13 జనవరి 2013

ఎవరో మేలుకొన్నట్లు : Some insider woke up from slumber


నిన్ను గాయపరిచిన మనిషివైపు దయగా చూసినపుడు
నీకు ఇష్టమైన వస్తువొకటి ఎవరికైనా మనసారా ఇచ్చినపుడు
గెలిచి కూడా ప్రపంచం ముందు వినమ్రుడివై మోకరిల్లినపుడు

ఏదో జరుగుతుంది, లోపలెవరో మేలుకొన్నట్లుంటుంది
ఉద్వేగాలన్నీ బడిపిల్లల్లా బుద్ధిగా కూర్చున్నట్లుంటుంది
తలపై నుండి తెలియని భారం దిగిపోయినట్లుంటుంది
తీరం విడిచిన పడవ తానే ప్రవాహమైనట్లుటుంది

ఎవరూ పట్టించుకోని నిన్ను చూసుకొని హాయిగా నవ్వుకొన్నపుడు
ఇతరుల నిష్కపట దు:ఖంలో, నవ్వులో నీకు నువ్వు కనిపించినపుడు
నానావర్ణ సమ్మిళిత ప్రపంచం విడిచి నీలోకి నువ్వు చూసినపుడు
క్షణమైనా జీవన భయాన్ని మరిచినపుడు, పూర్తిగా నిన్ను మరిచినపుడు

లోలోపల ఎవరో ధ్యానం చేస్తున్నట్లుంటుంది
అంతంలేని మౌనం ఏదో నిన్ను అన్వేషిస్తున్నట్లుంటుంది
చందమామ ఆకాశంలో మెల్లగా ఎగురుతున్నట్లుంటుంది
మధురస్వప్నాల చివర బంగారుఎండ కనురెప్పల్ని తాకినట్లుంటుంది

నువు ఊయలలో ఉన్నట్లూ
ఆకాశం అమ్మ ముఖంలా నీమీదికి వంగినట్లూ ఉంటుంది
దైవం నీముందు నిలిచి నీతో కరచాలనం చేసినట్లుంటుంది

అప్పుడు బాల్యంలోకి మళ్ళీ ప్రవేశించినట్లుటుంది
చూసిన ప్రతివస్తువునీ మళ్ళీ మృదువుగా తాకాలనిపిస్తుంది
చూసిన ప్రతి మనిషినీ హృదయంలోకి తీసుకోవాలనిపిస్తుంది
సృష్టి అంతటినీ చూసి ఆశ్చర్యపోవాలనిపిస్తుంది

అప్పుడు జీవితంపై మరిచిపోయిన ప్రేమ మళ్ళీ గుర్తుకొస్తుంది
క్షణం జీవితం చాలనిపిస్తుంది. కల్పాలు బ్రతికినా చాలదనిపిస్తుంది



Some insider woke up from slumber


When you cast a gracious glance on someone who hurt you earlier-
When you heartily gift away a souvenir that you loved the most-
When you humbly kneel before the world though being the victor-
Something happens!

You feel like some insider woke up from slumber
You feel like emotions methodically assembled like the kids in uniform
You feel like an unknown burden got relieved from the head
You feel like the boat that left the banks turned into a stream on itself

When you, the ignored and humiliated you, laugh at yourself -
When you traced your own self, in others’ candid smiles or sobs-
When you peeped into you, leaving the myriad-colored world-
When you could relieve yourself of the fear of life for a while-

And, when you could completely put ‘you’ out of your mind-
You feel like someone was meditating in side!
You feel like a certain endless silence was probing for you-
You feel like the Moon was treading slowly in the sky
You feel like sunny gold rays were caressing your eye-lids
At the end of a sweet dream

You feel like swinging in a cradle-
You feel like the sky leaned on you wearing your mother’s face-
As if the God stood before you shaking a hand-
And, then you feel like entering into childhood again!

You would wish to tap everything softly
And, embrace everyone into your heart
You would wish to be dumb-stuck at the whole world

Then
You shall regain the love for life that vanished long ago
A speck of life might seem to be suffice-
Million Millennia might not seem to be enough!


_______________________________ 
'ఆకాశం' సంపుటి నుండి    
Translation: Sri Mandalaparthy Kishore

12 జనవరి 2013

స్వచ్చమైన కవిత్వానికి ప్రతిస్పందనలు


ఆకాశం వంటి నిర్మలమైన కవిత్వం ఇవాల్టి యాంత్రిక జీవితాలలో ఎందరిని చేరుతుందా అనిపిస్తూ వుండేది. కానీ ఆర్ద్రత కనుమరుగవుతున్న ఇవాల్టి మానవాళికే ఇలాంటి కవిత్వం అవసరమని, కవిగా నా వంతు బాధ్యత నేను సరిగా నిర్వహిస్తున్నాననే నమ్మకంతోనే ఆరాధన నుండి హైకూల మీదుగా ఆకాశం వరకూ కవిత్వాన్ని రాసుకొంటూ వస్తున్నాను. ఈ కవిత్వాన్ని కవి సొంత అనుభూతులుగా మాత్రమే చూసే వారికి, సాహిత్యాన్ని అది మేలుకొలిపే ఉదాత్త సంస్కారం కోసం ప్రేమించే పాఠకులు రాసిన, ఈ వ్యాసాలే జవాబులు.

కవి మానవ హృదయాన్ని గురించి రాసాడు కాని, కేవలం తన హృదయాన్ని గురించి కాదనీ, సాహిత్యం కోసమో, కవికోసమో కాకుండా పాఠకుడు తన లోలోపలి ప్రశాంత తటాకాన్ని దర్శించడానికి ఆకాశం చదవాలనీ చెబుతూ.. వారి వ్యాసాలను ఇక్కడ పరిచయం చేస్తున్నాను. వీటి పూర్తి పాఠం పుస్తకం.నెట్ లో చూడగలరు.


అరచేతిలో ఆకాశం : స్వాతి కుమారి

ఆకాశమంటే పొగకాదు, చెల్లాచెదురైన ధూళి మబ్బుల సమూహం కాదు. పదార్ధమూ, శూన్యమూ కాదు. కొన్ని అస్తిత్వాలు లేవని చెప్పడానికి ఎంత గట్టి ఋజువులుంటాయో ఉన్నాయని తెలుసుకోవడానికి అంతకంటే బలమైన నమ్మకం ఆసరాగా ఉంటుంది; దైవం లాగా, ఆకాశంలాగా. ఆ నమ్మకాల్లో ఉండే గొప్ప నిశ్చింత, నిబ్బరం, ఆనందం, ఆహ్లాదం- ఇవే వాటి రూపాలు, రూపాంతరాలు, అస్తిత్వాలూ. తన రూపరహిత స్వరూపాన్ని నీటిలో చూసుకునే అకాశంలాగే కవిత్వమూ చదువరి పొందే తాదాత్మ్యతలోనే తనని తాను పోల్చుకుంటుంది.

___

ఇవ్వాళ నా గీటురాయికి గంధపు చెక్కా, నా కత్తి మొనకి పూలగుత్తీ, గీతకి అటువైపు విసిరెయ్యడానికి తొక్కుడుబిళ్ళా, నా రాతల మధ్యలో ఊహించని విరామంలాంటి లేతముద్దూ ఒకేసారి దొరికాయి.
___
“క్షణం జీవితం చాలనిపిస్తుంది. కల్పాలు బ్రతికినా చాలదనిపిస్తుంది.” అని బీవీవీ ప్రసాద్ గారి “ఆకాశం” కవితల్లో చదువుతున్నప్పుడు “దాక్కోవడం కవిత్వం, దొరికిపోవడం కవిత్వం” వెరసి ”నాకు నచ్చిన భావాన్ని నీకు నచ్చిన మాటల్లో చెప్పడం కవిత్వం” అని చెప్పుకున్నమాటలు, శబ్ధాలలోపల దాచి కవి పంచిపెడుతున్న కలల్లా కనిపిస్తాయి.
పూర్తి వ్యాసం: ఇక్కడ క్లిక్ చేయండి



‘ఆకాశం’ – నా అభిప్రాయం : చాణక్య

‘Genuine poetry can communicate before it is understood.’ — T.S. Eliot

శ్రీ బివివి ప్రసాద్‌గారి కవితా సంకలనం ‘ఆకాశం’ చదువుతున్నప్పుడు అక్షరాలా నిజమనిపించింది ఈ మాట! ఏ కళైనా ఉన్నతంగా రాణించాలంటే ఉండవలసిన లక్షణం.. కళాకారుడి ప్రజ్ఞ ప్రేక్షకుడి అవగాహనకు మించి ఉండడం! తన భావాల్ని కమ్యూనికేట్ చేయడానికి పూర్తిగా పాఠకుడి ఊహ మీదా, మేధస్సు మీదా ఆధారపడక తప్పని రచయితకు ఇది చాలా అవసరం. చదివేవాడి మనసు మీద ఒక అస్పష్ట చిత్రాన్ని గీసి, పూర్తి చేసే బాధ్యత వాడికే వదిలేయడం నిజమైన కవి చేసే పని. కవి అయినా, కళాకారుడైనా తన టార్గెట్ ఆడియన్స్ ని నిరంతరం అబ్బురపరుస్తూనే ఉండాలి. పాఠకుడి స్థాయి పెరిగేకొద్దీ తాను ఒక మెట్టు పైనే ఉన్నానని నిరూపించుకుంటూ ఉండాలి. అది జరగని రోజున పఠితల మనోఫలకం నుంచి చెదరిపోవడానికి ఎంతోకాలం పట్టదు. This is a rule of thumb for success in any existing business on the planet.

నేను కవిత్వాన్ని ఆస్వాదించగలననీ, కేవలం చదవడానికే చదివి అనుభూతిని అరువు తెచ్చుకునే రకం కాదనీ నాకు చాలాసార్లు నిరూపణ అయింది. అయినా కృష్ణశాస్త్రి, కరుణశ్రీ, చలం, శ్రీశ్రీ, తిలక్‌లతో ఆగిపోవడానికి ప్రధాన కారణం పైన చెప్పినదే. నేను చదివిన ఒకటీఅరా ఆధునిక కవితలు నా పాండిత్యాన్ని పరీక్షించకపోగా, సదరు ‘కవుల’ మానసిక పరిణతి మీద ప్రశ్నలు రేకెత్తించాయి. This so-called ‘Modern Poetry’ is not so ‘modern’ in thoughts and definitely not my cup of coffee అనుకుని వదిలేశాను. అయితే ఒకటీఅరా సర్వం కాదనీ, కవిత్వపు గుబాళింపులు ‘గతజన్మలోని జాజిపూల సువాసన’ కాదని ‘ఆకాశం’ గుర్తుచేసింది. ఆధునిక కవిత్వ ధోరణి పట్ల నా అభిప్రాయం మార్చుకోవాలేమో అని ఆలోచింపజేసింది.

పూర్తి వ్యాసం: ఇక్కడ క్లిక్ చేయండి



'ఆకాశం' సంపుటి  దొరికేచోట్లు:
1. పాలపిట్ట ప్రచురణలు,  హైదరాబాద్. ఫోన్: 040-27678430.
2. కినిగే.కాం లో ఈ బుక్ లేదా ముద్రిత ప్రతి కోసం  
ఇక్కడ క్లిక్ చేయండి 

08 జనవరి 2013

హృదయం - మనస్సు - ప్రపంచం


మనస్సు చాలా చిత్రమైనది. ఒక నిర్వచనానికి అందనిది. అది ఉన్నదనీ, లేదనీ చెప్పటానికి వీలులేనిది. దానిని వెలుతురని కానీ, చీకటని కానీ చెప్పటానికి కుదరనిది. మనస్సు అంటే హృదయం కాదు. హృదయాన్నీ, బుద్ధినీ, ప్రపంచాన్నీ అనుసంధానించి ప్రవర్తించే ఒక విశేషచేతన. నేను, నాది అనే మౌలిక భావాలనీ, వాటిమీద ఆధారపడిన సంస్కారాలనీ, జ్ఞాపకాలనీ, కలల్నీ, భయాలనీ, సమాచారాన్నీ, సంవేదనలనీ ఆశ్రయించుకొని క్రీడించే ఒక చేతనా వేదిక. నేను ఇది, నేను అది, ఇది నాది, అది నీది అని నిరంతరం గీతలు గీసి చూపే ఒక తెలియరాని స్పృహ. చలనం దాని స్వభావమని, అది చలించకుండా ఉండలేదని, పెద్దలు చెబుతారు. అనేక దేశకాలాల్లొకీ, ఊహల్లోకీ, భయాల్లోకీ, సంవేదనల్లొకీ అది చలిస్తూనే వుంటుంది. మనస్సు ఎప్పుడూ స్థూలాన్నే ఆశ్రయిస్తుందని చెబుతారు జ్ఞాని. అంటే తనకన్నా స్థూలంగా గోచరించే వెలుపలి ప్రపంచాన్ని. అట్లాంటి మనస్సుని ప్రపంచం నుండి వెనుకకు మరలించి, తన హృదయంతోనే నిరంతరం ఉండేలా చేయడమొకటే, ఏనాటికైనా సమస్త దు:ఖాన్నుండీ, భయాలనుండీ, వెలితి నుండీ విముక్తి పొందటానికి మార్గమని, వివేకవంతులైన అనేక దేశకాలాల జ్ఞానులు బోధిస్తూ వచ్చారు.   

అయితే, హృదయగత విలువలని ఆశ్రయించుకొని బ్రతకటం ఏటికి ఎదురీదటంలా వుంటుంది. కానీ, కొద్దిపాటి వివేకంతో, ప్రశాంతంగా ఆలోచించి చూస్తే వాటిని మరిచి సాంఘికవిలువలతో బ్రతకటం కూడా ఏటికి ఎదురీదటమే అని తెలుస్తుంది.  

హృదయం అన్నపుడు మన ప్రవర్తనని నిరంతరం గమనించి, అది సర్వశుభకరంగా ఉన్నపుడు కాంతిగానూ, వ్యక్తిగత రాగద్వేషాదులతో నిండినపుడు చీకటిగానూ మనస్సును తాకే మనలోపలి ఒక సూక్ష్మవస్తువు. 'ఉన్నాను' అనే స్పురణ బయలుదేరే చోటు. దానినే  మనం అంతరాత్మ అనికూడా సంబోధించుకొంటాము. హృదయగత విలువలు అంటే హృదయం తెలియచేసే ఆర్ద్రత, నిజాయితీ, వివేకం, వైజ్ఞానికదృక్పధం నిండిన మానవీయ విలువలు.  సాంఘికవిలువలు అన్నపుడు  మనచుట్టూ ఉన్న మానవ సమాజం నిరంతరం మనని ప్రేరేపించే ధనం, విజయం, కీర్తి వంటి అహంకార సంబంధమైన విలువలు. 

హృదయాన్ని అనుసరిస్తే వెలుపలి జీవితం సంక్లిష్టంగా తయారయినట్లే, సమాజాన్ని అనుసరిస్తే లోపలి జీవితం సంక్లిష్టంగా తయారవుతుంది. తెలియరాని అశాంతి, భయం, వెలితి మనస్సుని ఆవరిస్తూవుంటాయి. మళ్ళీ వాటిని అధిగమించడానికి మానవ నిర్మిత ప్రపంచంలోనే పరిష్కారాలు వెదకటం, ఫలితంగా మరింత సంక్లిష్టత, మరింత యాంత్రికత, పొడిబారిపోవటం. చివరకు జీవితం ఒక ప్రవాహమో, విహంగయానమో కాకుండా శిలాసదృశంగా, భారంగా, విసుగుపుట్టించేదిగా మిగలటం జరుగుతుంది.  

తనలోపలికి, తన అంతరాత్మలోనికి చూసుకొని దానిని అనుసరించకుండా, వెలుపలి జ్వరపీడిత, అయోమయపు సమాజాన్ని అనుసరించడం వలన ఇలా జరగడం మూడునాలుగు పదుల జీవితాన్ని అనుభవించిన వాళ్ళకి లీలగా తెలుస్తూనే వుంటుంది. కానీ అప్పటికే నలిగినదారివెంట నడవటం సుఖంగా తోచి, కొత్తదారినీ, కొత్త ప్రశ్నలనీ వెదికే, ఎదుర్కొనే తాజాదనమూ, శక్తీ తరిగి, మిగిలిన జీవితం చాలామందికి నిస్సారంగా గడిచిపోతుంది. లోపల ఎలాంటి ఆర్ద్రతా, స్పందనా కలిగించని విజయాలనీ, కీర్తినీ వెదుకుకొంటూ జీవితాన్ని ఏ ఉన్నతమైన వెలుగులూ ప్రసరించని చీకటిలో ముగించాల్సి వుంటుంది.

అయితే, విలువలని ఆశ్రయించటం వలన  కూడా  జీవితం సాఫీగా గడుస్తుందన్న హామీ లేదు. వెలుపలి జీవితమూ, అది ఇస్తుందనుకొనే మైకమూ నిరంతరం మనస్సుకి పరీక్షగానే నిలుస్తాయి. సమాజాన్ని నమ్మితే, తనలాంటి గుంపైనా తోడుగా వుంటుంది. హృదయాన్ని నమ్మితే చాలాసార్లు ఒంటరిగానే మిగలాల్సి వుంటుంది. సహజీవన సౌఖ్యం కోరుకోవటం సర్వజీవ లక్షణం. అలాంటి సౌఖ్యాన్నుండి దూరం కావటం చాలాసార్లు దు:ఖం కలిగిస్తుంది. 

అయినా, హృదయాన్ననుసరించటం ఒకటే నమ్మదగినది అని స్థిరంగా గ్రహించినపుడు, క్రమంగా దాని వెలుతురు జీవితంపై విస్తరిస్తుంది. అప్పుడు మనిషి, పసిదనంలో కన్నా తాజాగా, నిర్మలంగా, సృజనాత్మకంగా తయారవుతాడు. అతనూ, అతని హృదయమూ వేరుకావు గనుక, అతని హృదయమూ, విశ్వ హృదయమూ వేరుకావు గనుక అతని జీవితంలో లయ ఏర్పడుతుంది. స్పష్టత గోచరిస్తుంది. అతని నడవడి సర్వహితంగా రూపుదిద్దుకొంటుంది. అతని మనస్సు, పూర్తిగా ప్రపంచ ప్రభావం నుండి విముక్తమైనపుడు, అతను పూర్తిగా తన హృదయంలో కరిగిపోతాడు. ఆ స్థితిలో అతని మనస్సులో నేను, నాది అనే భావాలు కరిగిపోయి, అది ప్రేమ అనే ఒక్క సంస్కారంతోనే ప్రపంచాన్ని తాకుతుంది. అతనికి ప్రపంచం అంతా తనదే అయినట్లూ, సమస్తజీవులూ తనవాళ్ళే అయినట్లూ అనుభవమౌతుంది. 

. . .
ఈ మాటలన్నీ, రచయిత తనను తాను పరిశీలిస్తూ రాసినవి. వీటిలో ఎక్కడైనా స్పష్టత లోపించి ఉండవచ్చు, కనుక వీటిని యధాతధంగా తీసుకోకుండా, మిత్రులు కూడా వారివారి అంతరంగంలోనికి చూసుకొని వీటి సత్యాసత్యాలను నిర్ధారించుకొమ్మనీ, తగినంత అంతర్వీక్షణ చేసిన పెద్దల్నీ, మిత్రుల్నీ వారికి తెలిసిన విషయాల్ని తెలియచేయమనీ కోరుతున్నాను.  


బివివి ప్రసాద్       

07 జనవరి 2013

భయపడినప్పుడు : Fear


భయపడినప్పుడు మనిషి ముఖం అరణ్యమౌతుంది
 
అతని కళ్లల్లో ఏవో మృగాలు విశ్రాంతిలేక తిరుగుతాయి

భయపడినప్పుడు గాఢమైన నిద్రలోంచి ఉలిక్కిపడి లేచినట్లుంటుంది
భయం నుండి బయటపడాలనే కోరిక ఏదో 
చీకటిలో మెరిసే జంతునేత్రాలా దిక్కుతోచక తిరుగుతుంది

భయపడినప్పుడు మనిషి అంతే
లోకంలోని చీకటి అంతా అతనిలో ఘనీభవిస్తుంది
తనలోపలి చీకటిచీకటిలో తానే ఎక్కడైనా దాక్కోవాలనిపిస్తుంది

భయం ఒక ఆదిమభావం, ఒక రక్షణవలయం, దయగల శక్తి
అది మనిషిని ఏకాంతదీవికి చేరుస్తుంది
అతనిలోని మహాశక్తులకి ద్వారం తెరుస్తుంది

చీకటిపుష్పంలాంటి భయం, మరణంలాంటి భయం
ప్రపంచాన్ని ఒకవైపునా, అతన్ని ఒకవైపునా నిలబెట్టి
సన్నని సరిహద్దురేఖ గీసి చూపిస్తుంది

శిఖరం నుండి నదిలో దూకినట్లు 
పంజరం నుండి ఆకాశంలోకి ఎగిరినట్లు 
నేలనుండి నేలలేనిచోట అడుగేసినట్లు
భయంలోని మనిషి ప్రపంచాన్ని విడిచి, తనలో తానే నిలిచి ఉండాలి 

అప్పుడు, రాతిలోని కప్పకి రాయి చిట్లి ఆకాశం కనిపించినట్లు
ఊహలోని మనిషికి ఊహ చెదిరి ప్రపంచం ప్రత్యక్షమైనట్లు 
భయంలోని మనిషికి భయమేఘం చెదిరి ఆకాశంలాంటి సాహసం కలుగుతుంది 
అప్పుడు మనిషి ముఖం ప్రశాంతమైన చిరునవ్వుతో మెరుస్తుంది 


Fear 

When in the grip of fear,
The human face wears the aspect of a forest
Roaming restlessly in his eyes
Are to be seen ferocious beasts .

A man changes that way when seized with fear;
One feels as if the sum-total of darkness
In the entire world, is frozen within him
Somewhere in the depths of night (darkness, gloom)
In his innermost self.

Fear is a primordial instinct
Fear is a defense reaction
Fear is a merciful force
Fear does lead a man to a lonely island.

Fear opens the door to inner greatness
Fear is a flower dark in hue and cold
Fear is almost like death.

Only a thin dividing line
Separates the victim of fear
From the rest of the world.

The fear-struck man must stand within himself
As he would, when plunging down into a river
From a mountain peak, or flying out of a cage
Into the boundless sky.
Or stepping down from terra firma  
Into a groundless empty space.

Then only,
Like a frog which can behold the sky
When the encasing rock is split open,
Like a man who can behold the world
When the obstructing hordes of thought
Are made to flee;

Then only
When the clouds of fear are dispersed,
Appears the sky of adventure
And the man’s face is lit up with a smile
A smile real and true!


________________________________________
'ఆకాశం' సంపుటి నుండి 
Translation: Sri Rachakonda Narasimha Sarma

05 జనవరి 2013

సరస్సు వలే వుండు : జెన్ కథ


ఒక వృద్ధగురువు తన శిష్యుడి ఫిర్యాదులు వినీవినీ విసుగుచెందాడు.

ఒక ఉదయం అతన్ని కొంత ఉప్పు తీసుకురమ్మని పంపాడు.

తీసుకువచ్చాక, అతన్ని చేతినిండా ఉప్పు తీసుకొని ఒక గ్లాసు నీళ్ళలో కలిపి తాగమన్నాడు. ఎలావుందని అడిగాడు గురువు. భరింపలేని రుచి అన్నాడు శిష్యుడు.

గురువు చిరునవ్వు నవ్వి, ఆ యువకుడిని, మరలా చేతినిండా ఉప్పు తీసుకొని సరస్సులో కలపమన్నాడు.

వారిద్దరూ సరస్సు ఒడ్డుకి నిశ్శబ్దంగా నడిచారు. శిష్యుడు చేతిలోని ఉప్పు సరస్సులో కలిపాడు. ఇప్పుడా సరస్సులో నీరు తాగమన్నాడు వృద్ధగురువు. త్రాగాక, ఇప్పుడా నీటిరుచి ఎలావుందని అడిగాడు. 'తాజాగా వుంది ' శిష్యుడు. గురువు 'నీకు ఉప్పదనం తెలిసిందా '. అతను లేదన్నాడు.

ఆ వృద్ధుడు అతని ప్రక్కన కూర్చుని మృదువుగా ఇలా చెప్పాడు ' జీవితంలో బాధ ఉప్పులాంటిది. అది ఎక్కువా కాదు, తక్కువా కాదు. ఎప్పుడూ ఒకే మోతాదులో వుంటుంది. కానీ దాని రుచి మనం ఆ బాధని ఉంచిన పాత్రపై ఆధారపడివుంటుంది. కనుక, నీకు బాధ కలిగినప్పుడల్లా నువ్వు చెయగలిగిన ఒకే పని, దానిని అనుభవించే వ్యక్తిని విశాలం చెయ్యటం. అలాంటపుడు, నువ్వు ఒక గ్లాసులా వుండకు. సరస్సు వలే వుండు '


~ Become a Lake ~

An aging master grew tired of his apprentice’s complaints.

One morning, he sent him to get some salt.

When the apprentice returned, the master told him to mix a handful of salt in a glass of water and then drink it.
“How does it taste?” the master asked.
“Bitter,” said the apprentice.

The master chuckled and then asked the young man to take the same handful of salt and put it in the lake.

The two walked in silence to the nearby lake and once the apprentice swirled his handful of salt in the water, the old man said, “Now drink from the lake.”
As the water dripped down the young man’s chin, the master asked, “How does it taste?”
“Fresh,” remarked the apprentice.
“Do you taste the salt?” asked the master.
“No,” said the young man.

At this the master sat beside this serious young man, and explained softly,
“The pain of life is pure salt; no more, no less. The amount of pain in life remains exactly the same. However, the amount of bitterness we taste depends on the container we put the pain in. So when you are in pain, the only thing you can do is to enlarge your sense of things. Stop being a glass. Become a lake.”





Source: www.facebook.com/TaoZen2012

తెలుగు అనువాదం: బివివి ప్రసాద్ 

01 జనవరి 2013

గుమ్మం తెర : The Curtain

ఏదో రాసుకొంటున్నపుడు
అకస్మాత్తుగా ఎవరో వచ్చినట్టు గుమ్మంతెర లోపలికి వస్తుంది
ఎవరా అని చూసేసరికి
పొరపాటున గదిలోకి వచ్చినట్టు బయటకు ఎగురుతుంది

పిల్లలు అమ్మచుట్టూ తిరుగుతున్నట్టు
గాలిపిల్లలు తెర ముందూ వెనుకా దోబూచులాడుతుంటాయి

ఏ కదలికా లేని ఆకాశమే గుమ్మం ముందూ వెనుకా ఉన్నట్టు
ఏ స్పందనా లేని కాలమే ఎప్పుడూ విస్తరించి ఉన్నపుడు
ఒక తెర ఉండటం బావుంటుంది
పలుచని తెరలాంటి ప్రపంచ స్పర్శ బావుంటుంది

గోడలన్నిటినీ రబ్బరుతో చెరిపి, తెరలుగా దిద్ది
తెరలమధ్య పిల్లలందరం సందడి చేస్తే బావుంటుంది



The Curtain

When engrossed in writing
The curtain sneaks into the room-
As I curiously stare at
-She hops out-
As though it was a slip-up!

Just as the toddlers do,
Wind-kids play knick-knock
Around their curtain mother!

When the frozen time
Spreads slowly all through, forever-
Just as the stock-still sky
Standing in the forth and rear of the portal-
It’s fine to have a drape -The thin layer of the worldly feel!

Erasing the walls and, painting curtains in their place
-We the children raising hurly-burly amidst them-
Will it not be wonderful?


_______________________________
'ఆకాశం' సంపుటి నుండి
Translation: Sri Mandalaparthy Kishore