08 జనవరి 2013

హృదయం - మనస్సు - ప్రపంచం


మనస్సు చాలా చిత్రమైనది. ఒక నిర్వచనానికి అందనిది. అది ఉన్నదనీ, లేదనీ చెప్పటానికి వీలులేనిది. దానిని వెలుతురని కానీ, చీకటని కానీ చెప్పటానికి కుదరనిది. మనస్సు అంటే హృదయం కాదు. హృదయాన్నీ, బుద్ధినీ, ప్రపంచాన్నీ అనుసంధానించి ప్రవర్తించే ఒక విశేషచేతన. నేను, నాది అనే మౌలిక భావాలనీ, వాటిమీద ఆధారపడిన సంస్కారాలనీ, జ్ఞాపకాలనీ, కలల్నీ, భయాలనీ, సమాచారాన్నీ, సంవేదనలనీ ఆశ్రయించుకొని క్రీడించే ఒక చేతనా వేదిక. నేను ఇది, నేను అది, ఇది నాది, అది నీది అని నిరంతరం గీతలు గీసి చూపే ఒక తెలియరాని స్పృహ. చలనం దాని స్వభావమని, అది చలించకుండా ఉండలేదని, పెద్దలు చెబుతారు. అనేక దేశకాలాల్లొకీ, ఊహల్లోకీ, భయాల్లోకీ, సంవేదనల్లొకీ అది చలిస్తూనే వుంటుంది. మనస్సు ఎప్పుడూ స్థూలాన్నే ఆశ్రయిస్తుందని చెబుతారు జ్ఞాని. అంటే తనకన్నా స్థూలంగా గోచరించే వెలుపలి ప్రపంచాన్ని. అట్లాంటి మనస్సుని ప్రపంచం నుండి వెనుకకు మరలించి, తన హృదయంతోనే నిరంతరం ఉండేలా చేయడమొకటే, ఏనాటికైనా సమస్త దు:ఖాన్నుండీ, భయాలనుండీ, వెలితి నుండీ విముక్తి పొందటానికి మార్గమని, వివేకవంతులైన అనేక దేశకాలాల జ్ఞానులు బోధిస్తూ వచ్చారు.   

అయితే, హృదయగత విలువలని ఆశ్రయించుకొని బ్రతకటం ఏటికి ఎదురీదటంలా వుంటుంది. కానీ, కొద్దిపాటి వివేకంతో, ప్రశాంతంగా ఆలోచించి చూస్తే వాటిని మరిచి సాంఘికవిలువలతో బ్రతకటం కూడా ఏటికి ఎదురీదటమే అని తెలుస్తుంది.  

హృదయం అన్నపుడు మన ప్రవర్తనని నిరంతరం గమనించి, అది సర్వశుభకరంగా ఉన్నపుడు కాంతిగానూ, వ్యక్తిగత రాగద్వేషాదులతో నిండినపుడు చీకటిగానూ మనస్సును తాకే మనలోపలి ఒక సూక్ష్మవస్తువు. 'ఉన్నాను' అనే స్పురణ బయలుదేరే చోటు. దానినే  మనం అంతరాత్మ అనికూడా సంబోధించుకొంటాము. హృదయగత విలువలు అంటే హృదయం తెలియచేసే ఆర్ద్రత, నిజాయితీ, వివేకం, వైజ్ఞానికదృక్పధం నిండిన మానవీయ విలువలు.  సాంఘికవిలువలు అన్నపుడు  మనచుట్టూ ఉన్న మానవ సమాజం నిరంతరం మనని ప్రేరేపించే ధనం, విజయం, కీర్తి వంటి అహంకార సంబంధమైన విలువలు. 

హృదయాన్ని అనుసరిస్తే వెలుపలి జీవితం సంక్లిష్టంగా తయారయినట్లే, సమాజాన్ని అనుసరిస్తే లోపలి జీవితం సంక్లిష్టంగా తయారవుతుంది. తెలియరాని అశాంతి, భయం, వెలితి మనస్సుని ఆవరిస్తూవుంటాయి. మళ్ళీ వాటిని అధిగమించడానికి మానవ నిర్మిత ప్రపంచంలోనే పరిష్కారాలు వెదకటం, ఫలితంగా మరింత సంక్లిష్టత, మరింత యాంత్రికత, పొడిబారిపోవటం. చివరకు జీవితం ఒక ప్రవాహమో, విహంగయానమో కాకుండా శిలాసదృశంగా, భారంగా, విసుగుపుట్టించేదిగా మిగలటం జరుగుతుంది.  

తనలోపలికి, తన అంతరాత్మలోనికి చూసుకొని దానిని అనుసరించకుండా, వెలుపలి జ్వరపీడిత, అయోమయపు సమాజాన్ని అనుసరించడం వలన ఇలా జరగడం మూడునాలుగు పదుల జీవితాన్ని అనుభవించిన వాళ్ళకి లీలగా తెలుస్తూనే వుంటుంది. కానీ అప్పటికే నలిగినదారివెంట నడవటం సుఖంగా తోచి, కొత్తదారినీ, కొత్త ప్రశ్నలనీ వెదికే, ఎదుర్కొనే తాజాదనమూ, శక్తీ తరిగి, మిగిలిన జీవితం చాలామందికి నిస్సారంగా గడిచిపోతుంది. లోపల ఎలాంటి ఆర్ద్రతా, స్పందనా కలిగించని విజయాలనీ, కీర్తినీ వెదుకుకొంటూ జీవితాన్ని ఏ ఉన్నతమైన వెలుగులూ ప్రసరించని చీకటిలో ముగించాల్సి వుంటుంది.

అయితే, విలువలని ఆశ్రయించటం వలన  కూడా  జీవితం సాఫీగా గడుస్తుందన్న హామీ లేదు. వెలుపలి జీవితమూ, అది ఇస్తుందనుకొనే మైకమూ నిరంతరం మనస్సుకి పరీక్షగానే నిలుస్తాయి. సమాజాన్ని నమ్మితే, తనలాంటి గుంపైనా తోడుగా వుంటుంది. హృదయాన్ని నమ్మితే చాలాసార్లు ఒంటరిగానే మిగలాల్సి వుంటుంది. సహజీవన సౌఖ్యం కోరుకోవటం సర్వజీవ లక్షణం. అలాంటి సౌఖ్యాన్నుండి దూరం కావటం చాలాసార్లు దు:ఖం కలిగిస్తుంది. 

అయినా, హృదయాన్ననుసరించటం ఒకటే నమ్మదగినది అని స్థిరంగా గ్రహించినపుడు, క్రమంగా దాని వెలుతురు జీవితంపై విస్తరిస్తుంది. అప్పుడు మనిషి, పసిదనంలో కన్నా తాజాగా, నిర్మలంగా, సృజనాత్మకంగా తయారవుతాడు. అతనూ, అతని హృదయమూ వేరుకావు గనుక, అతని హృదయమూ, విశ్వ హృదయమూ వేరుకావు గనుక అతని జీవితంలో లయ ఏర్పడుతుంది. స్పష్టత గోచరిస్తుంది. అతని నడవడి సర్వహితంగా రూపుదిద్దుకొంటుంది. అతని మనస్సు, పూర్తిగా ప్రపంచ ప్రభావం నుండి విముక్తమైనపుడు, అతను పూర్తిగా తన హృదయంలో కరిగిపోతాడు. ఆ స్థితిలో అతని మనస్సులో నేను, నాది అనే భావాలు కరిగిపోయి, అది ప్రేమ అనే ఒక్క సంస్కారంతోనే ప్రపంచాన్ని తాకుతుంది. అతనికి ప్రపంచం అంతా తనదే అయినట్లూ, సమస్తజీవులూ తనవాళ్ళే అయినట్లూ అనుభవమౌతుంది. 

. . .
ఈ మాటలన్నీ, రచయిత తనను తాను పరిశీలిస్తూ రాసినవి. వీటిలో ఎక్కడైనా స్పష్టత లోపించి ఉండవచ్చు, కనుక వీటిని యధాతధంగా తీసుకోకుండా, మిత్రులు కూడా వారివారి అంతరంగంలోనికి చూసుకొని వీటి సత్యాసత్యాలను నిర్ధారించుకొమ్మనీ, తగినంత అంతర్వీక్షణ చేసిన పెద్దల్నీ, మిత్రుల్నీ వారికి తెలిసిన విషయాల్ని తెలియచేయమనీ కోరుతున్నాను.  


బివివి ప్రసాద్       

2 కామెంట్‌లు:

  1. good evenin sir.advytadi anubhuthi pondanu.if u r following this with innerjourney ur adisankara(advythi).

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిర్మల్ గారూ, శుభ సాయంత్రం. అద్వైతానికి మొదటి మెట్టు దగ్గర నేను వ్యాసం ముగించాను. తరువాత ప్రయాణం ఇంకా సూక్ష్మమైనది. అది మన ప్రయత్నానికి ఆవలిది అనుకొంటాను. మీ అనుభూతి తెలిసి సంతోషం కలిగింది. మీకు కలిగింది హృదయం మేలుకొన్న అనుభవమేమో అనుకొంటాను. మొదటిలో క్షణమాత్రంగా తెలిసే అది, క్రమంగా స్థిరపడాలని, నిరంతరాయం కావాలని కోరుకొంటున్నాను. ఒకవేళ నా అంచనా కన్నా లోతైనది అయితే దానిని రహస్యంగానే ఉంచుకోండి. శుభం కలుగుతుంది. నాది మేధాపరమైన అవగాహన మాత్రమే. ప్రేమతో.. ప్రసాద్

      తొలగించండి