1
వెలుతురు కిరణాలని పూలరేకులుగా మలిచి
ఏ నీడలకీ వాడిపోకుండా అరచేతులలో కాపాడుకొన్నట్లు
ఆమెని పెంచారు ఆ అమాయక ప్రేమికులు ఆమె తల్లిదండ్రులు
మెరిసే కత్తిమొనకీ, మంచుబిందువుకీ భేదం తెలియని ఆమె
భ్రమలు చూపిన చీకటిస్వర్గంలోకి తటాలున జారిపోయింది
ఆమె తలిదండ్రులని చూసాను
అప్పటినుండీ చూస్తూనే ఉన్నాను
కాంతిలేని చూపులూ, ఉత్సవంలేని నవ్వులూ
ఎవరితో ఏమి మాట్లాడుతున్నా
ఆ మాటలన్నిటి వెనుకా ఆమెకోసం తెంపులేని వెదుకులాటా
ప్రతిదినమూ తెలియని వెలితిని నింపుకొనే దు:ఖమయ విఫలయత్నమూ
ఇప్పుడు వాళ్ళు మృత్యువు వెనుక నడుస్తుంటే
జీవితం దయగా వాళ్ళని అనుసరిస్తోంది
తమని తాము తప్పించుకొని దాక్కోవాలని
విరామంలేని పనుల్లోకి వాళ్ళని ఒంపుకొంటూనే ఉన్నారు
ఇవాళ ఎక్కడో పనిచేస్తున్న ఆమెని చూసాను
ఈ పగటి ఎండనిండా దుమ్మూ, జీవనవ్యాకులతల రొదా
పగటిలో సారాన్నీ, తాజాదనాన్నీ పోగొట్టుకొంటూ ఆమె
ఎన్నడూ లేనిది ఆమెపై కాస్తంత దయ కలిగింది
2
ఈ కథ ఏ మలుపులు తిరగనుందో
కథ చివర ఎలాంటి చిరునవ్వులు ఉంటాయో మనకు తెలియదు
కానీ, పిల్లలు గొప్ప స్వర్గాన్ని రుచి చూపిస్తున్నపుడు
కాస్తంత జాగ్రత్తగా ఉండాలి
గొప్ప నరకం దానిని కాపలా కాస్తుందనే మెలకువ ఉండాలి
లోకంలో బలంగా వేళ్ళూనుకోవద్దు
కాస్తంత తేలికగా నీటిమీద నడిచినట్లు వెళ్ళిపోతూ ఉండాలని
మిత్రులకి చెప్పే నెపంతో నాకు చెప్పుకొంటాను చాలాసార్లు
పిల్లలు కావచ్చు, ప్రియమైనవి ఏమైనా కావచ్చు
వాటిని రానివ్వటానికి విశాలంగా తెరిచిన తలుపుల్ని
పోనివ్వటానికి కూడా విశాలంగా తెరిచే ఉంచాలనుకొంటాను
బహుశా, సుఖం వాళ్ళు రావటంలోనూ, దు:ఖం వాళ్ళు వెళ్ళటంలోనూ లేవేమో
తలుపులు తెరిస్తే లోనికి వచ్చిన వెలుతురునీ, సుఖాన్నీ
తలుపులు మూసి దాచుకోవాలని చూస్తున్నామేమో
బహుశా, మనల్ని వెలుతురు కిరణాలుగా మలుచుకొన్న జీవితం
మన అనుమతి లేకుండా తలుపులు తెరిచి
దాచుకోవటమే దు:ఖమనీ, తెరుచుకోవటమే సుఖమనీ మనచెవిలో చెప్పబోతుందేమో
__________________________________
ప్రచురణ: ప్రస్థానం మార్చ్ 2013 ఇక్కడ క్లిక్ చేయండి
6.3.2013
"విశాలంగా తెరిచిన తలుపుల్ని
రిప్లయితొలగించండిపోనివ్వటానికి కూడా విశాలంగా తెరిచే ఉంచాలనుకొంటాను"
కవిత్వమూ అంతేనా sir
మీ ప్రశ్న నాకు జవాబనుకొంటా నాయుడు గారూ..
తొలగించండి