21 జులై 2012

'నిశ్చలనది మీద ఆకాశయానం' వసీరా

ఆకాశాన్ని అద్దంలో చూపించవచ్చా? చూపించవచ్చు. కానీ అద్దమంతే కనిపిస్తుంది. బి.వి.వి.ప్రసాద్ ఆకాశాన్ని అద్దంలో చూపించలేదు. ఆకాశంలోనే చూసుకోమన్నాడు. తాను చూసిన మేరకు వర్ణించాడు. వ్యాఖ్యానించాడు. బోధించాడు. తన ఊహలు, ఆలోచనలు, అనుభూతులు, అనుభవాలు పంచుకోవటానికి ప్రయత్నించాడు. దాని కళాత్మక సారాన్ని రమణజీవి కవర్ పేజీలో రుచి చూపించాడు. ఓ సముద్రంలో, ఓ అడవిలో, ఓ మంచు కప్పిన లోయలో, తెల్లని కాంతిలో కుంచె ముంచి ఓ కొత్త కవితని కవర్ పేజీగా ఇచ్చాడు.

ఆకాశాన్ని చూడ్డం అంటే కేవలం పైకి చూడ్డం కాదు. మనిషి ఎన్నిసార్లు పైకి చూస్తే ఓ ఆకాశాన్ని చూడగలడు. How many times must a man look up .. before he could see the sky అని Bob Dylan కాబోలు అన్నాడు. అందుచేత బివివి ఆకాశంలోకి చూడమన్నాడు కదాని చూస్తే, అక్కడేమీ లేదు కదా ఎందుకు చూడమన్నాడనిపిస్తుంది. అక్కడేమీ లేదనే సంగతి కూడా ఎప్పుడో పెద్దలు చెప్పేసినదే. మరి ఈయనేదో పెన్నిధిని చూసిన చిన్నపిల్లాడిలా.. కొత్త డిస్కవరీలా అంత ఉత్సాహంతో, ఎక్సయిట్‌మెంట్‌తో ఎందుకు పిలుస్తున్నాడనిపిస్తుంది. ఇతడు పైకి చూడలేదు. ఆకాశాన్ని చూడటానికి ఎన్ని ప్రయత్నాలు చెయ్యాలో అన్నీ చేసాడు. ఆకాశాన్ని మనుషుల్లోంచి చూశాడు. మానవీయంలోంచీ చూశాడు. మనుషుల్లోంచి ఆకాశాన్ని చూపించే ప్రయత్నం చేశాడు. పైకి కనిపించే ఆకాశమే లోపలికి చూసినా కనిపిస్తుందని కనుగొన్నాడు. అందుకే ఇద్దరి మనుషుల ఆకర్షణని కూడా ఏ స్థాయికి తీసుకెళ్ళాడంటే..

 'కాలాలు మారతాయి, దేశాలు మారతాయి
దేహాలు మారతాయి, దేహాల దశలు మారతాయి
కల మళ్ళీ పూవులా పూస్తూనే వుంటుంది ' ఇంత వరకూ ఎవరయినా అనగలరు.
'కల మళ్ళీ పూవులా రాలుతూనే వుంటుంది ' అని ఒక్క బివివి మాత్రమే అనగలడు.

'ఎప్పుడూ విసుక్కొనే కన్నకొడుకు తల్లి పాదాలు తాకి దీవించమన్నపుడు
ఆమె కళ్ళలో ఎన్నడూ చూడని కన్నీరెందుకొస్తుంది

గాయపరిచాను క్షమించమన్నపుడు
అప్పటివరకూ వెలవెలబోతున్న భార్య కన్నుల వెంట ఆపలేని ధారలెందుకొస్తాయి

చాలా ఖర్చవుతుందేమో వద్దులే నాన్నా అని పిల్లలన్నపుడు
వారిలేత దయాపూర్ణ హృదయాలు తలచి అతని కన్నులెందుకు చెమ్మగిల్లుతాయి
.. .. ..
మనుషులిద్దరి మధ్య హృదయం ప్రవేశించిన ప్రతిసారీ
తెలివి కాని తెలివీ, బలము కాని బలమూ కన్నీరుగా మారి పొరలిపోతాయెందుకని ' అంటూ ప్రశ్నిస్తాడు.
ఇతడు ఆకాశాన్ని మనిషిలోంచి చూశాడు కాబట్టి ప్రపంచం మొత్తం మీద మానవ జీవితాన్ని ఒకే యూనిట్ గా చూశాడు. మానవసారాన్ని ఒకటిగా చూశాడు. కాదు, ఆకాశాన్ని మనుషుల్లో చూశాడు కాబట్టే మానవ సారాన్ని ప్రపంచసారంలో భాగంగా చూశాడు.

' నేను హృదయాన్ని, నేను అందరి ఒకే హృదయాన్ని
ఒక శరీరంలోంచి మాట్లాడుతున్నా నేనే అందరి శరీరాన్ని
.. .. ..
జీవులు వేదనలో ఉన్నపుడు వారిలో శాంతినై ఓదార్చుతున్నాను
వారు భ్రమల్లో మునిగినప్పుడు పరమకారుణ్యాన్నై ఎదురుచూస్తున్నాను ' అని కేవలం ఒక ప్రవక్త మాత్రమే అనగలడు.
కానీ బివివి అవలీలగా అనేశాడు. ఇలా మనిషి నుంచి మనిషిలోని విశ్వాకాశానికి రూట్ మ్యాప్ ఇచ్చేశాడు.

హృదయం ప్రవేశించినపుడు ఏం జరుగుతుందో చెప్తాడు. ఎలా నిద్రపోవాలో చెప్తాడు. ఎలా మెలకువగా ఉండాలో చెప్తాడు. ఏమీ చెయ్యకుండా గర్భంలో శిశువులా కూచుండాలని చెప్తాడు. 'గెలుపు జ్వరం తగిలిన లోకంలో పరాజితుడివై ఆరోగ్యంగా జీవించ ' మని చెప్తాడు.

ఆకాశం కనిపించే ముందు తన కొసగాలుల విసురులతోనే ఎన్నెన్ని దృశ్యాదృశ్యాలు చూపిస్తుందో, శూన్యంలోకి మరింత మృదువుగా వికసించిన పూలు, తిరిగి రాలాయని చెప్పడానికి మధ్య మంచుతెరల్లో ఏమేమి రహస్యాలున్నాయో, వాటిని వినిపించీ వినిపించనట్లు, కనిపించీ కనిపించనట్లు, యుగాల సారాంశం ఓ క్షణంలో స్ఫురించి, తిరిగి మరుపు కమ్మినట్లు ఇతడితో ఆడుకుంది ఆకాశం. ఆకాశమయినా తాను ఆకాశాన్ని కానని, ఆకాశానికి ముందూ, వెనకా ఉన్నదాన్నని ఓ ఆకాశం ఇతడికి కొన్ని క్షణాల్లో స్ఫురింపచేసి ఆనక మళ్ళీ, మళ్ళీ మాయ చేసింది. అప్పుడు బివివికి ఏమనిపించింది. ఏమిటో ఈ ఆకాశం ఏ లెక్కలకీ అందదు. లెక్కలు మానేస్తే అర్థమౌతానంటుంది. ఇది మన అంతరాత్మలా మాట్లాడుతుంది అనిపించింది. పైకి చూస్తే కనిపించే ఆకాశం, లోపలికి చూస్తే ఇలా ఇక్కడ కూడా ఉంటుందా అనిపించింది. అప్పుడు ఆకాశం వెనక మహా నిశ్శబ్దాన్ని కావాలని కలగన్నాడు.

పాపం ప్రసాద్ ఇటువంటి సంగతులే మనందరితో షేర్ చేసుకోవాలని తాను విన్నవి, కన్నవి విన్నవించడానికి ఈ పుస్తకం వేశాడు. బివివి ఆకాశయానం గురించి చెప్పాలంటే, ఓ మంచి బాలుడు కవి కావడానికి యాత్ర ప్రారంభించాడు. తర్వాత మంచి కవిగా యాత్రించాడు. ఒక మంచి కళాకారుడు తనకు తెలియకుండానే ఆకాశయానం మొదలుపెట్టాడు. 'నేనే ఈ క్షణం ' రాశాడు. అయితే తర్వాత తన యాత్ర ఆకాశయానం కోసమా? తన యాత్ర ఆకాశం కంటే ముందునుంచీ ఉన్నదాని కోసం చేసే యాత్రా? అని అశ్చర్యపోయాడు. ఈ యాత్రలోని అనుభవాలే మనతో పంచుకున్నాడు.

'అడవిలో వికసించి రాలిన అనామక పుష్పంలా
ఎవరూ చూడనప్పుడు ఎగురుతూ వెళ్ళిపోయిన పేరు తెలియని పిట్టలా
అక్షరాలు గుర్తించేలోపు అదృశ్యమైన ఊహలా
గుడి తలుపులు మూశాక లోపల వెలుగుతున్న దీపంలా
నిశ్శబ్దంగా బ్రతికితే ఏమిటి? నిరాడంబరంగా వెళ్ళిపోతే ఏమిటి?
.. .. ..
విశాలమైన మెలకువలూ, విశాలమైన నిద్రలూ తనివితీరా అనుభవిస్తే చాలు
వెలుపలా, లోపలా బోలెడంత విశ్రాంతి సంపాదించగలిగితే చాలు
బ్రతికినంత నిశ్శబ్దంగా, నిరాడంబరంగా మన చోటు ఖాళీ చేస్తే చాలు ' అంటూ
పుట్టుకా, బతుకూ, చివరికి చావూ..సృష్టిలోని హార్మొనీని డిస్ట్రబ్ చెయ్యకూడదని.. సృష్టిలో మమేకం అవ్వాలనే కాంక్షని వెలిబుచ్చాడు.

దీనికోసం ఎలాంటి సాధన కావాలి, ఏం చెయ్యాలనే విషయం కూడా బివివి చెప్పాడు.
'మనకు తెలియని ఈ మహా లోకంలో
ఎప్పుడూ శబ్దదృశ్యాల చిటికెన వ్రేళ్ళు పట్టుకొని సంచరిస్తున్నా
విశ్రాంతి తెలియని సాహసిలా, స్వాప్నికుడిలా
ఎప్పటికప్పుడు వాటిని ఖాళీ చేసుకొంటూ కొత్త మెలకువలోకి ప్రవేశించాలి '
'తీరం వదిలిన దేన్నైనా ప్రవాహం తీసుకుపోయినట్లు
అలవాట్లను వదిలితే చాలు జీవితం తనతో మనల్ని తీసుకుపోతుంది '

ఇక్కడ నాకు బాలరాజు కథ సినిమా గుర్తొస్తుంది. ఒక వాక్యంలోని సత్యాన్ని అనుభవించి తెలుసుకోడానికి వందేళ్ళ జీవితం సరిపోదు అనిపిస్తుంది. అయినా బివివి ఎంత ఈజీగా చెప్పేశావయ్యా. అసలిది సాధ్యమయ్యేదేనా? అటు నిద్రాపోకుండా, ఇటు మెలకువగానూ ఉండకుండా ఏమిటిలాంటి కలలు కంటున్నావు? ఇలాంటి కలలు కంటున్నావు కాబట్టే 'అది ఉంటుంది ' ' చివర చూసినవాడు ' 'ఒక్క ఊహైనా ' వంటి కవితలు రాసిపారేశావు.

అద్దం గురించి రాసినా ఇదే గొడవ.
'అది మనని చూస్తుందో, మనం దానిని చూస్తామో తెలీదు
మన ముఖం దానిలో చూస్తున్నపుడు
దాని ముఖం మనలో చూస్తుందో లేదో తెలీదు

మనం నిద్రపోతున్నపుడైనా
అది నిద్రపోతుందా అని క్రీగంటితో గమనిస్తే
వీధి గుమ్మం తలుపు బార్లా తెరిచినట్టు
అద్దమంత కన్ను తెరుచుకొని
గదినంతా కావలి కాస్తున్నట్లు చూస్తూనే ఉంటుంది '
.. .. ..
అద్దం అర్థం కాకుండా ఉండిపోతుంది
అది నిద్రపోతుందో, కలగంటుందో, మెలకువగా ఉందో
ఎప్పటికీ అర్థంకాకుండా ఉండిపోతుంది '
ఇంతవరకూ అద్దంతో కవిగారి గొడవ.. శిల్పం రీత్యా సూపర్బ్. అంతవరకూ ఓకే.

అక్కడినుంచి
'మనం అద్దంలా ఉండగలిగితే బాగుండును
నిద్రలోని కలలాంటి మెలకువతో ఉంటే బాగుండును ' అంటూ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాడు.

పోనీ నిద్ర గురించి రాసినా ఇదే తపన. మామూలు నిద్రని మార్మికంగా వర్ణించడం మొదలెట్టి చివరికి..

'ఏ భేదమూ మిగలని, ఏ కలలూ, దిగుళ్ళూ మనపై పనిచేయని
పవిత్రమైన నిద్రలాగా మెలకువ ఉంటే జీవితమెంత మృదువుగా ఉంటుంది
గాఢమైన నిద్రలాంటి లోతైన మెలకువ ఉంటే జీవితమెంత ఉదాత్తమౌతుంది ' అంటూ మంచి శిల్పంతో కవిత చెప్తాడు.

నాయనా ప్రసాదూ! ఈ స్థితిని ఏమంటారో తెలుసా? అమ్మగారిని అడుగు. అమ్మ చెప్పినా మనం అర్థం చేసుకోగలమా? అది ఎవరో గొప్ప యోగులకి మాత్రమే సాధ్యం. మనకి అసాధ్యం. ఇది నిజం. అయితే ఇంకో నిజం ఉంది. అఫ్‌కోర్స్ అమ్మ దయతో అన్నీ సాధ్యమే.

అసలు 'మొదలైతే చాలు '
'ఆకాశంలో పలుచగా పరుచుకొన్న శబ్దంలా
పదార్థంలో కోమలంగా నిద్రిస్తున్న రుచిలా
ఇంకా ఏ అనుభవమూ ఎదురుకాని మెలకువలా
సరళంగా, తేటగా, ప్రశాంతంగా సిద్ధంగా ఉండగలిగితే చాలు

పిట్ట వాలాక పిట్టలో వాలుతున్న విశ్రాంతిలా
నవ్వుతుంటే నవ్వులో వికసిస్తున్న కాంతిలా
ఊరికే ఉండీ లేనట్లు, కదిలీ కదలనట్లు
ఉండగలిగితే చాలు, చలించగలిగితే చాలు '

ఈ శక్తులే 'తేటగా, ప్రశాంతంగా, సిద్ధంగా 'నూ ఉంచుతాయి. ఈ శక్తులే ఆకాశ దర్శనం చేయిస్తాయి. నిద్ర కవితలో చెప్పిన మెలకువని ఇచ్చేది కూడా ఈ శక్తులే. ఈ శక్తులే అమ్మ కృప.

ఆ శక్తులే కవికి ప్రాచీనులు చెప్పిన రహస్యాన్ని విప్పాయి.

'ఆకాశమే శబ్దమై మన చెవుల ద్వారా తనని వింటుంది
వాయువే స్పర్శలా మారి మన చర్మం ద్వారా తనని తాకుతోంది
అగ్ని దృశ్యంలా విస్తరించి మన కనుల ద్వారా తనని చూసుకొంటోంది
జలమే రసరూపం దాల్చి మన నాలుకల ద్వారా తనని రుచిచూస్తోంది
భూమి పరిమళంగా పక్వమౌతూ మన నాసిక ద్వారా తనని ఆఘ్రాణిస్తోంది '

ఈ ప్రాచీన రహస్య ఆకాశ యాత్రని ఇంకాస్త పొడిగించింది.

'అయితే కదలని ఆకాశానికి ముందు ఏముంది
ఆకాశం ఉండటానికి ముందు ఉన్నది ఏమిటి '

'నేనే ఈ క్షణం ' అని చెప్పిన బివివి, నేనే ఆకాశాన్నని చెప్పలేదు.

'అందరినీ ఒకే ఆకాశం, ఒకే భూమీ తయారుచేసుకొన్నాయి
ఫలం తనలో తాను పక్వమౌతూ పరిమళాలను వెదజల్లినట్లు
సృష్టి తనలో తాను పక్వమౌతూ మానవుల్ని సృష్టించుకొంది
మానవులలో పరిమళాల వంటి ఊహల్ని సృష్టించుకొంది ' అంటున్నాడు.

అంతేకాదు-
'మనం ఆకాశం పిల్లలమనీ, చిన్న చిన్న ఆకాశాలమనీ
మనని ఎప్పుడూ వదలని అమ్మలాంటి ఆకాశాన్ని
మనమే తప్పించుకొని, తప్పిపోయామనుకొని
సదా వెదుకుతూ తిరుగుతున్నామని ' గ్రహించిన వాళ్ళ గురించి చెప్తూనే

అసలు ఆకాశం ఎక్కడ ఉంటుందో కూడా చెప్పాడు. ఆకాశం వెనుక మహా నిశ్శబ్దాన్ని కావాలని కలగన్నాడు.

నేనే ఈ క్షణం.. మనమే ఆకాశం.

ఇంకా ఆకాశమంత గాఢమైన, ఆకాశమంత నిశ్శబ్దం మేల్కొన్నాక ఈ కవి చెప్పడానికి ఏమయినా మిగుల్తుందా? 'మౌన వాక్య 'మే సమాధానమా? ఏమయినా ఇతడు మనుషుల్లోంచి ఆకాశాన్ని చూపించాడు. ఆకాశాం వెనుకా, ఆకాశం ముందూ ఏముందో చూద్దామంటున్నాడు.

మనుషుల మధ్య 'హృదయం ప్రవేశించినపుడు' ఈ పుస్తకంలో ఆకాశాన్ని తనివితీరా చూడగలరు.

డిసెంబర్ 2011 'పాలపిట్ట ' సాహిత్య మాసపత్రిక నుండి

'ఆకాశం' సంపుటి  దొరికేచోట్లు:
1. పాలపిట్ట ప్రచురణలు,  హైదరాబాద్. ఫోన్: 040-27678430.
2. కినిగే.కాం లో ఈ బుక్ లేదా ముద్రిత ప్రతి కోసం  
ఇక్కడ క్లిక్ చేయండి 

1 కామెంట్‌: