21 నవంబర్ 2012

కవిని చూద్దామని

కవి ఎలావుంటాడో చూద్దామని అతని ఇంటికి వస్తారు
అక్షరాలకి జీవంపోసి దయ నింపేవాడూ
పదాలని శుభ్రం చేసి సౌందర్యం అద్దేవాడూ
వాక్యాలని నిద్రలేపి స్వప్న సంచారం చేయించేవాడూ
దయగా, అందంగా, చురుకుగా ఉండివుంటాడని 
తమ లోపలి కవిని వెలుపల ధ్రువపరచుకోడానికి అతన్ని చూడబోతారు

రోజూ చూసే ఇంటిలోని, వీధిలోని మనుషుల్లో ఒకడుగానే 
కవి వాళ్ళకి ఎదురౌతాడు
కాస్త నమ్రతా, గర్వం, మరికాస్త జాలీ, కోపం  
కొంచెం లౌక్యం, కొంచెం భోళా 
ఎపుడూ చూసే నమూనాల్లో ఒకడుగానే కవి వాళ్ళతో మాట్లాడతాడు

ఇతనూ మనలాంటివాడే కదా అనుకొంటూ 
భ్రమలు చిట్లిన నవ్వొకటి నవ్వుకొంటారు 
బహుశా, రాస్తున్నది ఇతను కాదు, 
ఏ దివ్యభావాలో ఇతన్ని వశపరచుకొని, వాహిక చేసుకొన్నాయని 
తాజా సమాధానంలోకి నిదానంగా తేటపడతారు 

కవిని నిజంగా ఎవరు కనిపెట్టగలరు 
పైపై నడతల నివురువెనుక తేజోరాశిని ఎవరు తాకగలరు 
తన అగ్ని ఎవరినీ దహించరాదనే దయచేత నటిస్తున్నాడని తెలుసుకోగలరు
తనలో నిదానంగా ఫలదీకృతమౌతున్న రేపటి కవితల్ని 
అతను మొరటుగా మట్టిలా దాస్తున్నాడని ఊహించగలరు 
అతనిలాంటి మరొక కవి మినహా, కవిత్వప్రేమికుడు మినహా  
అతని అంతరంగంలోకి సునాయాసంగా ఎవరు చొరబడగలరు

అందుకే చూడవచ్చిన వాళ్లకి వీడ్కోలు చెబుతూ 
'మీరు రావటం సంతోషం, మళ్ళీ కలుద్దాం ' అని కవి అంటున్నపుడు
అతని కళ్ళవంక ఎపుడూ చూడకండి 
తనని వాళ్ళు చూడలేకపోయారన్న బెంగ వాటిలో ముసురుకొని వుంటుంది

14 నవంబర్ 2012

పసిదనపు స్వర్గం


దైవంలాంటి మరొక ఉదయం  
పసిదనపు స్వర్గంలోని పిల్లలు
కవిచుట్టూ చేరి, 'మా గురించి కవిత్వం రాయ ' మని ఆజ్ఞాపించారు 
ఆనందసముద్రంలో ఆల్చిప్పల్లా విచ్చుకొన్న కళ్ళల్లో
ఆశ్చర్యాల ముత్యాలు ఊగుతున్నాయి 

కవి వాళ్ళ గురించి ఏమి రాస్తాడు
వాళ్ళపైన కవిత్వం రాయటానికి వాళ్ళలాగా కావాలి
ఇంతకాలం రహస్యంగా పోగేసుకొన్న భయాలనీ
జ్ఞానమని భ్రమిస్తున్న ఉత్త జ్ఞాపకాలనీ 
కాసేపైనా విప్పుకొని సూర్యకిరణాల తీగలమీద ఆరేసుకోవాలి    

పొందటమే కాని, పోగొట్టుకొనే విద్య తెలియని
తీసుకోవటమే కాని, ఇవ్వటం ఎలాగో మరిచిన
చీకటి దారులవెంట ఇరుకిరుకు గుహల్లో పడి 
కవి చాలా దూరం నడిచివచ్చాడు

'మన్నించండి, నేను రాయలేను
నాలోని అమాయకత్వం చాలాకాలాల క్రితమే అదృశ్యమయింది

నేను జీవితాన్ని జీవించడం ఏనాడో మానేసాను
ఆనందాన్ని ఆనందించడం కోల్పోయాను

దేనినీ పట్టించుకోని
నాలోని సాహసపు విద్యుల్లతను ఏనాడో ఉండచుట్టి మూలకు విసిరేసాను
అందంలోకో, ఆర్ద్రతలోకో అలవోకగా కరిగిపోయే ద్రవమేదో నాలో ఆవిరైపోయింది

నేనిపుడు అలవాట్లనీ, ఆలోచనలనీ జీవిస్తున్నాను
నేనిపుడు ఉద్వేగాలనీ, గాయాలనీ పూజిస్తున్నాను
నన్ను శకలాలు చేసి చూసుకొని మురిసిపోయే
తెలివితేటల బాటల వెంట
అందరికన్నా ముందుకు దూసుకుపోయే పనిలో ఉన్నాను

పిల్లల్లారా, నన్ను మన్నించండి
నాలో మరక వలే మిగిలిన పురాతన స్మృతి ఏదో  
నేను మీలోంచి మొరటుదనంలోకి తరలిపోయానని చెబుతోంది
నా జీవనానందం ఏనాడో బెరడు కట్టిందని విసుక్కొంటోంది
మీపైన కవిత్వం రాయలేను
నేనిక పసిదనపు స్వర్గంలో అడుగు పెట్టలేను '

కవిచుట్టూ ఆవరించిన స్వప్నగోళంలోని పిల్లలు
దేవతల్లా, పక్షుల్లా, చెట్లలా కాంతులీనుతున్న పిల్లలు
సూర్యకాంతిలా, శుభ్రశ్వాసలా, రంగుల్లా, పరిమళాల్లా, రుచుల్లా
జీవితోత్సవం నిండిన పిల్లలు
రుతువుల్లా, ఆకాశంలా, మబ్బుల్లా
నదీజలాల్లా, వాటి పరుగులా, సముద్రాల్లా, నురగల్లా 
జీవితంలోకి జీవించటం నింపుతోన్న పిల్లలు
నవ్వుల్లా, కేరింతల్లా, కపటం తాకలేని కన్నీటి జడుల్లా
ఇది జీవితం మినహా మరేమీ కాదని ప్రకటిస్తున్న పిల్లలు  

దయగా, మరికాస్త దయగా, మరింత దయగా
అతన్ని కౌగలించుకొన్నారు
ముద్దుపెట్టుకొన్నారు
అతని తలపై నిమిరారు
అరక్షణం వారి అమాయకత్వాన్ని విడిచి
అర్ధవంతమైన చూపుల వెన్నెల కురిపించి ఆపాదమస్తకం అభిషేకించారు   

కవి ఇపుడు కన్నీటి శిఖరమయ్యాడు
తల వాల్చి, కనురెప్పలు వాల్చి, లోలోపలి ఉద్రేకాలు రాల్చి
తనలో ఎగిరెగిరి పడుతున్న వేల గర్వాల సముద్రపక్షుల్ని  
దు:ఖకెరటాలూపి దూరతీరాలకు పంపిస్తున్నాడు

కవిలో ఇపుడు
దేశాలూ, మతాలూ, జాతులూ కరిగి నీరై పోతున్నాయి 
చరిత్రలూ, వ్యవస్థలూ, తనపరభేదాలూ - అర్ధాలు కోల్పోయి చెదిరిపోతున్నాయి  
కవిలో ఇపుడు నల్లని శిలలేవో, శిలాజాలేవో
మంచై, నీరై, ఆవిరుల స్వరాలై 
కాంతికిరణాల కౌగిలి వెంట కనిపించని లోకాలకి తరలిపోతున్నాయి

పిల్లల కాంతిగోళం, కవి యుగాల జీవితాన్ని రద్దుచేసి
మెలకువలోకీ, మెలకువలాంటి తాజాదనంలోకీ   
క్షణమంత తేలికా, శాశ్వతమంత స్థిరమూ అయిన జీవితంలోకీ తీసుకువచ్చింది    

పసిదనపు స్వర్గం
అతన్ని పచ్చని ఆకునీ, పచ్చదనాన్నీ చేసింది
పూవునీ, పూలరంగుల్నీ, పరిమళాన్నీ, వికాసాన్నీ చేసింది   
పక్షినీ, పక్షుల పాటనీ, పక్షిరెక్కల చుట్టూ పరుచుకొన్న వినీలగగనాన్నీ చేసింది      

అతనికి ఎడతెగని ఆశ్చర్యాన్నీ, జవాబు అవసరం లేని ప్రశ్నలనీ
ఏమీ లేని మౌనాన్నీ, ఏమీ కాని శాంతినీ,   
ఏ దిగులు రంగులూ కనరాని కాంతినీ ప్రసాదించింది     

అతను నమ్రతగా, కృతజ్ఞతగా
ఆ దేవతల ముందు చేతులు జోడించి నిలుచున్నాడు చివరిసారి  

అప్పుడు వాళ్ళలో ఒకరు
'కవీ ఇప్పుడు కవిత్వం చెప్పు ' అనగా విని
కొత్తగా చేరిన పిల్లవాడొకడు
అటూ, ఇటూ చూసి 'కవి అంటే ఎవరు ' అని అడిగాడు

పసిదనపు స్వర్గం ఫకాలున నవ్వుల్లో మునిగి
అక్షరాలను విడిచి ఎటో ఎగిరిపోయింది



_____________________________
ప్రసారం: ఆకాశవాణి, విజయవాడ  14.11.12 

03 నవంబర్ 2012

ఇస్మాయిల్‌గారి స్మృతి: ఒక పక్వఫలం!


 జీవన సౌందర్యమూ, సౌకుమార్యమూ తెలిసిన మిత్రుడొకరు ఒక సాయంత్రం ఫోన్ చేసి ‘నేనొక చిట్టడవిలో ఉన్నాను. పక్షుల కూతలు వింటున్నాను. ఉన్నట్టుండి నా చుట్టూ ఉన్నదంతా ప్రవహించిపోతున్నట్టూ, నా శరీరం మాత్రమే జడంగా ఉన్నట్టూ అనిపించింది’ అన్నారు. ‘అవును, మనసు లోపలికంటా ఉన్న ఆందోళననీ, వెలితినీ మరచి, కేవలం ప్రకృతిలో మమేకమైనపుడు అది పూర్తి ప్రశాంతంగా ఉంటుంది. అలా ఎక్కువ సమయం ఉంటే శరీరం కూడా లేనట్టుంటుంది.’ అన్నాను. కవీ, చిత్రకారుడూ అయిన ఆ మిత్రునితో ‘మన కవిత్వం, బొమ్మలూ, అన్నీ కూడా భయం నుంచే జనిస్తాయి. భయానికీ, స్వేచ్ఛకీ మధ్య ఘర్షణలోంచి అవి అన్నీ సృష్టిస్తాం. భయాన్ని దాటిన క్షణాల్లో మనకు తెలిసిందీ ఏమీ లేదు. తెలియాల్సిందీ ఏమీ లేదు అనిపి స్తుంది’ అన్నాను. మిత్రుడు ఆ మాటలకు సంతోషించాడు. అతని ప్రశాంతతలోకి అంతకన్నా ఎక్కువగా చొరబడడం ఇష్టం లేక త్వరగా సంభాషణ ముగించాను.

స్పష్టమైన ఎరుక

బహుశా మా సంభాషణని లీలగా ఎక్కడి నుంచో ఇస్మా యిల్‌గారు విని తల పంకించి ఉంటారనుకుంటాను. కవి త్వం, ఆర్టు, సేవ-మాధ్యమం ఏదైనా-వాటి ద్వారా ప్రకటిం చే వ్యక్తులు రెండువిధాలుగా ఉంటారు. ఒకరు-ఆయా విష యాలలో ఎంతో పరిజ్ఞానమూ, అనుభవమూ సంపాదిం చిన తరువాత కూడా వాటి వలన పేరూ, ఇతర ప్రయోజనా లూ లక్ష్యంగా పనిచేస్తారు. వారికి మాధ్యమం కన్నా దాని ద్వారా సిద్ధించే ప్రయోజనాలే ముఖ్యం. మరొకరు ఆయా మాధ్యమాల లోతుల్లోకి ప్రయాణించి వాటి అంతస్సారాన్ని కనుగొని వాటిలోకి తమని కోల్పోయి - నిజమైన జీవితోత్సవంలోకి మేలుకొంటారు. అటువంటి వారి ద్వారా ఉదాత్త విలువలు తమని ప్రకటించుకుంటాయి. వీరిలో ఇస్మాయిల్ గారు రెండవ తరహా వ్యక్తి. మానవ సంస్కృ తిలో, సాహిత్యంలో ఇప్పటివరకు మొదటి తరహా వ్యక్తులు అధికం. కళ పరమావధి పట్ల స్పష్టమైన ఎరుక కలిగిన అరుదైన వ్యక్తులలో ఇస్మాయిల్‌గారు ఒకరు.

చేతనా నైశిత్యం

కళ కళకోసమే అని పూర్వు లు చెప్పినపుడు కళ వినో దం కోసం అని అర్థం కాదు. సామాన్యులలో నిద్రాణంగా ఉండే మానసిక చైతన్యాన్ని మరింత మేలుకొలపడానికే కళలని అర్థం చేసుకోవాలి. కేవల వినోద ప్రధానమైన కళలు మనిషిలోని సృజనా త్మ కతనీ, చైతన్యాన్నీ సుప్తావస్థలోకి తీసుకెళ తాయి. అయితే మనిషి చైతన్యవంతుడు కావడం అంటే మరింతగా మానవ సామాజిక జీవనంలో కల్పించుకోవడం అని అర్థం కాదు. మరింత ఎక్కువగా గాఢంగా మొత్తం జీవితం పట్ల ఎరుక కలిగి ఉండడం అని గ్రహించాలి. దీనినే ఇస్మాయిల్ గారి వంటి వారు చేతనా నైశిత్యం (సెన్సిబిలిటీ) అంటారు. ఈ చేతనా నైశిత్యాన్ని పెంచడమే కళకు తనంత తానుగా స్వతహాగా ఉన్న లక్ష్యం. కవిత్వం ఈ ఉదాత్త లక్ష్యాన్ననుసరించాలని ఇస్మాయిల్‌గారు జీవితమంతా చెబుతూ వచ్చారు.

విలువైన బహుమతులు

మనకు, ముఖ్యంగా తెలు గు వాళ్లకి ఓపిక తక్కువ. ఒక ఉద్వేగాన్ని ఎక్కువ సేపు నిలబెట్టుకోవడానికీ, ఒక ఆలోచనని అనుస రించి చివరికంటా ప్రయా ణించడానికీ, ఒక దృష్టి లోతుకంటా ప్రవేశపెట్టడా నికీ చాలా ఓపిక కావాలి. శ్రద్ధ కావాలి. చాలా సంయ మనం కావాలి. ప్రశాంతత కావాలి. మనం కొంచెం కంగారు మనుషులం. త్వరగా నిర్ణయాలు జర గాలి. త్వరగా పని చేయా లి. అంతకన్నా త్వరగా ఫలితం అనుభవించాలి. మనకు సాఫీగా దారి వెంట నడవడం కంటె ఒక ట్రెడ్‌మిల్ ఊహించుకుని దాని మీద పరుగులు తీయడం పట్ల అభిరుచి. ఒక్క అడుగూ ముందుకు పడకపోయినా, మనం చాలా చైతన్యంగా ఉన్నామనుకొని సంతోషిస్తాం. ఇలాంటి వాతావరణంలో ఇస్మాయిల్‌గారు నిశ్శబ్దంగా, నింపాదిగా మనకు విలువైన బహుమతులు అందచేసి వెళ్లిపోయారు. ఆయన రాసిన అనేక కవితలని మనం మృదువుగా, గాఢంగా హృదయానికి హత్తుకొంటే ఆయన ఎంత లోతైన ప్రశాంతతని మనలో నాటే ప్రయత్నం చేశారో అర్థమవుతుంది.

విశుద్ధ అనుభవం

చిట్టడవిలోని నిశ్శబ్దంలో, ఒక పక్షి కూత విన్న మిత్రునితో ‘ పక్షికి సంబంధించిన, కూతకు సంబంధించిన సమాచారం మనకు అనవసరం. ఒక శబ్దం వింటాం. కేవలం ఒక శబ్దం. కేవలం ఆ శబ్దం వినడానికే ఈ లోకంలోకి వచ్చినంత శ్రద్ధగా. అలా విన్నపుడు అది మనని శుభ్రం చేస్తుంది’ అన్నాను. అలాంటి శుభ్రమైన స్థితిలోనే సృజనాత్మకతా, హృదయమూ, బుద్ధీ వికసిస్తాయి. మనం మరింత నాణ్యత గల జీవితం గడుపుతూ, సాటి వారికి నిజమైన సహాయం చేయగలుగుతాం. ఇస్మాయిల్ గారి కవిత్వం ఎప్పుడూ చెబుతున్నదిదే. సమాచారాలన్నిటినీ పూర్తిగా తుడిచేసి కేవలం విశుద్ధ అనుభవాన్నివ్వడానికే ఆయన ఎప్పుడూ ప్రయత్నించారు. తెల్ల కాగితం మీద ‘ ఒక అడ్డగీతా ఒక నిలువు గీతా’ గీసి ఒక గోదావరి లంక గ్రామాన్నీ, అక్కడి మొత్తం వాతావరణంలోని ప్రశాంతతనీ, సమగ్రతనీ మనలో మృదువుగా ప్రవేశపెడతారాయన.

గీసింది - చెరిపింది

జీవితం కాని, కళ కాని మరింత, మరిన్ని అనే సంఖ్యా వ్యామోహం నుంచి బయటపడి స్వచ్ఛమైన జీవనసారం లోకీ, రహస్యంలోకీ ప్రవేశించడం మొదలుపెట్టినపుడు - పోగు చెయ్యడంలో కన్నా, పోగొట్టుకోవడంలో సుఖం స్వేచ్ఛ ఉన్నాయని, మనం ‘గీసింది కన్నా , చెరుపుకోగలి గింది’ మనని బాగా వ్యక్తం చేస్తుందని, దానికి ఎంతో ప్రజ్ఞా ఓర్పూ అవసరమని మనకు అర్థమవుతుంది.

అనేక కసరుకాయలతో నిండిన మన కాలం తెలుగు కవిత్వ వృక్షంలో ఇస్మాయిల్ గారి కవిత్వం సహజంగా పక్వమైన ఒక మధుర ఫలం. మనం ఇస్మాయిల్ గారితో కలిసి నడవడానికి ఇంకా చాలా దూరం నడవవలసి ఉంటుంది.



ఇస్మాయిల్ గారి కవిత్వం ఈ బ్లాగులో చదవవచ్చు: http://ismailmitramandali.blogspot.in/


వ్యాసం ప్రచురణ: సాక్షి దినపత్రిక
http://www.sakshi.com/main/Weeklydetails.aspx?Newsid=21917&Categoryid=1&subcatid=3

01 నవంబర్ 2012

కంప్యూటరు పూలు


కంప్యూటరు తెర మీద రంగురంగుల పూలు పలకరించి వెళుతున్నాయి
నిజమైన చాలా వాటిని చూడటంకన్నా, ఈ పూలని చూడటం బాగుంటుంది
ఇంత స్పష్టంగా, కాంతిగా, ఇంత పరిణామంలో పూలని ఎప్పుడూ చూడలేదు

బయట పూల అనుభవం ఇంత సుఖంగా, తేటగా ఉండదు
అక్కడ పూలతోపాటు అనేకం పలకరిస్తాయి

మట్టీ, గాలితెరలూ, వెచ్చని, చల్లని వాతావరణాలూ,
వికాసంలోకో, వడిలిపోవటంలోకో పూల ప్రయాణాలూ, పరిమళాలూ
వాటి వివరాలేమిటనో, సొంతమెలా చేసుకోవాలనో ఆలోచనల రొదలూ
దేహభారమూ, పనుల, పథకాల, పక్క మనుషుల చిక్కుముడులూ
అన్నీ కలిపి చూపునీ, అనుభవాన్నీ కప్పేస్తాయి

ఈ తెర మీది పూలతో ఏ గొడవా లేదు
చూడటం మినహా మరే పనీ లేనపుడు అవి నాలోకి ప్రవహిస్తాయి

ఇవి పూలు కాదు, పూల జ్ఞాపకాలే, రంగులు కాదు, రంగుల పరిచయాలే
అయినా ఈ కాస్తంత పూల అనుభూతి చాలు
వెలుపలి జీవితం చీకటిలోకి ప్రయాణిస్తున్నపుడు
వెలుతురు సూదిమొనల్లాంటి పూల జ్ఞాపకాలు చాలు

వీటి రంగులు ఇప్పుడు కొత్తగా చూస్తున్నాను
పూవులిలా ఉంటాయని, రంగులిలా ఉంటాయని
రంగులతో, పూవులతో, వెలుతురుతో నిండిన ప్రపంచం ఇలా ఉంటుందని
ఇప్పుడు కంప్యూటరు నాకు నేర్పుతోంది

బాగా తెలుసుకోవాలి జీవితాన్ని జీవించటాన్ని
తెలుసుకొని, తెలుసుకొని
ఎప్పుడో కంప్యూటరు నుండి జీవితం లోకి అమాంతం ప్రవేశించాలి

___________________________________
ప్రచురణ: తెలుగు.వన్ఇండియా.ఇన్ 31.10.2012
http://telugu.oneindia.in/sahiti/kavitha/2012/bvv-prasad-poem-computer-poolu-107764.html