సామాజిక స్పృహలు... హైకూ గొడుగు కిందకు తేవడం న్యాయం కాదు. 'పదచిత్రం ఇంద్రియ జ్ఞానాన్ని ప్రేరేపిస్తుంది. లోతైన భావాల్ని ఆవాహన చేసే శక్తి పదచిత్రానికి ఉంది.
కవిత్వానుభవాల్ని పదచిత్రాలు స్ఫురింపచేసినట్లు, బౌద్ధికమైన ఆలోచనలు స్ఫురింపచెయ్యలేవు' అని ఇస్మాయిల్ చెప్పిన మాట హైకూ కవులకే, కాదు, కవులందరికీ వర్తిస్తుంది. ఇస్మాయిల్ గారు అన్నట్లు ప్రసాద్ కవిత్వంలో పూలకన్నా సీతాకోక చిలుకలే ఎక్కువ. వీటితోపాటు కీచురాళ్ళు, నిశ్శబ్దం, వెన్నెల వంటి జెన్ కవి సమయాల పునరుక్తుల నుంచి కూడా ప్రసాద్ విముక్తమై విస్తృతమైతే మరిన్ని గొప్ప హైకూలు రాయగలరు. మనకు తెలుగులో హైకూలు రాసేవాళ్ళే తక్కువ. వారిలోనూ హైకూ రచనను తన మార్గంగా ఎంచుకుని, హైకూ కవిగా జీవించే సాధనలో ఉన్న ప్రసాద్ నుంచే కదా మరిన్ని గొప్ప హైకూలను ఆశించాలి!
ద్రష్ట, దృశ్యమూ, అనుభూతీ ఏకత సాధించినప్పుడే కదా...
పూవూ లేదు
నేను లేను
సౌందర్యం ఆవరించింది
అనే గొప్ప హైకూ ప్రాణం పోసుకుంటుంది. తనను తాను వెతుక్కుంటూ, లోపలి ద్వారాలను తెరుచుకుంటూ ప్రయాణిస్తున్న ప్రసాద్ ను మరెన్నో హైకూ క్షణాలు కరుణిస్తాయని ఆశిద్దాం. వాటిని స్వీకరించే హృదయాలు మరెన్నో పురుడు పోసుకోవాలని కోరుకుందాం.
రచయిత : పసునూరు శ్రీధర్ బాబు
ప్రచురణ : కవిత 78 వ సంచిక
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి