31 జులై 2012

అత్యున్నతాకాశం : ఏనుగు నరసింహారెడ్డి


ఆకాశం లాంటిదే జీవితం. దాని ఎత్తులూ లోతులూ తెలిసినట్లే ఉంటాయి. కానీ, తరచిన కొద్దీ కొత్తగా కనిపిస్తుంటాయి. పైపైన తేలిపోయే మబ్బులుంటాయి. సూర్యచంద్రుల్లా ఆవేశాలు, ఆనందాలు, నక్షత్రాల్లాంటి మెరుపులూ ఉంటాయి. ఆకాశం ఉందో లేదో తెలియనట్లే జీవితం కూడా! ఆకాశం ఆరంభం, అంతం ఎక్కడో చెప్పలేనట్లే జనన మరణాల ఆవలిగట్లు ఎంత ధ్యానించినా కనిపించే దాఖలాల్లేవు. ఆకాశం మన మీదుందో, ఆకాశం మీద మనమే వేలాడుతున్నామో తెలియదు. గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంతలు భూమ్మీద కూడా గతులు తప్పుతుంటాయి. గ్రహణాలు మనుషులక్కూడా పడుతుంటాయి.

ఆకాశమంటే అంతు దొరకని రహస్యం, ఏదీ దాచిపెట్టలేని బహిరంగం కూడా. ఒక్క బివివి ప్రసాద్‌కే కాదు, మనక్కూడా. కానీ మనకంత తీరికేది. చూపేది. ప్రసాద్‌కున్న పరిశీలనేది. మనమంతా ప్రవాహం. ప్రసాద్ గట్టుమీదున్న చెట్టు. గట్టు మీద నిలబడి ఎలాంటి గర్వం లేకుండా జీవితాకాశాన్ని అక్షరాల తీగలు పేర్చుకొని కవిత్వం రాగాలు తీస్తాడు. ఒక్క పాలూ శృతి తప్పదు. ఏ దరువూ అక్షరాన్ని అదనంగా జోడించుకోదు. కుదించుకోదు. నూరు కవితలున్న ఆకాశం చదివాక నూటొక్కటో కవిత ఎందుకులేదన్న బాధ. ప్రసాద్ ఆరవ పుస్తకం ఎప్పుడొస్తుందన్న డిమాండ్, ఆశ. 

అడుగడుగునా కవి గురించీ, ఆకాశం గురించీ చెప్పినట్లు నడిచే ప్రసాద్ కవిత్వంలో అబ్బురపరచని వాక్యమేదైనా దొరుకుతుందేమోనని చూసాను. సరల వాక్యం సరమెక్కడైనా తెగిపోకపోతుందా అని చూసాను. ఓడిపోవడం పాఠకుడిగా మొదటిసారి గర్వించాను.

ఒక్క కవితా పాదం:
'పుట్టగానే పిల్లలు ఎప్పుడూ ఏడుస్తారెందుకని
దు:ఖమయ ప్రపంచాన్ని వ్యాఖ్యానిస్తారెందుకని '

మరొక్క వాక్యాల గుంపు:
'తలుపులు మూసిన మందిరంలో దేవుడూ
పెద్దవాళ్ళకు అడ్డంరాకుండా పసివాడూ
తమ సమయం వచ్చేవరకూ ఎదురు చూస్తారు ' 

ఏదో ఒక పేజీ జరుపుదాం:
'అయితే 
ఏ పుట్టుకా లేనపుడు 
అందరం ఎక్కడ దాగివున్నాం 
సృష్టి ఏమై వుంటుంది 

కొలనులో రాయి వేసాక
నీటి వలయాలు బయటపడినట్లు
ఈ ప్రశ్నలు వేసుకొన్నాక
ఏవో దిగులు వలయాలు బయటపడుతున్నాయి '

అతి పేలవమైన కవితనొక్కదాన్ని వెతికి మీ ముందు పడేస్తాను:
'అప్పుడు ఒక్క ఊహైనా పూవులా రాలదు
ఒక్క ఊహైనా సీతాకోకలా ఎగరదు
నిద్రలో పాపాయి నవ్వులా వెలగదు
కదలని కోనేటిలో చందమామలా ప్రతిఫలించదు '

ఇంకా మీరు ప్రసాద్ కవిత్వం చదివే తీరాలనే పంతం పట్టకుందా ఉండేందుకు 'చిన్న బడి ' పిల్లల్లా 'ప్రశ్నలు-జవాబులు ' ప్రవేశపెడతాను. కానీ ప్రసాదు ప్రశ్న అడుగుతున్నాడో, జీవితపుటద్దం ముక్కలని ఎలా అతకవచ్చో లాంటి వేల ప్రశ్నలకి జవాబు ఓపికగా చెబుతున్నాడో చెప్పడం కష్టం.

చూడండి:
'ఎప్పుడూ విసుక్కొనే కొడుకు తల్లి పాదాలు తాకి దీవించమన్నపుడు
ఆమే కళ్ళలో ఎన్నడూ చూడని కన్నీరెందుకొస్తుంది

గాయపరిచాను, క్షమించమన్నపుడు
అప్పటివరకూ వెలవెలబోతున్న భార్య కన్నులవెంట ఆపలేని ధారలెందుకొస్తాయి

చాలా ఖర్చవుతుందేమో, వద్దులే నాన్నా అని పిల్లలన్నపుడు
వారి లేత దయాపూర్ణ హృదయాలు తలచి అతని కన్నులెందుకు చెమ్మగిల్లుతాయి ' 

ఇప్పుడు చెప్పండి. ఇవి ప్రశ్నలా? జవాబులా? ప్రశ్నలే అయితే, వాటికి జవాబులెంత లోతుల్లోంచి రావాలి. జవాబులే అయితే, వాటికి ముందు ఎన్ని వేల ప్రశ్నలు కావాలి. 

శీర్షికలింత నేరుగా పెట్టొచ్చా? మన జవాబును పట్టించుకోకుందా మహా సూటిగా పెట్టాడు. పుట్టగానే పిల్లలు - అప్పుడు పుట్టిన పిల్ల గురించే. ఎదురుచూస్తారు - ఒక సందర్భం కోసం ప్రేమాస్పదమైన ఎదురుచూపే. ఆకాశం, అద్దం, నవ్వు అన్నీ వాచ్యాలే శీర్షికలు. కవిత్వాంశ నూరుపాళ్ళు.

'అకస్మాత్తుగా ఒక జీవితం ఆగిపోతుంది
ఒక జ్ఞాపకాల దీపం ఆరిపోతుంది
మానవసంబంధాల ముడి ఒకటి విడిపోతుంది '

లాంటి సరళ వాక్యాలు. సంభ్రమాశ్చర్యాలు గొలిపే కవిత్వాంశ.

'అవుననటం ఒక దారి, కాదనటం ఒక దారి
ఇవ్వటమొక దారి, తీసుకోవటమొక దారి 
విజయం ఒక దారి, పరాజయం ఒక దారి ' 

లాంటి కవితల్లో ఇంకా సంక్షిప్తం చేయడానికి అవకాశం ఉన్నా కవి ఉపయోగించుకోలేదనే పై చూపులకి అనిపిస్తుంది. కానీ, ఎక్కడ పదాల పునరుక్తి అవసరమో అక్కడ మాత్రమే ఉంది. అది ప్రసాద్ కవిత్వాన్ని చాలాచోట్ల బలోపెతం చేసింది కూడా. జీవిత సత్యాలు పదేపదే ఎదురైనట్లు కొన్ని కవితా సందర్భాలు సారూప్యాలతో ఉన్నాయి, కానీ, కవిత్వం లోని మార్దవం, ఆర్ద్రత అద్భుతంగా కొనసాగాయి. ప్రసాద్ రాసిన ప్రతి కవితా వాక్యమూ మెరుపుల మాలికలాగా ఉండటం ఆశ్చర్యానందాలతో ముంచెత్తుతుంది పాఠకుల్ని. 

9 అక్టోబర్ 2011 ఆదివారం 'వార్త ' నుండి.

'ఆకాశం' సంపుటి  దొరికేచోట్లు:
1. పాలపిట్ట ప్రచురణలు,  హైదరాబాద్. ఫోన్: 040-27678430.
2. కినిగే.కాం లో ఈ బుక్ లేదా ముద్రిత ప్రతి కోసం  
ఇక్కడ క్లిక్ చేయండి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి