31 జనవరి 2026

జీవించి ఉండటానికి నన్ను నేను ఒప్పించుకునే ప్రయత్నమే నా కవిత్వం : బివివి ప్రసాద్‌తో మానస చామర్తి ఇంటర్వ్యూ

మనుష్యులు తమతమ రోజువారీ యుద్ధాలను దాటడానికి పోరాటం ఎంత ముఖ్యమో పోనివ్వాలనే చూపూ అంతే ముఖ్యమని తెలిసిన కవి బివివి ప్రసాద్. అందుకే “గెలుపు జ్వరం పట్టిన లోకంలో, ఓడిపోవడానికే ఎక్కువ ధైర్యం కావా”లని ఇప్పటికి ఎన్నో యేళ్ళ క్రితమే తన కవిత్వంలో చెప్పగలిగారు. గగనమూ లోయలూ ఒకేసారి పిలిచినప్పుడు శిలలాంటి వర్తమానంలోకి ఉలికిపడే మనిషిని హత్తుకుని నెమ్మదింపజేసే స్వరం వీరి కవిత్వానిది. లోపలి ప్రపంచంతో నిజాయితీగా సాగే సంభాషణల్లో, కొంత ఆనందమూ, కొంత దిగులూ, కొంత ఆశా కొంత వెలితీ అన్నీ తెరలు తెరలుగా తనలోనే వచ్చిపోవడం మనిషికి తెలుస్తూంటుంది. ఆ ఉద్వేగాల ఉద్ధృతిని అర్థం చేసుకునేందుకు ఉపకరించే తాత్త్విక అన్వేషణతో కూడిన కవిత్వం బివివి గారిది. ఎంతో లోతుల్లోకి దిగితే కానీ, మనుషులు ప్రేమించడానికి భయపడతారనే గమనింపు దొరకదు. “భయంలో కాపాడేదేదో ఉందనిపించి ఊరికే భయపడతాం”లాంటి మాటలు ఈ కవిత్వంలో తారసపడినప్పుడు తెలుస్తుంది, ఎదురెళ్ళి అర్థం చేసుకోవాలసిన ఉద్వేగాలను ఏవో తెలీని భయాలతో తొక్కిపెడుతున్నామని; భయాన్నే ధైర్యమని భ్రమించి హత్తుకుంటున్నామని. లోపలి మనిషిపట్లా, లోకంపట్లా, దయాపూరితమైన చూపును, ఆలోచనను, మెలకువను ఈ కవిత్వంలో నేను చూశాను. సీతాకోకచిలుక రెక్కల్లోని ఆశను, వర్షపు చినుకుల సంగీతాన్ని, వెన్నెల రాత్రుల నిశ్శబ్దంలోని గాఢమైన శాంతిని ఈ పదాల్లోనుండి అందుకున్నాను. బివివి కవిత్వం జీవితాన్ని అర్థం చేసుకోవడమే లక్ష్యంగా సాగిన ఆంతరంగిక సంభాషణ. కన్నులు మూసుకుని ధ్యానంలోకి జారుకున్నాక, వచ్చే పోయే ఉద్వేగాలను నిర్మోహంగా చూసే చూపు. సుతిమెత్తని జీవనానందపు కౌగిలి.

కొత్త కవిత్వ సంపుటి ‘సృష్టి’ విడుదలైన సందర్భంగా, బివివి ప్రసాద్‌గారితో ఈమాట తరఫున మానస చామర్తిగారు చేసిన చిన్న ఇంటర్వ్యూ:

‘ఆకాశం’ మొదలు మీ కవిత్వ సంపుటుల్లో మీదైన శైలి ప్రస్ఫుటంగా కనపడుతూ వస్తోంది. దీని వెనుక ఉన్న సాధన, ప్రభావాలను చెప్పండి.

బివివి: ‘ఆకాశం’ రాసేనాటికి, శిల్పపరమైన ఎలాంటి కండిషన్ లేకుండా, నన్ను నేను వాక్యాల్లోకి తెరుచుకోవటం కొంత చాతనైంది అనుకుంటాను.

అయితే నా వాక్యం నేను కనుగొనడానికి సహాయపడినవారు ముఖ్యంగా టాగోర్, ఖలీల్ జిబ్రాన్. పరమ ఉదాత్తమైన దాన్నే కవితా సమయంలో తాకాలని నేర్పారు వారు. తర్వాత ఇస్మాయిల్. కవిత్వంలోకి అనుభవాన్ని అనువదించడం, ప్రధానంగా, ఆయననుండి వచ్చిందనుకుంటాను.

మొదటి సంపుటి ‘ఆరాధన’లో టాగోర్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ‘నేనే ఈ క్షణం’లో ఇస్మాయిల్ , జిబ్రాన్, కొందరు తాత్త్వికుల ప్రభావాలు, సమకాలీన తెలుగు కవుల ప్రభావాలు కనిపిస్తాయి. ఆ కవితలలో ఏకరూప్యత లేకపోవటం గమనిస్తే, నాదైన వాక్యం కోసం తపనపడటం తెలుస్తుంది.

‘నేనే ఈ క్షణం’ కవితల కాలంలోనే, విస్తృతంగా సాధన చేసిన హైకూ ప్రక్రియ brevity, effect, ease లను నేర్పింది. కనుక జపనీయ కవుల ప్రభావం కూడా నా వాక్యాల్లో ఉండవచ్చును.

మీ దృష్టిలో కవిత్వం ఎందుకు, దాని పరమావధి ఏమిటి?

బివివి: కవిత్వం కానీ, మరే రచన, కళ గానీ మానవ చేతనని సున్నితపరచాలి, మానసిక ఆవరణలను విస్తరింపచేయాలి అని నమ్ముతాను. కేవల వినోద ప్రధానమైన కళ కాలక్షేపానికి మినహా, లోతైన ప్రయోజనమేదీ కలిగి ఉండదనిపిస్తుంది. కేవల సందేశ ప్రధానమైన కళ కూడా కొన్ని ఉపరితల ప్రయోజనాలు కలిగించవచ్చేమో కానీ, ఆంతరిక వికాసానికి అంతగా దోహదపడదు అనుకుంటాను. సౌందర్యాన్నీ , ప్రయోజనాన్నీ కలుపుకొంటూ సత్యసీమలకి ప్రయాణించటం కళ లక్ష్యం అని నమ్ముతాను.

మీ కవిత్వం ప్రధానంగా తాత్త్విక అన్వేషణతో సాగుతుంది. మీపై ఉన్న తాత్విక ప్రభావాలేమిటి?

బివివి: శ్రీ రమణమహర్షి బోధించిన ప్రశ్న”నేనెవరు” నా తాత్త్విక అన్వేషణకి మూలం. ఆ “నేను”ను గురించి విస్తృతంగా, లోతుగా వివరించిన నిసర్గదత్త మహరాజ్ ని చదవటం స్పష్టత నిచ్చింది. “నేను”ను మరింత సూక్ష్మంగా బోధించినవారు శ్రీ కాళహస్తిలోని సుబ్రహ్మణ్యంగారు. పూర్వ ఋషుల బోధలు, ఎకార్ట్ టోలీ వంటి ఆధునిక ద్రష్టల సూచనలు కూడా నా వెదుకులాటకి సహాయ పడుతున్నాయి అనుకుంటాను.

అయితే, అంతిమంగా ఎవరైనా తమదైన స్పష్టత, వెలుగు తామే పొందాల్సి ఉందనిపిస్తుంది.

రూమి, టాగోర్ లాంటి తాత్త్వికకవుల్లో దైవం కోసం, ఆయన అనుగ్రహం కోసం, సన్నిధి కోసం వెదుకులాట ఉంటుంది. మీ అన్వేషణకు కేంద్రం దైవంగా కనిపించదు. ఎందువలన?

బివివి: పూర్వ తాత్త్వికకవులు సత్యాన్ని దైవంగా, object గా, చూడబడేదిగా తలచటం ఎక్కువ, కొన్నిసార్లు మినహాయింపులున్నా.

సత్యం subject అని, చూసేవాడు అని, నేనే సత్యమని జ్ఞానులు చెబుతారు. కనక, నా ప్రయత్నమంతా నన్ను నేను తెలుసుకోవటం వైపే, నేను నేనుగా ఉండటం వైపే ఉంటుంది. రమణమహర్షి తనలో తాను సంస్థితం కావటం అంటారు. తెలియటం కూడా కాదు, అదిగా ఉండటం. అది సర్వదర్శనాల లక్ష్యంగా తోచింది.

ఒక ఆబ్జెక్ట్ ని కవిత్వం చేయటంలో వెసులుబాటు ఉంటుంది. ‘నేను’కి, ఆ వస్తువుకి మధ్యనున్న ఖాళీలో ఎన్ని ఊహలైనా, నాటకీయత అయినా, ఎంత రసమైనా చొప్పించవచ్చును. ‘నేను’ను కవిత్వం చేయటం దుస్సాధ్యం.

కానీ, ప్రసాద్ నేను, ఏమీకాని నేనుగా ఉండాలనుకున్నపుడు ఆ ప్రయత్నం, వెదుకులాట, దుఃఖం, ఆనందం కవిత్వంగా మారే వీలు కలుగుతుంది. ఆ చలనాలు కేవలం బౌద్ధికం (intellectual) కాకుండా, హృదయగతం అయినప్పుడు అది కవిత్వంగా పండుతుంది.

‘ఆకాశం’తో మొదలైనట్టు కనబడే ఈ రసాయనచర్యకి మూలాలు అంతకు పూర్వం రాసుకున్న ‘ఆరాధన’, ‘నేనే ఈ క్షణం’ సంపుటాలలోనూ, హైకూ సంపుటాలలో కూడా కనిపిస్తాయి.

మీ కవితల్లో అధికభాగం “నువ్వు” ని సంబోధిస్తూ రాస్తారు. దీనికేమైనా ప్రత్యేకమైన కారణం ఉందా?

బివివి: కవితల్లో కవి సంబోధించేది తనని తానే. నా కవిత్వం నాతో నేను జరిపే సంభాషణ. కవిగా ఉన్న తాను, ఒంటరి తనతో జరిపే సంభాషణలో, కవి, ఒంటరి మనిషిని ఉద్దేశించి చెబుతుంటాడు. ఈ ధోరణి ఉద్దేశపూర్వకంగా కాకుండా, సహజంగా నాలో ఏర్పడిందనుకుంటాను.

గాఢమైన అనుభవంతో నిండిన ఒక మనిషి సాంత్వనగా పలుకుతున్న మాటల్లా వినపడుతుంది మీ కవిత్వం, అదే సమయంలో వాక్యాలు బోధ చేస్తున్నట్లు కూడా ఉండవు. ఇది ఎలా నిర్వహిస్తారు?

నా కవిత్వం, ముఖ్యంగా ‘ఆకాశం’ మొదలుపెట్టి, నన్ను నేను కన్విన్స్ చేసుకునే ప్రయత్నం – జీవితాన్నీ, మనుషుల్నీ, నన్నూ ప్రేమించటానికి, మరింత లోతుగా గ్రహించటానికి. చాలాసార్లు జీవించి ఉండటానికి నన్ను నేను ఒప్పించుకునే ప్రయత్నం కూడా. నాకు నేనే ఔట్ సైడర్ గా ఒక బోధకుడిలా, తండ్రిలా, మిత్రునిలా, కౌన్సిలర్ లా ఉంటూ నాకు చెప్పుకోవటం. చెప్పే నేను, వినే నేను ఒకరే గనుక ఒకరు ఎక్కువా, ఒకరు తక్కువా కారు గనక, బోధ ఉన్నా అది ఆజ్ఞలా కాక, మృదువుగా, భుజం మీద చేయి వేసి మాట్లాడినట్లు వస్తుంది.

ఒక కవిత మీలో ఎలా తయారవుతుంది? ఎలా వ్యక్తమవుతుంది? కవిత రాయటంలో మీకేదైనా ప్రణాళిక ఉంటుందా?

బివివి: కవిత్వం నా జీవితానుభవంనుండి, చూపునుండి, ఆర్తినుండి పుడుతుంది. అది ఆకాశంలో మేఘాలు పుట్టినట్టు, సాంద్రమైన భావాలుగా రూపు దిద్దుకొంటూ ఉంటుంది. మేఘం బరువెక్కినపుడు ఇక కురవబోతుంది అని మనకి తెలిసినట్లే, భావసాంద్రత ఏదో ఒక సమయంలో ఒక ఊహ ద్వారానో, వాక్యం ద్వారానో, ఉపమ ద్వారానో పదాల్లోకి కురవబోతుంది అనిపిస్తుంది. మొదటివాక్యం పూర్తవుతూ ఉండగా, రెండవ వాక్యం తెరుచుకుంటుంది. ముగింపువరకూ అలానే నడుస్తుంది. వాన వెలుస్తుంది. కవిత్వం రాయటం అయిదు, పదినిమిషాల పని. కానీ ఆ కవితకి తయారుకావటం వెనక జీవితమంతా ఉంటుంది అనుకుంటాను.

మీ కవిత్వం మొత్తం మానసిక ప్రపంచం చుట్టూ తిరుగుతుంది. నిర్దిష్ట వస్తువుల మీదా, సమస్యల మీదా కవితలు కనపడవు. ఎందువల్ల?

బివివి: జీవితంలోని విషయాల కన్నా, అన్నిటినీ కలుపుకున్న జీవితమనే అనుభవం గురించి రాయటమే, కాలక్రమేణా ఇష్టంగా, సహజంగా మారింది. మారాల్సింది విషయాలు కాదు, చూపు అని జ్ఞానులు చెప్పటం వల్ల కూడా కావచ్చును, మొత్తం జీవితాన్ని చూసే చూపు మార్చుకొనే సాధనలోనే నా కవిత్వం భాగమవుతూ వచ్చింది. కనుకనే నిర్దిష్ట వస్తువులు, సమస్యలు నా కవితల్లో కనిపించవు. ఇది కాగితం మీది బొమ్మల గురించిగాక, బొమ్మలకు ఆధారమైన కాగితం గురించి మాట్లాడటం వంటిది.

మీ కవిత్వంలో కష్టమైన సంధులుండవు, పరుష పదాలుండవు. పొడుగైన పదబంధాలు కూడా ఉండవు. ఒత్తులు, ద్విత్వాక్షరాలూ కూడా అరుదు. ఎందుచేత మీ భాషను ఇట్లా నిర్మించుకున్నారు?

బివివి: నేను అనుభవిస్తున్న, అర్థం చేసుకొంటున్న లోతైన, సున్నితమైన విషయాలు స్పష్టంగా, తేలికగా తెలియచేయటానికి చాలా సరళమైన మీడియం అవసరం అనిపించింది. అందువలన భాష ఎక్కడా అడ్డు పడకుండా చూసుకుంటాను. నా కవిత్వంలో భాష, ‘ఇదిగో నేనున్నాను’ అనదు. తానున్నానా, లేనా అన్నంత నిశ్శబ్దంగా, నిరాడంబరంగా భావాల్ని, కవినుండి పాఠకుడికి చేరవేస్తుంది.

పూలు, సీతాకోకచిలుకలు, వాన, ఆకాశం వంటివి తరచూ మీ కవిత్వంలో కనిపిస్తాయి. దీనికేదైనా ప్రత్యేక కారణం ఉందా?

బివివి: ప్రాకృతిక దృశ్యాలు మనం జీవితమని భ్రమపడుతున్న దానినుండి జీవించటంలోకి మేల్కొలుపుతాయి. మానవుల్ని ఆశలూ, భయాలతో నిండిన మానసిక ఉద్వేగాల నుండి, విముక్తం చేసి, సంతోషమూ, నిండుదనమూ, కనికరమూ వంటి హృదయ స్పందనలలోకి తీసుకువెళతాయి. ప్రాకృతిక పదాలు సహజంగానే కవిత్వ పరిమళాన్ని కలిగి ఉంటాయి గనుక, అవి ఉపయోగించటం ఇష్టంగా ఉంటుంది.

రంగుల్ని చూసి విభ్రాంతికి లోనయే పసిదనమేదో లోపల సాంద్రంగా ఉండి వుంటుంది గనుక, వర్ణ ప్రధాన ప్రాకృతిక దృశ్యాలైన సీతాకోకలు, పూలు, ఇంద్రధనువులు పదేపదే వాక్యాల్లోకి వాలుతాయి. విస్తృతినీ, విముక్తినీ కంటి ముందు నిలిపే ఆకాశమూ, హృదయధర్మానికి సమీపంగా ఉండే వానా తేలికగా కవిత్వంలో కరిగిపోతాయి.

‘ఈ లోకం చిటికెన వేలు పట్టుకుని ఇక్కడ ఉండటానికి భయమేమిటి, బాధేమిటి’ అంటారు ‘సృష్టి’లో. “చాలు అన్న మాట చివర ఏముందో ఎప్పుడన్నా చూసావా” అని ‘ఊరికే జీవితమై’లో అంటారు. ‘ఆకాశం’లో ‘నిశ్శబ్దంగా బ్రతికితే ఏమిటి? నిరాడంబరంగా వెళ్ళిపోతే ఏమిటి?’ అంటారు. ఈ పరుగుల ప్రపంచంలో ఇంత తృప్తికి, నెమ్మదికి చోటెక్కడుంది? “పోనీలే” అన్న మీ మాటతో పక్కకు తప్పుకుంటే ఈ పోటీ ప్రపంచపు నిజాన్ని ఎదుర్కోవడమెట్లా?

బివివి: పరుగుల ప్రపంచం లోకమోహంలో మనసు కల్పించేది. తృప్తి మనసు తనతో తాను నిండినపుడు కలిగేది. మొదటిదానిలో పడి కొట్టుకుపోతున్నాం, గనకే రెండవది నొక్కి చెప్పటం. అనుభవాలా, శాంతా ఏది చివరిది అనే చూపు నివ్వటానికి ప్రయత్నమేమో, నా రాతలన్నీ.

జీవం నిండిన మెలకువతో పగలు గడపటానికి, రాత్రులు గాఢమైన నిద్ర అవసరం. పగటికి రాత్రి వ్యతిరేకం కాదు, పూరకం. అలానే, ఘర్షణతో నిండిన జీవితంలో ఉత్సాహంగా పాల్గొనటానికి శాంతి నిండిన మనసు అవసరం. ఆ శాంతిని కలిగించే మౌలిక విలువలలో, ‘పోనివ్వు’ కూడా ఒకటి. ఆశలలో కొట్టుకుపోయే మనసుకి, చాలు అనే భావన అమృతబిందువు. అది నిరాశని, చేతకానితనాన్ని ఇచ్చే చాలు కాదు, నిండుదనాన్ని, వివేకాన్ని ఇచ్చే చాలు.

‘ఆకాశం’లో గొప్ప సానుకూల దృక్పథం (positive outlook) ఉంటుంది. ఉత్సాహభరితమైన గొంతు, ఆశావహ దృక్పథం కనపడతాయి. ఇప్పుడు ‘సృష్టి’ సంపుటిలో, “ఒక భయ దుఃఖ కంపిత హృదయపు వెదుకులాట ఈ మాటలు” అంటారు. ఈ పరిణామాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

బివివి: ‘ఆకాశం’ నుండి ‘నీలో కొన్నిసార్లు’, ‘ఊరికే జీవితమై’ మీదుగా ఇప్పటి ‘సృష్టి’ వరకూ, నా ఆంతరిక ప్రయాణం ఏకసూత్రతతోనే ఉందనుకుంటాను. లోపలున్నది ఒకే ఆనందం, దుఃఖం, ఒకే భయం, ప్రేమ, ఒకే వెదుకులాట, తృప్తి. మానవ మౌలిక సంవేదనలతోనే కవి వ్యవహరిస్తూ వచ్చాడు. ఆయా జీవన సందర్భాల నేపథ్యం వలన పైకి కొన్నిసార్లు ఆనందదాయకంగా ఉన్నట్లు, కొన్నిసార్లు వేదనతో రాసినట్లు కనిపిస్తాయి గానీ, మౌలిక చలనంలో రెండిటినీ గాఢంగా హత్తుకొంటూనే, మరలా రెండిటినీ దాటి వెళ్ళిపోవాలనే ఆరాటమూ, ఆర్తీ కూడా వెలుగునీడల్లా ఆ వాక్యాలపై వాలి గోచరిస్తూ ఉంటాయి.

ప్రచురణ : 
ఎడిటెడ్ : 'వివిధ' ఆంధ్రజ్యోతి 15.12.2025
పూర్తి పాఠం : ఈమాట, జనవరి 2026

02 జనవరి 2026

జీవనోద్వేగం వైపు ... - డాక్టర్ సుంకర గోపాల్

బివివి ప్రసాద్ మొదటి పుస్తకం ఆరాధన నుండి ఇప్పటి సృష్టి వరకు వచ్చిన కవిత్వంలో తన తాత్విక ధారను కొనసాగిస్తున్నారు. మొత్తం మీద వారి సారాంశం అద్వైత భావన. జీవితంలో ఆయన జీవితేచ్చ వెతుకుతున్నాడు. జీవితంలో ఉండే సుఖ, దుఃఖాలను జీవితంలో ఉండే ద్వంద్వాలను అనేకమార్లు బివివి గుర్తించాడు. ఈ జీవితాన్ని ఎట్లా దాటాలో, ఎందుకు దాటలేమో దాని అంతు చూడాలనేది ప్రసాద్ గారి బలమైన కాంక్ష. ప్రకృతికి ,కాలానికి మనిషి అతీతుడు కాదు. శూన్యం నుండి మొదలై భావోద్వేగాల ద్వారా పరిపూర్ణత చెంది, తిరిగి శూన్యం వైపు అనగా అది నిద్ర కావచ్చు, మరణం వైపు కావచ్చు. మానవ జీవితం శూన్యం నుండి శూన్యం వైపు వెళుతుంది అనే భావనను ప్రసాద్ గారు గాఢంగా నమ్మారు. సరళపదాలలో తాత్వికతను పలికించారు. జీవితం తనని తాను ఎట్లా జీవిస్తుందో పసిగడుతున్నారు

వారు రాసిన సృష్టి అనే కవితని పరిశీలిస్తే ఈ సృష్టిని చిత్రకారుడు నైపుణ్యంతో పోలుస్తూ మానవ ఉనికిలోని తాత్విక కోణాన్ని చూపుతారు. సృష్టి కవిత మూడు మూడు పాదాలుగా ఉంటూ చివర నాలుగు పాదాలతో ముగుస్తుంది. ఇందులో వారు మొదట కవితకి పునాది వేస్తారు.

"ఖాళీ మనసులో కొన్ని రంగులు ఒంపు
అవి ఆకాశమూ, గాలీ, నీరూ
కాంతీ, చీకటిలో వెన్నెలా"

ఈ మూడు పాదాలను చిత్రకారుని నైపుణ్యంతో పోలుస్తూ కవితకి పునాది వేస్తారు.

"రంగులపై కొన్ని గీతలు గీయి 
నదులూ, కొండలూ, మైదానాలూ 
ఉదయాస్తమయ మేఘాలూ, పాలపుంతలూ"

ఈ పాదం మనకు ఒక ఆకృతిని ఆకారాన్ని తెలియజేస్తుంది. తరువాతి మూడు పాదాలలో ప్రకృతికి చైతన్యాన్ని ఇచ్చే ప్రతీకలను చెప్తారు.

"గీతలను కొంచెం కదిలించి చూడు
చెట్లు, పిట్టలూ, చేపలూ
చీమలూ, ఏనుగులూ, మనుషులూ"

ఆ తర్వాతి మూడు పాదాలలో ఖాళీ మనసులోని భావోద్వేగాలను చెప్తారు.

"కదలికలలో ఉద్వేగాలు కలుపు 
చిక్కగా, లేతగా ,తీవ్రంగా, తేలికగా 
మంచీ, భయమూ, బాధా, ప్రేమా"

చివరి నాలుగు పాదాలలో శూన్యం నుండి శూన్యం వైపు వెళ్ళడం గురించి చెప్తారు.

"ఇంతకన్నా ఊహించేదేమీ లేదు 
నువ్వైనా, దేవుడైనా 
మళ్లీ మొదటికి రావాల్సిందే 
నిద్రలోనో, మరణంలోనో, జ్ఞానంలోనో" అంటారు.

బివివి ప్రసాద్ చాలా కవితలలో ప్రకృతిలోని వైవిధ్యానికి జీవన ఉత్సాహమే కారణం అనే భావన కనిపిస్తుంది. ఆయన రచించిన మరో కవిత రంగుల పిల్లలు, ఇందులో రంగులు ఆశకి, అస్తిత్వానికి గుర్తుగా చెప్పారు. జీవితంలోని సుఖ, దుఃఖాలను ఓదార్పుగా బతుకుపై ఆశను కలిగించే పసిపిల్లలలాంటి శక్తులుగా కవి అభివర్ణిస్తాడు. ఈ కవిత చదివాక పాఠకుడు తన అంతరంగాన్ని తానే చూసుకోవాలి.

ప్రసాద్ గారికి ఉన్న గొప్ప శక్తి దృశ్య చిత్రణ, అది అన్ని కవితల్లో కనిపిస్తుంది.

"అస్తమయబింబం ఆకాశంలోకి విసిరే 
చివరి నారింజ కాంతిలా

అట్లా నలుపు, తెలుపుల
దుఃఖానందాల కెరటాల మధ్య
రంగులు నీకు ఆశ కల్పిస్తాయి అమాయకంగా 
ఇక్కడింకా ఏదో ఉందని"

ఇక్కడ కవివాడిన నలుపు, తెలుపులు వాస్తవానికి, నిశ్శబ్దానికి సూచికలు.
 
ఇందులో ఉన్న మరొక కవిత మోహం. ఈ కవిత ద్వారా బ్రతికే క్షణాల విలువను కవి చెప్తారు. బాహ్య ప్రపంచానికి అంతరంగ ప్రపంచానికి మధ్య ఉన్న విభజనను గుర్తించమంటారు. జీవితాన్ని అనుభవించాలి అనే తహతహ అడుగడుగునా కనిపిస్తుంది. రెండున్నర గంటల సినిమా అయిపోతుందని జాగ్రత్తగా చూసినట్లు జీవితాన్ని చాలా విలువగా చూడాలని ఈ కవితలో కవి
గుర్తించమంటాడు. మోహం జీవితం పట్ల ఉన్న లేదా ఉండాల్సిన ప్రేమకి సూచిక.

"జీవితమ్మీద ఇంత మోహమేమిటి అంటారు 
ఏ రోజైనావెళ్ళిపోయే విరక్తి ఉంది గనుక అంటావు

ఆ దీపం వెలుతురు, బాటపై మనుషులు 
ఇళ్లపై వెలుగునీడల దోబూచులాట 
ఉండి ఉండి తగిలే గాలి తెరలు
కురవలేక బేలగా నిలబడిన మబ్బులు 
మానుష ప్రపంచపు వింత శబ్దాలు 
చనిపోతే ఇక దొరకవు కదా అని కూడా

జీవించటం ఇంత అపురూపమైన సంగతా అంటారు".

పై వాక్యాలలో కవి నిర్మాణాన్ని పరిశీలిస్తే
చాలా తేలికైన వాక్యాలుగా అనిపిస్తాయి. కానీ ఇందులో కవి జీవితంలోని దృశ్య, స్పర్శ, శబ్ద సన్నివేశాలను చెప్పాడు.

ఇక ఇదే కవితా సంపుటిలో సీతాకోకల కథ
కవిత ఉంది. అందులో కవిత చాలా మామూలుగా 

"రెండు తెల్లటి ప్లాస్టిక్ సీతాకోకల్ని
తలలో తురుముకుంది ఆ అమ్మాయి"
అంటూ ప్రారంభం అవుతుంది.

ఆ కవితలో 
"మాకు రెక్కలున్నాయి, ఊహల్లేవు, 
నీకు ఊహలున్నాయి, రెక్కల్లేవు"
వాక్యాలు మనిషి ఉనికిలోని వెలితిని సూచిస్తాయి. మనిషికి ఎగరాలనే కోరిక ఉంటుంది కానీ పరిమితులు ఉంటాయి. ఈ రెండింటి కలయికతో కళాసృష్టి జరుగుతుందని కవి సీతాకోకల కథ అనే కవితలో చెప్తాడు.

ఈ కవిత, వస్తువు రీత్యా సామాన్యంగా అనిపించినా, దాని వెనుక ఉన్న తాత్వికత చాలా లోతైనది. ఒక చిన్న దృశ్యాన్ని (అమ్మాయి తలలోని ప్లాస్టిక్ సీతాకోక చిలకలు) తీసుకుని, దాన్ని కవిత్వం, ఊహ మరియు జీవిత సత్యాల మధ్య సంఘర్షణగా మార్చిన తీరు గొప్పగా ఉంది.
 
కవి నిరంతరం బాహ్య ప్రపంచాన్ని తన ఊహలతో నింపేయాలని చూస్తుంటాడు, కానీ జీవితం దానికంటే బరువైనదని ఇక్కడ గుర్తు చేస్తారు.
 
"మాతోపాటు సూర్యకాంతినీ, ఆకాశాన్నీ, భూమినీ
అంతటినీ దాచుకునే, పంచిపెట్టే 
జీవితం బరువునీ నువు మోస్తూనే ఉండాలి" అని అంటారు.

"జీవితం బరువునీ నువు మోస్తూనే ఉండాలి" - ఊహల్లో విహరించడం సులభమే కానీ, సూర్యకాంతిని, ఆకాశాన్ని, భూమిని మోయడం కష్టమని కవి అంటారు. కవి కేవలం అందాన్ని మాత్రమే కాదు, ఆ అందం వెనుక ఉన్న జీవిత పాఠాన్ని కూడా వెతుకుతున్నారు.

అమ్మాయి వెళ్ళిపోయాక, అక్కడ మిగిలిన 'నీరెండ'
సీతాకోకలా ఎగరడం అనేది కవితకు ఒక గొప్ప దృశ్యాత్మక ముగింపునిచ్చింది. అమ్మాయి వెళ్ళిపోయినా, కవి ఆలోచనల్లో ఆ అనుభూతి ఇంకా మిగిలే ఉంది.

ఈ కవిత కేవలం ఒక అమ్మాయి తలలోని పిన్నుల గురించి కాదు; ఇది కవిత్వానికీ - జీవితానికీ, ఊహకూ - వాస్తవానికీ మధ్య జరిగే నిరంతర సంవాదం. లోకాన్ని పరిశీలించే క్రమంలో కవి తనని తాను ఎట్లా విశ్లేషించుకుంటారో ఈ కవిత ప్రతిబింబిస్తుంది.

"భూమి ఇంకా ఎడారి కాలేదు
సముద్రం ఎండిపోలేదు 
వెన్నెల మసకగానైనా కనిపిస్తూ ఉంది 
ఎందుకు బ్రతకకూడదు"

అంటూ మరొక కవితలో ఆత్మహత్యలు చేసుకునేవారికి క్షణాల విలువ, ఊపిరి విలువ, జీవితం విలువ, సారహీనమైన జీవితాన్ని వెలిగించుకోవడానికి ఏమేమి చేయాలో, మనకు ఏది భరోసాగా నిలుస్తుందో చాలదా అనే కవితలో చెప్తారు. ప్రసాద్ గారు ఉదయం కిరణాలు, గాలి, మధ్యాహ్నపు ఎండ నీడ, సాయంత్రం దిగులు ఆకాశం పైన కనిపించే రంగులు, చీకటి వచ్చిన సమయాల్లో ఆకాశంలో మెరిసే నక్షత్రాలు.. ఇవన్నీ మనల్ని బతికిస్తాయని, కొంచెం ప్రేమ మిగిలి ఉన్న చాలు ద్వేషాలు, అపనమ్మకాల మధ్య ఒక్క తడి చూపు చాలు ఈ లోకం చాలా ఏళ్లు బతుకుతుందని తన కవిత్వం ద్వారా భరోసా ఇస్తాడు. 

ఈ లోకంలో మనం ఏమన్నా బతికితే చిన్నప్పుడు మాత్రమే బతికామని మిగిలిన జీవితం అంతా కేవలం బదులు చెల్లించడం వలే గడిపేస్తున్నామని వాపోతాడు. జీవితాన్ని సాహసంగా స్వీకరించడం ఎలానో సృష్టి కవితా సంకలనంలోని చాలా కవితలు ఒక తడి హృదయం తో చెప్తాయి. బీవీవీ కవిత్వంలో ఆకాశము, సముద్రం, క్షణాలు, జీవితం, పూలు, సీతాకోకలు, ప్రేమ, దయ, దుఃఖం వంటి పదాలతో చేసే ఊహలు సరికొత్తగా ఉంటాయి. ఇక ఆయన వాక్యాలు మృదువైన స్పర్శతో సున్నితంగా, లాలనగా ఉంటాయి. ప్రపంచం పట్ల, ఈ ప్రపంచంలోని మనుషులు పట్ల అపారమైన ప్రేమ కలిగిన కవి బివివి ప్రసాద్. ప్రపంచాన్ని లేదా జీవితాన్ని చిన్నారిపాపలా దగ్గరకు తీసుకోవడం ఎట్లాగో ఈ కవిని చదివాక తెలుస్తుంది. ఆయన ఓ కవితలో ముగింపువాక్యం చూడండి.

"జీవితం నీ ప్రేమ కోసం ఏడుస్తున్న 
నీ తప్పిపోయిన శిశువు"

సృష్టి కవిత సంపుటి కోసం బీవీవీ ప్రసాద్ గారిని సంప్రదించవచ్చు.

- డాక్టర్ సుంకర గోపాల్
8555971630

(కవిసంగమం గ్రూప్ లోని కవిత్వ కాంతి శీర్షిక కోసం రాసిన 44వ వ్యాసం)