27 జులై 2012

మౌలిక ప్రపంచం గురించి మొదటి కవిత్వం - ఆకాశం. డాక్టర్ రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు

ఇదొక కొత్త కవితా సంపుటి. ఇదీ ఈ మధ్యనే అచ్చయిన కవితాసంపుటి అని కాదు. ఇంతకు ముందు వచ్చిన, ఇప్పుడొస్తున్న కవితాసంపుటుల కన్నా భిన్నమైనదని.
ఆకాశం ఆధ్యాత్మిక కవితాసంపుటి. నాకు తెలిసి తెలుగులో ఇంతవరకూ ఇటువంటి కవిత్వం ఇదే.   ఆధ్యాత్మికత వివరణ నపేక్షించే మాట. దాన్నీ, భక్తినీ అర్థభేదం లెకుండా వాడుతున్నారు కనక. భక్తి అనే ప్రపంచంలో నామరూపాత్మకుడైన ఒక దేవుడుంటాడు. ఆయనను మానవులు ఆశ్రయించడం ఉంటుంది. వాళ్ళ విధేయత, అర్పణ ఉంటాయి. ఒక గుడి ఉంటుంది. దేవుడి కథలుంటాయి. ఒక మతం ఉంటుంది. మతం అంటే పూజలు, వ్రతాలు, మంత్రాలు, కర్మకాండ కలిసి తయారైన ఒక వ్యవస్థ. అందులో పరలోకం ఉంటుంది. అది సాధారణంగా స్వర్గమై ఉంటుంది.


ఆధ్యాత్మికత వేరు. అందులో దేవుడుండడు. రూపం ఉండదు. ఆ స్థానంలో విశ్వచైతన్యం ఉంటుంది. నిర్మలత్వం, దయ, ప్రేమ, క్షమ, త్యాగం వంటి మాటలు వాటి మౌలికార్థాల్లో దేవుడి స్థానంలో ఉంటాయి. వాటిని ఆరాధించడం ఉండదు. ఆచరించే ప్రయత్నం ఉంటుంది. మోక్షం ఇక్కడ ఎవరూ ప్రసాదించే విషయం కాదు. ఎరుక ద్వారా, ఆచరణ ద్వారా మనిషి దాన్ని సాధించుకుంటాడు. స్వర్గం అంటూ వేరే ఏమీ ఉండదు. ఈ లోకాన్ని ఈ జీవితంలోనే ఎడంగా నిలిచి చూసే చోటు, స్థితి ఉంటుంది.
ఈ దృష్టితో  'ఆకాశం' ఒక ఆధ్యాత్మిక కవితా సంపుటి.

 
ఇక్కడ ఆకాశం మనం తలెత్తి చూస్తే కనిపించే నీలం రంగు జాగా కాదు. పైపైకి పోతే గ్రహ నక్షత్రాంతర స్థలంలో ఉండే నల్లటి ప్రదేశం కూడా కాదు. ఆకాశం అంటే చోటు. దేనిలో ఈ చెట్టూ, పిట్టా, మృగం, కొండ, సముద్రం.. సమస్త పదార్ధాలూ ఉంటున్నాయో అది. గ్రహాలు, గ్రహాలు కాకముందు, నక్షత్రాలు, గెలాక్సీలు కాకముందు వేరే పదార్ధంగా ఉంటాయి. ఇంకా వెనక్కి వెళితే ఒక ఆదిమ పదార్ధం ఉంటుంది. అదీ 'చోటు 'లోనె ఉంటుంది. ఈ 'మహా చోటు 'ని కవి ఆకాశం అంటున్నారు. సృష్టి మొత్తం అంతరిస్తే అదే మిగులుతుంది. కాబట్టి ఈ సమస్తం అందులోంచే వచ్చి ఉండాలి.


మనిషికి మూడు ప్రపంచాలున్నాయి. ద్వితీయ ప్రపంచం, ప్రాధమిక ప్రపంచం, మౌలిక ప్రపంచం. ద్వితీయ ప్రపంచం అంటే ఆర్ధిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, విద్యావ్యవస్థ, మతవ్యవస్థ ఇలాంటి వాటితో కూడిన ప్రపంచం. మనిషి ఇప్పుడు ఈ ప్రపంచంలోనే అత్యధికంగా జీవిస్తున్నాడు. దీన్ని సృష్టించుకున్నది మానవుడే కనక ఇతర జీవజాలానికి ఈ ప్రపంచం లేదు కనక దీన్ని మానవ ప్రపంచం అని కూడా అనొచ్చు. ప్రాథమిక ప్రపంచం అంటే ప్రాకృతిక ప్రపంచం. అంటే నదులు, సముద్రాలు, పక్షులు, వృక్షాలు, ఎండ, మంచు, వెన్నెల మొదలైన అన్నీ ఉన్న ప్రపంచం. మౌలిక ప్రపంచం అంటే దేని నుంచి ఈ ప్రాధమిక ప్రపంచం వచ్చిఉండాలో అది.
   'ఆకాశం ' ఈ మౌలిక ప్రపంచాన్ని ప్రతిపాదిస్తుంది. దాని గురించి మాట్లాడుతుంది. 
ఇలా చెప్పగానే 'అవునూ, ఈ పనిని కవి కవిత్వం ద్వారా ఎలా నిర్వహించాడు ' అని కుతూహలం పుడుతుంది.

మచ్చుకి ఒక కవితను చూద్దాం.
   'ఏ అలజడీ లేనపుడు
    అలలన్నీ కొలనులో దాగి ఉండి
    నీటిలో నీరు పొందికగా సర్దుకొంది ' అని మొదలవుతుంది.

    'ఏ వెలుగూ లేనపుడు చీకటిలో చీకటి విశ్రమించిందనీ, ఏ కదలికా లేనపుడు శబ్దాలన్నీ నిశ్శబ్దంలో దాగి ఉండి ప్రశాంతత ప్రశాంతంగా విస్తరిస్తోంది ' అనీ చెబుతుంది.

   'అయితే ఏ పుట్టుకా లేనపుడు
    అందరం ఎక్కడ దాగి వున్నాం! '

    అని చటుక్కున ఒక ఆశ్చర్యకరమైన ఆలోచనను పైకి తీస్తుంది.
    'బయలుదేరిన చోటికి త్వరగా తిరిగి వెళ్ళాలనె బెంగ ఏదొ .. పరివ్యాప్తమౌతోంది ' అని ముగుస్తుంది.
   దీనికి కవి ఉంచిన పేరు.. ఇంటిబెంగ!

   ఇవి మొత్తం 100 కవితలు. ఒక పది, పదిహేను కవితల్ని మినహాయిస్తే తక్కినవన్నీ 1 జనవరి నుంచి 5 ఏప్రిల్ 2011 మధ్య కాలంలో రాసినవి. 100 రొజుల్లో 80 కవితలు రాయడం ఆశ్చర్యం.
   అయితే ఇవి రాసిన కవితలు కావు. వచ్చినవి. 80 కవితలు రావడం కూడా ఆశ్చర్యమే.
   లోగడ బి.వి.వి.ప్రసాద్ ' పూలు రాలాయి ' హైకూ సంపుటి విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన మాటనే వాడితే ఒక జ్వరగ్రస్తత లాంటి స్తితి ఆవరించినపుడు అవన్నీ వచ్చాయట. 

   'అందరినీ ఒకే ఆకాశం, ఒకే భూమీ తయారుచేసుకొన్నాయి. 
    ఫలం తనలో తాను పక్వమౌతూ పరిమళాన్ని వెదజల్లినట్లు
    సృష్టి తనలో తాను పక్వమౌతూ మానవుల్ని సృష్టించుకొంది
    మానవులలో పరిమళాలవంటి ఊహల్ని సృష్టించుకొంది '  అంటారు ఒక కవితలో. 
ఈ కవి కూడా అదే పని చేసినట్టుంది. తనలో కవిత్వం పక్వమయ్యేవరకూ వేచిచూసి, అయినప్పుడు వ్యక్తం చేసారు. 

'నిన్న మధ్యాహ్నం ఖాళీగా ఉండిపోయాను. బోర్ కొట్టేసింది ' అన్నాను ఒకసారి ప్రసాద్ గారితో. ఆ మాటకి, ' ఒంటరిగా ఉంది బోర్ కొట్టడం అంటే మనల్ని మనం భరించలేకపోతున్నామని అర్థం. ఒక్కళ్ళమే ఉండటం అంటే మనతో మనం ఉండటమే కదా ' అన్నారు. మరో సందర్భంలో మా ఊరొచ్చినపుడు సకాలంలో బస్‌స్టాండుకి వెళ్ళలేకపోయాను. ' మిమ్మల్ని వెయిటింగ్‌లో పెట్టేసాను, సారీ ' అంటే, ' జీవితం, జీవించటం కోసమే అయినప్పుడు వెయిటింగ్‌లో జీవితం లేకుండా పోదు కదా ' అన్నారు. ఈ మాటలు మెట్ట వేదాంతాలుగా, సరదా వ్యాఖ్యలుగా నాకనిపించలేదు. జీవితాన్ని ఒక ప్లేన్‌లో దర్శించడానికి ప్రయత్నించే సాధకుడి మాటలుగానే అనిపించాయి. వీటి ప్రస్తావన దేనికి అంటే కవి ఎవరో అర్థం కావడానికి.

   'అక్షరాలు కూర్చితే కవిత్వం కాలేము
   కవిగా జీవించటం సాధన చెయ్యాలి ' 
   ఈ కవితా సంపుటి కవి ఆత్మాభివ్యక్తి. ఇది ఒక లాలస నుంచి వచ్చింది కాదు. ఆర్తి నుంచి, అనివార్యత నుంచి, ప్రేమ నుంచి, స్పష్టత నుంచి, విశ్వాసం నుంచి వచ్చింది.

ఈ కవిత్వం ప్రతిపాదిస్తున్న తత్వం విషయంలో కవికి ఏ మాత్రం సందేహం లేదు. తన మార్గం మీద, గమ్యం మీద అచంచల విశ్వాసం ఉంటుంది ప్రసాద్‌గారి మాటల్లో, రాతల్లో. జీవితం అంతా దేన్ని అన్వేషిస్తున్నారో దాన్ని తప్ప మరి దేన్నీ పట్టించుకోని ఏకాగ్రత ఉంటుంది.  
రమణ మహర్షి, నిసర్గదత్త మహరాజ్, Eckhart Tolle వంటి వాళ్ళు ప్రసాద్‌గారి ఆధ్యాత్మిక గురువులు. వాళ్ళంతా ఏ దృష్టినీ, స్థితినీ ప్రబోధిస్తున్నారో ఆ దృష్టిలో, ఆ స్థితిలో ఈ ప్రపంచం ఎలా అర్థం అవుతుందో దాన్ని ఆవిష్కరిస్తుంది ఈ 'ఆకాశం '.
   ఆధ్యాత్మికవేత్తల దృష్టి భౌతికవాదుల దృష్టికన్నా చాలా భిన్నం.
   'ప్రపంచం మనం సరిచేయటానికి లేదని
    జీవితం మనల్ని సరిచేసుకోవటానికి ఉందని
    మనం చూసే చిక్కులన్నీ, లోపాలన్నీ మనకి ఏవో నేర్పబోతున్నాయనీ ' 
    వాళ్ళు చెబుతారు. 'ఆకాశం ' దీన్ని కవిత్వీకరిస్తుంది. 

    'ఇన్నాళ్ళూ నేను జీవితమనుకొన్నది ఒక నీడ అని, దు:ఖక్రీడ అని ' ఒక కవిత తీర్మానిస్తుంది. జీవితం నుంచి జీవిని కాస్త ఎడంగా జరుపుతుంది. 

   'పుట్టగానే పిల్లలు నవ్వరెందుకని..
   వాళ్ళంతవరకూ 
   ఏ జరామరణాల అంచుల్ని దాటి బ్రతికారు
   ఏ భయ రహిత ఏకాంతంలో సంచరించారు
   ఒక్క మాటైనా, ఒక్క చూపైనా, ఒక్క మనిషైనా అక్కర్లేని
   ఏ మహాశాంతి లోకాన్నుండి ఇక్కడికి జారిపోయారు '
   అని మన దృష్టిని జననాత్ పూర్వస్థితికి మళ్ళిస్తుంది మరో కవిత. 

ఆకాశం చెబుతున్న ఆత్యంతిక పదార్థం లేదా అపదార్థం ఊహా, నిజమా అనే ప్రశ్న చాలామందిని వెంటాడుతూనే ఉండొచ్చు. అది నిజమే అయిన పక్షంలో మనం దానిగా ఉండటం ఎలా? ఊహ అయినట్టయితే ఆ ఊహకు పరమార్థం ఏమిటి? అనే ప్రశ్నలూ వెంటాడుతూ ఉండొచ్చు. దానికి 'జీవితం దైవం' అనే కవిత ఒక జవాబునిస్తుంది.

   'పవిత్ర భావన అనుభవాల్ని పవిత్రం చేస్తుంది, శుభ్రం చేస్తుంది.
   స్వచ్ఛమైన మనస్సులో జీవితానుభవం విస్తరిస్తుంది.'  
   ఈ కవిత అనే కాదు, ఈ కవిత్వం మొత్తం జవాబుగా పర్యవసిస్తుంది. దీన్ని చదువుతున్నంతసేపూ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఈ కవిత్వంలోని పదాలంత మృదువుగా, పోలికలంత లలితంగా, భావనలంత నిర్మలంగా ఉంటుంది. 'ఎడతెగని ప్రార్ధన లాంటి ఆర్ద్రతలోకి సమస్తాన్నీ అనువదిస్తున్నట్లుంటుంది '   
   ఈ కవిత్వపు అవసరం ఉన్నట్టు తడుతుంది. ద్వితీయ ప్రపంచంలో, అంటే తన సృష్టిలోనే ఇరుక్కుపోయి ఊపిరాడక అవస్థ పడుతున్న మనిషికి విముక్తి చూపాల్సిన అవసరం కనబడుతుంది. 

   ధ్యానం గుర్తుకొస్తుంది. మనిషికి బాహ్య ప్రపంచాన్ని మాత్రమే తెలుసుకొని సుఖశాంతులతో ఉండలేడు కనక ధ్యానావసరం కలిగింది. అంత:ప్రపంచం ఒకటి ఉందని తెలియాలి, అది ఎలాంటిదో తెలియాలి. అప్పుడు బాహ్య ప్రపంచాన్ని ఎలా సమీపించాలో, ఏంచేసినా ఎలా చెయ్యాలో తెలుస్తుంది. 
   ఆధ్యాత్మికత, బాహ్య ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకోవాలో, జీవితాన్ని ఎలా జీవించాలో తెలియజేసే అంతర్దృష్టి. సృష్ట్యంతర్దృష్టి.
   దీనికోసం ఈ కవి ప్రయత్నం. తెలిసిన విషయాలనుంచి మనల్ని తెలియని లోకానికి తీసుకెళ్ళడానికి, అక్కడనుంచి ఈ లోకాన్ని చూపడానికి ఒక స్థిరమైన, నెమ్మదితో కూడిన ప్రయాణంగా ఈ సంపుటిని తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. వంద కవితల ఈ సంపుటి ఒకేసారి కూర్చుని చదవగలిగేటంత సారళ్యం, కోమలత్వం, సౌందర్యం, ప్రశాంతత కలిగి ఉంది.

   కొన్ని కవితల్లో జెన్ ఛాయలు కనిపిస్తాయి. హైకూ మీదుగా వస్తున్న ఈ కవి ప్రయాణాన్ని గుర్తు చేస్తాయి.
   'తీరం వదిలిన దేన్నైనా ప్రవాహం తీసుకుపోయినట్లు
   అలవాట్లను వదిలితే చాలు జీవితం తనతో మనల్ని తీసుకుపోతుంది '
అని ముగుస్తుంది.'అలవాటు ' కవిత. యాంత్రికతకు, ఏమరుపాటుకు వ్యతిరేకి జెన్, నిజానికి జెన్ తత్వంలాంటి వాటి గురించి మాట్లాడుతున్నపుడు వ్యతిరేకత వంటి ఋణాత్మక పదాలు వాడకూడదు. పాజిటివ్ పదాలే ఎన్నుకోవాలి. ఆధ్యాత్మికత కూడా అంతే. నెగటివ్‌కి చోటులేనిది. ఈ సంపుటిలో ఎక్కడా వ్యతిరేకత, కటుత్వం లేకపోవడం దీని ఆధ్యాత్మికతకు ఒక సూచిక. 

  ఇంతకీ జెన్ ఛాయలున్నా అవి పరిణామశీలాలుగానే ఉంటాయి. అంటే ప్రాకృతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచంవైపు నడిపేవిగా ఉంటాయని.
   'నిన్ను గాయపరిచిన మనిషివైపు దయగా చూసినపుడు
   నీకు ఇష్టమైన వస్తువొకటి ఎవరికైనా మనసారా ఇచ్చినపుడు 
   గెలిచికూడా ప్రపంచం ముందు వినమ్రుడివై మోకరిల్లినపుడు
   ఏదో జరుగుతుంది. లోపలెవరో మేలుకొన్నట్లుంటుంది.' 
   ఇటువంటి కవితలు చదువుతున్నపుడు సూఫీ కవిత్వం గుర్తుకొస్తుంది. కానీ సూఫీ ఫిలాసఫీకి పరిమితమైన సంపుటికాదు ఆకాశం.

   'జీవించే ఏర్పాట్లు మాత్రమే జీవితం కాదు
   జీవితం అర్థమైతే సమాజం అర్థమౌతుంది ' అంటుంది.
   ఇక్కడ జీవితం అంటే జననమరణాల మధ్య దశ కాదు. ఇంతకాల వ్యవధీ, ఇన్ని సంఘటనల సంపుటీకాదు. జీవచైతన్యం, జీవితం వేరు, జీవన సంఘటనలు వేరు అని టోలే వంటివాళ్ళు చెబుతున్న మాటలు గమనిస్తే ఇది సూఫీ తత్వం దగ్గర ఆగదని తెలుస్తుంది. 

   'మహాసముద్రాలు ఈదమని కవ్విస్తుంటే
   పాదమైనా మోపనట్టు నడిచివెళ్ళే మంత్రవిద్య నా కవిత్వం
   దృశ్యం నుండి అదృశ్యంలోకి
   ఉద్వేగాల నుండి స్వచ్ఛతలోకి
   భయం నుండి స్వేచ్ఛలోకి
   శ్రమతెలియక నడిపించే స్నేహం నా కవిత్వం ' 
   అని తన కవిత్వాన్ని ఈ కవి ఎందుకు ప్రకటించుకుంటున్నాడో అర్థమౌతుంది.

   కొన్ని కవితల్లో 'అతను' అని ఒక అతను కనిపిస్తాడు. అతను కవి ప్రతిపాదిస్తున్న ఆదర్శమానవుడు. మనుషులందరికీ తలొక ఆదర్శ మానవుడు ఉంటాడు. వాళ్ళందరినీ సేకరిస్తే కొన్ని టైప్స్ తయారవుతాయి. ఆ నమూనాల్లో ప్రసాద్‌గారు ఊహిస్తున్న నమూనా చాలా తక్కువమంది ఎంచుకుంటారు. ఎందుకని అంటే.. కోరుకోవడానికి, ఎన్నుకోవడానికి నచ్చి ఉండాలి. నచ్చడానికి ముందు ఆ ఆదర్శ మానవుడు 'తెలిసి ' ఉండాలి. ఆ తెలిసి ఉండడం కోసమే ఈ కవిత్వం. అది దీని పరమ లక్ష్యం. 

   ఈ కవి ఇస్తున్న ఆదర్శ మానవుడు ఆధ్యాత్మిక మానవుడు. స్థితప్రజ్ఞుడనే పేరుతో గీత ప్రతిపాదించింది ఇతన్నే. కానీ ఈ కవి గీతావాక్యాలనుంచి ఈ మానవుణ్ణి రూపొందించుకున్నట్టు కనబడదు. ఆధ్యాత్మిక గురువులు చెబుతున్న స్థితినుంచి ఇతన్ని కల్పించుకున్నట్లు తోస్తుంది. 'దయ ఉంటే ఓడిపోతామంటే, దయ లేకపోవటమే ఓడిపోవడమంటాడు ' ఇతను.  
   'ఆతను' అనే కవితలో మరొక ఆతను కనిపిస్తాడు.ఆతను మానవుడు కాడు, ప్రసాద్ గారే చెప్పినట్టు 'అతను' absolute truth. కేవల సత్యం. 

   'అతనికీ వారికీ మధ్య, నిద్రకీ మెలకువకీ ఉన్నంత దూరమైనా లేదని, అతన్ని చేరేందుకు ఊహలోంచి ప్రపంచంలోకి వచ్చే సమయమైనా ఎక్కువని తెలుస్తుంది ' అని,
   'అతన్ని చూసినవారైనా ఎలా ఉండడో చెబుతారు గాని అతన్ని చెప్పలేరు ' అనీ, కవి అన్నపుడు ఎరిగిన వాళ్ళకి తప్పక రమణ మహర్షి, టోలే చేసిన బోధలు గుర్తుకొస్తాయి.

   ఆధ్యాత్మికతకు కవిత్వరూపం ఇవ్వడం అంత తేలిక కాదు. దాన్ని ప్రసాద్ గారు సాధించిన మార్గం ఎంతో బాగుంది. ఆయన వాడే భాష, ఎన్నుకొనే పోలికలు, చేసే ఊహలు మనల్ని ముగ్ధుల్ని చేస్తాయి. ఈ వాక్యంలో ముగ్ధ శబ్దం ఊరికే వాడింది కాదు. ఇక్కడ వేరే మాటలేదు. అవి మనల్ని ముగ్ధత్వంలోకి తీసుకెళతాయని చెప్పడం కోసమే ఉద్దేశించిన పదం అది.

   'పదార్ధంలో కోమలంగా నిద్రిస్తున్న రుచిలా
   ఇంకా ఏ అనుభవమూ ఎదురుకాని మెలకువలా..'
అంటూ తాను చెప్పదలచుకొన్న స్థితికి మనని చేర్చడంలో గొప్ప ఒడుపుంది.

   'మన అనుభవాలు బెంగలుగా, విజయాలు భయాలుగా
   మనకైనా చెప్పకుండా లోపలెవరో అనువాదం చేసేస్తుంటే..'
అన్నప్పుడు జీవన విషాద రహస్యాల్ని అక్షరీకరించిన ease బాగుంది.

   చలం గురించి రాస్తూ
   'మీ హృదయమంతా నింపి మాటలు బహూకరిస్తున్నపుడు
   మీ మాటల్లో వారి మాటలే విన్న తెలివితేటలకి  క్షమించాలి ' అంటారు.

మరొకచోట
   'ఒకరి భయం కలిసుందామన్నపుడు
   ఒకరి భయం విడిపోదామన్నపుడు
   ఒకే భయంలో ఇద్దరూ కలిసి జీవిస్తారు ' అంటారు.

   'ఉద్వేగాలన్నీ బడిపిల్లల్లా బుధ్ధిగా కూర్చున్నట్లుంటుంది ' అంటారు మరోచోట.
   'అతను అన్నం తింటున్నపుడు
   రేపటిరోజు కూడా జీవించే ఆనందం కోసం ధ్యానం చేస్తున్నట్లుంటుంది ' అని అతన్ని (ఆదర్శ మానవుడిని) మరో కవితలో పరిచయం చేస్తున్నపుడు ఖలీల్ జీబ్రాన్ గుర్తొచ్చాడు. ఆయన రాసిన ప్రాఫెట్ జ్ఞాపకం వచ్చింది. అందులో అల్ ముస్తఫా ఆహారం గురించి చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. ఈ ఆకాశపు కవితా వాక్యం, దాని తర్వాత వాక్యం. మొత్తంగా ఈ కవితాసంపుటి ప్రాఫెట్ తర్వాత పుస్తకం.

   తిలక్ గురించి రాసిన ఒక కవితలో నేను మీ తర్వాత తరం వాడిని అన్నారు ప్రసాద్. అక్కడ అనాల్సిన మాట 'నేను జీబ్రాన్ తర్వాత తరం వాడిని ' అని నాకనిపిస్తుంది.
   ఈ ఆకాశం ఆంగ్లంలోకి అనువాదం కావాలని నా ఆకాంక్ష. భారతదేశపు జీబ్రాన్ ఇలా ఉంటాడని ప్రపంచానికి తెలియాలి కనుక ఈ అనువాదానికి తగిన launching కూడా ఉండాలని కోరిక.
   ఆధ్యాత్మికత ఇవాళ్టి ప్రపంచానికి అవసరమని, దీనిని వీలయినంత మందికి వినిపించాలని ఈ సంపుటిని ప్రకటించినా ప్రసాద్ గారికి సందేహమే. 'ఒకరిద్దరు మినహా ఎవరూ కవిని వినరు ' అనే రాసుకున్నారు. కానీ ఇప్పటికే చాలామంది వినడమూ, పట్టించుకోవడమూ మొదలైనట్టు అనిపిస్తోంది.
 గుంటూరుజిల్లా రచయితల సంఘం దీన్ని ఉత్తమ కవితా సంపుటిగా గౌరవిస్తోందని చినుకు రాజగోపాల్ గారు చెబుతున్నారు. శుభం.

జూన్ 2012 'చినుకు ' సాహిత్య మాస పత్రిక నుండి

'ఆకాశం' సంపుటి  దొరికేచోట్లు:
1. పాలపిట్ట ప్రచురణలు,  హైదరాబాద్. ఫోన్: 040-27678430.
2. కినిగే.కాం లో ఈ బుక్ లేదా ముద్రిత ప్రతి కోసం  
ఇక్కడ క్లిక్ చేయండి 

6 కామెంట్‌లు:

  1. ఉత్తమ కవితా సంపుటిగా గౌరవిస్తోందని చినుకు రాజగోపాల్ గారు చెబుతున్నారు.congratulations sir.

    రిప్లయితొలగించండి
  2. ఈ వ్యాసం చదివిన తర్వాత మిమ్మల్ని ఇంకా దగ్గరికి తీసుకున్న అనుభూతి కలిగింది.ఏ ఒక్క వాక్యాన్నీ వెంటనే వదలాలని పించదు నాకైతే...చక్కని మీ కవిత్వానికి అద్దం లాంటి రచన ఇది.

    రిప్లయితొలగించండి
  3. ఆకాశం E Book లేదా Print Book కావలసిన వారు ఈ Website ని చూడండి.
    http://kinige.com/kbook.php?id=571
    ఈ పుస్తకం నలుగురూ చదివితే బాగుంటుంది అని భావించే సహృదయులు, అక్కడ కామెంట్ పెడితే చదవాలనే ఆసక్తిని కలిగించినవారౌతారు..
    Thank you the tree, Guru Swamy garu

    రిప్లయితొలగించండి
  4. ఆకాశం కవితాసంపుటి దొరికేచోట్లు:
    హైదరాబాద్: నవోదయ బుక్‌హౌస్, కాచిగూడ
    విజయవాడ: మైత్రి బుక్స్, ఏలూరు రోడ్
    కర్నూలు: విశాలాంధ్ర బుక్ సెంటర్
    నిజామాబాద్: కీర్తి బుక్‌స్టాల్, బస్‌స్టాండ్
    పోస్టులో కావలసిన వారు: పాలపిట్ట బుక్స్, 040-27678430
    ఇంటర్నెట్ ద్వారా కావలసినవారు: kinige.com

    రిప్లయితొలగించండి