03 నవంబర్ 2012

ఇస్మాయిల్‌గారి స్మృతి: ఒక పక్వఫలం!


 జీవన సౌందర్యమూ, సౌకుమార్యమూ తెలిసిన మిత్రుడొకరు ఒక సాయంత్రం ఫోన్ చేసి ‘నేనొక చిట్టడవిలో ఉన్నాను. పక్షుల కూతలు వింటున్నాను. ఉన్నట్టుండి నా చుట్టూ ఉన్నదంతా ప్రవహించిపోతున్నట్టూ, నా శరీరం మాత్రమే జడంగా ఉన్నట్టూ అనిపించింది’ అన్నారు. ‘అవును, మనసు లోపలికంటా ఉన్న ఆందోళననీ, వెలితినీ మరచి, కేవలం ప్రకృతిలో మమేకమైనపుడు అది పూర్తి ప్రశాంతంగా ఉంటుంది. అలా ఎక్కువ సమయం ఉంటే శరీరం కూడా లేనట్టుంటుంది.’ అన్నాను. కవీ, చిత్రకారుడూ అయిన ఆ మిత్రునితో ‘మన కవిత్వం, బొమ్మలూ, అన్నీ కూడా భయం నుంచే జనిస్తాయి. భయానికీ, స్వేచ్ఛకీ మధ్య ఘర్షణలోంచి అవి అన్నీ సృష్టిస్తాం. భయాన్ని దాటిన క్షణాల్లో మనకు తెలిసిందీ ఏమీ లేదు. తెలియాల్సిందీ ఏమీ లేదు అనిపి స్తుంది’ అన్నాను. మిత్రుడు ఆ మాటలకు సంతోషించాడు. అతని ప్రశాంతతలోకి అంతకన్నా ఎక్కువగా చొరబడడం ఇష్టం లేక త్వరగా సంభాషణ ముగించాను.

స్పష్టమైన ఎరుక

బహుశా మా సంభాషణని లీలగా ఎక్కడి నుంచో ఇస్మా యిల్‌గారు విని తల పంకించి ఉంటారనుకుంటాను. కవి త్వం, ఆర్టు, సేవ-మాధ్యమం ఏదైనా-వాటి ద్వారా ప్రకటిం చే వ్యక్తులు రెండువిధాలుగా ఉంటారు. ఒకరు-ఆయా విష యాలలో ఎంతో పరిజ్ఞానమూ, అనుభవమూ సంపాదిం చిన తరువాత కూడా వాటి వలన పేరూ, ఇతర ప్రయోజనా లూ లక్ష్యంగా పనిచేస్తారు. వారికి మాధ్యమం కన్నా దాని ద్వారా సిద్ధించే ప్రయోజనాలే ముఖ్యం. మరొకరు ఆయా మాధ్యమాల లోతుల్లోకి ప్రయాణించి వాటి అంతస్సారాన్ని కనుగొని వాటిలోకి తమని కోల్పోయి - నిజమైన జీవితోత్సవంలోకి మేలుకొంటారు. అటువంటి వారి ద్వారా ఉదాత్త విలువలు తమని ప్రకటించుకుంటాయి. వీరిలో ఇస్మాయిల్ గారు రెండవ తరహా వ్యక్తి. మానవ సంస్కృ తిలో, సాహిత్యంలో ఇప్పటివరకు మొదటి తరహా వ్యక్తులు అధికం. కళ పరమావధి పట్ల స్పష్టమైన ఎరుక కలిగిన అరుదైన వ్యక్తులలో ఇస్మాయిల్‌గారు ఒకరు.

చేతనా నైశిత్యం

కళ కళకోసమే అని పూర్వు లు చెప్పినపుడు కళ వినో దం కోసం అని అర్థం కాదు. సామాన్యులలో నిద్రాణంగా ఉండే మానసిక చైతన్యాన్ని మరింత మేలుకొలపడానికే కళలని అర్థం చేసుకోవాలి. కేవల వినోద ప్రధానమైన కళలు మనిషిలోని సృజనా త్మ కతనీ, చైతన్యాన్నీ సుప్తావస్థలోకి తీసుకెళ తాయి. అయితే మనిషి చైతన్యవంతుడు కావడం అంటే మరింతగా మానవ సామాజిక జీవనంలో కల్పించుకోవడం అని అర్థం కాదు. మరింత ఎక్కువగా గాఢంగా మొత్తం జీవితం పట్ల ఎరుక కలిగి ఉండడం అని గ్రహించాలి. దీనినే ఇస్మాయిల్ గారి వంటి వారు చేతనా నైశిత్యం (సెన్సిబిలిటీ) అంటారు. ఈ చేతనా నైశిత్యాన్ని పెంచడమే కళకు తనంత తానుగా స్వతహాగా ఉన్న లక్ష్యం. కవిత్వం ఈ ఉదాత్త లక్ష్యాన్ననుసరించాలని ఇస్మాయిల్‌గారు జీవితమంతా చెబుతూ వచ్చారు.

విలువైన బహుమతులు

మనకు, ముఖ్యంగా తెలు గు వాళ్లకి ఓపిక తక్కువ. ఒక ఉద్వేగాన్ని ఎక్కువ సేపు నిలబెట్టుకోవడానికీ, ఒక ఆలోచనని అనుస రించి చివరికంటా ప్రయా ణించడానికీ, ఒక దృష్టి లోతుకంటా ప్రవేశపెట్టడా నికీ చాలా ఓపిక కావాలి. శ్రద్ధ కావాలి. చాలా సంయ మనం కావాలి. ప్రశాంతత కావాలి. మనం కొంచెం కంగారు మనుషులం. త్వరగా నిర్ణయాలు జర గాలి. త్వరగా పని చేయా లి. అంతకన్నా త్వరగా ఫలితం అనుభవించాలి. మనకు సాఫీగా దారి వెంట నడవడం కంటె ఒక ట్రెడ్‌మిల్ ఊహించుకుని దాని మీద పరుగులు తీయడం పట్ల అభిరుచి. ఒక్క అడుగూ ముందుకు పడకపోయినా, మనం చాలా చైతన్యంగా ఉన్నామనుకొని సంతోషిస్తాం. ఇలాంటి వాతావరణంలో ఇస్మాయిల్‌గారు నిశ్శబ్దంగా, నింపాదిగా మనకు విలువైన బహుమతులు అందచేసి వెళ్లిపోయారు. ఆయన రాసిన అనేక కవితలని మనం మృదువుగా, గాఢంగా హృదయానికి హత్తుకొంటే ఆయన ఎంత లోతైన ప్రశాంతతని మనలో నాటే ప్రయత్నం చేశారో అర్థమవుతుంది.

విశుద్ధ అనుభవం

చిట్టడవిలోని నిశ్శబ్దంలో, ఒక పక్షి కూత విన్న మిత్రునితో ‘ పక్షికి సంబంధించిన, కూతకు సంబంధించిన సమాచారం మనకు అనవసరం. ఒక శబ్దం వింటాం. కేవలం ఒక శబ్దం. కేవలం ఆ శబ్దం వినడానికే ఈ లోకంలోకి వచ్చినంత శ్రద్ధగా. అలా విన్నపుడు అది మనని శుభ్రం చేస్తుంది’ అన్నాను. అలాంటి శుభ్రమైన స్థితిలోనే సృజనాత్మకతా, హృదయమూ, బుద్ధీ వికసిస్తాయి. మనం మరింత నాణ్యత గల జీవితం గడుపుతూ, సాటి వారికి నిజమైన సహాయం చేయగలుగుతాం. ఇస్మాయిల్ గారి కవిత్వం ఎప్పుడూ చెబుతున్నదిదే. సమాచారాలన్నిటినీ పూర్తిగా తుడిచేసి కేవలం విశుద్ధ అనుభవాన్నివ్వడానికే ఆయన ఎప్పుడూ ప్రయత్నించారు. తెల్ల కాగితం మీద ‘ ఒక అడ్డగీతా ఒక నిలువు గీతా’ గీసి ఒక గోదావరి లంక గ్రామాన్నీ, అక్కడి మొత్తం వాతావరణంలోని ప్రశాంతతనీ, సమగ్రతనీ మనలో మృదువుగా ప్రవేశపెడతారాయన.

గీసింది - చెరిపింది

జీవితం కాని, కళ కాని మరింత, మరిన్ని అనే సంఖ్యా వ్యామోహం నుంచి బయటపడి స్వచ్ఛమైన జీవనసారం లోకీ, రహస్యంలోకీ ప్రవేశించడం మొదలుపెట్టినపుడు - పోగు చెయ్యడంలో కన్నా, పోగొట్టుకోవడంలో సుఖం స్వేచ్ఛ ఉన్నాయని, మనం ‘గీసింది కన్నా , చెరుపుకోగలి గింది’ మనని బాగా వ్యక్తం చేస్తుందని, దానికి ఎంతో ప్రజ్ఞా ఓర్పూ అవసరమని మనకు అర్థమవుతుంది.

అనేక కసరుకాయలతో నిండిన మన కాలం తెలుగు కవిత్వ వృక్షంలో ఇస్మాయిల్ గారి కవిత్వం సహజంగా పక్వమైన ఒక మధుర ఫలం. మనం ఇస్మాయిల్ గారితో కలిసి నడవడానికి ఇంకా చాలా దూరం నడవవలసి ఉంటుంది.



ఇస్మాయిల్ గారి కవిత్వం ఈ బ్లాగులో చదవవచ్చు: http://ismailmitramandali.blogspot.in/


వ్యాసం ప్రచురణ: సాక్షి దినపత్రిక
http://www.sakshi.com/main/Weeklydetails.aspx?Newsid=21917&Categoryid=1&subcatid=3

2 కామెంట్‌లు:

  1. ప్రసాద్ గారు , చాలా మంచి తాత్విక కళా వ్యాసం . " మనసు లోపలికంటా ఉన్న ఆందోళననీ, వెలితినీ మరచి, కేవలం ప్రకృతిలో మమేకమైనపుడు అది పూర్తి ప్రశాంతంగా ఉంటుంది. అలా ఎక్కువ సమయం ఉంటే శరీరం కూడా లేనట్టుంటుంది.’ కవీ, చిత్రకారుడూ అయిన ఆ మిత్రునితో ‘మన కవిత్వం, బొమ్మలూ, అన్నీ కూడా భయం నుంచే జనిస్తాయి. భయానికీ, స్వేచ్ఛకీ మధ్య ఘర్షణలోంచి అవి అన్నీ సృష్టిస్తాం. భయాన్ని దాటిన క్షణాల్లో మనకు తెలిసిందీ ఏమీ లేదు. తెలియాల్సిందీ ఏమీ లేదు అనిపి స్తుంది’" .

    రిప్లయితొలగించండి
  2. ధన్యవాదాలు గంగారెడ్డి గారూ, మీరు ఉదాహరించిన వాక్యాలు చాలా ముఖ్యమైనవి. వీటి గురించి సాహిత్యంలో విస్తృతంగా ఆలోచన జరగాలనుకొంటాను.

    రిప్లయితొలగించండి