02 జనవరి 2026

జీవనోద్వేగం వైపు ... - డాక్టర్ సుంకర గోపాల్

బివివి ప్రసాద్ మొదటి పుస్తకం ఆరాధన నుండి ఇప్పటి సృష్టి వరకు వచ్చిన కవిత్వంలో తన తాత్విక ధారను కొనసాగిస్తున్నారు. మొత్తం మీద వారి సారాంశం అద్వైత భావన. జీవితంలో ఆయన జీవితేచ్చ వెతుకుతున్నాడు. జీవితంలో ఉండే సుఖ, దుఃఖాలను జీవితంలో ఉండే ద్వంద్వాలను అనేకమార్లు బివివి గుర్తించాడు. ఈ జీవితాన్ని ఎట్లా దాటాలో, ఎందుకు దాటలేమో దాని అంతు చూడాలనేది ప్రసాద్ గారి బలమైన కాంక్ష. ప్రకృతికి ,కాలానికి మనిషి అతీతుడు కాదు. శూన్యం నుండి మొదలై భావోద్వేగాల ద్వారా పరిపూర్ణత చెంది, తిరిగి శూన్యం వైపు అనగా అది నిద్ర కావచ్చు, మరణం వైపు కావచ్చు. మానవ జీవితం శూన్యం నుండి శూన్యం వైపు వెళుతుంది అనే భావనను ప్రసాద్ గారు గాఢంగా నమ్మారు. సరళపదాలలో తాత్వికతను పలికించారు. జీవితం తనని తాను ఎట్లా జీవిస్తుందో పసిగడుతున్నారు

వారు రాసిన సృష్టి అనే కవితని పరిశీలిస్తే ఈ సృష్టిని చిత్రకారుడు నైపుణ్యంతో పోలుస్తూ మానవ ఉనికిలోని తాత్విక కోణాన్ని చూపుతారు. సృష్టి కవిత మూడు మూడు పాదాలుగా ఉంటూ చివర నాలుగు పాదాలతో ముగుస్తుంది. ఇందులో వారు మొదట కవితకి పునాది వేస్తారు.

"ఖాళీ మనసులో కొన్ని రంగులు ఒంపు
అవి ఆకాశమూ, గాలీ, నీరూ
కాంతీ, చీకటిలో వెన్నెలా"

ఈ మూడు పాదాలను చిత్రకారుని నైపుణ్యంతో పోలుస్తూ కవితకి పునాది వేస్తారు.

"రంగులపై కొన్ని గీతలు గీయి 
నదులూ, కొండలూ, మైదానాలూ 
ఉదయాస్తమయ మేఘాలూ, పాలపుంతలూ"

ఈ పాదం మనకు ఒక ఆకృతిని ఆకారాన్ని తెలియజేస్తుంది. తరువాతి మూడు పాదాలలో ప్రకృతికి చైతన్యాన్ని ఇచ్చే ప్రతీకలను చెప్తారు.

"గీతలను కొంచెం కదిలించి చూడు
చెట్లు, పిట్టలూ, చేపలూ
చీమలూ, ఏనుగులూ, మనుషులూ"

ఆ తర్వాతి మూడు పాదాలలో ఖాళీ మనసులోని భావోద్వేగాలను చెప్తారు.

"కదలికలలో ఉద్వేగాలు కలుపు 
చిక్కగా, లేతగా ,తీవ్రంగా, తేలికగా 
మంచీ, భయమూ, బాధా, ప్రేమా"

చివరి నాలుగు పాదాలలో శూన్యం నుండి శూన్యం వైపు వెళ్ళడం గురించి చెప్తారు.

"ఇంతకన్నా ఊహించేదేమీ లేదు 
నువ్వైనా, దేవుడైనా 
మళ్లీ మొదటికి రావాల్సిందే 
నిద్రలోనో, మరణంలోనో, జ్ఞానంలోనో" అంటారు.

బివివి ప్రసాద్ చాలా కవితలలో ప్రకృతిలోని వైవిధ్యానికి జీవన ఉత్సాహమే కారణం అనే భావన కనిపిస్తుంది. ఆయన రచించిన మరో కవిత రంగుల పిల్లలు, ఇందులో రంగులు ఆశకి, అస్తిత్వానికి గుర్తుగా చెప్పారు. జీవితంలోని సుఖ, దుఃఖాలను ఓదార్పుగా బతుకుపై ఆశను కలిగించే పసిపిల్లలలాంటి శక్తులుగా కవి అభివర్ణిస్తాడు. ఈ కవిత చదివాక పాఠకుడు తన అంతరంగాన్ని తానే చూసుకోవాలి.

ప్రసాద్ గారికి ఉన్న గొప్ప శక్తి దృశ్య చిత్రణ, అది అన్ని కవితల్లో కనిపిస్తుంది.

"అస్తమయబింబం ఆకాశంలోకి విసిరే 
చివరి నారింజ కాంతిలా

అట్లా నలుపు, తెలుపుల
దుఃఖానందాల కెరటాల మధ్య
రంగులు నీకు ఆశ కల్పిస్తాయి అమాయకంగా 
ఇక్కడింకా ఏదో ఉందని"

ఇక్కడ కవివాడిన నలుపు, తెలుపులు వాస్తవానికి, నిశ్శబ్దానికి సూచికలు.
 
ఇందులో ఉన్న మరొక కవిత మోహం. ఈ కవిత ద్వారా బ్రతికే క్షణాల విలువను కవి చెప్తారు. బాహ్య ప్రపంచానికి అంతరంగ ప్రపంచానికి మధ్య ఉన్న విభజనను గుర్తించమంటారు. జీవితాన్ని అనుభవించాలి అనే తహతహ అడుగడుగునా కనిపిస్తుంది. రెండున్నర గంటల సినిమా అయిపోతుందని జాగ్రత్తగా చూసినట్లు జీవితాన్ని చాలా విలువగా చూడాలని ఈ కవితలో కవి
గుర్తించమంటాడు. మోహం జీవితం పట్ల ఉన్న లేదా ఉండాల్సిన ప్రేమకి సూచిక.

"జీవితమ్మీద ఇంత మోహమేమిటి అంటారు 
ఏ రోజైనావెళ్ళిపోయే విరక్తి ఉంది గనుక అంటావు

ఆ దీపం వెలుతురు, బాటపై మనుషులు 
ఇళ్లపై వెలుగునీడల దోబూచులాట 
ఉండి ఉండి తగిలే గాలి తెరలు
కురవలేక బేలగా నిలబడిన మబ్బులు 
మానుష ప్రపంచపు వింత శబ్దాలు 
చనిపోతే ఇక దొరకవు కదా అని కూడా

జీవించటం ఇంత అపురూపమైన సంగతా అంటారు".

పై వాక్యాలలో కవి నిర్మాణాన్ని పరిశీలిస్తే
చాలా తేలికైన వాక్యాలుగా అనిపిస్తాయి. కానీ ఇందులో కవి జీవితంలోని దృశ్య, స్పర్శ, శబ్ద సన్నివేశాలను చెప్పాడు.

ఇక ఇదే కవితా సంపుటిలో సీతాకోకల కథ
కవిత ఉంది. అందులో కవిత చాలా మామూలుగా 

"రెండు తెల్లటి ప్లాస్టిక్ సీతాకోకల్ని
తలలో తురుముకుంది ఆ అమ్మాయి"
అంటూ ప్రారంభం అవుతుంది.

ఆ కవితలో 
"మాకు రెక్కలున్నాయి, ఊహల్లేవు, 
నీకు ఊహలున్నాయి, రెక్కల్లేవు"
వాక్యాలు మనిషి ఉనికిలోని వెలితిని సూచిస్తాయి. మనిషికి ఎగరాలనే కోరిక ఉంటుంది కానీ పరిమితులు ఉంటాయి. ఈ రెండింటి కలయికతో కళాసృష్టి జరుగుతుందని కవి సీతాకోకల కథ అనే కవితలో చెప్తాడు.

ఈ కవిత, వస్తువు రీత్యా సామాన్యంగా అనిపించినా, దాని వెనుక ఉన్న తాత్వికత చాలా లోతైనది. ఒక చిన్న దృశ్యాన్ని (అమ్మాయి తలలోని ప్లాస్టిక్ సీతాకోక చిలకలు) తీసుకుని, దాన్ని కవిత్వం, ఊహ మరియు జీవిత సత్యాల మధ్య సంఘర్షణగా మార్చిన తీరు గొప్పగా ఉంది.
 
కవి నిరంతరం బాహ్య ప్రపంచాన్ని తన ఊహలతో నింపేయాలని చూస్తుంటాడు, కానీ జీవితం దానికంటే బరువైనదని ఇక్కడ గుర్తు చేస్తారు.
 
"మాతోపాటు సూర్యకాంతినీ, ఆకాశాన్నీ, భూమినీ
అంతటినీ దాచుకునే, పంచిపెట్టే 
జీవితం బరువునీ నువు మోస్తూనే ఉండాలి" అని అంటారు.

"జీవితం బరువునీ నువు మోస్తూనే ఉండాలి" - ఊహల్లో విహరించడం సులభమే కానీ, సూర్యకాంతిని, ఆకాశాన్ని, భూమిని మోయడం కష్టమని కవి అంటారు. కవి కేవలం అందాన్ని మాత్రమే కాదు, ఆ అందం వెనుక ఉన్న జీవిత పాఠాన్ని కూడా వెతుకుతున్నారు.

అమ్మాయి వెళ్ళిపోయాక, అక్కడ మిగిలిన 'నీరెండ'
సీతాకోకలా ఎగరడం అనేది కవితకు ఒక గొప్ప దృశ్యాత్మక ముగింపునిచ్చింది. అమ్మాయి వెళ్ళిపోయినా, కవి ఆలోచనల్లో ఆ అనుభూతి ఇంకా మిగిలే ఉంది.

ఈ కవిత కేవలం ఒక అమ్మాయి తలలోని పిన్నుల గురించి కాదు; ఇది కవిత్వానికీ - జీవితానికీ, ఊహకూ - వాస్తవానికీ మధ్య జరిగే నిరంతర సంవాదం. లోకాన్ని పరిశీలించే క్రమంలో కవి తనని తాను ఎట్లా విశ్లేషించుకుంటారో ఈ కవిత ప్రతిబింబిస్తుంది.

"భూమి ఇంకా ఎడారి కాలేదు
సముద్రం ఎండిపోలేదు 
వెన్నెల మసకగానైనా కనిపిస్తూ ఉంది 
ఎందుకు బ్రతకకూడదు"

అంటూ మరొక కవితలో ఆత్మహత్యలు చేసుకునేవారికి క్షణాల విలువ, ఊపిరి విలువ, జీవితం విలువ, సారహీనమైన జీవితాన్ని వెలిగించుకోవడానికి ఏమేమి చేయాలో, మనకు ఏది భరోసాగా నిలుస్తుందో చాలదా అనే కవితలో చెప్తారు. ప్రసాద్ గారు ఉదయం కిరణాలు, గాలి, మధ్యాహ్నపు ఎండ నీడ, సాయంత్రం దిగులు ఆకాశం పైన కనిపించే రంగులు, చీకటి వచ్చిన సమయాల్లో ఆకాశంలో మెరిసే నక్షత్రాలు.. ఇవన్నీ మనల్ని బతికిస్తాయని, కొంచెం ప్రేమ మిగిలి ఉన్న చాలు ద్వేషాలు, అపనమ్మకాల మధ్య ఒక్క తడి చూపు చాలు ఈ లోకం చాలా ఏళ్లు బతుకుతుందని తన కవిత్వం ద్వారా భరోసా ఇస్తాడు. 

ఈ లోకంలో మనం ఏమన్నా బతికితే చిన్నప్పుడు మాత్రమే బతికామని మిగిలిన జీవితం అంతా కేవలం బదులు చెల్లించడం వలే గడిపేస్తున్నామని వాపోతాడు. జీవితాన్ని సాహసంగా స్వీకరించడం ఎలానో సృష్టి కవితా సంకలనంలోని చాలా కవితలు ఒక తడి హృదయం తో చెప్తాయి. బీవీవీ కవిత్వంలో ఆకాశము, సముద్రం, క్షణాలు, జీవితం, పూలు, సీతాకోకలు, ప్రేమ, దయ, దుఃఖం వంటి పదాలతో చేసే ఊహలు సరికొత్తగా ఉంటాయి. ఇక ఆయన వాక్యాలు మృదువైన స్పర్శతో సున్నితంగా, లాలనగా ఉంటాయి. ప్రపంచం పట్ల, ఈ ప్రపంచంలోని మనుషులు పట్ల అపారమైన ప్రేమ కలిగిన కవి బివివి ప్రసాద్. ప్రపంచాన్ని లేదా జీవితాన్ని చిన్నారిపాపలా దగ్గరకు తీసుకోవడం ఎట్లాగో ఈ కవిని చదివాక తెలుస్తుంది. ఆయన ఓ కవితలో ముగింపువాక్యం చూడండి.

"జీవితం నీ ప్రేమ కోసం ఏడుస్తున్న 
నీ తప్పిపోయిన శిశువు"

సృష్టి కవిత సంపుటి కోసం బీవీవీ ప్రసాద్ గారిని సంప్రదించవచ్చు.

- డాక్టర్ సుంకర గోపాల్
8555971630

(కవిసంగమం గ్రూప్ లోని కవిత్వ కాంతి శీర్షిక కోసం రాసిన 44వ వ్యాసం)



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి