కొలతలకి లొంగకు, లెక్కల నుండి ఎగిరిపో
లొంగనట్టు కనబడటానికి కూడా..
అప్పుడు మేలుకొంటావు
నిశ్శబ్ద, రహస్య, ప్రశాంత తటాకం ఒడ్డున
సీతాకోకలు
నిన్ను పట్టించుకోకుండా ఎగురుతుంటాయి
పిట్టల పాటలు దూరాలకి పిలుస్తుంటాయి
తటాకంలోని నీటి తడి
జన్మల మాతృప్రేమలా తాకుతుంది
ఇక నిన్ను పూర్తిగా మాయం చేయగల
ప్రియురాలి కోసం ఎదురు చూస్తుంటావు
2
కలలు కంటే తప్పేమిటి
లోకం కల అయినప్పుడు
ఆదర్శాలూ, విజయాలూ, విరామాలూ
కళ్ళ ముందు కరిగిపోతున్నపుడు
కలలు రాలిపోతే గాయాలెందుకు
ఒక సూర్యోదయం
నువు లేని రోజున కూడా జరగబోతున్నపుడు
గాలి వీయబోతున్నపుడు
మనుషులు ఎప్పటిలానే ఈదబోతున్నపుడు
3
ఇదంతా బావుంది, బావోలేదు కూడా
ఇదంతా ఉన్నట్టుంది, లేదేమో కూడా
కొంచెం తడిగా ఉండటం తప్ప
ఇక్కడ వేరేదీ చేయదగింది లేనట్టుంది
బహుశా, అతను ఉన్నాడు
ఇంత ప్రపంచం అతనికి
రాలుతున్న ఎండుటాకు పాటి కాకపోవచ్చు
అప్పుడు నీ బరువుకి అర్థమేమిటి
బహుశా, అతనే నీలా ఉన్నాడు
ఇప్పుడు నువు
చేయవలసింది ఏమైనా మిగిలి ఉందా ఇక్కడ
24.9.24 11.00 రాత్రి
ప్రచురణ : కవితా ఫిబ్రవరి 2025
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి