తిలక్ పుట్టిన ఊరు తణుకు నుంచి తెలుగు కవిత్వానికి కలకాలం మిగిలే కవి ఇంకొకరు వున్నారు. అతనే బివివి ప్రసాద్. మనం ఈ రోజు ‘అమృతం కురిసిన రాత్రి’ని ఎలా చదువుకుంటున్నామో, మన భవిష్యత్ తరాలు బివివి హైకూలని, ‘ఆకాశం’ కవిత్వ సంపుటిని అలా చదువుకుంటారనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
చాలా కాలంగా తెలుసు బివివి నాకు. దాదాపు అతని మొదటి సంపుటి ‘ఆరాధన’ వచ్చిన రోజుల్నించి అతన్ని, అతని కవిత్వాన్ని శ్రద్ధగా గమనిస్తున్నవాడిని. అతనితో కవిత్వ సంభాషణలు చేసినవాడిని. ఒక్కమాటలో చెప్పమంటే, చలాన్ని అరుణాచలం నుంచి తీసుకొచ్చి కొత్త శరీరంలో ప్రవేశపెట్టి కవిత్వం రాయమంటే అది బివివి కవిత్వంలా వుంటుంది. అందుకే బివివికి నేను పెడుతున్న ముద్దుపేరు ‘అరుణాచలం’. చూడ్డానికి కూడా ‘యువ చలం’లా ఇతను వుండడం కాకతాళీయమే.
కొంత మంది బివివి కవిత్వాన్ని తాత్విక కవిత్వం అన్నారు. ఇంకొందరు ముందుకు పోయి ఆధ్యాత్మిక కవిత్వం అన్నారు. ఇదొక మార్మిక కవిత్వం అన్నారు. మిస్టిసిజం అన్నారు. తన్మయ కవిత్వం అన్నారు. మన కాలపు జిబ్రాన్ అన్నారు. ఇన్ని రకాలుగా బివివి కవిత్వాన్ని వర్ణించడం వలప దానికి మేలుకన్నా కీడే ఎక్కువ జరిగింది అని నా భావన. అందుకే వాటన్నిటినీ నేను పక్కనపెట్టి దీన్ని ‘అనుభవ కవిత్వం’ లేకపోతే ‘అనుభూతి కవిత్వం’ అంటాను. అయితే బివివి రాసే పద్ధతి వేరు.
కొంత మంది బివివి కవిత్వాన్ని తాత్విక కవిత్వం అన్నారు. ఇంకొందరు ముందుకు పోయి ఆధ్యాత్మిక కవిత్వం అన్నారు. ఇదొక మార్మిక కవిత్వం అన్నారు. మిస్టిసిజం అన్నారు. తన్మయ కవిత్వం అన్నారు. మన కాలపు జిబ్రాన్ అన్నారు. ఇన్ని రకాలుగా బివివి కవిత్వాన్ని వర్ణించడం వలప దానికి మేలుకన్నా కీడే ఎక్కువ జరిగింది అని నా భావన. అందుకే వాటన్నిటినీ నేను పక్కనపెట్టి దీన్ని ‘అనుభవ కవిత్వం’ లేకపోతే ‘అనుభూతి కవిత్వం’ అంటాను. అయితే బివివి రాసే పద్ధతి వేరు.
‘ఆరాధన’ కవితా సంపుటితో తెలుగు కవిత్వంలో 1989లో ప్రవేశించినా, హైకూల కవిగానే ప్రఖ్యాతి గాంచాడు. హైకూలని తెలుగులోకి విరివిగా తీసుకొచ్చింది ఇస్మాయిల్ గారయితే, ఆయన్ని మించి హైకూని అభ్యసించి, రచించి మెప్పిం చినవాడు ఈ కవి. తింటే గారెలు తినాలి అన్నట్టు చదివితే బివివి హైకూలు చదవాలి అని చాలా మంది పేరుగాంచిన కవులే అనడం విన్నాను.
హైకూ ముఖ్యంగా అనుభవ కవిత్వం. కానీ అందులో ఇంద్రి యాతీత అనుభవానికే ప్రాము ఖ్యత. ఇస్మాయిల్‌గారు హైకూ అంటే చంద్రుణ్ణి చూపించే వేలు అంటారు. దీని అర్థం ఏమిటంటే చంద్రుడ్ని చూపించాక ఎలాగైతే వేలు అవసరం లేదో, హైకూలో అనుభూతి కలిగాకా వస్తువు తను అదృశ్యమయిపోతుంది. వాన వెలిసింది తీగపై చిన్ని ప్రపంచాలు వేలాడుతున్నాయి (‘దృశ్యాదృశ్యాలు’లో హైకూ)
ప్రకృతి పట్ల ఆరాధన, ప్రాపంచిక విషయాలపట్ల విముఖత, ప్రపంచం అశాశ్వతం అనే జాగృతి, అపారమైన కరుణ ఇవి కలిగి వుంటే గానీ ‘హైకూ’లని రాసి మెప్పించలేరు. ఈ లక్షణాలే అతని కవిత్వానికి పునాది. 1999 తరవాత బివివి హైకూలు రాయడం మానేసాడు. హైకూలు రాసిన కవులు వేరే రూపాల్లోకి వెళ్ళడం అరుదు. ఇస్మాయిల్‌గారు హైకూల్లోకి వెళ్ళాకా పెద్ద కవితలు అతితక్కువగా రాశారు. హైకూలో కొన్ని వస్తు పరిమితులు వున్నాయి. అన్ని వస్తువుల మీదా హైకూలో కవిత్వం చెప్పడం కష్టం.
2006లో ‘నేనే యీ క్షణం’, 2011లో ‘ఆకాశం’, 2015లో ‘నీలో కొన్నిసార్లు’తో వచన కవిత్వం రాసాడు. నన్నడిగితే బివివి కవిత్వాన్ని 2000కి ముందు ఒక దశ, ఆ తర్వాత ఇంకో దశగా చెప్పవచ్చు. అతను యువకుడి దశ నుంచి మధ్యవయసుకు మారినపుడు జరిగిన రూపాంతరం కూడా కావచ్చు. రుతువు మారినపుడు ప్రకృతి ఎలాగైతే రూపాన్ని మార్చుకుంటుందో ఈ కవి జీవితంలో వచ్చే మార్పులకి తన కవిత్వరూపాన్ని మార్చుకున్నాడు. ఈ మార్పులు చేసుకుని గొంతు విప్పడానికి ఇతనికి ఏడేళ్ళు పట్టింది. ఆ మార్పులు, వాటి స్వరూప స్వభావాలు గురించి మాట్లాడే ముందు అసలు ఎందుకు ఆ మార్పులు సంభవించాయో కూడా తెలుసుకోవాలి.
హైకూ అద్భుతంగా రాయడానికి కావలసిన లక్షణాలు ఏమైతే వున్నాయో అవి ప్రపంచంతో రాజీపడడానికి పనికి రావు. ప్రపంచంతోను, కొన్ని విలువలతోను రాజీపడకుండా ప్రాపంచికమైన అనేక విషయాలు సాధించడం సాధ్యంకాదు. నచ్చని వాటిని తీవ్రంగా వ్యతిరేకించటం; నిజాయితీ, ఇతరులలో మానవీయ విలువలు ఆశించి నిరాశ చెం దడం, వీటన్నిటి ద్వారా కార ణం తెలియని లోలోపలి వెలితి ఒకపక్క తనని జ్వలిస్తుంటే, అంతిమ సత్యంకోసం అనేక మా ర్గాల్ని అన్వేషించాడు. రమణ మహార్షి బోధనలతో అతనికి సాంత్వన లభించింది. సాహిత్యకారుల ఇరుకిరుకు వాద ప్రతి వాదాల నుంచి చాలాకాలం దూరంగా వుండి, తనకు అర్థ మైన జీవన సత్యాన్ని కొంతమందితోనైనా పంచుకోవాలని, వచన కవిత్వంలోకి 2006లో ‘నేనే ఈక్షణం’లో విస్తరించి, 2011లో ‘ఆకాశం’తో అనుకున్న లక్ష్యాన్ని సాధించారు.
ప్రసాద్ కవిత్వంలో వచ్చిన మార్పులు ఏమిటో, వాటి స్వరూప స్వభావాలు ఏమిటో తెలుసుకోవాలంటే ఈ కవిత చూడండి: ‘‘ఎప్పుడూ విసుక్కునే కొడుకు తల్లి పాదాలు తాకి దీవించమన్నప్పుడు/ ఆమె కళ్ళల్లో ఎన్నడూ చూడని కన్నీరెందుకొస్తుంది?// గాయపరిచాను క్షమించమన్నపుడు/ అప్పటివరకు వెలవెలబోతున్న భార్య కనుల వెంట ఆపలేని ధారలెందుకు కొస్తాయి.// చాలా ఖర్చవుతుందేమో వద్దులే నాన్న అని పిల్లలన్నపుడు/ వారి లేత దయాపూర్ణ హృదయాలు తలచి అతని కన్నులెందుకు చెమ్మగిలుతాయి./... /అణగారిన మంచినెవరైనా గుర్తించిన ప్రతిసారీ,/లేదనుకున్న మంచితనం ఎదురైన ప్రతిసారీ,/ ఎవరినెవరైనా మంచితనంతో గెలుస్తూ గెలిపించిన ప్రతిసారీ/ మన కళ్ళెందుకు చెమరుస్తాయి. మన కంఠాలెందుకు రుద్ధమౌతాయి’’(‘హృదయం ప్రవేశించినపుడు’ - ఆకాశం, 2011). ఇలా సాగుతుంది యీ కవిత. సాధారణ మానవసంబంధాలలో దాగివున్న సౌందర్యాన్ని, దయని, కరుణని, దైవత్వాన్ని పునఃప్రతిష్ట చేసే కవిత్వం ఇది. అయితే ఇక్కడ వచ్చిన మార్పు గురించి స్పష్టంగా వివరించాలి.
హైకూలలో బివివి ప్రాకృతిక పదచిత్రాల ద్వారా సార్వత్రిక సత్యాలను అవిష్కరిస్తే ఇక్కడ మానవ సంబంధాలు, సామాజిక సందర్భాలలోని వెలితిని వస్తువుగా తీసుకుని సార్వత్రిక సత్యమనే ఒక మెలకువలోకి మనం మేలుకునే అనుభవాన్ని కలగచేస్తున్నాడు. అందుకనే నేనన్నాను- బివివి ‘అనుభవ కవి’గానో, ‘అనుభూతి కవి’గానో తప్ప వేరే ఏరకంగా చెప్పినా అది చెల్లదు.
హైకూలలో బివివి ప్రాకృతిక పదచిత్రాల ద్వారా సార్వత్రిక సత్యాలను అవిష్కరిస్తే ఇక్కడ మానవ సంబంధాలు, సామాజిక సందర్భాలలోని వెలితిని వస్తువుగా తీసుకుని సార్వత్రిక సత్యమనే ఒక మెలకువలోకి మనం మేలుకునే అనుభవాన్ని కలగచేస్తున్నాడు. అందుకనే నేనన్నాను- బివివి ‘అనుభవ కవి’గానో, ‘అనుభూతి కవి’గానో తప్ప వేరే ఏరకంగా చెప్పినా అది చెల్లదు.
‘‘నిన్ను గాయపరిచిన మనిషి వైపు దయగా చూసినపుడు/ నీకు ఇష్టమైన వస్తువొకటి ఎవరికైనా మనసారా ఇచ్చినపుడు/ గెలిచికూడా ప్రపంచం ముందు వినమ్రుడివై మోకరిల్లినపుడు// ఏదో జరుగుతుంది, లోపలెవరో మేలు కొన్నట్లుంటుంది./... /అప్పుడు జీవితంపై మరిచిపోయిన ప్రేమ మళ్ళీ గుర్తుకొస్తుంది/ క్షణం జీవితం చాలనిపిస్తుంది. కల్పాలు బతికినా చాలదని పిస్తుంది.’’ (‘ఎవరో మేలుకొన్నట్లు’ - ఆకాశం, 2011) - ఇది మానవ సంబంధాలలోకి నిర్మలత్వాన్ని, కరుణనీ, దయనీ, జాలినీ, సత్యాన్ని, నింపి దైవత్వానికి మేలుకొలిపే దిశగా నడిపించే కవిత్వం. ఆ అనుభవాన్ని, అనుభూతిని జాగృతం చేయడమే యీ కవిత్వ లక్ష్యం. తన కవిత్వం గురించి ఇంతకీ బివివి ఏమి చెబుతున్నాడు: ‘‘దృశ్యం నుంచి రహస్యంలోకి/ ఉద్వేగాల నుండి స్వచ్ఛతలోకి/ భయం నుండి స్వేచ్ఛలోకి/ శ్రమ తెలియక నడిపించే స్నేహం నా కవిత్వం.’’ (‘నా కవిత్వం’ - ఆకాశం, 2011)
మూర్తమైన మానవసంబంధాల నుంచి అమూర్తమైన విశ్వసత్యంలోకి నడిపించడమే తన కవిత్వం చేసేపని అని స్పష్టంగా చెబుతున్నాడు. పాఠకుడికి ఆ అనుభవాన్ని కలిగించే స్నేహహస్తం తన కవిత్వం: ‘‘కవిత్వానికి హృదయం రథి, కవి సారథి, వస్తువు రథం./ ఉద్వేగం అశ్వం, తత్వం మార్గం/ శబ్ద వైచిత్రీ, తర్క విన్యాసం, అలంకారాలూ అస్త్రాలు, ధ్వని బ్రహ్మాస్త్రం/ రసజ్ఞునిలో అమానవుని తొలగించి, మానవుని రక్షించటం లక్ష్యం’’ (‘కవిత్వం పాఠాలు’ - ఆకాశం, 2011) - ఇలా తన కవితా రహస్యాన్ని విడమర్చి తనే చెప్పుకున్నాడు.
‘‘కవిత్వం రాస్తున్నపుడు కాదు/ రాసే ముందు కవి కావాలి/ కవిత్వం చదువుతున్నపుడు కాదు/ చదివాక అలజడి కలిగించాలి/ కవి పదాలతో కాదు/ పదాల మధ్య మౌనం నింపి ఆలోచింపచేయాలి/ పుస్తకం తెరిచినపుడు కాదు/ మూసిన తరువాత వదలని జ్ఞాపకం కావాలి/ మనిషి వున్నపుడు కాదు/ వెళ్ళిపోయాక వీడని పరిమళం కావాలి.’’ (‘సన్నని రేఖ’ - ఆకాశం, 2011) - ఇలా ఎన్నో కవితల్లో బివివి తన కవిత్వాన్ని తనే చాలా స్పష్టంగా నిర్వచించుకున్నాడు.
‘‘కవిత్వం రాస్తున్నపుడు కాదు/ రాసే ముందు కవి కావాలి/ కవిత్వం చదువుతున్నపుడు కాదు/ చదివాక అలజడి కలిగించాలి/ కవి పదాలతో కాదు/ పదాల మధ్య మౌనం నింపి ఆలోచింపచేయాలి/ పుస్తకం తెరిచినపుడు కాదు/ మూసిన తరువాత వదలని జ్ఞాపకం కావాలి/ మనిషి వున్నపుడు కాదు/ వెళ్ళిపోయాక వీడని పరిమళం కావాలి.’’ (‘సన్నని రేఖ’ - ఆకాశం, 2011) - ఇలా ఎన్నో కవితల్లో బివివి తన కవిత్వాన్ని తనే చాలా స్పష్టంగా నిర్వచించుకున్నాడు.
సాహిత్య చరిత్ర గమనిస్తే, గొప్ప కవులు తమ కవిత్వాన్ని గురించి తమ మార్గాన్ని, తత్వాన్ని గురించి వారే స్పష్టంగా చెప్పుకున్నారు. తమ కవిత్వ విశ్లేషణకు వారు మార్గం సుగమం చేసుకున్నారు. బివివి కూడా అదేకోవకు చెందుతాడు బివివి అభివ్యక్తి మీద, ఇస్మాయిల్ ప్రభావం పూర్తిగా వుంది. చాలాచోట్ల తనే చెప్పుకున్నట్లుగా బివివి మీద ఠాగూర్ ప్రభావం; చలం ఆదర్శవాదం, స్వేచ్ఛాప్రీతి, ప్రేమ; శరత్, ప్రేమచంద్, రాహుల్ సాంకృత్యాయన్, విశ్వనాథ, గోపిచంద్, బుచ్చిబాబు, టాల్‌స్టాయ్, విక్టర్ హ్యాగో, వడ్డెర చండీదాస్, శ్రీశ్రీ, సంజీవ్‌దేవ్ ప్రభావాలు కనబడతాయి. రమణ మహర్షి తత్వం, ఇంకా కొంతమంది తాత్వికుల ప్రభావం కనబడుతోంది. మొత్తానికి ఇస్మాయిల్ స్కూల్ ఆఫ్ థాట్‌కి చెందిన కవిగానే బివివి ని గుర్తించవచ్చు. ఏ నీడలు కనబడినా ముఖ్యంగా బివివి కవిత్వాన్ని పొయెట్రీ ఆఫ్ ఎక్స్‌పిరియెన్స్, అనుభవ లేక అనుభూతి కవిత్వంగానే గుర్తించాలి. ఏ విధమైన ఆడంబరాలులేక, కవిత్వ రాజకీయాలకి దూరంగా నిజాయితీగా కవిత్వం ప్రయాణం సాగిస్తున్న బివివి ప్రసాద్- ‘ఆకాశం’, ‘నీలో కొన్నిసార్లు’ కవితా సంపుటుల తర్వాత- మన కవుల్లో అగ్రగణ్యుడు.
ప్రచురణ : 'వివిధ' ఆంధ్రజ్యోతి డైలీ 18.05.2020