15 జులై 2012

దిగులు వాన

1
దిగులు గాలిపటం ఎక్కడో ఎగురుతూ ఉంది ఈ విరామసమయంలో

2
వాన కురుస్తుంటే లోలోపల దాగిన తాపమేదో ఆవిరై చల్లబడాలి కదా
కానీ ఈ దిగులేమిటి
దారిలో తగులుకొన్న కుక్కపిల్లలా నాతోనే తిరుగుతోంది
 
3
ఎందుకని 'ఆకాశమా ఏడవకమ్మా' అనాలనిపిస్తోంది
మననెవరూ ఓదార్చనపుడు, మనకెవరినైనా ఓదార్చాలనిపిస్తుందనుకొంటా
 
4
విరామమెంత బరువుగా వుంటుంది
ఈ ఖాళీ సమయాన్ని తెల్లకాగితంలా మడిచి దాచుకొని
వత్తిడుల మధ్య వాడుకోగలిగితే బాగుండును
 
5
ఏదో ఒకటి చేయాలి
నన్ను నేను తప్పించుకోవాలి
కురిసే, కురిసే వానని ఊహతో ఆపగలనేమో ప్రయత్నించాలి
 
6
సంగీతమో, స్మృతులో, కవిత్వమో
దేనికైనా ఈ దిగులు సరైన సమయం
కానీ, అన్నిటినీ విడిచి,
ఈ సారైనా దిగులు గర్భంలోకి సరాసరి దూకాలని ఉంది
ఏ సృష్ట్యాది కాలపు వెలుతురులు అక్కడ దాగివున్నాయో చూడాలని ఉంది
 
ఏమీ లేకపోవటమైనా అక్కడ ఉండకపోతుందా
అంతూ, దరీ లేని స్వేచ్ఛ నన్ను ముంచేయకపోతుందా
నిజమైన వాన ఏదో నన్నొక చినుకుని చేసి ఎటైనా విసిరేయకపోతుందా