03 ఫిబ్రవరి 2017

ముక్తికాంక్ష

బాగా చిన్నపుడు, ఆలోచించటం నేర్చుకొంటున్నపుడు
ముక్తికోసం మునులు తపస్సు చేస్తారని చదివి

జీవితం ఇంత అందమైంది కదా, ఆనందనిధి కదా
జన్మ ఒక శాపమైనట్టు, పాపమైనట్టు వాళ్ళెందుకు స్వేచ్ఛకోసం తపించారని
జనం మధ్య వెచ్చగా బ్రతకటం మాని అరణ్యాలకి వలసవెళ్ళారని
అమాయకంగా, వాళ్ళంటే దయగా తలుచుకొనేవాడిని

నిద్రపోతున్నపుడు ఊరిలో సడిలేకుండా ప్రవేశించిన వరదలా
కబుర్లలో మునిగి గమనించనపుడు పగటిలోకి చేరుకున్న రాత్రిలా
ఒక్కొక్కరోజూ గడిచి, కాలం నా దేహాన్నీ, మనస్సునీ, సందర్భాలనీ
మాయాజాలం చేసినట్టు మార్చుకొంటూ పోయాక

ఒకనాడు అకస్మాత్తుగా బాల్యం వెళ్ళిపోవటం తెలుసుకొని
నలుపు ప్రక్కన నిలబెట్టిన తెలుపులా
ఇవాళ్టి నా ప్రక్కన, బాల్యాన్ని నిలబెట్టి చూసుకొన్నపుడు

జీవితం ఆకాశంలా సుకుమారం కాదని, విశాలం, నిత్య నిర్మలం కాదని
నా ఆకాశం నాకు చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయిందని
నేను బంధించబడ్డానని, నా ప్రతి కదలికా, నవ్వూ, ఏడుపూ బంధించబడ్డాయని
నేను ఉండటమూ, వెళ్ళటమూ కూడా నా చేతుల్లో లేవని తెలిసింది

అప్పుడు బాల్యంపై బెంగ పెట్టుకొని
వెళ్ళిపోయిన పెద్దల వస్తువుల్ని వారికోసం తాకినట్టు
చిననాటి ఆలోచనలని తడుముకొని చూసినపుడు
మునుల ముక్తికాంక్ష జ్ఞాపకం వచ్చింది

మునులెందుకు స్వేచ్ఛకోసం తపస్సు చేస్తారో అర్థమైంది
సాటి మనుషులకన్నా, చివరికి అన్నంకన్నా, గాలికన్నా
స్వేచ్ఛ ఎంత ప్రియమైనదో, అవసరమైనదో తెలిసివచ్చింది

మనిషి చేయవలసిన పనికి
వ్యతిరేకంగా, ఎంత వేగంగా వెళుతున్నాడో అర్థమైంది
నాపైనా, వెచ్చని మానవుల గుంపులపైనా దయ కలిగింది
అప్పుడు నా ప్రయాణం మొదలైంది


3.3.2011
___________
'ఆకాశం' నుండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి