14 నవంబర్ 2012

పసిదనపు స్వర్గం


దైవంలాంటి మరొక ఉదయం  
పసిదనపు స్వర్గంలోని పిల్లలు
కవిచుట్టూ చేరి, 'మా గురించి కవిత్వం రాయ ' మని ఆజ్ఞాపించారు 
ఆనందసముద్రంలో ఆల్చిప్పల్లా విచ్చుకొన్న కళ్ళల్లో
ఆశ్చర్యాల ముత్యాలు ఊగుతున్నాయి 

కవి వాళ్ళ గురించి ఏమి రాస్తాడు
వాళ్ళపైన కవిత్వం రాయటానికి వాళ్ళలాగా కావాలి
ఇంతకాలం రహస్యంగా పోగేసుకొన్న భయాలనీ
జ్ఞానమని భ్రమిస్తున్న ఉత్త జ్ఞాపకాలనీ 
కాసేపైనా విప్పుకొని సూర్యకిరణాల తీగలమీద ఆరేసుకోవాలి    

పొందటమే కాని, పోగొట్టుకొనే విద్య తెలియని
తీసుకోవటమే కాని, ఇవ్వటం ఎలాగో మరిచిన
చీకటి దారులవెంట ఇరుకిరుకు గుహల్లో పడి 
కవి చాలా దూరం నడిచివచ్చాడు

'మన్నించండి, నేను రాయలేను
నాలోని అమాయకత్వం చాలాకాలాల క్రితమే అదృశ్యమయింది

నేను జీవితాన్ని జీవించడం ఏనాడో మానేసాను
ఆనందాన్ని ఆనందించడం కోల్పోయాను

దేనినీ పట్టించుకోని
నాలోని సాహసపు విద్యుల్లతను ఏనాడో ఉండచుట్టి మూలకు విసిరేసాను
అందంలోకో, ఆర్ద్రతలోకో అలవోకగా కరిగిపోయే ద్రవమేదో నాలో ఆవిరైపోయింది

నేనిపుడు అలవాట్లనీ, ఆలోచనలనీ జీవిస్తున్నాను
నేనిపుడు ఉద్వేగాలనీ, గాయాలనీ పూజిస్తున్నాను
నన్ను శకలాలు చేసి చూసుకొని మురిసిపోయే
తెలివితేటల బాటల వెంట
అందరికన్నా ముందుకు దూసుకుపోయే పనిలో ఉన్నాను

పిల్లల్లారా, నన్ను మన్నించండి
నాలో మరక వలే మిగిలిన పురాతన స్మృతి ఏదో  
నేను మీలోంచి మొరటుదనంలోకి తరలిపోయానని చెబుతోంది
నా జీవనానందం ఏనాడో బెరడు కట్టిందని విసుక్కొంటోంది
మీపైన కవిత్వం రాయలేను
నేనిక పసిదనపు స్వర్గంలో అడుగు పెట్టలేను '

కవిచుట్టూ ఆవరించిన స్వప్నగోళంలోని పిల్లలు
దేవతల్లా, పక్షుల్లా, చెట్లలా కాంతులీనుతున్న పిల్లలు
సూర్యకాంతిలా, శుభ్రశ్వాసలా, రంగుల్లా, పరిమళాల్లా, రుచుల్లా
జీవితోత్సవం నిండిన పిల్లలు
రుతువుల్లా, ఆకాశంలా, మబ్బుల్లా
నదీజలాల్లా, వాటి పరుగులా, సముద్రాల్లా, నురగల్లా 
జీవితంలోకి జీవించటం నింపుతోన్న పిల్లలు
నవ్వుల్లా, కేరింతల్లా, కపటం తాకలేని కన్నీటి జడుల్లా
ఇది జీవితం మినహా మరేమీ కాదని ప్రకటిస్తున్న పిల్లలు  

దయగా, మరికాస్త దయగా, మరింత దయగా
అతన్ని కౌగలించుకొన్నారు
ముద్దుపెట్టుకొన్నారు
అతని తలపై నిమిరారు
అరక్షణం వారి అమాయకత్వాన్ని విడిచి
అర్ధవంతమైన చూపుల వెన్నెల కురిపించి ఆపాదమస్తకం అభిషేకించారు   

కవి ఇపుడు కన్నీటి శిఖరమయ్యాడు
తల వాల్చి, కనురెప్పలు వాల్చి, లోలోపలి ఉద్రేకాలు రాల్చి
తనలో ఎగిరెగిరి పడుతున్న వేల గర్వాల సముద్రపక్షుల్ని  
దు:ఖకెరటాలూపి దూరతీరాలకు పంపిస్తున్నాడు

కవిలో ఇపుడు
దేశాలూ, మతాలూ, జాతులూ కరిగి నీరై పోతున్నాయి 
చరిత్రలూ, వ్యవస్థలూ, తనపరభేదాలూ - అర్ధాలు కోల్పోయి చెదిరిపోతున్నాయి  
కవిలో ఇపుడు నల్లని శిలలేవో, శిలాజాలేవో
మంచై, నీరై, ఆవిరుల స్వరాలై 
కాంతికిరణాల కౌగిలి వెంట కనిపించని లోకాలకి తరలిపోతున్నాయి

పిల్లల కాంతిగోళం, కవి యుగాల జీవితాన్ని రద్దుచేసి
మెలకువలోకీ, మెలకువలాంటి తాజాదనంలోకీ   
క్షణమంత తేలికా, శాశ్వతమంత స్థిరమూ అయిన జీవితంలోకీ తీసుకువచ్చింది    

పసిదనపు స్వర్గం
అతన్ని పచ్చని ఆకునీ, పచ్చదనాన్నీ చేసింది
పూవునీ, పూలరంగుల్నీ, పరిమళాన్నీ, వికాసాన్నీ చేసింది   
పక్షినీ, పక్షుల పాటనీ, పక్షిరెక్కల చుట్టూ పరుచుకొన్న వినీలగగనాన్నీ చేసింది      

అతనికి ఎడతెగని ఆశ్చర్యాన్నీ, జవాబు అవసరం లేని ప్రశ్నలనీ
ఏమీ లేని మౌనాన్నీ, ఏమీ కాని శాంతినీ,   
ఏ దిగులు రంగులూ కనరాని కాంతినీ ప్రసాదించింది     

అతను నమ్రతగా, కృతజ్ఞతగా
ఆ దేవతల ముందు చేతులు జోడించి నిలుచున్నాడు చివరిసారి  

అప్పుడు వాళ్ళలో ఒకరు
'కవీ ఇప్పుడు కవిత్వం చెప్పు ' అనగా విని
కొత్తగా చేరిన పిల్లవాడొకడు
అటూ, ఇటూ చూసి 'కవి అంటే ఎవరు ' అని అడిగాడు

పసిదనపు స్వర్గం ఫకాలున నవ్వుల్లో మునిగి
అక్షరాలను విడిచి ఎటో ఎగిరిపోయింది



_____________________________
ప్రసారం: ఆకాశవాణి, విజయవాడ  14.11.12 

3 కామెంట్‌లు:

  1. " కవిచుట్టూ ఆవరించిన స్వప్నగోళంలోని పిల్లలు
    దేవతల్లా, పక్షుల్లా, చెట్లలా కాంతులీనుతున్న పిల్లలు
    సూర్యకాంతిలా, శుభ్రశ్వాసలా, రంగుల్లా, పరిమళాల్లా, రుచుల్లా
    జీవితోత్సవం నిండిన పిల్లలు
    రుతువుల్లా, ఆకాశంలా, మబ్బుల్లా
    నదీజలాల్లా, వాటి పరుగులా, సముద్రాల్లా, నురగల్లా
    జీవితంలోకి జీవించటం నింపుతోన్న పిల్లలు
    నవ్వుల్లా, కేరింతల్లా, కపటం తాకలేని కన్నీటి జడుల్లా
    ఇది జీవితం మినహా మరేమీ కాదని ప్రకటిస్తున్న పిల్లలు

    దయగా, మరికాస్త దయగా, మరింత దయగా
    అతన్ని కౌగలించుకొన్నారు
    ముద్దుపెట్టుకొన్నారు
    అతని తలపై నిమిరారు
    అరక్షణం వారి అమాయకత్వాన్ని విడిచి
    అర్ధవంతమైన చూపుల వెన్నెల కురిపించి ఆపాదమస్తకం అభిషేకించారు

    కవి ఇపుడు కన్నీటి శిఖరమయ్యాడు
    తల వాల్చి, కనురెప్పలు వాల్చి, లోలోపలి ఉద్రేకాలు రాల్చి
    తనలో ఎగిరెగిరి పడుతున్న వేల గర్వాల సముద్రపక్షుల్ని
    దు:ఖకెరటాలూపి దూరతీరాలకు పంపిస్తున్నాడు"
    ----- -- ఎన్ని సార్లు చదివినా, ప్రతిసారీ కొత్తగా మళ్ళీ కవితో పాటు నేనూ కన్నీటి శిఖరమవుతూ...
    ఎంత బాగా వ్రాసారో! చాలా చాలా బాగుంది సర్. మళ్ళీ మళ్ళీ చెప్పాలనిపిస్తోంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు మానసా, తన కవిత్వానికి సరిగా స్పందించేవారిని చూసినపుడు, కవికి తననే మరొక రూపంలో చూస్తున్నట్టు వుంటుంది. మీ ఆత్మీయ పరామర్శ ఎప్పటిలానే చాలా సంతోషాన్నిస్తోంది.

      తొలగించండి