21 నవంబర్ 2012

కవిని చూద్దామని

కవి ఎలావుంటాడో చూద్దామని అతని ఇంటికి వస్తారు
అక్షరాలకి జీవంపోసి దయ నింపేవాడూ
పదాలని శుభ్రం చేసి సౌందర్యం అద్దేవాడూ
వాక్యాలని నిద్రలేపి స్వప్న సంచారం చేయించేవాడూ
దయగా, అందంగా, చురుకుగా ఉండివుంటాడని 
తమ లోపలి కవిని వెలుపల ధ్రువపరచుకోడానికి అతన్ని చూడబోతారు

రోజూ చూసే ఇంటిలోని, వీధిలోని మనుషుల్లో ఒకడుగానే 
కవి వాళ్ళకి ఎదురౌతాడు
కాస్త నమ్రతా, గర్వం, మరికాస్త జాలీ, కోపం  
కొంచెం లౌక్యం, కొంచెం భోళా 
ఎపుడూ చూసే నమూనాల్లో ఒకడుగానే కవి వాళ్ళతో మాట్లాడతాడు

ఇతనూ మనలాంటివాడే కదా అనుకొంటూ 
భ్రమలు చిట్లిన నవ్వొకటి నవ్వుకొంటారు 
బహుశా, రాస్తున్నది ఇతను కాదు, 
ఏ దివ్యభావాలో ఇతన్ని వశపరచుకొని, వాహిక చేసుకొన్నాయని 
తాజా సమాధానంలోకి నిదానంగా తేటపడతారు 

కవిని నిజంగా ఎవరు కనిపెట్టగలరు 
పైపై నడతల నివురువెనుక తేజోరాశిని ఎవరు తాకగలరు 
తన అగ్ని ఎవరినీ దహించరాదనే దయచేత నటిస్తున్నాడని తెలుసుకోగలరు
తనలో నిదానంగా ఫలదీకృతమౌతున్న రేపటి కవితల్ని 
అతను మొరటుగా మట్టిలా దాస్తున్నాడని ఊహించగలరు 
అతనిలాంటి మరొక కవి మినహా, కవిత్వప్రేమికుడు మినహా  
అతని అంతరంగంలోకి సునాయాసంగా ఎవరు చొరబడగలరు

అందుకే చూడవచ్చిన వాళ్లకి వీడ్కోలు చెబుతూ 
'మీరు రావటం సంతోషం, మళ్ళీ కలుద్దాం ' అని కవి అంటున్నపుడు
అతని కళ్ళవంక ఎపుడూ చూడకండి 
తనని వాళ్ళు చూడలేకపోయారన్న బెంగ వాటిలో ముసురుకొని వుంటుంది

3 కామెంట్‌లు:

  1. విశ్వనాథ వారిని చూడటానికి ఆయన ఒక అభిమాని వెళ్ళినప్పుడు కవిగారు చిన్నతుండు కట్టుకుని ఆ రోజు పెట్టవలసిన ఆవకాయకోసం బేసిన్లో పాళ్ళు కలుపుతూ కనిపించాడుట.ఆ అభిమాని ఇప్పుడు మీరు ఇక్కడ చెప్పిన పద్యంలో లాగే నివ్వెర పోయుంటాడేమో కదా!అభిమాని నివ్వెరపాటును కూడా కవి గారు అచ్చంగా మీరిక్కడ చెప్పినట్లే స్పందించి ఉంటారు.గహ్యమైన భావాలను సాంద్రత చెదరకుండా సరళ సుందర వ్యాఖ్యానంగా మలిచగలిగే అక్షర రసవిద్య ప్రస్తుతం నడుస్తున్న తరంలో నిస్సందేహంగా మీకే సొంతం.మీ మార్గం మీదే.మీ దుర్గమ్ చేరడం చాలా కష్టం.ఇలాంటి కవితలు చదువుతున్నప్పుడు మనసు మళ్ళీ recharge ఐనట్లు ఉంటుంది.నమస్కారం Bvv Prasad sir!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ కవిత బాగున్నది ప్రసాద్ గారు. పైన హనుమంతరావుగారు చెప్పినటువంటి దృశ్యం, ప్రముఖ చాయా చిత్రకారుడు శ్రీ నీలంరాజు మురళీధర్ గారు తన కెమెరాలో బంధించారు. ఆ చిత్రాలన్ని తిరుమల రామచంద్రగారు వ్రాసిన ఒక పుస్తకంలో వచ్చినాయి. ఈ కింది లింకు సహాయంతో చూడవచ్చు.

      http://saahitya-abhimaani.blogspot.in/2011/05/blog-post_10.html

      తొలగించండి
  2. ధన్యవాదాలు సర్, నమస్కారాలతో.. మీ.. ప్రసాద్

    రిప్లయితొలగించండి