కొందరు బయటికి ప్రయాణిస్తారు. కొందరు లోపలి ప్రయాణం చేస్తారు. బయటికి ప్రయాణం చేసేవాళ్ళ ‘ఎదుగుదల’ మనకు కనిపిస్తుంది. పేరు, పలుకుబడి, ఆస్తి, అధికారం వాళ్ళు అందుకుంటారు. వాళ్లకు మనం గొప్పతనం ఆపాదిస్తాం. ప్రపంచంలో పైకి రావడమంటే అదే.
కొందరు లోపలి ప్రయాణం చేస్తారు. వాళ్ళు అతికొద్దిమంది. ప్రపంచంనుంచీ వాళ్ళు అభినందనలు, సత్కారాలు ఆశించరు. వాళ్ళ ప్రయాణమే వాళ్ళ పరవశం.
బి.వి.వి. ప్రసాద్ ఆంతరిక ప్రయాణం అంతరిక్షయానం లాంటిదే. అది నిరంతరంగా కొనసాగుతూ ఉంటుంది. అతను అందుకున్న ఎత్తులు, ప్రయాణించిన లోతులు మన వూహకందనివి. అతని భాష గొప్ప సౌందర్యాన్ని, సౌకుమార్యాన్ని సాధించింది. అతని భావాలు మహాతాత్వికుల చింతనలు. ఐతే తాత్త్వికులకు లేని కవిత్వదృష్టి ప్రసాద్‌కు ఉంది. ఆధ్యాత్మికతకు అందాలద్దిన కళాశీలి ప్రసాద్.
నిజమైన నిర్లిప్తతలో, ఉదాసీనతలో మనం మనంగా నిలబడి నిఖిల ప్రపంచాన్నీ, నిర్మిలంగా చూస్తాం. ప్రసాద్ అన్నిటినీ ఆహ్వానిస్తూ దేనిలోనూ పడికొట్టుకుపోని ఆకాశం లాంటివాడు.
'సృష్టికి తానే కారణమై ఏమీ ఎరగనట్లుండే స్వచ్ఛతకీ
అన్నిటినీ తనలో పొదువుకుని, అన్నిటిలో ఒదిగి
ఏదీ తనది కాదన్నట్లుండే నిర్మల ప్రేమకీ
ఉండీ లేనట్లుండే ఉదాత్త స్వభావానికీ ఆకాశం ప్రతీక' అంటాడు.
అతనొక ఆకాశం. దేన్నీ కాదనడు. దేన్నీ కావాలనడు. తన స్వేచ్ఛను ఎక్కడా మలినపడనివ్వడు.
సామ్రాజ్యాల్ని సాధించడం గొప్పకాదు. ఆత్మ సామ్రాజ్యాన్ని సాధించడమన్నది అపూర్వ విషయం. సుకుమార సామ్రాజ్యాన్ని సృష్టించుకోవడం గొప్ప విషయం. ప్రసాద్ మనః ప్రపంచంలో కాఠిన్యముండదు. కరుణ ఉంటుంది. దౌర్జన్యముండదు. దయ ఉంటుంది. ఆ సామ్రాజ్యాన్ని మనం దురాక్రమించలేం. కారణం అక్కడ అనురాగమొక్కటే అన్నివేళలా అందరికీ అందుబాటులో ఉంటుంది. మనతో ఘర్షించని వ్యక్తిని మనం జయించలేం. అహంకారమున్నప్పుడే సంఘర్షణ ఉంటుంది. అన్నిటికీ ఆమోదద్వారాలు తెరచుకున్న ఈ సౌమ్యుడిని ప్రేమించడమొక్కటే చెయ్యగలం.
ప్రసాద్ ప్రవహించే నీళ్ళలాంటి వాడు. అడ్డంగా నిల్చున్నా, పక్కకు తొలిగి ప్రవాహం సాగిపోతుంది. ప్రసాద్ ప్రశ్నలకు అందడు. సమాధానాలకు లొంగడు. తెల్లని మేఘంలా తేలిపోతాడు. మధుర పరిమళాన్ని నింపుకున్న మందపవనంలా ముందుకు సాగిపోతాడు. నిర్ణయాలకు లొంగడు. స్వేచ్ఛ అతని ఊపిరి. నిజమైన స్వేచ్ఛ బాల్యంలో ఉందని, మనుషులు బాల్యాన్ని కోల్పోయి బండబారిపోతారని బాధపడతాడు. రుషులు బాల్యం కోసమే తపస్సు చేస్తారంటాడు.
'మునులెందుకు స్వేచ్ఛ కోసం తపస్సు చేస్తారో అర్థమైంది
సాటి మనుషులకన్నా చివరికి అన్నం కన్నా, గాలికన్నా
స్వేచ్ఛ ఎంత ప్రియమైందో అవసరమైందో తెలిసి వచ్చింది
మనిషి చేయవలసిన పనికి
వ్యతిరేకంగా ఎంత వేగంగా వెళుతున్నాడో అర్థమైంది
అప్పుడు నా ప్రయాణం మొదలైంది.'
దైవత్వం అక్షరాల్లో ఉంటుందంటే మనం నమ్మం. ఊహల్లో దయ, విశ్రాంతి తీసుకుంటుదంటే విశ్వసించం. వాక్యాలు పూలహారాల్లా ఉండొచ్చంటే నమ్మబుద్ధి కాదు. ‘నా అక్షరాలతో భగవంతుని వస్త్రాన్ని నేస్తాను’ అన్నాడు జర్మన్ మహాకవి గోధె. ‘‘వాగ్భూషణమే సుభూషణము భూషణముల్ నశియించునన్నియున్’’ అన్నాడు ఏనుగు లక్ష్మణ కవి. ఏ తఫః ఫలితంగా సాధించాడో ప్రసాద్ ఈ అక్షరాల్ని. సంస్కారాన్ని. సౌమ్యతను. సౌందర్యంలో అద్ది అజ్ఞాతాన్ని ఆరాధిస్తున్నాడు. జీవితం అహంకార చలనం కాదు. జీవితం ఆనంద గమనం. ఆనందంగా జీవించడానికి ఐశ్వర్యం అక్కర్లేదు. మనోహరంగా జీవించడానికి మణులూ, మాణిక్యాలూ అక్కర్లేదు. ప్రేమ, అనురాగం, దయ అంతరంగంలో ఉంటే అపూర్వంగా జీవించవచ్చు. పోలికలు లేకుంటే ఉల్లాసంగా బతకవచ్చు.
'దృశ్యమేదైనా చూడడమే ఆనందంగా
శబ్దమేదయినా వినటమే ఆనందంగా
రుచి ఏదైనా ఆస్వాదించటమే ఆనందంగా
జీవితమెలా ఉన్నా జీవించడమే ఆనందంగా'
ఉండడం తెలిసినవాడు ప్రసాద్. ప్రసాద్‌ది సరళ మార్గం. సహజ మార్గం. సత్యమార్గం. సకల జనులకూ ఆమోదయోగ్యమయిన మార్గం.
ఆంధ్రభూమి దినపత్రిక నుండి
'ఆకాశం' సంపుటి దొరికేచోట్లు:
1. పాలపిట్ట ప్రచురణలు, హైదరాబాద్. ఫోన్: 040-27678430.
2. కినిగే.కాం లో ఈ బుక్ లేదా ముద్రిత ప్రతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి
2. కినిగే.కాం లో ఈ బుక్ లేదా ముద్రిత ప్రతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి