18 అక్టోబర్ 2025

కవిత : ఒక మిత్రుడు

ఒక మిత్రుడుండేవాడు
ఉదయపు సూర్యకాంతీ, మధ్యాహ్నపు వేడిమీ,
సాయంత్రపు గాలితెరలూ, నక్షత్రాల గుసగుసలూ 
కలిపి తయారుచేసినట్లు

వాడుంటే సందడుండేది, సందడుంటే వాడుండేవాడు,
ఒకానొకరోజు ఇక చాలురా అని వెళిపోయాడు
కాంతీ, వేడిమీ, తెరలూ, గుసగుసలూ పుట్టేచోటికి

వాడిక రాడు, అలాగని నువ్వూ మిగిలేది లేదు,
వాడిలాగా జీవితాన్ని అనుభవించలేదు నువు,
మనుషుల్ని ప్రేమించలేదు,
వాడిలాగా బ్రతుకుపండగ చాతకాలేదు

ఇలా ఉంటుంది జీవితం
ఉండవలసినవాళ్ళు ఉండరు,
వెళ్ళవలసినవాళ్ళు వెళ్ళరు 

వాడిని తలిస్తే దుఃఖమేమీ రాదు,
ఉన్నట్లుండి వీచే గాలితెరలా
వాడి జ్ఞాపకాలలోంచి రాలే సంతోషం తప్ప,

వాడికి కళలు తెలియవు,
గెలుపుపందెంలో పరుగు కోరుకోలేదు,
సామాన్యంగా బ్రతికి, సామాన్యంగా వెళిపోయాడు,
నువు చూడని రోజుల్లో కూడా
నీ ఊరిచుట్టూ నిశ్శబ్దంగా ప్రవహిస్తున్న కాలువలా

(చక్కా శ్రీనివాస్ స్మృతిలో)

బివివి ప్రసాద్

17 అక్టోబర్ 2025

కవిత : అనుభవం

 అనుభవానికి దగ్గరగా జరుగుతావు
జీవితం చాలా గడిచిపోయాక,
చివరి మలుపు తిరిగి
ముగింపు దూరాన కనబడుతున్నపుడు

కలలూ, ఆశలూ కొన్ని ఫలిస్తాయి, 
చాలా ఫలించనట్లే
గడిచిన కాలమంతా గుప్పిటలోకి తీసుకుని
దీనిలో సారమేమైనా ఉందా అని వెదుకుతావు

గడిచిన ఊహల్నీ, ఆందోళనలనీ 
తడుముకొని చూస్తావు
చాలా సంగతులకి అర్థం ఉండదు,
చాలా ఊహలు ఏ ఫలితం చూపకనే ఆవిరయాయి
ఎండమావులలోని నీటిలా

మరోసారి గడిచిన కాలాన్ని జీవించే అవకాశం వస్తే 
చాలా పనులు చేయవు,
చాలా అనుభవాలు కోరుకోవు

ఉదయపు కాంతి దీవించిన అనుభవం, 
తాజాగాలులు తాకుతూ వెళ్లిన అనుభవం,
పూలు విప్పారుతూ ఆశ్చర్యపరిచిన అనుభవం,
పక్షి కూత గాలిలోకి పలుచని వల విసిరిన అనుభవం 

వీటికన్నా అపురూపమైనవేమీ లేవని
నీ భయాల, గర్వాల, దుఃఖాల తర్వాత తెలుస్తుంది

చివరిమలుపులో నీకు తెలియవస్తుంది
సూర్యకాంతీ, నక్షత్రాలూ నిన్నెంత ప్రేమించాయో,
నిను కన్నతల్లి 
నీలో ఎన్ని పగళ్ళనీ, రాత్రుల్నీ కలగన్నదో,
తల్లినీ, జీవితానుభవాన్నీ ఎంత నిర్లక్ష్యం చేసావో

బివివి ప్రసాద్

16 అక్టోబర్ 2025

కవిత : పొడి సాయంత్రం

 అవును, సాయంత్రపు రంగులకాంతి 
విరజిమ్ముతుంది సమానంగా
ఎడారిలోనూ, అడవిలోనూ, 
నది మీదా, సమూహాల మీదా

ఎడారి రంగులకాంతిని పిలుస్తుంది, 
అడవి తనలోకి ఒంపుకొంటుంది,
అలలనది ఆటలాడుతుంది తనతో,
సమూహం తనని అంటకుండా
ధూళి నిండిన పనుల్లో మునుగుతుంది

ఇంత అందమైన కాంతిని,
కాంతిని ఒంపే విశాలమైన గగనాన్ని కాదని
వీళ్ళేం చేస్తున్నారని విస్మయపడుతుంది సాయంత్రం

ప్రతి సాయంత్రం జీవితమొక ప్రేమలేఖ పంపిస్తుంది
అవని సమస్తానికీ
జీవితమెంత అందమైనదో చూడమని,
జనులు మాత్రం, 
సాయంత్రాలని గడియారాల్లో గుర్తుపడతారు

చూస్తూ ఉండగా చీకటి పడుతుంది
ఆకాశంలో కొంత వెన్నెల ప్రసరిస్తుంది,
చీకటిలో మునిగినవారిలోకి
వెన్నెల ఏ మాత్రమూ ఇంకకపోగా
చివరి చీకటి మరికాస్త వేగంగా సమీపిస్తుంది

బివివి ప్రసాద్

15 అక్టోబర్ 2025

కవిత : బాల్య స్నేహం

జారిపోయే నిక్కరు పైకి లాక్కుంటూ
ఆవేశంగా కబుర్లు చెప్పుకునేటపుడు 
విడిపోయిన అమ్మాయి
అరవై ఏళ్ళకి కనబడి, ఏడుస్తూ అంది
ఇన్నాళ్ళూ ఎక్కడికి పోయావు

అతనన్నాడు
సరే, ఇప్పుడు నేనేం చేయాలి
అప్పటి ఆకాశాన్ని మళ్ళీ పట్టుకురానా,
అప్పటి గాలిని వీచమని బ్రతిమాలనా,
అప్పటి అమాయకత్వాన్ని వెదుకుతూ వెళ్ళనా

తను అంది 
వద్దులే, ఇప్పుడు వెళితే, ఎప్పుడు వస్తావో 
ఇక్కడే ఉండు కళ్ళముందు, చాలు

అవాళ్టి సూర్యుడు
ముసిముసి నవ్వులు నవ్వుతూ నిద్రపోయాడు,
ఆ రాత్రి నక్షత్రాలు గుప్పున విరబూసాయి,
మళ్ళీ క్రొత్తగా పుట్టిన ఇద్దరు పిల్లలు
కాలం జారుడుబల్లపై
గాఢమైన శాంతిలోకి జారిపోయారు 

బివివి ప్రసాద్

14 అక్టోబర్ 2025

కవిత : సీతాకోకల కథ

రెండు తెల్లటి ప్లాస్టిక్ సీతాకోకల్ని 
తలలో తురుముకుంది ఆ అమ్మాయి

చీకటి సెలయేళ్ళ వంటి శిరోజాల్ని 
జారిపోకుండా పట్టుకొని, కదలకుండా ఎగురుతున్న 
సీతాకోకలు ఆ అమ్మాయితో ఏం చెబుతాయి,
లేదా ఏం చెప్పాయని తనతో తెచ్చుకొంది 

జీవితం కాంతికి కాంతితోనే బదులిస్తే
రంగుల్ని దాటి తెల్లగా వెలుగుతావు అనా,
నల్లని జీవితం ముసురుకొన్నపుడు
తెల్లని కాంతిలోకి దారి చూపిస్తాము అనా

మేం మాట్లాడం, నువ్వూ మాట్లాడకు
ఊరికే చేతుల్లోకి తీసుకుని ఎగరేయి,
మా రెక్కలు చాపి ఎగురుతూ వుంటాము,
మాదైన విశాల గగనంలోకి తీసుకుపోతామనా

మాకు రెక్కలున్నాయి, ఊహల్లేవు,
నీకు ఊహలున్నాయి, రెక్కల్లేవు,
నీ ఊహలకి మా రెక్కలు తగిలించి
మనదైన మాంత్రికనగరం సృష్టించుకుందామనా

వాళ్లేం మాట్లాడుకుని ఒప్పందానికి వచ్చారో తెలీదు,
మాటలేమీ లేకుండానే ఒకరినొకరు చేరారో తెలీదు,
అవి పిలిస్తే ఆ అమ్మాయి ఎగురుతూ వెళ్ళిందో,
తాను పిలిస్తే అవి నడుచుకొంటూ వెళ్లాయో తెలీదు

ఇట్లా, నువ్వు వాళ్ళ మధ్య చేరి
వారి నడుమ ఉన్న రహస్యాలని పసిగట్టబోతావా, 
వారి మంత్రనగరిలోకి దారి వెదకబోతావా, 
ఆ అమ్మాయిని అటు తిరగనిచ్చి,
సీతాకోకలు నీ వైపు తిరిగి అంటాయి కదా

కవీ, నీ కింకా పిల్లచేష్టలు పోలేదు,
ఇతర్ల స్థలంలోకి నువు చొరబడనప్పుడే
నీ స్థలమేదో నిజంగా గుర్తుపడతావు,
నీలో నువ్వు నిలబడినప్పుడు
నీ లోపలికే మేం మరలా చేరిపోతాము

ఇట్లా ఊహిస్తూ ఉన్నావంటే
నీలోంచి సీతాకోకలై ఎగురుతూనే వుంటాము,
మాతో పాటు సూర్యరశ్మినీ, అది పొంగిపొర్లే ఆకాశాన్నీ,
మా అంతటినీ దాచుకునే, పంచిపెట్టే జీవితమనే
వృద్ధురాలి బరువునీ నీపై మోపుతూనే వుంటాము

ఉలికిపడి చూసేసరికి,
సీతాకోకల అమ్మాయి వెళ్ళిపోయిన ఖాళీలో 
కంటికి తగలని నీరెండ సీతాకోకలా ఎగురుతోంది

బివివి ప్రసాద్

13 అక్టోబర్ 2025

కవిత : వానతెరలు

కొన్ని వానతెరలూ, తడుస్తూనో, చూస్తూనో
కాసేపు పరుగాపి నిలబడిన ప్రపంచం,
వానలో నాని, మసకబారిన పగటి కాంతీ,
సమస్తాన్నీ కూర్చోబెట్టి
ఈ క్షణంలో జీవించటమెంత బావుంటుందో
విసుగులేకుండా బోధిస్తున్న వానచప్పుడు

ఇది కదా జీవితం అనిపిస్తుందపుడు,
వేడి ఆవిరులు తొలగి, చల్లదనం ఇంకుతున్నట్లు
దుఃఖభారం తొలగి, జీవించే ఆశ ఇంకుతూ వుంటుంది

వాన కురిసే క్షణాలు, క్షణాల్లా కురిసే వానచినుకులు
నీ నుండి తప్పిపోయి దిక్కుతోచక తిరుగుతున్న నిన్ను,
చల్లని గాలితెరలతో కప్పి, గుండెలకి హత్తుకొని,
భయపడుతున్నావా అని లాలనగా అడుగుతాయి

వానలేని ప్రపంచాన్ని ఊహించలేవు,
వాన కాలేని మనుషుల్ని ఊహించలేనట్టే

వాన కురిసే సమయంలో, నింగిపొరల్లో దాగిన,
నీ సోదరులుండే సుతిమెత్తని స్వర్గమేదో, 
ఇంద్రధనువులోంచి లీలగా కనిపించకపోతుందా అని
బేలగా ఆకాశం వంక చూస్తావు

వాన కురుస్తూ వుంటుంది, 
కలల్ని మెత్తబరుస్తూ వుంటుంది,
కలల కాంతిలో మునిగిన నువ్వు
వాన ఆగిందని గుర్తించటం ఇష్టం లేక
నీ కలల్లోకి తిరిగిరాలేనట్టు తప్పిపోతావు

బివివి ప్రసాద్
ప్రచురణ : కవితా! 89 అక్టోబర్ 25 దీపావళి సంచిక