12 జనవరి 2013

స్వచ్చమైన కవిత్వానికి ప్రతిస్పందనలు


ఆకాశం వంటి నిర్మలమైన కవిత్వం ఇవాల్టి యాంత్రిక జీవితాలలో ఎందరిని చేరుతుందా అనిపిస్తూ వుండేది. కానీ ఆర్ద్రత కనుమరుగవుతున్న ఇవాల్టి మానవాళికే ఇలాంటి కవిత్వం అవసరమని, కవిగా నా వంతు బాధ్యత నేను సరిగా నిర్వహిస్తున్నాననే నమ్మకంతోనే ఆరాధన నుండి హైకూల మీదుగా ఆకాశం వరకూ కవిత్వాన్ని రాసుకొంటూ వస్తున్నాను. ఈ కవిత్వాన్ని కవి సొంత అనుభూతులుగా మాత్రమే చూసే వారికి, సాహిత్యాన్ని అది మేలుకొలిపే ఉదాత్త సంస్కారం కోసం ప్రేమించే పాఠకులు రాసిన, ఈ వ్యాసాలే జవాబులు.

కవి మానవ హృదయాన్ని గురించి రాసాడు కాని, కేవలం తన హృదయాన్ని గురించి కాదనీ, సాహిత్యం కోసమో, కవికోసమో కాకుండా పాఠకుడు తన లోలోపలి ప్రశాంత తటాకాన్ని దర్శించడానికి ఆకాశం చదవాలనీ చెబుతూ.. వారి వ్యాసాలను ఇక్కడ పరిచయం చేస్తున్నాను. వీటి పూర్తి పాఠం పుస్తకం.నెట్ లో చూడగలరు.


అరచేతిలో ఆకాశం : స్వాతి కుమారి

ఆకాశమంటే పొగకాదు, చెల్లాచెదురైన ధూళి మబ్బుల సమూహం కాదు. పదార్ధమూ, శూన్యమూ కాదు. కొన్ని అస్తిత్వాలు లేవని చెప్పడానికి ఎంత గట్టి ఋజువులుంటాయో ఉన్నాయని తెలుసుకోవడానికి అంతకంటే బలమైన నమ్మకం ఆసరాగా ఉంటుంది; దైవం లాగా, ఆకాశంలాగా. ఆ నమ్మకాల్లో ఉండే గొప్ప నిశ్చింత, నిబ్బరం, ఆనందం, ఆహ్లాదం- ఇవే వాటి రూపాలు, రూపాంతరాలు, అస్తిత్వాలూ. తన రూపరహిత స్వరూపాన్ని నీటిలో చూసుకునే అకాశంలాగే కవిత్వమూ చదువరి పొందే తాదాత్మ్యతలోనే తనని తాను పోల్చుకుంటుంది.

___

ఇవ్వాళ నా గీటురాయికి గంధపు చెక్కా, నా కత్తి మొనకి పూలగుత్తీ, గీతకి అటువైపు విసిరెయ్యడానికి తొక్కుడుబిళ్ళా, నా రాతల మధ్యలో ఊహించని విరామంలాంటి లేతముద్దూ ఒకేసారి దొరికాయి.
___
“క్షణం జీవితం చాలనిపిస్తుంది. కల్పాలు బ్రతికినా చాలదనిపిస్తుంది.” అని బీవీవీ ప్రసాద్ గారి “ఆకాశం” కవితల్లో చదువుతున్నప్పుడు “దాక్కోవడం కవిత్వం, దొరికిపోవడం కవిత్వం” వెరసి ”నాకు నచ్చిన భావాన్ని నీకు నచ్చిన మాటల్లో చెప్పడం కవిత్వం” అని చెప్పుకున్నమాటలు, శబ్ధాలలోపల దాచి కవి పంచిపెడుతున్న కలల్లా కనిపిస్తాయి.
పూర్తి వ్యాసం: ఇక్కడ క్లిక్ చేయండి



‘ఆకాశం’ – నా అభిప్రాయం : చాణక్య

‘Genuine poetry can communicate before it is understood.’ — T.S. Eliot

శ్రీ బివివి ప్రసాద్‌గారి కవితా సంకలనం ‘ఆకాశం’ చదువుతున్నప్పుడు అక్షరాలా నిజమనిపించింది ఈ మాట! ఏ కళైనా ఉన్నతంగా రాణించాలంటే ఉండవలసిన లక్షణం.. కళాకారుడి ప్రజ్ఞ ప్రేక్షకుడి అవగాహనకు మించి ఉండడం! తన భావాల్ని కమ్యూనికేట్ చేయడానికి పూర్తిగా పాఠకుడి ఊహ మీదా, మేధస్సు మీదా ఆధారపడక తప్పని రచయితకు ఇది చాలా అవసరం. చదివేవాడి మనసు మీద ఒక అస్పష్ట చిత్రాన్ని గీసి, పూర్తి చేసే బాధ్యత వాడికే వదిలేయడం నిజమైన కవి చేసే పని. కవి అయినా, కళాకారుడైనా తన టార్గెట్ ఆడియన్స్ ని నిరంతరం అబ్బురపరుస్తూనే ఉండాలి. పాఠకుడి స్థాయి పెరిగేకొద్దీ తాను ఒక మెట్టు పైనే ఉన్నానని నిరూపించుకుంటూ ఉండాలి. అది జరగని రోజున పఠితల మనోఫలకం నుంచి చెదరిపోవడానికి ఎంతోకాలం పట్టదు. This is a rule of thumb for success in any existing business on the planet.

నేను కవిత్వాన్ని ఆస్వాదించగలననీ, కేవలం చదవడానికే చదివి అనుభూతిని అరువు తెచ్చుకునే రకం కాదనీ నాకు చాలాసార్లు నిరూపణ అయింది. అయినా కృష్ణశాస్త్రి, కరుణశ్రీ, చలం, శ్రీశ్రీ, తిలక్‌లతో ఆగిపోవడానికి ప్రధాన కారణం పైన చెప్పినదే. నేను చదివిన ఒకటీఅరా ఆధునిక కవితలు నా పాండిత్యాన్ని పరీక్షించకపోగా, సదరు ‘కవుల’ మానసిక పరిణతి మీద ప్రశ్నలు రేకెత్తించాయి. This so-called ‘Modern Poetry’ is not so ‘modern’ in thoughts and definitely not my cup of coffee అనుకుని వదిలేశాను. అయితే ఒకటీఅరా సర్వం కాదనీ, కవిత్వపు గుబాళింపులు ‘గతజన్మలోని జాజిపూల సువాసన’ కాదని ‘ఆకాశం’ గుర్తుచేసింది. ఆధునిక కవిత్వ ధోరణి పట్ల నా అభిప్రాయం మార్చుకోవాలేమో అని ఆలోచింపజేసింది.

పూర్తి వ్యాసం: ఇక్కడ క్లిక్ చేయండి



'ఆకాశం' సంపుటి  దొరికేచోట్లు:
1. పాలపిట్ట ప్రచురణలు,  హైదరాబాద్. ఫోన్: 040-27678430.
2. కినిగే.కాం లో ఈ బుక్ లేదా ముద్రిత ప్రతి కోసం  
ఇక్కడ క్లిక్ చేయండి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి