14 డిసెంబర్ 2012

మాతృభాష

మాతృభాష మాట్లాడుతున్నపుడు ఎలావుంటుంది
పసిదనంలో అమ్మ ఊయలలోవేసి జోల పాడుతున్నట్లుంటుంది
ఆమె గారాబు చేస్తున్నట్టూ, ఆటళవేళల ఆతృతగా హెచ్చరిస్తున్నట్టూ వుంటుంది

బాల్యంలో స్నేహితులతో కాలవగట్ల వెంటా, పొలాల నడుమా పరుగెడుతున్నట్టూ,
చెట్టూ, పుట్టల్నీ, పిట్టల్నీవాటివాటి భాషల్లో పలకరిస్తున్నట్టూ వుంటుంది
నేస్తాలతో నవ్వుకొన్నట్టూ, తిట్టుకొన్నట్టూ, చిరుతిళ్ళు వాళ్ళతో పంచుకొన్నట్టూ వుంటుంది

మాతృభాష మాట్లాడుతున్నపుడు
మనలో ఎక్కడో పైరగాలులు హోరున సరదాగా సాగిపోతున్నట్టూ
స్వచ్చప్రవాహాలు రాళ్ళగలగలల్తో మనతో, మనభాషలో మాట్లాడినట్టూ వుంటుంది

తెల్లని పగళ్ళూ, నల్లని రాత్రులూ
రుతువులతో రూపం మార్చే ఆకాశాలూ
మనని నిండుగా కప్పుకొన్నట్టూ వుంటుంది

మాతృభాష ఒక సంపద
ఒక పురాతన వారసత్వం
ఒక జీవన సమూహపు కథలూ, కలల నిరంతర ప్రవాహం
మాతృభాష మనని మనల్నిగా నిలిపిచూపే ఒక శబ్దాల వన్నెల జెండా

మన లోలోపలి
కోరికల, భయాల, స్మృతుల, స్వప్నాల జాడల్ని
తల్లిలా మృదువుగా తాకే, పలకరించే, పరిమళింపచేసే
సంగీత పరికరం, మంత్రదండం

మాతృభాషని ప్రేమించటం మాతృమూర్తిని ప్రేమించటం
మాతృమూర్తి ప్రసాదించిన జీవితాన్ని ప్రేమించటం
జీవితం ప్రసాదించిన ఆనందాన్నీ, దు:ఖాన్నీ ప్రేమించటం
మాతృభాషని ప్రేమించటమంటే ప్రేమించటం ఎలాగో నేర్చుకోవటం

మాతృభాష నేర్చుకోవటమే భాషని నేర్చుకోవటం
అది దేనినైనా గౌరవించటమెలాగో నేర్చుకోవటం
దేనినైనా శ్రద్ధగా నేర్చుకోవటమెలాగో నేర్చుకోవటం

మాతృభాష గుండెనిండా నింపుకోవటం తెలిసినవాడికి
మరొకభాషనైనా తనలోనికి ఆహ్వానించటం ఎలానో తెలుస్తుంది

అది నోరారా పలకలేని మనిషిని చూస్తే జాలేస్తుంది
నేలమీద నిలవలేక, గాలిలో ఎగరలేక గంతులు వేస్తున్నట్లుంటుంది
పాలు ఒలకబోసుకొని నీటికోసం పరుగెడుతున్నట్లుంటుంది  

మనం పుట్టిన నేల
మనకేమైనా ఇస్తుందో, లేదో కానీ
మనం నోరారా ప్రశ్నించేందుకు, జవాబు చెప్పేందుకు
మనకంటూ ఒక  భాషనిస్తుంది

మన చుట్టూవున్న జీవితాన్ని చదివేందుకు, మన కథ లోకంతో పంచుకొనేందుకు
గుండెనిండా భావాలనీ, నోటినిండా అక్షరాలనీ నింపేందుకు కావలసినంత సంభాషణనిస్తుంది
 
మాతృభాష కళ తప్పని బంగారు స్వప్నాలనిస్తుంది
కలతపడ్డ వేళల కన్నీరు నిండిన మాటలనిస్తుంది
మన హృదయం భాషలోకి వికసించి మన జీవితం పక్వమయేలా చేస్తుంది  (మా ఊరిలో జరిగిన తెలుగు భాషా ఉత్సవాల సందర్భంగా రాసింది.)

13.12.12