1.
ఒక నిద్రలేవవలసిన ఉదయం నీ దేహం చల్లబడి ఉంటుంది
ఎలా బ్రతికావో బ్రతికావు, ఇక అంతా అయిపోయింది
నీ దేహం చుట్టూ మేఘంలా ముసురుకొన్న దు:ఖానికీ, ఆర్తి నిండిన శబ్దాలకీ
నువు వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంటావు
అవును, అసలు ఉంటావో, ఉండవో ఎప్పటికీ రహస్యమే
తీరా వెళ్ళిపోయాక ఈ పంచరంగుల ఆట కొనసాగుతుందో, ముగుస్తుందో ఎప్పటికీ సందేహమే
నువు ఉంటావనుకోవటమూ, జీవితం కొనసాగుతుంది అనుకోవటమూ
కలలాంటి జీవితానికి అందమైన సరిహద్దులు మాత్రమే
మిగిలేదేమిటో తెలిసిందెవరికి, తెలుసుననేవారిలో తెలుసుకొంటున్నదెవరు
2.
జీవితం భయ, విషాదాలతో పొర్లిపోయే పాత్రను తలపై ఉంచుకొని నర్తించే ఒక కళ
గెలిచేందుకు ఏ నియమాలూ లేని, గెలిచే హామీ ఏ మేరకూ లేని
నీడలు తొణికిసలాడే ఒక నవ్వులక్రీడ
ఎన్నాళ్ళని భూమి మీద ఈ ఎగుడుదిగుడు నడక
ఆడటం అనివార్యమైనపుడు నక్షత్రాలతో ఆడిచూడాలి
నాట్యం తప్పనిసరి అయినపుడు గెలాక్సీలు వేదిక కావాలి
వెళ్ళటమెటూ నిర్ధారణ అయినపుడు
ఉన్నన్నాళ్ళు సమస్త సృష్టినీ పొదువుకొన్న ఆకాశం లా ఉండాలి
ఏమో ఎవరికి తెలుసు
భూమీ, నక్షత్రాలూ, గెలక్సీలూ
అద్దంలో ప్రతిబింబం లా హఠాత్తుగా మాయం కావచ్చును
అద్దంలాంటి ఆకాశం మాత్రం అదృశ్యం కాకుండా మిగలవచ్చును
3.
ఏమయినా కానీ
రా నడుద్దాము అలా ఆకాశం వరకూ
ఈ దారి కొసన నేలకి ఒంగి రమ్మని పిలుస్తోంది
తీరా చేరేసరికి అది పక్షిలా రెక్కలువిప్పి ఎగిరిపోతుందనవద్దు
ఏమో ఎవరికి తెలుసు
మనలో మిగిలే కాస్తంత అమాయకత్వాన్ని ముద్దుపెట్టుకొనేందుకు
అది అక్కడ ఎదురుచూస్తూ ఉండవచ్చును
బహుశా మన పసిమనసుల నిండా ఆకాశం నిండిపోనూవచ్చును
ఒకసారి నాతోరా అలా ఆకాశంగా మారి చూద్దాము
చనిపోతే ఆకాశం లా మిగిలేదీ, లేనిదీ చూసి వద్దాము
4.
ఇంతకూ, పుట్టక ముందు ఎక్కడ ఉండేవాళ్ళమో
ఈ సారి ఆకాశాన్ని కలిసినపుడు తప్పక అడగాలి
రచనాకాలం: 19.8.2012
ప్రచురణ: పాలపిట్ట డిసెంబరు 2012

సర్,
రిప్లయితొలగించండిఎప్పటిలాగే మనసును స్పృశించే కవిత్వం..
మీకు అక్షరాల్లో అమాయకత్వాన్ని అందంగా పొదగగల రహస్యం ఎలా తెలిసిందో, మిమ్మల్ని కలిసినప్పుడు నాకు తప్పక చెప్పాలి. :)
"జీవితం భయ, విషాదాలతో పొర్లిపోయే పాత్రను తలపై ఉంచుకొని నర్తించే ఒక కళ
గెలిచేందుకు ఏ నియమాలూ లేని, గెలిచే హామీ ఏ మేరకూ లేని
నీడలు తొణికిసలాడే ఒక నవ్వులక్రీడ"
నిజంగా క్రీడే అయితే బాగుండును, అంత తేలిగ్గా గడపగల అదృష్టమూ దక్కితే బాగుండును. మీ కవితల్లో మాత్రం ఈ హామీ, ధీమా రెండూ ఉంటాయంటే అతిశయోక్తి కాదు.
Thanks for presenting a wonderful poem over the weekend. :-)
మానసా, ముందుగా మీ ఆత్మీయ ప్రశంసకు ధన్యవాదాలు.
తొలగించండిమనందరిలో ఉండేది అమాయకత్వమే, కష్టపడి మాయ నేర్చుకొంటాము. మాయ వలన అంతిమంగా నష్టమే తప్ప లాభం లేదని ఎవరికివాళ్ళం స్వయంగా తెలుసుకోన్నపుడు, దానిని వదిలేసి అమాయకంగా, శాంతంగా ఉంటాము. అమాయకత్వం సహజస్తితి, మాయ కృత్రిమం. ఇది స్పష్టంగా అర్ధమైతే, మన మాటల్లో, చేతల్లో అమాయకత్వపు అందం ప్రతిఫలిస్తుంది. అలాకాక మాయ అమాయకత్వాన్ని నటిస్తే ఆ అందం లోపిస్తుంది.
ఇంతకూ అమాయకత్వం అంటే తెలివి లేకపోవటం కాదు, మాయ అంటే తెలివీ కాదు. అమాయకత్వం అంటే కల్మషం తెలియకపోవటం కాదు, కల్మషం తెలిసినా దానిని అంటనివ్వకపోవటం. తెలివి అనగా ప్రజఞ అమాయకత్వం నుండే పుడుతుంది కానీ, మాయ వలన ఏర్పడే జిత్తులమారితనం నుండి కాదు. ఇవన్నీ చాలా సూక్ష్మమైన విషయాలు. ఒక వ్యాసమే రాయవచ్చు. ఆసక్తి ఉన్నవారికి ఉపయోగిస్తాయని ఇక్కడ సంక్షిప్తంగా పరిచయం చేసాను.