అష్టావక్రగీత కథ
అమెరికాలో కెరీర్ లో మంచిస్థితిలో ఉన్న మిత్రుడొకరు నిన్న ఫోన్ చేసి ఈ భగవద్గీతా, ఉపనిషత్తులూ ఒకసారి చదవాలనుకొంటున్నాను, తెలుగులో ఎక్కడ దొరుకుతాయి అన్నపుడు, కాస్త నవ్వూ, విచారమూ కలిగాయి.
కొన్ని చదవటం అంటే ఊరికే సరదా కాదు. కొన్ని వృధా చర్చల కోసం సమాచారం ప్రోవు చేసుకోవటంకాదు. నాకు ఎంత తెలుసో చూడు అని చెప్పుకోవటానికీ, నీ నమ్మకాలనీ, వాటి వెనుక ఉన్న నీ ఇగో నీ ఇతర్లపై బలవంతంగా రుద్దటానికీ కాదు.
కొన్ని చదవటం అంటే, ఇప్పటి వరకూ నువ్వు అనుకొంటున్న నిన్ను వదులుకోవటానికి సిద్ధపడటం, మరణించి మళ్ళీ కొత్తగా పుట్టటానికి సాహసించటం. అలా చదవగలిగినపుడే కొన్ని చదవాలి. లేదంటే రాళ్ళని తాకే సెలయేటి పరుగులా, అవి ఏ మంత్రమయలోకాలకీ తీసుకుపోకుండానే, నిన్ను విడిచివెళ్ళిపోతాయి. అందుకే కొన్ని ప్రాచీన గ్రంధాలు 'ఇప్పుడు' అని మొదలుపెడతారు. అంటే, నువ్వు సిద్ధపడి ఉన్నావు గనుక, ఇప్పుడు మాట్లాడుకొందాం అని.
నిజంగా, అలా చదవగలిగితే, 'ఇప్పటికైనా నువ్వు ఏమిటో, నీ జీవితం ఎందుకో తెలుసుకోవాలన్న జ్వరం కనుక పుడితే, మరింత సూటిగా నిన్ను తాకే వేరే గ్రంధాలు కూడా ఉన్నాయి' అని చెప్పాలనిపించింది కాని, అందరిలానే ఆ మిత్రుడూ కేవలం పైపైన బ్రతకటానికే ప్రాధాన్యత ఇస్తాడని తెలుసు గనుక, నాకు తెలిసిన సమాచారం ఏదో చెప్పి ఊరుకొన్నాను.
అట్లా అత్యంత శక్తివంతంగా, నువ్వు అనుకొంటున్న నిన్ను దగ్ధం చేసి, నిజమైన జీవితానుభవంలోకి, నిరపేక్షసత్యంలోకి మేల్కొలిపే గ్రంధాలని స్వరూపవర్ణన గ్రంధాలుగా చెబుతారు. స్వరూపవర్ణన అంటే 'ఆత్మ' లేదా 'తాను' లేదా 'నేను' అంటే ఏమిటో, దానిని ఎలా తెలుసుకోవాలో తెలియచేసే గ్రంధాలు.
వాటిలో నేను చూసినవి ( చదివినవనీ, అధ్యయనం చేసినవనీ అనటంలేదు) అష్టావక్రగీత, ఋభుగీత, అవధూతగీత, యోగవాసిష్టం, త్రిపురారహస్యం ఇత్యాదులు. వీటిలో చాలా వరకూ గురు,శిష్య సంవాద రూపంలో ఉంటాయి. శ్రీ రమణమహర్షి తరచూ వీటిని ప్రస్తావించేవారు. అంతేకాక వాటికి సంబంధించిన కథలు కూడా చెప్పేవారు.
వాటిలోకి ప్రవేశించటానికి యోగ్యత ఎలా, ఎంతగా ఉండాలో ఆ కథలు చెబుతాయి. వాటిలో ఈ రచయితకి అత్యంత ప్రేమాస్పదమైన ఒక కథ ఇక్కడ చెబుతున్నాడు.
ఒకానొక జనకుడి కొలువులో వేదాంతసభ జరుగుతూ వుంటుంది. చర్చలో భాగంగా ఒకరు ప్రాచీనులు చెప్పిన శాస్త్రవాక్యం ఒకటి చెబుతారు. 'ఆత్మజ్ఞానం పొందటానికి ఏమంత సమయంపట్టదు. గుర్రపు రికాబులో ఒక కాలు ఉంచి, రెండవ ప్రక్క రెండవ కాలు వేసేలోగా ఆ జ్ఞానం పొందవచ్చును' అని ఆ వాక్యానికి అర్థం.
అప్పుడా జనకుడు ఈ శాస్త్రవాక్యం నిజమేనా అని అడుగుతాడు. వాళ్ళు నిజమే అంటే, నిరూపించగలరా అంటాడు. మేము అంత శక్తిగలవాళ్ళం కాదంటారు. జనకుడు దండోరావేయిస్తాడు, ఈ శాస్త్రవాక్యం నిజమని నిరూపించగలవారికి తగిన బహుమానం ఇస్తానని. ఆ మాట, అరణ్యంలో ఉన్న అష్టావక్రమహర్షిని చేరుతుంది. ఆయన రాజసభకి వస్తారు,, తాను నిరూపిస్తానని చెబుతారు.
జనకుడు సరేనన్నాక, బయట గుర్రం నిలబెడతారు. రాజు ఒక పాదం రికాబులో ఉంచుతాడు. అప్పుడు, మహర్షి నీకు జ్ఞానం బోధిస్తున్నాను గనుక, నాకు గురుదక్షిణ ఇవ్వాలి అంటారు. బోధన అయ్యాక కదా దక్షిణ ఇవ్వాల్సింది, కానీ, ముందుగా అడగటానికి కారణం ఉంది. జ్ఞానం పొందినవాడికి ఇక అన్యత్వభావం (తన కంటే వేరుగా ప్రపంచం ఉంది అనే భావం) నశిస్తుంది. తనకి అన్యంగా ఏదీ లేదు గనుక, గురువూ ఉండడు, దక్షిణా, ఇవ్వటమూ కూడా ఉండవు.
జనకుడు గురుదక్షిణగా ఏమి ఇవ్వాలో చెప్పమంటాడు. మహర్షి 'నేను, నాది అనుకొంటున్న సమస్తాన్నీ నాకు ఇవ్వ'మంటాడు. జనకుడు 'ఇచ్చాను' అంటాడు. అంతే. ఇక జనకుడు శిలాప్రతిమలా నిలబడిపోతాడు. నేను, నాది అనేభావాలతో కూడిన సమస్తాన్నీ, అంటే, నాది అనిపించే దేహంతో సహా, మనస్సుతో సహా మహర్షికి ఇచ్చేసాడు జనకుడు. ఇక తనపై తనకి ఏ ఆధిపత్యమూ లేదు. అసలు తానే లేడు. నేను అనుకొంటున్నది అంతా గురువుకి ఇవ్వగానే, ఇక ఏదీ, ఎవరిదీ కాని శుద్ధమైన ఎరుక మాత్రమే మిగిలింది.
కాలం గడుస్తున్నా స్థాణువులానే నిలబడిపోయిన రాజుని చూసి, పరివారం ఆందోళన పడ్డారు. ఈ ఋషి రాజుగారిని ఏదో చేసాడని భయపడ్డారు, మళ్ళీ ఆయన్నే ప్రార్ధించారు, మా రాజుగారిని మాకు ఇవ్వమని. మహర్షి 'నాయనా, ఇక కదులు' అన్నారు. గురుస్వాధీనమైన ఆ దేహం, మనస్సూ గురువాజ్ఞతో కదిలాయి.
ఇప్పుడు నీస్థితి ఎలా ఉందో చెప్పమంటారు అష్టావక్రుడు. జనకుడు పరమానందంతో, ఆశ్చర్యపోతూ చెబుతాడు. ఇట్లా, ఆ గురుశిష్యుల పరమస్వచ్ఛమైన సంభాషణతో అష్టావక్రగీత మొదలవుతుంది. స్వరూపం అంటే ఏమిటో, ఈ దృశ్యమాన ప్రపంచం ఏమిటో, వీటి వింతవింత లేమిటో ఎంతో కవితాత్మకంగా మాట్లాడుకొంటూ వారి సంభాషణ నడుస్తుంది.
వారికి నీడగానైనా నడిచేంత హృదయనైర్మల్యం సాధిస్తే, అలాంటివారికి అష్టావక్రగీత ఎనలేని మేలు చేస్తుంది.
~ బివివి ప్రసాద్